మా మరిదికి పోలియో, మా బావగారి పాపకు ఆటిజం ఉంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని.. మూడో నెల. ఈ పోలియో, ఆటిజం ఏమైనా జన్యుపరమైన జబ్బులా? నా బిడ్డకూ వచ్చే ప్రమాదం ఉందా?
–కర్నె ఉజ్వల, నాగర్ కర్నూల్
పోలియో అనేది వైరల్ ఇన్‌ఫెక్షన్. ఇది ఫ్లూ లాగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. పోలియో జన్యుపరమైన.. వంశపారంపర్య జబ్బు కాదు. పోలియో వైరస్ బారినపడిన వారికి స్పైనల్ కార్డ్ ఇన్‌ఫెక్షన్ పక్షవాతం ఉంటుంది. మెనింజైటిస్ – బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల శాశ్వతమైన వైకల్యం సంభవిస్తుంది. టీకాతో పోలియోను పూర్తిగా నివారించవచ్చు. ఐపీవీ అండ్ ఓపీవీ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లలందరికీ ఇప్పుడు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో పోలియో టీకాను ఇస్తున్నారు. ఇది జన్యుపరమైన అంటే తల్లిదండ్రులు.. బంధువుల నుంచి వ్యాపించదు.
మీ మరిదికి పోలియో ఉన్నా.. ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీలో మీ బిడ్డకు సోకే ప్రమాదం.. అవకాశం ఏమాత్రం లేదు. ఇక ఆటిజం విషయానికి వస్తే.. ఆటిజం అనేది.. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌లో ఒక భాగం. ఇది డెవలప్‌మెంటల్ డిజేబులిటీ. బాల్యంలోనే పిల్లల మెదడులో తేడాలను గుర్తించి దీన్ని డయాగ్నసిస్ చేస్తారు. దీనికి తల్లిదండ్రులతో కొంతవరకు జన్యుపరంగా రావచ్చు. కొన్నిసార్లు మామూలు తల్లితండ్రులకూ ఆటిజం ఉన్న బిడ్డ ఉండొచ్చు. ఇది స్పాంటేనియస్ మ్యుటేషన్స్‌తో అవుతుంది. ఎవరికి ఆటిజం ఉంటుంది అని ప్రెగ్నెన్సీలోనే కనిపెట్టడం కష్టం.
కానీ కొన్ని జంటలకు జెనెటిక్ కౌన్సెలర్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్స్ చేయించి.. కొన్ని కేసెస్‌లో బిడ్డకు వేరే సిండ్రోమ్స్ ఏమైనా వచ్చే చాన్సెస్ ఉంటే.. వాటిల్లో ఆటిజం కూడా ఉంటే మూడో నెల ప్రెగ్నెన్సీలో కొన్ని జెనెటిక్ టెస్ట్‌ల ద్వారా బిడ్డకు ఆ సిండ్రోమ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. కాబట్టి జెనెటిక్, నాన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ రెండూ ఆటిజానికి కారణాలు కావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే చాన్స్ ఉన్న కేసెస్‌లో ముందస్తుగానే అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే జెనెటిక్ , ఫీటల్ మెడిసిన్ కౌన్సెలింగ్ చేయిస్తే.. ఏ కేసెస్‌కి వైద్యపరీక్షలు అవసరం అనేది ముందుగానే నిర్ధారించే అవకాశం ఉంటుంది.
--డా భావన కాసు
గైనకాలజిస్ట్, ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment