2 నుంచి పల్స్ పోలియో
Published Tue, Mar 28 2017 1:16 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
ఏలూరు (మెట్రో): జిల్లాలో పోలియో వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు వచ్చేనెల 2 నుంచి 4వ తేదీ వరకూ మూడు రోజులపాటు పల్స్ పోలియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా వైద్యారోగ్యాధికారి (డీఎంహెచ్‌ఓ) కె.కోటేశ్వరి తెలిపారు. పల్స్ పోలియా కార్యక్రమ ఏర్పాట్లపై సోమవారం ఆమె కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు నాలుగు లక్షల మంది వరకూ ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 2వ తేదీన జిల్లాలో 3,233 కేంద్రాలను ఏర్పాటు చేసి 13,215 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు చెప్పారు. డీఆర్‌ఓ హైమావతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి మోహనకృష్ణ, డెమో నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అందరికీ ఆరోగ్య బీమా లక్ష్యం
జిల్లాలో అందరికీ ఆరోగ్య బీమా అందించే లక్ష్యంతో హెల్త్ ఫర్ ఆల్ అనే పథకం అమలుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌ఓ కె.కోటేశ్వరి తెలి పారు. సోమవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్య బీమా పథకంలో భాగంగా ఏడాదికి రూ.1,200 చెల్లించడం ద్వారా రూ.2 లక్షల వరకు వైద్య సేవలు పొందే వీలుంటుందన్నారు. కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు వచ్చేనెల 3వ తేదీ నుంచి ఇంటింటా అవగాహన కార్యక్రమం చేపడతామని చెప్పారు. ఏఎన్‌ఎంలు, ఆరోగ్య మిత్రలు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారిని పథకంలో చేర్చేందుకు కృషి చేస్తారని తెలిపారు.
పథకాల అమలుపై ఆరా
జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య పథకాలపై ఎంపీహెచ్‌ఈఓ, సీఓలతో డీఎంహెచ్‌ఓ కోటేశ్వరి సమీక్షించారు. ఐవో మోహనకృష్ణ, ఆర్‌బీఎస్‌కే డాక్టర్ కె.సురేష్‌బాబు, డెప్యూటీ డెమో నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Advertisement