శుక్రవారం సచివాలయంలో షాన్ పోలియో వ్యాక్సిన్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి
- శాంతా బయోటెక్ లిమిటెడ్ రూపకల్పన
- యునిసెఫ్ ద్వారా దేశ వ్యాప్తంగా సరఫరా
- వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పోలియో నిర్మూలనకు శాంతా బయోటెక్ లిమిటెడ్ తయారు చేసిన షాన్-ఐపీవీని (ఇనాక్టివేటేడ్ పోలియో వ్యాక్సిన్ - దీనిని ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పోలియో పునరావృతం కాకుండా ఉండేందుకు సురక్షితమైన ఈ వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు కంపెనీ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం కంపెనీ ప్రతినిధులు సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మొదటి శాంపిల్‌ను కేసీఆర్ యునిసెఫ్ ప్రతినిధులకు అందించారు. ఈ వ్యాక్సిన్‌ను రూపొందించినందుకు శాంతా బయోటెక్ కంపెనీని ముఖ్యమంత్రి అభినందించారు.
పోలియో శాశ్వత నిర్మూలన లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని, బిడ్డకు 14 వారాల వయసులో దీనిని ఇస్తారని, ఇప్పుడు వేస్తున్న పోలియో చుక్కలకు ఇది అదనమని, అయిదేళ్ల పాటు శ్రమించి దీన్ని రూపొందించామని వరప్రసాద్‌రెడ్డి సీఎంకు వివరించారు. వ్యాక్సిన్ తయారీలో ఫ్రెంచి కంపెనీ నుంచి శాస్త్రీయ సహకారం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధర ఒక యూనిట్‌కు రూ.1,050 ఉందని, తమ కంపెనీ మాత్రం యునిసెఫ్‌కు కేవలం రూ.55 చొప్పున సరఫరా చేస్తుందన్నారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు యునిసెఫ్ ద్వారా కేంద్రం తమ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తుందన్నారు.
రాష్ట్రానికి ఉచిత సరఫరా..
ఈ వ్యాక్సిన్‌ను తెలంగాణకు యునిసెఫ్ ఉచితంగా అందిస్తుందని వరప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ రాష్ట్రానికి గర్వ కారణమని కేసీఆర్ ప్రశంసించారు. ఇప్పటికే ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌ను 25 లక్షల డోస్‌ల కొనుగోలుకు యునిసెఫ్ ముందుకొచ్చిందని, ఏపీ, తెలంగాణకు ఉచితంగా అందించనుందని సీఎం పేర్కొన్నారు. తక్కువధరలో వ్యాక్సిన్స్, ఇన్సులిన్ తయారీలో శాంతా బయోటెక్ అద్భుతమైన పనితీరును కనబరుస్తోందని కొనియాడారు. కాగా, మేడ్చల్ సమీపంలోని తమ యూనిట్‌కు నీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని వరప్రసాద్‌రెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత తొందరగా నీటి సరఫరాను పునరుద్ధరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, హెల్త్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్, యునిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోని కుట్టి జార్జ్ పాల్గొన్నారు.