పోలియోమైలిటీస్ వ్యాధిని వాడుక భాషలో పోలియో అని పిలుస్తుంటారు. ఇది ఒక రకమైన అంటు వ్యాధి. వైరస్ కారణంగా వ్యాప్తిచెంది, మానవ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు వయసుగల చిన్నారులు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి ఇప్పుడు పాకిస్తాన్‌ను వణికిస్తోంది.
పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లోగల క్వెట్టాలో పోలియో కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. తాజాగా ఐదో కేసు వెలుగు చూసింది. ఇది ఏప్రిల్ 29న వెలుగు చూడగా, జూన్ 8న నిర్ధారణ అయ్యింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) నివేదిక ప్రకారం బాధిత చిన్నారి తొలుత అతిసారం, వాంతులు తదితర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని చికిత్స కోసం క్వెట్టాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతున్న తరుణంలో 10 రోజుల తర్వాత ఆ చిన్నారి శరీరంలోని దిగువ భాగం బలహీనంగా మారింది. తరువాత పోలియో వ్యాధి ఆ చిన్నారి శరీరానికంతటికీ వ్యాపించింది. దీంతో బాధిత చిన్నారిని కరాచీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఎన్‌ఐసీహెచ్)కు తరలించారు. అక్కడ ఆ చిన్నారికి అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం (ఏఎఫ్‌పీ) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వైద్య చికిత్స అందించినప్పటికీ వ్యాధి సోకిన చిన్నారి మే 22న మృతి చెందింది. దీనిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టింది.
బాధిత చిన్నారి రక్త నమూనాలను సేకరించారు. ఆ చిన్నారి తోబుట్టువులలో ఒకరికి వైల్డ్ పోలియోవైరస్ టైప్ వన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా ఆ చిన్నారికి పోలియో వ్యాక్సిన్ వేయించని కారణంగానే మృతి చెందిందా? అనే కోణంలో వైద్యశాఖ విచారణ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment