హెపటైటిస్–బి టీకా పేరు వినగానే ‘శాంతా బయోటెక్నిక్స్’ గుర్తొస్తుంది. వెంటనే ‘వరప్రసాద్‌రెడ్డి’ గుర్తొస్తారు. డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చి ల్యాబ్‌లో రాడార్ సైంటిస్టుగా పని చేస్తూ... ఆసక్తి కొద్దీ బయోటెక్నాలజీ వైపు అడుగులు వేసి, సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఆయన. ప్రభుత్వోద్యోగాన్ని వదిలేసి, సవాళ్లను అధిగమిస్తూ సాగించిన ప్రస్థానానికి అక్షరరూపమే ‘మనసు పలికే’. 2007లో వెలువరించిన 58 పేజీల ఈ చిన్న పుస్తకాన్ని తన విజయగాథను వివరించడానికే రాసి ఉంటే చెప్పుకోదగ్గ వైశిష్ట్యం ఉండేది కాదు. రచయితకు సంగీతసాహిత్యాలపై మమకారం ఉండటంతో అద్భుతమైన విశ్లేషణను జోడించారు. వెంచర్ క్యాపిటలిస్టుల్ని ‘వల్చర్ (రాబందు) క్యాపిటలిస్టులు’ అంటారు. ప్రభుత్వం సైతం అదే పంథాలో డిస్కౌంటుతో కూడిన షేరు, వడ్డీ, గ్యారంటీ అడిగిన విషయాన్ని ‘వైద్యుడు–పౌరోహిత్యం’ కథతో పోల్చి చెబుతారు.
అధునాతన జెనటికల్లీ ఇంజినీర్‌డ్ వ్యాక్సిన్లు తయారు చేసే వ్యాపారావకాశం ఉందని గ్రహించడమే ఆయన సంకల్పసిద్ధికి తొలిమెట్టు. బొత్తిగా కొత్త రంగం కావడంతో దేశంలో అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. సాంకేతిక సహకారం కోసం ఓ విదేశీయుణ్ని కలిస్తే, అతగాడు దానికి భారీ వెల కట్టి, పైగా ‘దాన్ని అర్థం చేసుకోవడానికే మీ ఇండియన్సుకు పాతికేళ్లు పడుతుంది’ అంటూ హేళన చేస్తాడు. పట్టుదల పెరిగి, సవాలు విసిరి మరీ తిరిగొస్తారీయన. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆలంబనగా పరిశోధన ప్రారంభిస్తారు. ఫలితాలు మొదలవుతాయి. అక్కణ్నుంచీ మొదలవుతాయి అసలు కష్టాలు. ప్రభుత్వ అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అధికారుల ఉదాసీనత, బయోటెక్నాలజీపై అవగాహన లేమి, అడ్డగోలు నిబంధనలు, అకారణంగా ఎన్జీవోల ఆందోళన, వివరణ లేకుండా అక్కసు వెళ్లగక్కే పత్రికలు, బ్యాంకుల నిర్లక్ష్య వైఖరి, క్లినికల్ ట్రయల్స్ పట్ల అర్థంలేని అభ్యంతరాలు వగైరా! తీరా తీరం చేరామనుకునేలోపే మార్కెట్ మాయాజాలం అనే మరో పెద్దభూతం!
అటుపై... అనుకూలంగా లేని చట్టాలు, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు, డిస్ట్రిబ్యూటర్ల గిమ్మిక్కులు, పనిగట్టుకుని మార్కెట్లో చేసే దుష్ప్రచారం... ఇన్ని ఇక్కట్లను అధిగమించి శాంతా బయోటెక్నిక్స్‌ను విశ్వవేదికపై తలెత్తుకు నిలబడేలా చేశారు వరప్రసాద్‌రెడ్డి. ఆ తర్వాతి ఆవిష్కరణలైన హృద్రోగ ఔషధం, క్యాన్సర్ డ్రగ్‌లను మార్కెట్లో నిలబెట్టడానికి కూడా పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చిందంటారు.
1993లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 300 చదరపు అడుగుల గదిలో ప్రారంభమైన ‘శాంతా బయోటెక్నిక్స్’ ప్రస్తుతం అనేక దేశాల్లో తన ఆవశ్యకతను ఘనంగా చాటుకుంటోంది.
నెల్లూరు దగ్గరి పాపిరెడ్డిపాళెంలో పుట్టి, తెలుగులో విద్యాభ్యాసం చేసి, ఖండాలన్నీ చుట్టివచ్చిన వరప్రసాద్‌రెడ్డి పుస్తకం పొడవునా మాతృభాష ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతారు. ఓనమాల కన్నా ముందే ఏబీసీడీలు వద్దంటారు. ‘తెలుగులో చదివినంత మాత్రాన నువ్వు ఏ దేశపౌరుడికీ తీసిపోవు’ అని ఉత్సాహపరుస్తారు. విద్యావ్యవస్థలోని లోపాలేమిటో, అది ఎలా ఉండాలో వివరిస్తారు.
చాలామంది చదువుతో సంబంధంలేని ఉద్యోగం చేస్తున్నామని కుమిలిపోతుంటారు. ఎలక్ట్రానిక్స్ చదివిన తాను జెనెటిక్ ఇంజనీరింగ్‌తో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నానని చెప్పడం ద్వారా అలాంటి వారి నైరాశ్యాన్ని దూరం చేస్తారు.
- ఎమ్వీ రామిరెడ్డి
ఓ పారిశ్రామికవేత్త ప్రస్థానం
Published Mon, Sep 24 2018 3:21 AM | Last Updated on Mon, Sep 24 2018 3:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment