ఏ వ్యాక్సిన్‌కు ఎంత సమయం? | Historic Dates of Events Find Vaccines | Sakshi
Sakshi News home page

ఏ వ్యాక్సిన్‌కు ఎంత సమయం?

Published Sat, Jan 2 2021 5:53 AM | Last Updated on Sat, Jan 2 2021 5:53 AM

Historic Dates of Events Find Vaccines - Sakshi

తొలినాళ్లలో టీకాలు కనిపెట్టేందుకు దశాబ్దాల కాలం పట్టేది. కానీ ఆధునిక సాంకేతికత పెరిగే కొద్దీ టీకాల ఉత్పత్తి  సమయం తగ్గుతూ వచ్చింది. తాజాగా మానవాళిపై ప్రకృతి పంపిన కరోనా మహమ్మారికి రికార్డు స్థాయిలో ఏడాదిలోపే టీకా కనుగొన్నారు. చరిత్రలో ప్రత్యేకత సంతరించుకున్న వ్యాక్సిన్లు, వాటిని కనిపెట్టేందుకు పట్టిన సమయం ఓసారి చూద్దాం..

స్మాల్‌పాక్స్‌ (మశూచి)
క్రీ.పూ 3వ శతాబ్దం నుంచి మానవచరిత్రలో ఈ వ్యాధి ప్రస్తావన కనిపిస్తుంది. 18వ శతాబ్దినాటికి కాలనైజేషన్‌ కారణంగా ప్రపంచమంతా విస్తరించింది. దీనివల్ల కలిగే మరణాలు భారీగా ఉండేవి. 1796లో ఎడ్వర్డ్‌ జెన్నర్‌ తొలిసారి ఈవ్యాధికి వ్యాక్సిన్‌ తయారు చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 1967 తర్వాతే ఈ వ్యాక్సిన్‌ను విరివిగా ఇచ్చి 1980 నాటికి స్మాల్‌పాక్స్‌ ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఇప్పటివరకు టీకాతో సమూలంగా నిర్మూలించిన వ్యాధి ఇదొక్కటే.

టైఫాయిడ్‌: 1880లో దీనికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. 1886లో టీకా కనుగొనే యత్నాలు ఆరంభమయ్యాయి. 1909లో రస్సెల్‌ అనే శాస్త్రవేత్త విజయవంతమైన వ్యాక్సిన్‌ కనుగొన్నారు. 1914 నుంచి సామాన్యులకు  అందుబాటులోకి తెచ్చారు.  

ఇన్‌ఫ్లూయెంజా:  ఈ వ్యాధికి టీకా కనుగొనే ప్రయత్నం 1930 నుంచి జరిగింది. 1945లో విజయవంతమైన టీకా ఉత్పత్తి చేశారు. కానీ ఈ వ్యాధికారక వైరస్‌లో మార్పులు జరుగుతుండటంతో టీకాలో మార్పులు చేస్తున్నారు.  

పోలియో: ప్రాణాంతకం కాకపోయినా, మనిషిని జీవచ్ఛవంలా మార్చే ఈ వ్యాధి నివారణకు టీకాను 1935లో కోతులపై ప్రయోగించారు. కానీ తొలిసారి విజయవంతమైన టీకాను 1953లో జోనస్‌ సాక్, 1956లో ఆల్బర్ట్‌ సబిన్‌ తయారు చేశారు. 1990 అనంతరం పలు దేశాల్లో పోలియోను దాదాపు నిర్మూలించడం జరిగింది.

ఆంత్రాక్స్‌: ఈవ్యాధి గురించి క్రీ.పూ 700 నుంచి మనిషికి తెలుసు. 1700నుంచి దీనిపై శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. 1881లో తొలిసారి వ్యాక్సిన్‌ ఉత్పత్తి ప్రయత్నం జరిగింది. పశువులకు వాడే విజయవంతమైన ఆంత్రాక్స్‌ టీకాను మాత్రం 1937లో మాక్స్‌ స్టెర్నె కనుగొన్నారు. 1970ల్లో ఆంత్రాక్స్‌ టీకా ఉత్పత్తి జరిగింది.

ఎంఎంఆర్‌: మీజిల్స్, మంప్స్, రూబెల్లా అనేవి వైరస్‌ ద్వారా సంక్రమించే వ్యాధులు. 1960 నాటికి వీటికి విడివిడిగా వ్యాక్సిన్లు వచ్చాయి. 1971లో మౌరిస్‌ హిల్లెమన్‌ ఈ వ్యాధులకు ఒకే వ్యాక్సిన్‌ను కనుగొన్నారు.  

చికెన్‌పాక్స్‌(ఆటలమ్మ): 19వ శతాబ్దం వరకు దీన్ని స్మాల్‌పాక్స్‌గానే భ్రమించేవారు. అనంతరం దీనిపై విడిగా పరిశోధనలు జరిగాయి. 1970లో జపాన్‌ సైంటిస్టులు విజయవంతమైన చికెన్‌పాక్స్‌ టీకా కనుగొన్నారు.  

ప్లేగు: మానవాళిని గజగజలాడించిన మొండి వ్యాధి. ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమైంది. కానీ దీనికి సరైన వ్యాక్సిన్‌ ఇప్పటివరకు లేదు. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. అందువల్ల ఆధునిక యాంటీబయాటిక్స్‌తో దీన్ని నివారించవచ్చు. గతంలో దీనికి వ్యాక్సిన్‌ తయారు చేయాలన్న యత్నాలు సఫలం కాలేదు.  2018లో దాదాపు 17 వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయిల్స్‌లో ఉన్నట్లు డబ్లు్యహెచ్‌ఓ తెలిపింది.
 
యెల్లో ఫీవర్‌
500 ఏళ్లుగా మనిషిని ఇబ్బందులు పెట్టిన ఈవ్యాధికి టీకా కనుగొనే యత్నాలు 19వ శతాబ్దంలో ఆరంభమయ్యాయి. 1918లలో రాక్‌ఫెల్లర్‌ సంస్థ సైంటిస్టులు వ్యాక్సిన్‌ కనుగొన్నారు. మాక్స్‌ ధీలర్‌ 1937లో తొలిసారి యెల్లోఫీవర్‌కు విజయవంతమైన టీకా తయారు చేశారు. 1951లో ఆయనకు నోబెల్‌ వచ్చింది. టీకా ఉత్పత్తికి నోబెల్‌ అందుకున్న తొలి శాస్త్రవేత్త ఆయనే.
 హెపటైటిస్‌ బీ
ఇటీవల కాలంలో కనుగొన్న వైరస్‌ ఇది. 1965లో దీన్ని గుర్తించిన డా. బరూచ్‌ బ్లుంబర్గ్‌ నాలుగేళ్ల అనంతరం దీనికి వ్యాక్సిన్‌ను తయారు చేయగలిగారు. 1986లో హెపటైటిస్‌ బీకి సింథటిక్‌ టీకాను కనుగొన్నారు. ఈ వైరస్‌ వల్ల లివర్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. దీని టీకాతో లివర్‌ క్యాన్సర్‌ను నివారించడం జరుగుతుంది కనుక ఈ టీకాను తొలి యాంటీ క్యాన్సర్‌ టీకాగా పేర్కొంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement