
మార్చి 22న ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం
మే 25న కోల్‌కతాలో ఫైనల్
క్వాలిఫయర్–1, ఎలిమినేటర్ మ్యాచ్‌లకు హైదరాబాద్ ఆతిథ్యం
విశాఖపట్నంలో రెండు మ్యాచ్‌లు ఆడనున్న ఢిల్లీ క్యాపిటల్స్
న్యూఢిల్లీ: వేసవిలో క్రీడాభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్‌కు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్ల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ టోర్నీకి తెర లేవనుంది.
మే 25వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనే జరిగే ఫైనల్‌తో టోర్నీకి తెర పడుతుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మొత్తం 9 మ్యాచ్‌లు (7 లీగ్ మ్యాచ్‌లు, రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు)... విశాఖపట్నంలో రెండు మ్యాచ్‌లు (ఢిల్లీ క్యాపిటల్స్) జరుగుతాయి.
» 13 వేదికల్లో 10 జట్ల మధ్య 65 రోజులపాటు నిర్వహించే ఐపీఎల్ 18వ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో 70 లీగ్ మ్యాచ్‌లు... నాలుగు ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) మ్యాచ్‌లు ఉన్నాయి. మొత్తం 10 జట్లు సొంత నగరాలతో పాటు... మూడు ఫ్రాంచైజీలు (ఢిల్లీ, రాజస్తాన్, పంజాబ్) తమ హోం మ్యాచ్‌లను రెండో వేదికపై కూడా ఆడాలని నిర్ణయించుకున్నాయి.
» ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ సీజన్‌ను విశాఖపట్నంలో మొదలు పెడుతుంది. వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగే రెండు మ్యాచ్‌ల్లో (మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో; మార్చి 30న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో) ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలో దిగుతుంది.
రాజస్తాన్ రాయల్స్ రెండు మ్యాచ్‌లను గువాహటిలో, పంజాబ్ కింగ్స్ జట్టు తమ మూడు మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడనున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒకే రోజు రెండు మ్యాచ్‌ల చొప్పున 12 సార్లు జరగనున్నాయి.
» సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో ఆడనుంది. ఈ సీజన్‌లో మొత్తం హైదరాబాద్ వేదికగా 9 మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 20న క్వాలిఫయర్–1, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు కూడా హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. క్వాలిఫయర్–2తో పాటు తుదిపోరు కోల్‌కతాలో జరగనున్నాయి.
» లీగ్‌లో 10 జట్లు అయినప్పటి నుంచి జట్లను ఈసారి కూడా రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్–1లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్... గ్రూప్–2లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లున్నాయి.
లీగ్ దశలో ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌లోని ఒక జట్టు తమ గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో రెండుసార్లు చొప్పున ఆడుతుంది. రెండో గ్రూప్‌లోని నాలుగు జట్లతో ఒక్కోసారి, మిగిలిన మరో జట్టుతో రెండుసార్లు తలపడుతుంది.
» ‘డబుల్ హెడర్’ ఉన్న రోజు తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్ యధావిధిగా రాత్రి గం. 7:30 నుంచి జరుగుతాయి. ఒకే మ్యాచ్ ఉన్న రోజు మ్యాచ్ రాత్రి గం. 7:30 నుంచి జరుగుతుంది.




Comments
Please login to add a commentAdd a comment