shantha biotech
-
‘ఆధునిక జీవన విధానం- ఆయుర్వేదం పాత్ర’పై వీధి అరుగు సమావేశం
వీధి అరుగు ఆధ్వర్యంలో ‘ఆధునిక జీవన విధానం- ఆయుర్వేదం పాత్ర’పై జూలై 25 తారీఖున ఆన్లైన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం సాయంత్రం ఏడు గంటలకు కార్యక్రమం ప్రారంభంకానుంది. యూరప్‌లో నివసించే వారి కోసం 15.30 CEST కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై ప్రముఖ వక్తలు మాట్లాడనున్నారు. ‘భారతీయ వైద్య రంగం – శాంత ప్రస్థానంలో నా అనుభవాలు’ అంశంపై శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి, ‘ఆధునిక జీవనం – ఆయుర్వేద పాత్ర’ అంశంపై కళారత్న, ఆంధ్రప్రదేశ్ హంస పురస్కార గ్రహీత, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీ.వీ. పూర్ణచంద్ మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా ఐఐటీ ఢిల్లీ విశ్లేషకులు ప్రొఫెసర్ వి. రామ్ గోపాల్ రావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ భాస్కర్ దీర్ఘాసీ(భారత్), శిరీష తూనుగుంట్ల(యూఎస్ఏ), ప్రో. గణేష్ తొట్టెంపూడి(జర్మనీ), అశోక్ కుమార్ పారా(భారత్), విజయ్ కుమార్ (యూకే), లక్ష్మణ్.వి(దక్షిణాఫ్రికా), అన్నపూర్ణ మహీంద్ర(ఫ్రాన్స్), రవిచంద్ర నాగబైరవ(నార్వే), సత్యనారాయణ కొక్కుల(నార్వే), శ్రీని దాసరి(నార్వే), సునీల్ గుర్రం (నార్వే), రామకృష్ణ ఉయ్యూరు(నార్వే), శైలేష్ గురుభగవతుల(ఫిన్లాండ్),శివప్రసాద్‌రెడ్డి మద్దిరాల(డెన్మార్క్), అచ్యుత్‌రామ్ కొచ్చర్లకోట(ఫిన్లాండ్) ఆయా దేశాల సమన్వయకర్తలుగా ఉండనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని నిర్వహణ సంస్థ వీధి అరుగు పేర్కొంది. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్‌ను నిర్వహకులు విడుదల చేశారు. నాలుగు తెలుగు మాటలు చెప్పుకునేందుకు ‘వీధి అరుగు’ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న గాయకుడు కార్తీక్ మద్దాల పాటతో ప్రారంభం కానుంది. కార్యక్రమానికి డాక్టర్ విద్య వెలగపూడి అనుసంధానకర్తగా వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు, మీ ప్రశ్నలను ఈ క్రింద లింక్ ద్వారా తెలపవచ్చును: https://tinyurl.com/VeedhiArugu ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించవచ్చు: 1. Join Zoom meeting https://us02web.zoom.us/j/87433469173?pwd=QXpNK3ZVbVFYVkFIUm0wdElhNU1odz09 Meeting ID: 874 3346 9173 Passcode: arugu 2. Youtube live streaming: ఆధునిక జీవితంలో ఆయుర్వేద పాత్ర : వీధి అరుగు సమావేశం, జులై 2021 - YouTube -
'వీధి అరుగు'లో శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు
ఆన్ లైన్ వేదికపై ఈనెల 25న 'వీధి అరుగు' ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భారతీయ వైద్య రంగం - శాంతా రంగంలో తమ అనుభావాల్ని పంచుకోవడానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. జి.వి. పూర్ణచంద్ విశిష్ట అతిథిగా పాల్గొనున్నారు. స్వదేశీ పరిజ్ఞానముతో భారతదేశంలో బయోఫార్మారంగం ఎలా అభివృద్ధి చెందింది, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మరియు టెక్నోక్రాట్లకు ఎలాంటి విధానాలతో ముందుకు వెళ్ళాలి. ఆధునిక జీవితంలో మన ఆయుర్వేదం పాత్ర ఏమిటి? మానవుడు దైనందిక జీవితంలో ఎటువంటి కట్టుబాట్లు-నియమాలను పాటించాలి. కరోనా సంహారంకు ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలిస్తారని నిర్వహాకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను నిర్వహకులు విడుదల చేశారు.నాలుగు తెలుగు మాటలు చెప్పుకునేందుకు ‘వీధి అరుగు’ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్స్ లో నివసిస్తున్న గాయకుడు కార్తీక్ మద్దెల పాటతో కార్యక్రమం ప్రారంభం కానుంది -
వ్యాక్సిన్ అభివృద్ధిపైనే శాంతా బయోటెక్ దృష్టి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ డెవలప్మెంట్కు దాదాపు 1000 కంపెనీలు దృష్టి పెట్టాయని శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు డా. వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం సాక్షిటీవీతో మాట్లాడుతూ.. వ్యాక్సిన్ అభివృద్ధిపైనే శాంతా బయోటెక్ దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మధ్యలో కానీ చివరలో కానీ వాక్సిన్ రావచ్చని ఆయన చెప్పారు. రక్షణ విభాగానికే బడ్జెట్ నిధులు ఎక్కువగా కేటాయించారని ఆయన అన్నారు. వార్షిక బడ్జెట్లో విద్య, వైద్యం,ఆరోగ్యం పట్ల చిన్నచూపు ఉందని తెలిపారు. ఇకపై భవిష్యత్‌లో ఆరోగ్యంపై ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. మేక్ ఇన్ ఇండియా పిలుపు మేరకు ఆవిష్కరణలు జరగాలని వరప్రసాదరెడ్డి చెప్పారు. దేశంలో వైద్యుల సంఖ్య పెరగాలని, కరోనా వంటి వివత్తుల కోసం ప్రత్యేక వైద్య బృందాలు ఉండాలని వరప్రసాదరెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రాల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరచడం అవసరని ఆయన తెలిపారు. భవిష్యత్ అంతా జీవ సాంకేతిక ఆయుధాలదే అని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ఎవరూ మిస్సైల్స్, ఆయుధాలు వాడరు, అంత ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. భవిష్యత్ దృష్ట్యా అవసరాలు మారాలని ఆయన పేర్కొన్నారు. మేథో సంపత్తిని ప్రోత్సహిస్తే ఆవిష్కరణలు పెరుగుతాయని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ను పొడిగించుకుని కూర్చుంటే ఇంకా ప్రమాదం ఎక్కువని, జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాల్సిందేనని డా. వరప్రసాద్‌రెడ్డి అన్నారు. -
ఓ పారిశ్రామికవేత్త ప్రస్థానం
హెపటైటిస్–బి టీకా పేరు వినగానే ‘శాంతా బయోటెక్నిక్స్’ గుర్తొస్తుంది. వెంటనే ‘వరప్రసాద్‌రెడ్డి’ గుర్తొస్తారు. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చి ల్యాబ్‌లో రాడార్ సైంటిస్టుగా పని చేస్తూ... ఆసక్తి కొద్దీ బయోటెక్నాలజీ వైపు అడుగులు వేసి, సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఆయన. ప్రభుత్వోద్యోగాన్ని వదిలేసి, సవాళ్లను అధిగమిస్తూ సాగించిన ప్రస్థానానికి అక్షరరూపమే ‘మనసు పలికే’. 2007లో వెలువరించిన 58 పేజీల ఈ చిన్న పుస్తకాన్ని తన విజయగాథను వివరించడానికే రాసి ఉంటే చెప్పుకోదగ్గ వైశిష్ట్యం ఉండేది కాదు. రచయితకు సంగీతసాహిత్యాలపై మమకారం ఉండటంతో అద్భుతమైన విశ్లేషణను జోడించారు. వెంచర్ క్యాపిటలిస్టుల్ని ‘వల్చర్ (రాబందు) క్యాపిటలిస్టులు’ అంటారు. ప్రభుత్వం సైతం అదే పంథాలో డిస్కౌంటుతో కూడిన షేరు, వడ్డీ, గ్యారంటీ అడిగిన విషయాన్ని ‘వైద్యుడు–పౌరోహిత్యం’ కథతో పోల్చి చెబుతారు. అధునాతన జెనటికల్లీ ఇంజినీర్డ్ వ్యాక్సిన్లు తయారు చేసే వ్యాపారావకాశం ఉందని గ్రహించడమే ఆయన సంకల్పసిద్ధికి తొలిమెట్టు. బొత్తిగా కొత్త రంగం కావడంతో దేశంలో అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. సాంకేతిక సహకారం కోసం ఓ విదేశీయుణ్ని కలిస్తే, అతగాడు దానికి భారీ వెల కట్టి, పైగా ‘దాన్ని అర్థం చేసుకోవడానికే మీ ఇండియన్సుకు పాతికేళ్లు పడుతుంది’ అంటూ హేళన చేస్తాడు. పట్టుదల పెరిగి, సవాలు విసిరి మరీ తిరిగొస్తారీయన. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆలంబనగా పరిశోధన ప్రారంభిస్తారు. ఫలితాలు మొదలవుతాయి. అక్కణ్నుంచీ మొదలవుతాయి అసలు కష్టాలు. ప్రభుత్వ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అధికారుల ఉదాసీనత, బయోటెక్నాలజీపై అవగాహన లేమి, అడ్డగోలు నిబంధనలు, అకారణంగా ఎన్జీవోల ఆందోళన, వివరణ లేకుండా అక్కసు వెళ్లగక్కే పత్రికలు, బ్యాంకుల నిర్లక్ష్య వైఖరి, క్లినికల్ ట్రయల్స్ పట్ల అర్థంలేని అభ్యంతరాలు వగైరా! తీరా తీరం చేరామనుకునేలోపే మార్కెట్ మాయాజాలం అనే మరో పెద్దభూతం! అటుపై... అనుకూలంగా లేని చట్టాలు, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు, డిస్ట్రిబ్యూటర్ల గిమ్మిక్కులు, పనిగట్టుకుని మార్కెట్లో చేసే దుష్ప్రచారం... ఇన్ని ఇక్కట్లను అధిగమించి శాంతా బయోటెక్నిక్స్‌ను విశ్వవేదికపై తలెత్తుకు నిలబడేలా చేశారు వరప్రసాద్‌రెడ్డి. ఆ తర్వాతి ఆవిష్కరణలైన హృద్రోగ ఔషధం, క్యాన్సర్ డ్రగ్‌లను మార్కెట్లో నిలబెట్టడానికి కూడా పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందంటారు. 1993లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 300 చదరపు అడుగుల గదిలో ప్రారంభమైన ‘శాంతా బయోటెక్నిక్స్’ ప్రస్తుతం అనేక దేశాల్లో తన ఆవశ్యకతను ఘనంగా చాటుకుంటోంది. నెల్లూరు దగ్గరి పాపిరెడ్డిపాళెంలో పుట్టి, తెలుగులో విద్యాభ్యాసం చేసి, ఖండాలన్నీ చుట్టివచ్చిన వరప్రసాద్‌రెడ్డి పుస్తకం పొడవునా మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతారు. ఓనమాల కన్నా ముందే ఏబీసీడీలు వద్దంటారు. ‘తెలుగులో చదివినంత మాత్రాన నువ్వు ఏ దేశపౌరుడికీ తీసిపోవు’ అని ఉత్సాహపరుస్తారు. విద్యావ్యవస్థలోని లోపాలేమిటో, అది ఎలా ఉండాలో వివరిస్తారు. చాలామంది చదువుతో సంబంధంలేని ఉద్యోగం చేస్తున్నామని కుమిలిపోతుంటారు. ఎలక్ట్రానిక్స్ చదివిన తాను జెనెటిక్ ఇంజనీరింగ్‌తో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నానని చెప్పడం ద్వారా అలాంటి వారి నైరాశ్యాన్ని దూరం చేస్తారు. - ఎమ్వీ రామిరెడ్డి -
పోలియో శాశ్వత నిర్మూలనకు వ్యాక్సిన్
- శాంతా బయోటెక్ లిమిటెడ్ రూపకల్పన - యునిసెఫ్ ద్వారా దేశ వ్యాప్తంగా సరఫరా - వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: పోలియో నిర్మూలనకు శాంతా బయోటెక్ లిమిటెడ్ తయారు చేసిన షాన్-ఐపీవీని (ఇనాక్టివేటేడ్ పోలియో వ్యాక్సిన్ - దీనిని ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పోలియో పునరావృతం కాకుండా ఉండేందుకు సురక్షితమైన ఈ వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు కంపెనీ చైర్మన్ వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం కంపెనీ ప్రతినిధులు సచివాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మొదటి శాంపిల్‌ను కేసీఆర్ యునిసెఫ్ ప్రతినిధులకు అందించారు. ఈ వ్యాక్సిన్‌ను రూపొందించినందుకు శాంతా బయోటెక్ కంపెనీని ముఖ్యమంత్రి అభినందించారు. పోలియో శాశ్వత నిర్మూలన లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ పని చేస్తుందని, బిడ్డకు 14 వారాల వయసులో దీనిని ఇస్తారని, ఇప్పుడు వేస్తున్న పోలియో చుక్కలకు ఇది అదనమని, అయిదేళ్ల పాటు శ్రమించి దీన్ని రూపొందించామని వరప్రసాద్‌రెడ్డి సీఎంకు వివరించారు. వ్యాక్సిన్ తయారీలో ఫ్రెంచి కంపెనీ నుంచి శాస్త్రీయ సహకారం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వ్యాక్సిన్ ధర ఒక యూనిట్‌కు రూ.1,050 ఉందని, తమ కంపెనీ మాత్రం యునిసెఫ్‌కు కేవలం రూ.55 చొప్పున సరఫరా చేస్తుందన్నారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు యునిసెఫ్ ద్వారా కేంద్రం తమ వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్రానికి ఉచిత సరఫరా.. ఈ వ్యాక్సిన్‌ను తెలంగాణకు యునిసెఫ్ ఉచితంగా అందిస్తుందని వరప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ రాష్ట్రానికి గర్వ కారణమని కేసీఆర్ ప్రశంసించారు. ఇప్పటికే ఈ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌ను 25 లక్షల డోస్‌ల కొనుగోలుకు యునిసెఫ్ ముందుకొచ్చిందని, ఏపీ, తెలంగాణకు ఉచితంగా అందించనుందని సీఎం పేర్కొన్నారు. తక్కువధరలో వ్యాక్సిన్స్, ఇన్సులిన్ తయారీలో శాంతా బయోటెక్ అద్భుతమైన పనితీరును కనబరుస్తోందని కొనియాడారు. కాగా, మేడ్చల్ సమీపంలోని తమ యూనిట్‌కు నీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని వరప్రసాద్‌రెడ్డి సీఎంకు విజ్ఞప్తి చేశారు. వీలైనంత తొందరగా నీటి సరఫరాను పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, హెల్త్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్, యునిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోని కుట్టి జార్జ్ పాల్గొన్నారు.