గుండెజబ్బుకు టీకా!
అవును. పోలియో, మెదడువాపు, క్షయ టీకాల మాదిరిగా గుండెజబ్బుకు కూడా త్వరలోనే టీకా రానుందట! అదేంటీ..? టీకా అంటే.. భవిష్యత్తులో శరీరంలోకి ప్రవేశించి ప్రాణాంతక వ్యాధులను కలిగించే వైరస్‌లు, బ్యాక్టీరియాలను అడ్డుకునేందుకు తోడ్పడే ఔషధం కదా. మరి.. గుండెజబ్బు సూక్ష్మజీవుల వల్ల రాదు కదా. దానికి టీకా ఏంటీ? అనుకుంటున్నారా? గుండెజబ్బు సూక్ష్మజీవుల వల్ల రాదు నిజమే. కానీ ధమనులు గట్టిబారడం(ఎథెరోస్క్లీరోసిస్) అనే సమస్య వల్ల కూడా వస్తుంది.
హానికర సూక్ష్మజీవులను హతమార్చాల్సిన మన సొంత రోగనిరోధక వ్యవస్థే ఒక్కోసారి కొన్ని పరిస్థితుల వల్ల శత్రువులా మారిపోతుంది. దీంతో ధమనులు గట్టిబారడంతో పాటు ఉబ్బిపోతాయి. ఫలితంగా ధమనుల్లో కొవ్వులు పేరుకుపోయి రక్తప్రసరణకు అడ్డంకి ఏర్పడి గుండెకు ముప్పు కలుగుతుందన్నమాట.
అయితే శత్రువులా మారే తెల్ల రక్తకణాలను ఎలా గాడిలో పెట్టాలో ఇప్పుడు అమెరికాలోని వేన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ధమనులపై తెల్ల రక్తకణాల హానికర ప్రభావాన్ని వీరు విజయవంతంగా తగ్గించగలిగారట. దీంతో మనుషుల్లోనూ తెల్ల రక్తకణాలను నియంత్రించేందుకు టీకాలను తయారు చేయవచ్చని వీరు ధీమా వ్యక్తంచేస్తున్నారు.