హైదరాబాద్ అభిమానులకు పండగ
నగరంలోనే ఐపీఎల్–10 తొలి మ్యాచ్
ఫైనల్ ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు టోర్నీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2017) పదో సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం విడుదల చేసింది. గత ఏడాది లీగ్ చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిబంధనల ప్రకారం తమ సొంతగడ్డపైనే తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకుంది. ఏప్రిల్ 5న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మొదటి పోరులో సన్‌రైజర్స్‌తో 2016 రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఐపీఎల్ పదో సీజన్‌లో మొత్తం 47 రోజుల పాటు 10 వేదికలలో లీగ్ నిర్వహిస్తారు. మే 21న ఫైనల్ మ్యాచ్ కూడా హైదరాబాద్‌లోనే జరుగుతుంది.
రెండు క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌ల వేదికలను తర్వాత ప్రకటిస్తారు. 2011 తర్వాత ఇండోర్‌లో మరోసారి ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండటం విశేషం. ఎప్పటిలాగే ప్రతీ జట్టు 14 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో 7 మ్యాచ్‌లను సొంతగడ్డపై, మరో 7 మ్యాచ్‌లను ప్రత్యర్థి మైదానాల్లో ఆడుతుంది. 2017 ఐపీఎల్ కోసం ఈ నెల 20న బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 10 లక్షల మధ్య కనీస విలువతో వేలం కోసం మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.