ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో కొత్తగా మరో రెండు పోలియో కేసులు నమోదు కావడంతో కలకలం చెలరేగింది. దేశంలో ఈ ప్రాణాంతక ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగుల సంఖ్య 41కి చేరింది. పాకిస్తాన్‌కు చెందిన డాన్ వార్తాపత్రిక తెలిపిన వివరాల ప్రకారం గురు, శుక్రవారాల్లో కొత్తగా రెండు పోలియో కేసులు నమోదయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 24ను పోలియో దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదే సమయంలో కొత్తగా కేసులు నమోదుకావడం పాక్ ప్రభుత్వానికి సవాల్‌గా నిలిచింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లలో నమోదైన ఈ రెండు కేసులు పోలియో వైరస్‌ను నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా నిలిచాయి.
బలూచిస్థాన్‌లోని లోరాలై జిల్లాలోని మూడేళ్ల బాలికకు పోలియో వ్యాధి సోకింది. ఈ చిన్నారి అక్టోబర్ 8న పోలియో బారిన పడింది. పోలియో వ్యాక్సినేషన్ ప్రచారంలో వ్యాధి సోకిన ఈ చిన్నారికి యాంటీ పోలియో డోస్ ఇవ్వలేదని వెల్లడయ్యింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని కోహట్ జిల్లాలోని రెండేళ్ల బాలునికి పోలియో సోకింది.
ఇప్పటివరకు బలూచిస్తాన్‌లో 21, సింధ్‌లో 12, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆరు, పంజాబ్, ఇస్లామాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున పోలియో కేసులు నమోదయ్యాయి. పాక్‌లో పోలియో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 4.5 కోట్ల మందికి పైగా పిల్లలకు పోలియో డోస్‌లు వేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూన్ 2025 నాటికల్లా పాకిస్తాన్ నుంచి ఈ వ్యాధిని తరిమికొట్టేందుకు పెద్ద ఎత్తున ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం పోలియో ఇప్పటికీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో మహమ్మారిగా ఉంది.
ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. తొమ్మిదిమందికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment