health organisation
-
ఒమిక్రాన్.. మహమ్మారి అంతానికే వేగం పెంచిందేమో...
ఒమిక్రాన్... ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరినీ భయపెడుతున్న మాట. విస్తరిస్తున్న తీరు, అందులో ఉన్న మ్యుటేషన్స్ ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే.. ఈ వేరియెంట్‌ను సౌతాఫ్రికాలోని బోట్స్వానాలో గుర్తించి వారం దాటింది. ఇప్పటివరకు తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడం, మరణం నమోదు కాలేదని ఆఫ్రికా డాక్టర్లు చెబుతున్నారు. ఒమిక్రాన్ బారిన పడినవాళ్లలో యువత ఎక్కువగా ఉన్నారనీ, వారిలోనూ అలసట, తలనొప్పి, కండరాల నొప్పుల వంటి తేలికపాటి లక్షణాలున్నాయని, వీటివల్ల రోగి రెండు మూడు రోజుల్లోనే రికవరీ అవుతున్నారని ఈ వేరియెంట్‌ని మొట్టమొదట గుర్తించిన సౌతాఫ్రికా మెడికల్ అసోసియేషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ ఏంజిలిక్ కోట్జీ తెలిపారు. ఇప్పుడున్నస్థాయిలో అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె చెబుతున్నారు. ప్రాణాంతకం కాకపోవచ్చు!? అదే నిజమైతే... ప్రపంచానికిదో ఎర్లీ క్రిస్మస్ గిఫ్ట్ అని జర్మన్ వైద్య నిపుణులు ప్రొఫెసర్ కాల్ లాత్బాక్ అంటున్నారు. ఒమిక్రాన్ మ్యుటేషన్స్ డెల్టా వేరియెంట్ కంటే రెండు రెట్లు అధికం. శ్వాసకోస వ్యాధులు కలిగించే ఇతర వైరస్‌లూ ఇలాగే పరిణామం చెందుతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ వేగం పెరిగినా... ప్రాణాంతకం కాకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. ఇది నిజమే కావచ్చంటున్నారు తూర్పు ఆంగ్లియా విశ్వవిద్యాలయ అంటువ్యాధుల నిపుణుడు ప్రొఫెసర్ పాల్ హంటర్. ఇన్ఫెక్షన్కు గురై.. ఆరోగ్యంగా బయటపడ్డవారిని, వ్యాక్సినేషన్ వేసుకున్నవాళ్లను ఇది అంతగా ప్రభావితం చేయకపోవచ్చని చెబుతున్నారు. చదవండి: Cryptocurrency: ఒమిక్రాన్ పేరులోనే మ్యాజిక్ ఉంది కొద్దిరోజులే కదా.. కొట్టిపారేయలేం: డబ్ల్యూహెచ్ఓ ఒమిక్రాన్ ఎలా వ్యాప్తి చెందుతుంది? దీని నుంచి వ్యాక్సిన్లు మనల్ని రక్షిస్తాయా? ఒమిక్రాన్ వల్ల ఆస్పత్రి పాలవ్వడం, మరణాలు పెరుగుతాయా? పాతవాటికంటే ఇది తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తుందా వంటి ప్రశ్నలన్నింటికి సమాధానం వచ్చేదాకా ఏం చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇది బయటపడి కొద్ది రోజులే అవుతున్నందున తేలికపాటి లక్షణాలేనని కొట్టిపారేయలేమని రీడింగ్ యూనివర్సిటీ మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ సైమన్క్లార్క్ హెచ్చరిస్తున్నారు. తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం కావొచ్చని ఆయన అంటున్నారు. డెల్టా వేరియెంట్కంటే తక్కువనుకుంటే... వూహాన్ ఒరిజినల్కంటే అధ్వాన పరిస్థితులకు దారితీయొచ్చని చెబుతున్నారు. ఒమిక్రాన్ బారిన పడిన ఎవరో ఒకరు తీవ్ర అనారోగ్యం పాలైతే తప్ప దీని ప్రభావాన్ని నిర్ధారించలేమంటున్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారు తీసుకోవాలని, రెండు డోసులు తీసుకున్నవారు... బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్లు ఈ వేరియెంట్ మీద చూపించే ప్రభావం అంతంతేనని ప్రపంచవ్యాప్త డేటా చెబుతోంది. ఇప్పడే నిర్ధారణకు రావడం తొందరపాటు అవుతుంది... రెండు వారాలు వేచి చూడాల్సిందేనని యూఎస్ వైద్య సలహాదారు డాక్టర్ ఆంతోనీ అంటున్నారు. ఆందోళన కలిగించే అంశాలు.. ఈ బోట్స్వానా వేరియెంట్లో ఆందోళన కలిగించే అంశాలు.. 50 మ్యుటేషన్స్. అందులో 30శాతం స్పైక్ ప్రోటీన్ మీదవే. ఈ మ్యుటేషన్స్ వల్ల వైరస్ రూపమే మారిపోతుంది. రూపం మారిన వైరస్‌ను వ్యాధినిరోధక శక్తి గుర్తించడం, దానిమీద పోరాడటం కష్టమవుతుంది. ఇందులో మూడు మ్యుటేషన్స్ ఏ665 , N679 ఓ, ్క681 ఏ శరీర కణాల్లోకి సుల భంగా ప్రవేశిస్తాయి. గత మ్యుటేషన్స్ తరహాలో ఇందులో మెంబ్రేన్ ప్రొటీన్ N్క6 లేకపోవడం వ్యాధి తీవ్రతను పెంచొచ్చు. గతంలో తీవ్ర ఇన్ఫెక్షన్కి కారణమైన ఖ203 ఓ, ఎ204 ఖరెండు మ్యుటేషన్స్ కూడా ఈ వేరియెంట్లో ఉన్నాయి. ఇందులోని ఓ417 N, ఉ484 అ మ్యుటేషన్స్ గతంలో బేటా వేరియెంట్‌లోనూ ఉన్నాయి. ఇవి వ్యాక్సిన్స్‌ను తట్టుకునే రకం. యాంటీబాడీల నుంచి తప్పించుకోగలిగే... N440 ఓ, 477N మ్యుటేషన్స్ ఇందులో ఉన్నాయి. ఇవి గతేడాది మార్చిలో కేసుల పెరుగుదలకు కారణమయ్యాయి. ఎ446 , ఖీ478 ఓ, ఖ493 ఓ, ఎ496 , ఖ498 ఖ, ్గ505 ఏ మ్యుటేషన్స్ పట్ల ఇంకా స్పష్టత రాలేదు. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ యువత ఓకే.. వృద్ధులు, పిల్లల సంగతేంటి? ప్రస్తుతం ఆఫ్రికాలో రోజుకు సగటున 6,000 మంది వైరస్ బారిన పడుతున్నారు. ఈ వేరియంట్‌కు ముందు ఉన్న కేసుల సంఖ్యతో పోల్చుకుంటే ఇది 20 రెట్లు అధికం. శాస్త్రీయంగా ఆ.1.1.529గా పిలిచే ఒమిక్రాన్.. యువతలో తక్కువ లక్షణాలు చూపించడం వ్యాప్తికి కారణమవుతోంది. అయితే పెద్దవయసు వారిలో ఈ లక్షణాలు, తీవ్రతలో తేడా ఉండొచ్చని నిపుణుల అంచనా. దక్షిణాఫ్రికా మొత్తం జనాభాలో 65 ఏళ్లు దాటినవారు ఆరుశాతం మాత్రమే... కాబట్టి ఆందోళన అవసరం లేదు. కానీ వృద్ధులు ఎక్కువగా ఉన్న దేశాల పరిస్థితి ఏమిటి, వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న. -
టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం
కుత్బుల్లాపూర్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ థర్డ్ వేవ్ విజృంభించే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న వేళ ఓ యూనివర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. ఏకం గా 25 మంది విద్యార్థులు, ఐదుగురు అధ్యాపకులలో కరోనా లక్షణాలు బయటపడటంతో కళాశాలలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. బహదూర్‌పల్లిలోని టెక్ మహీంద్ర ఏకోలా వర్సిటీ ఇటీవల మొదటి సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. పలు దేశాల విద్యార్థులు వర్సిటీలో చేరగా, కొందరు అస్వస్థతకు గురయ్యారు. వీరికి కరోనా లక్షణాలు వెల్లడయ్యాయి. దీంతో ముందస్తుగా యాజమాన్యం వర్సిటీకి సెలవులు ప్రకటించింది. రెండు వేలకుపైగా విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసిస్తున్నారు. గత రెండు రోజులుగా విద్యార్థుల రాకపోకలు లేకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై యూనివర్సిటీ వారిని ‘సాక్షి’ ఫోన్లో ఆరా తీయగా అటువంటిదేమీ లేదన్నారు. కాగా, ఈ క్యాంపస్‌లోని 1,700 మంది విద్యార్థులు హోం ఐసోలేషన్‌లో ఆరోగ్యంగానే ఉన్నారని, ఎటువంటి ఆందోళన పడాల్సిన పరిస్థితిలేదని కుత్బుల్లాపూర్ మండల వైద్యాధికారి డాక్టర్ నిర్మల ‘సాక్షి’కి తెలిపారు. -
డబ్ల్యూహెచ్‌వో కీలక సూచనలు.. ఇకపై నర్సులూ..
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వైద్యంలో నర్సులకు స్థానం కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మందుల చీటీ (ప్రిస్కిప్షన్) రాసే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు మన దేశానికి కొన్ని సూచనలు చేస్తూ నివేదిక విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ పూర్తయిన నర్సులకు ఆరు నెలల శిక్షణ ఇచ్చి వారితో మందులు ఇప్పించవచ్చని తెలిపింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లకు ప్రత్యేకంగా నిర్ణీత కోర్సు చేసినవారికి ప్రిస్కిప్షన్ రాసే అవకాశం కల్పించారు. ఆ రాష్ట్రంలో రూరల్ మెడికల్ అటెండర్ (ఆర్ఎంఏ) వ్యవస్థ ఉంది. వారికి కొన్ని రకాల మందులు రాసే అధికారం, వైద్యం చేసేందుకు అవకాశం కల్పిం చారు. ఎసిడిటీ మందులు, యాంటీబయోటిక్స్, టీబీ, మలేరియా, లెప్రసీ, అమీబియాసిస్, గజ్జి, తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వైరస్‌కు సంబంధించిన మందులు ఇవ్వొచ్చు. వాంతులు, జ్వరాలు, నొప్పు లు, విరేచనాలు, ఆస్తమా, దగ్గు, గర్భం ఆపే మందులు, విటమిన్లు, సాధారణ ప్రసవాలు జరిగాక మందులను ఇచ్చే అవకాశం ఆర్ఎంఏలకు ఇచ్చారు. వాళ్లే కొన్ని ఆపరేషన్లు చేస్తున్నారు. దెబ్బతగిలితే కుట్లు వేయడం, కాలిన గాయాలకు డ్రెసిం గ్ చేయడం, ఎముకలు విరిగితే కట్లు కట్టడం, ప్రమాదం జరిగితే రక్తస్రావం జరగకుండా చేయడం, ప్రసవాలు చేయడం, ప్రసవాల్లో చిన్నచిన్న సమస్యలు వస్తే వాటికి చికిత్స చేయడం, రక్తస్రావాలు జరిగితే ఆపడం వంటివి చేయాలి. అయితే పోస్ట్‌మార్టం, మెడికల్ లీగల్ కేసులు వంటి వాటిలో నర్సులకు అవకాశం కల్పించలేదు. ఇలా చత్తీస్ఘడ్ మాదిరిగా దేశవ్యాప్తంగా అమలుచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)లో మిడ్ లెవల్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు మందుల చీటీ ఇవ్వొచ్చని ఉంది. ఆ ప్రకారం నర్సులకు కూడా అవకాశం కల్పించాలని సూచించింది. డాక్టర్ల కొరత ఉన్నందున... కోవిడ్ వల్ల దేశంలో డాక్టర్లు ఆయా చికిత్సలపై దృష్టి సారించాల్సి వచ్చింది. పైగా భారత్‌లో డాక్టర్లు కొరత ఉంది. 11 వేల మందికి ఒక ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. వెయ్యి జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. తక్కువ ఉన్నందున ఆ కొరతను నర్సులతో పూడ్చవచ్చు. దేశంలో యూనివర్సల్ హెల్త్ కేర్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. కాబట్టి వైద్య సిబ్బందిని వాడుకోవాలి. వైద్య పరిశోధనల్లో తేలిందేంటంటే.. ప్రాథమిక ఆరోగ్యంలో నర్సులు, వైద్యులు చేసే వైద్యంలో పెద్దగా తేడా లేదు. డాక్టర్లు, నర్సులు చేసిన చికిత్సలు సమానంగా ఉన్నాయి. అంతేకాదు అమెరికాలో శిక్షణ పొందిన నర్సులు వైద్యంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మరికొన్ని అంశాలు ►నర్సులు రోగంపై సొంతంగా నిర్ణయం తీసుకొని మందులు ఇవ్వడం లేదా డాక్టర్ పర్యవేక్షణలో ఇవ్వడం లేదా రెండు పద్ధతుల్లో ఇవ్వడం వంటివి చేయవచ్చు. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లో ఈ పరిస్థితి ఉంది. పోలండ్‌లో మాస్టర్ నర్సింగ్ కోర్సు చేసినవారికి మందులు ఇచ్చే అవకాశం కల్పించారు. డెన్మార్క్‌లో డాక్టర్ పర్యవేక్షణలో నర్సులు మందులు ఇచ్చే పరిస్థితి ఉంది. ►భారత్‌లో దశల వారీగా కొన్ని నిర్ణీత జబ్బులకు మందులు ఇచ్చే అవకాశం కల్పించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ►ప్రస్తుతం ఇండియాలో మెడికల్ ప్రాక్టీషనర్లు మాత్రమే మందులు ఇవ్వాలన్న నిబంధన ఉంది. దాన్ని సవరించాలి. ఆ ప్రకారం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ట్ యాక్ట్–1940ని సవరించాలి. అలాగే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యాక్ట్–1947ను సవరిస్తూ, వారికి అధికారాలు కల్పించాలి. ఎన్ఎంసీ–2019 యాక్ట్‌లో కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్ జాబితాలో నర్సులను చేర్చాలి. ►నర్సింగ్ విద్యలో పెనుమార్పులు తీసుకురావాలి. ప్రాక్టీస్ చేయడానికి ముందు వారికి శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం మాస్టర్ నర్సింగ్‌లో నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ క్రిటికల్ కేర్ అనే కోర్సు ఉంది. దాని తరహాలో నర్సింగ్‌లో కోర్సు పెట్టాలి. ►కొన్ని మందులతో ప్రారంభించి వాటిని పెంచుకుంటూ పోవాలి. ప్రాథమిక వైద్యం డిగ్రీ నర్సింగ్‌లోనే కోర్సు ఉండాలి. ïజిల్లా, మెడికల్ కాలేజీల్లో పనిచేసే వారికోసం పీజీ లెవల్లో ప్రత్యేక కోర్సు ఉండాలి. -
కొత్త వేరియెంట్ వస్తేనే..!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గినట్టు కనబడుతోంది. కేసులు తక్కువగా నమోదుకావడంతోపాటు పాజిటివిటీ రేట్, యాక్టివ్ కేసులు కూడా తక్కువగానే ఉంటున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో థర్డ్‌వేవ్ లేదా మరో కొత్త వేవ్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే గత నవంబర్‌లో డెల్టా వేరియెంట్ ఆనవాళ్లు కనిపించి కేసుల పెరుగుదల మొదలై ఫిబ్రవరి కల్లా సెకండ్‌వేవ్ తీవ్రస్థాయికి చేరి మొత్తం దేశాన్నే అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. అందువల్ల కొత్త వేరియెంట్ పుట్టడానికి రెండు నుంచి మూడు నెలలు పడుతున్నందున వచ్చే నవంబర్ వరకు వ్యాక్సినేషన్ వేగం పెంచడంతోపాటు కొత్త వేరియెంట్ ఉద్భవించడానికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా 187 దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్వహించిన అధ్యయనంలో డెల్టా వేరియెంటే ఉనికిలో ఉన్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా వేవ్‌గా రావాలంటే డెల్టాకు మించిన వేరియెంట్ పుడితేనే ప్రమాదకరంగా మారుతుందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో 3 శాతమే వ్యాక్సినేషన్... ఇతరదేశాల్లో థర్డ్‌వేవ్‌కు కారణమైన డెల్టా ప్లస్ వేరియెంట్ నిర్వీర్యమైంది. అలాగే, వేరియెంట్ ఆఫ్ ఇంట్రస్ట్‌గా ప్రభావితం చేస్తాయని భావించిన థీటా, అయోటా, కప్పా, జేటా వేరియెంట్లను కూడా డౌన్‌గ్రేడ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఒరిజనల్ డెల్టా వేరియెంట్ కలిపి 39 సబ్క్లేట్స్ (ఆయా ప్రాంతాల్లో వ్యాప్తిని బట్టి) ఉండగా, భారత్‌లో 21 సబ్క్లేట్స్గా మారి డెల్టా వైరస్ వ్యాప్తిలో ఉంది. ఆఫ్రికా దేశాల్లో కేవలం 3 శాతమే వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల అక్కడ కొత్త వేరియెంట్ పుట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అక్కడ కొత్త వేరియెంట్ పుట్టి కొత్త వేవ్‌గా ప్రభావం చూపొచ్చునని, అప్పటి వరకు స్పైక్స్ రూపంలోనే రావొచ్చుని అంటున్నారు. ఎవరికి వారు పరిమితులకు లోబడి ఉంటేనే.. ఇప్పుడు వైరస్ తీవ్రత, వ్యాప్తి పెరగలేదు. అయినా ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే శ్రేయస్కరం. ప్రస్తుతం మనకు ‘మోనోక్లోనల్ యాంటీ బాడీస్ కాక్టెయిల్ డ్రగ్’ అందుబాటులో ఉండటం మేలు చేస్తోంది. ఈ ఇంజెక్షన్‌తో నాలుగు రోజుల్లోనే కోవిడ్ నెగెటివ్ వచ్చేస్తోంది. అదీగాక పోషకాహారం, తగిన విశ్రాంతి తీసుకుంటూ అన్ని జాగ్రత్తలు పాటిస్తే కరోనా బారిన పడకుండా రక్షణ పొందొచ్చు. సురక్షిత చర్యలు పాటిస్తూ పండగలు చేసుకున్నా, హాలిడే ట్రిప్‌లు తిరిగినా ఏమీ కాదు. ఎవరికి వారు పరిమితులకు లోబడి వ్యవహరించకపోతే మళ్లీ కరోనా పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త వేరియెంట్లు ఏర్పడకుండా. ప్రమాదకరమైన మ్యుటేషన్లు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బా ధ్యత మనందరిపై ఉంది. –డా.ప్రభుకుమార్ చల్లగాలి, జనరల్ ఫిజీషియన్, వృందాశ్రీ జూబ్లీ క్లినిక్ డెల్టాను డామినేట్ చేస్తేనే... దేశంలో డెల్టా వేరియెంట్ ఒక్కటే ప్రబలంగా ఉంది. మనదగ్గర 70 నుంచి 80 శాతం మంది కనీసం ఒక్క డోస్ అయినా టీకా తీసుకున్నారు. గతంలో కరోనా వ చ్చి పోయిన వారు, టీకా తీసుకున్న వారు కలిపి చాలామందిలోనే యాంటీబాడీస్ ఏర్పడ్డాయి. కొత్త వేవ్ వచ్చినా వారిలో తీవ్రత తక్కువగానే ఉండే అవకాశముంది. అదీగాక గతంతో పోల్చితే ఎలాంటి పరిస్థితి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్థంగా ఉన్నాం. మహారాష్ట్ర, ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు తక్కువగానే ఉంటున్నాయి. డెల్టా వేరియెంట్‌ను డామినేట్ చేసే కొత్త వేరియెంట్ వచ్చే వరకు ఇంకొక వేవ్ వచ్చే అవకాశాలు ఇప్పటికైతే లేవు. –డా.కిరణ్ మాదల, అసోసియేట్ ప్రొఫెసర్, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, వైద్యకళాశాల -
పసిప్రాయం ఎగ‘తాళి’!
వారిలో ఆలోచన శక్తి, సమస్యలను అధిగమించే పరిస్థితి ఉండదు. దీంతో గృహహింస, లైంగిక వేధింపులు, సామాజికంగా విడిపోవడం వంటి పరిస్థితులకు గురవుతారు. త్వరగా వృద్ధాప్యం వచ్చి వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది. రక్తహీనత ఏర్పడుతుంది. కారణాలు పేదరికం, అక్షరాస్యతలో బాలికల శాతం తక్కువగా ఉండడం. వారికి తక్కువ హోదా కల్పించడం, ఆర్థిక భారంగా భావించడం.. సాంఘికాచారాలు, సంప్రదాయాలు బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. దుష్పరిణామాలు బాల్య వివాహాలవల్ల చిన్న వయస్సులోనే బాలికలు గర్భం దాలిస్తే కాన్పు కష్టం కావటం, ప్రసూతి మరణాలు, శిశు మరణాలు అధికంగా ఉంటాయి. సాక్షి, అమరావతి : వివాహ భారంతో పసిప్రాయం నలిగిపోతోంది. మూడుముళ్ల బంధం పేరుతో బాలికల మెడలో పడుతున్న తాళి వారి జీవితానికి గుదిబండగా మారుతోంది. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు చేస్తే నేరమని చట్టాలు చెబుతున్నా మైనర్ వివాహాలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 అమలులోకి వచ్చినప్పటికీ పెళ్లీడు రాక ముందే జరుగుతున్న వివాహాలకు అడ్డుకట్ట పడట్లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ఇటీవల చేసిన సర్వేలు సైతం దేశంలోను, రాష్ట్రంలోను జరుగుతున్న బాల్య వివాహాలపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనెసెఫ్) లెక్కల ప్రకారం.. 40 శాతం కంటే ఎక్కువ బాల్య వివాహాలతో భారతదేశం ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. అలాగే, దేశంలో పరిశీలిస్తే మధ్యప్రదేశ్‌లో 73 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 71, రాజస్థాన్‌లో 68, బీహార్‌లో 67, ఉత్తరప్రదేశ్‌లో 64 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రానికి వస్తే.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు వరుస స్థానాల్లో ఉన్నాయి. ఏపీలో బాలికలే ఎక్కువ.. బాల్య వివాహాల్లో ఎక్కువగా బాలికలే ఉండటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015–2016 లెక్కల ప్రకారం దేశంలోని బాల్య వివాహాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరుగుతున్న 45 శాతం పెళ్లిళ్లలో 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహాలు జరగడం గమనార్హం. ఇది గ్రామాల్లో 35.5 శాతం, పట్టణాల్లో 26.3 శాతంగా ఉంది. పురుషుల విషయానికొస్తే.. 21 ఏళ్లు నిండని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 13.2 శాతం, పట్టణాల్లో 8.8 శాతం మందికి వివాహాలు జరుగుతున్నాయి. అలాగే, ఏపీకి సంబంధించి చైల్డ్‌లైన్–1098కు 2017–18 కాలంలో వచ్చిన ఫిర్యాదుల్లో 1,700.. 2018–19లో 1,900 బాల్య వివాహాలు జరిగాయి. అయితే, ఇలా వెలుగు చూడనివి మరెన్నో ఉన్నాయి. బాల్య వివాహాలకు బీజం ఇలా.. ఫ్రెంచి, పోర్చుగీసు, డచ్, బ్రిటీషు వాళ్లు భారతదేశాన్ని పాలించే కాలంలో కొంతమంది విదేశీ అధికారులు భారతీయ కన్యలను బల వంతంగా వివాహమాడటం, బలాత్కరించడం జరిగేది. వివాహితుల జోలికి రారనే ఉద్దేశ్యంతో తమ ఆడబిడ్డలను కాపాడుకునేందుకు భారతీ యులు తమ పిల్లలకు బాల్యంలోనే పెళ్లిళ్లు చేసే వారనే ప్రచారం ఉంది. రానురాను కుటుంబాల మధ్య సంబంధాలను పటిష్ఠ పరచుకోవడానికి ఆడపిల్ల పుట్టగానే తమ బంధువర్గంలో ఫలానా వాడికి భార్య పుట్టిందని ఇరువర్గాల వారు నిర్ణయించుకుని మొదట బొమ్మల పెళ్లిచేసి పెద్దయ్యాక వివాహం చేసేవారు. తాము చనిపోయే లోపు తమ వారసుల పెళ్లిళ్లు చూడాలనే వృద్ధుల కోరికను తీర్చడానికి కూడా పురుషుడి వయస్సు ఎక్కువైనా జరిపించే వారు. అనం తరం కాలంలో.. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రజల్లో అవగాహన పెరిగింది. అయినా ఇవి జరుగుతూనే ఉన్నాయి. నిరోధించే చట్టాలు బ్రిటిష్ పాలకులు 1929లో చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రిక్ట్ యాక్ట్ తెచ్చారు. అనంతరం.. భారత ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధక చట్టం–2006 (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్) 2007 జనవరి 10న ఆమోదం పొంది, 2007 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 18 ఏళ్లలోపు ఆడపిల్లలు, 21 ఏళ్ల లోపు మగపిల్లలు బాలల కిందకే వస్తారు. ఈ వయస్సులోపు వారికి పెళ్లి చేస్తే జిల్లా కలెక్టర్, ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, మెట్రోపాలి టన్ మేజిస్ట్రేట్, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, వీఆర్ఓ, వీఆర్ఏలకు ఫిర్యాదు చేయవచ్చు. వివాహ నమోదు చట్టంతో కూడా వీటికి చెక్ పెట్టవచ్చు. అలాగే, బాల్యవివాహం చేసిన వారెవరైనా నేరస్థులే. పెళ్లికి హాజరవ డమూ నేరమే. వీరికి రెండేళ్ల వరకు కఠిన కారా గార శిక్ష.. రూ.లక్ష వరకు జరిమానా విధించ వచ్చు. ఈ నేరాలకు బెయిల్ కూడా ఉండదు. బాల్య వివాహం సామాజిక దురాచారం తగిన వయసు రాకుండానే పెళ్లి చేయడంవల్ల బాలికలు సమస్యల సుడిగుండంలో కూరుకుపోతున్నారు. శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను కుంగదీసే ఈ వివాహాలు సమర్థనీయం కాదు. సామాజిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థను నిరోధించేలా కఠిన చర్యలు తీసుకోవాలి. – మణెమ్మ, సామాజిక కార్యకర్త నిరోధానికి కఠిన చర్యలు చేపట్టాలి బాల్య వివాహాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలి. దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో గతం నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. బాల్య వివాహాలపై స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేస్తే వాటిని నిలుపుదల చేయిస్తున్నారు. కానీ, కేసులు పెట్టి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. – ఎన్. రామ్మోహన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి -
బిడ్డకు రక్తం పంచబోతున్నారా?
మన దేశంలోని మహిళల్లో రక్తహీనత (అనీమియా) చాలా ఎక్కువ. దాదాపు 80 శాతం మందిలో రక్తహీనత ఉందని ఒక అంచనా. ఓ మోస్తరు రక్తహీనత దీర్ఘకాలం కొనసాగినా రకరకాల అనర్థాలు వస్తాయి. అయితే గర్భవతుల్లో రక్తహీనత వల్ల ఇటు కాబోయే తల్లికీ, అటు పుట్టబోయే బిడ్డకూ ప్రమాదమే.కాబట్టి వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ అనీమియా కేసులు ఎక్కువే... మరీ ముఖ్యంగా గర్భవతుల్లో. కాబట్టి ఈ రక్తహీనత వల్ల వచ్చే అనర్థాలు, దాన్ని అధిగమించడానికి మార్గాలను తెలుసుకుందాం. రక్తంలోని ఎర్రరక్తకణాలుగాని, దానిలో ఉండే పిగ్మెంట్ అయిన హీమోగ్లోబిన్గాని లేదా రెండూగాని తక్కువ అయితే వచ్చే సమస్యను రక్తహీనత (అనీమియా) అంటారు. కారణాలను బట్టి రక్తహీనతల్లో చాలా రకాలున్నాయి. గర్భిణుల్లో 90 శాతం రక్తహీనత ఐరన్ లోపం వల్ల, 5 శాతం ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల ఏర్పడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం రక్తంలో 10 గ్రాముల కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉంటే రక్తహీనత ఉన్నట్లుగా పరిగణించాలి. గర్భిణుల్లో రక్తహీనత ఎందుకు ఏర్పడుతుందంటే? గర్భిణుల్లో మామూలు మహిళల కంటే 40 శాతం (అంటే 1 నుంచి 2 లీటర్లు) ఎక్కువగా రక్తం వృద్ధి అవుతుంటుంది. గర్భంలో ఎదిగే బిడ్డకు ఆహారం, ఆక్సిజన్ సమృద్ధిగా అందడానికి వీలుగా ప్రకృతి ఈ ఏర్పాటు చేసింది. గర్భం ధరించిన నాలుగో నెల నుంచి మహిళల్లో రక్తం వృద్ధి చెందడం మొదలువుతుంది. ఎనిమిదో నెల నిండేసరికి ముందున్న దానికంటే రక్తం 40–50 శాతం పెరుగుతుంది. ఎంత ఆరోగ్యంగా ఉన్న స్త్రీకైనా గర్భం వచ్చిన 5–6 నెలలకి రక్తంలోని ప్లాస్మా పెరగడం వల్ల హీమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. రక్తం పట్టడానికి తగిన ఆహారం, ఐరన్ మాత్రలు వాడేవారిలో మళ్లీ కొద్దివారాల్లోనే హీమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అలా తీసుకోని వారిలో హీమోగ్లోబిన్ శాతం మరింత తగ్గుతుంది. రుతుస్రావం కూడా మరో కారణం... రుతు సమయంలో సాధారణంగా ఐదు రోజుల పాటు రక్తస్రావం అయ్యే మహిళల్లో నెలకు 45 సి.సి. రక్తం కోల్పోతేæ15 మి.గ్రా. ఐరన్‌ను కోల్పోయినట్లే. అంతకంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యేవారిలో ఇంకా ఎక్కువగా ఐరన్ తగ్గిపోతుంది. వీరు సరిగా ఆహారం తీసుకోకపోతే రక్తహీనత కలగవచ్చు. ఇక అప్పటికే రక్తహీనతతో ఉన్న మహిళ గర్భం ధరిస్తే... అనీమియా తీవ్రత మరింత పెరగవచ్చు. రక్తహీనత నివారణ / చికిత్స... ►21 ఏళ్లకంటే ముందర గర్భం రాకుండా చూసుకోవాలి. ►గర్భం దాల్చిన తర్వాత నాల్గవ నెల నుంచి పౌష్టికాహారంతో పాటు రోజూ ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉన్న మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలి ►నులిపురుగులు, మూత్రంలో ఇన్ఫెక్షన్ వంటివి ఉంటే తప్పనిసరిగా చికిత్స తీసుకోవాలి ►కాన్పుకి, కాన్పుకి మధ్య కనీసం రెండేళ్ల వ్యవధి ఉండేట్లు జాగ్రత్త పడటం వల్ల ఐరన్ నిలువలు పెరిగి మరో కాన్పుకు రక్తహీనత లేకుండా చూసుకోవచ్చు. సవరించడానికి... ►రక్తహీనతకు గల కారణాలను గుర్తించి దాన్ని బట్టి చికిత్స చేయాలి. ►డాక్టర్ సలహా మేరకు ఐరన్ మాత్రలు వాడాలి. బలంగా ఎదిగే పిల్లలతో ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం గర్భవతుల్లో రక్తహీనత సమస్యను తప్పనిసరిగా అధిగమించాల్సిన అవసరం ఉంది. అందుకే మహిళల్లో రక్తహీనతతోపాటు మరీ ముఖ్యంగా గర్భవతుల్లో అనీమియా సమస్యను నివారించడానికి సమాజం మొత్తం ఈ విషయంపై అవగాహన పెంచుకోవడం అవసరం. గర్భవతుల్లో రక్తహీనత లక్షణాలు ►తీవ్రతను బట్టి లక్షణాలు కొద్దిగా మారుతుంటాయి. సాధారణంగా కనిపించేవి... ►అలసట; ►గుండెదడ; ►కళ్లుతిరగడం; ►తలనొప్పి; ►తలబరువుగా ఉన్నట్లు అనిపించడం; ►ఆయాసం; ►కొంచెం పనికే ఊపిరి అందకపోవడం; ►నిద్రపట్టకపోవడం; ►ఆకలిలేకపోవడం; ►కాళ్లూ, చేతులు మంటలు, నొప్పులు; ►నోరు, నాలుకలో నొప్పి, పుండ్లు; ►నీరసం; ►బియ్యం, మట్టి తినాలనిపించడం; ►చర్మం మ్యూకస్‌పొరలు పాలిపోయి ఉండటం; ►కాళ్లవాపు; ►గుండె వేగంగా కొట్టుకోవడం; ►గోళ్లు పలచగా తయారవ్వడం, జుట్టు రాలిపోవడం. రక్తహీనతలో రకాలు స్వల్పరక్తహీనత (మైల్డ్) ... 8.7 గ్రా. నుంచి 10 గ్రా. ఉంటే ఒకమోస్తరు రక్తహీనత (మోడరేట్) ... 6.6 గ్రా. నుంచి 8.6 గ్రా. ఉంటే తీవ్రమైన రక్తహీనత (సివియర్) ... 6.5 గ్రా. కంటే తక్కువ రక్తహీనతకు కారణాలు ►గర్భం వచ్చాక రక్తంలో జరిగే మార్పుల వల్ల హీమోగ్లోబిన్ పరిమాణం తగ్గడం. ►ఆర్థిక, సామాజిక కారణాల వల్ల పౌష్టికాహార లోపం కారణంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 లోపం. ►జంక్‌ఫుడ్ తీసుకోవడం. ►జీర్ణవ్యవస్థలో నులిపురుగులు ఉంటే అవి రక్తాన్ని పీల్చుకోవడం ►జీర్ణకోశంలోని కొన్ని సమస్యల వల్ల ఆహారం నుంచి ఐరన్ సక్రమంగా రక్తంలోకి చేరకపోవడం (కడుపులో అల్సర్లవంటి కారణాల వల్ల కూడా) ►రక్తవిరేచనాలు, మొలలు ►గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవసమయంలో రక్తస్రావం. ►దీర్ఘకాలంగా మలేరియా వ్యాధితో బాధపడుతున్నవారిలో ఎర్రరక్తకణాలు విరిగిపోవడం. ►దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు, లక్షణాలేమీ బయటకు కనపడకుండా మూత్రవ్యవస్థలో బ్యాక్టీరియా చేరడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గడం. ►యువతులు 21 ఏళ్ల లోపు గర్భం ధరిస్తే ఐరన్, ప్రోటీన్స్ వంటివి బాలిక శరీరానికీ, గర్భంలో ఉన్న బిడ్డ పెరుగుదలకూ... ఇలా ఇద్దరికీ అవసరం ఉంటుంది. కాబట్టి అవి సరైన పాళ్లలో అందక రక్తహీనత రావచ్చు. ►పుట్టుకతో వచ్చే థలసీమియా, సికిల్‌సెల్ డిసీజ్ వంటి వాటి కారణంగా. ►అరుదుగా వచ్చే ఎప్లాస్టిక్ అనీమియా, రక్తసంబంధిత వ్యాధుల వల్ల ►కాన్పుకి, కాన్పుకి మధ్య ఎక్కువ వ్యవధి లేకపోవడం వల్ల ►క్షయ, కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్, హైదరాబాద్ -
పోలియో చుక్కలు, సూదిని వేయించాలి
నల్లగొండ టౌన్ : చిన్నారులకు పోలియో చుక్కలతో పాటు పోలియో సూదిని విధిగా వేయించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ డి.కిరణ్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.బాలనరేంద్ర అన్నారు. సోమవారం స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీహెచ్ఓలు, పీహెచ్‌సీల వైద్యాధికారులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి 24గంటల్లోపు పోలియో చుక్కలు, ఐపీ టైటీస్బీ టీకాలను వేయించాలన్నారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రతి బుధ, శనివారాల్లో జిల్లాలోని అన్ని ఉపకేంద్ర, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాల కార్యక్రమాలను నిర్వహించాలని, సంబంధిత వైద్యాదికారులు, పర్యవేక్షకులు పర్యవేక్షించాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 91శాతం పిల్లలకు అన్ని రకాల టీకాలు వేస్తుండగా ప్రైవేటు ఆస్పత్రుల్లో 9 శాతం మాత్రమే టీకాలను వేస్తున్నారని తెలిపారు. పుట్టిన ఏ బిడ్డ కూడా వికలాంగుడు కాకూడదని సరైన సమయంలో టీకాలను వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ అరుంధతి, పాఠశాల విద్య కార్యక్రమ అధికారి డాక్టర్ లలితాదేవి, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారి డాక్టర్ కె.రామకృష్ణ, జిల్లా మలేరియా అధికారి ఓం ప్రకాశ్, ఉప మీడియా అధికారి ఆర్.తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.