Anthrax
-
ఏ వ్యాక్సిన్‌కు ఎంత సమయం?
తొలినాళ్లలో టీకాలు కనిపెట్టేందుకు దశాబ్దాల కాలం పట్టేది. కానీ ఆధునిక సాంకేతికత పెరిగే కొద్దీ టీకాల ఉత్పత్తి సమయం తగ్గుతూ వచ్చింది. తాజాగా మానవాళిపై ప్రకృతి పంపిన కరోనా మహమ్మారికి రికార్డు స్థాయిలో ఏడాదిలోపే టీకా కనుగొన్నారు. చరిత్రలో ప్రత్యేకత సంతరించుకున్న వ్యాక్సిన్లు, వాటిని కనిపెట్టేందుకు పట్టిన సమయం ఓసారి చూద్దాం.. స్మాల్‌పాక్స్ (మశూచి) క్రీ.పూ 3వ శతాబ్దం నుంచి మానవచరిత్రలో ఈ వ్యాధి ప్రస్తావన కనిపిస్తుంది. 18వ శతాబ్దినాటికి కాలనైజేషన్ కారణంగా ప్రపంచమంతా విస్తరించింది. దీనివల్ల కలిగే మరణాలు భారీగా ఉండేవి. 1796లో ఎడ్వర్డ్ జెన్నర్ తొలిసారి ఈవ్యాధికి వ్యాక్సిన్ తయారు చేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా 1967 తర్వాతే ఈ వ్యాక్సిన్‌ను విరివిగా ఇచ్చి 1980 నాటికి స్మాల్‌పాక్స్ ఆనవాళ్లు లేకుండా చేయడం జరిగింది. ఇప్పటివరకు టీకాతో సమూలంగా నిర్మూలించిన వ్యాధి ఇదొక్కటే. టైఫాయిడ్: 1880లో దీనికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. 1886లో టీకా కనుగొనే యత్నాలు ఆరంభమయ్యాయి. 1909లో రస్సెల్ అనే శాస్త్రవేత్త విజయవంతమైన వ్యాక్సిన్ కనుగొన్నారు. 1914 నుంచి సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. ఇన్‌ఫ్లూయెంజా: ఈ వ్యాధికి టీకా కనుగొనే ప్రయత్నం 1930 నుంచి జరిగింది. 1945లో విజయవంతమైన టీకా ఉత్పత్తి చేశారు. కానీ ఈ వ్యాధికారక వైరస్‌లో మార్పులు జరుగుతుండటంతో టీకాలో మార్పులు చేస్తున్నారు. పోలియో: ప్రాణాంతకం కాకపోయినా, మనిషిని జీవచ్ఛవంలా మార్చే ఈ వ్యాధి నివారణకు టీకాను 1935లో కోతులపై ప్రయోగించారు. కానీ తొలిసారి విజయవంతమైన టీకాను 1953లో జోనస్ సాక్, 1956లో ఆల్బర్ట్ సబిన్ తయారు చేశారు. 1990 అనంతరం పలు దేశాల్లో పోలియోను దాదాపు నిర్మూలించడం జరిగింది. ఆంత్రాక్స్: ఈవ్యాధి గురించి క్రీ.పూ 700 నుంచి మనిషికి తెలుసు. 1700నుంచి దీనిపై శాస్త్రీయ అధ్యయనాలు జరిగాయి. 1881లో తొలిసారి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రయత్నం జరిగింది. పశువులకు వాడే విజయవంతమైన ఆంత్రాక్స్ టీకాను మాత్రం 1937లో మాక్స్ స్టెర్నె కనుగొన్నారు. 1970ల్లో ఆంత్రాక్స్ టీకా ఉత్పత్తి జరిగింది. ఎంఎంఆర్: మీజిల్స్, మంప్స్, రూబెల్లా అనేవి వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు. 1960 నాటికి వీటికి విడివిడిగా వ్యాక్సిన్లు వచ్చాయి. 1971లో మౌరిస్ హిల్లెమన్ ఈ వ్యాధులకు ఒకే వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. చికెన్‌పాక్స్(ఆటలమ్మ): 19వ శతాబ్దం వరకు దీన్ని స్మాల్పాక్స్గానే భ్రమించేవారు. అనంతరం దీనిపై విడిగా పరిశోధనలు జరిగాయి. 1970లో జపాన్ సైంటిస్టులు విజయవంతమైన చికెన్‌పాక్స్ టీకా కనుగొన్నారు. ప్లేగు: మానవాళిని గజగజలాడించిన మొండి వ్యాధి. ప్రపంచంలోనే అత్యధిక మరణాలకు కారణమైంది. కానీ దీనికి సరైన వ్యాక్సిన్ ఇప్పటివరకు లేదు. ఈ వ్యాధి బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది. అందువల్ల ఆధునిక యాంటీబయాటిక్స్‌తో దీన్ని నివారించవచ్చు. గతంలో దీనికి వ్యాక్సిన్ తయారు చేయాలన్న యత్నాలు సఫలం కాలేదు. 2018లో దాదాపు 17 వ్యాక్సిన్లు వివిధ దశల ట్రయిల్స్‌లో ఉన్నట్లు డబ్లు్యహెచ్‌ఓ తెలిపింది. యెల్లో ఫీవర్ 500 ఏళ్లుగా మనిషిని ఇబ్బందులు పెట్టిన ఈవ్యాధికి టీకా కనుగొనే యత్నాలు 19వ శతాబ్దంలో ఆరంభమయ్యాయి. 1918లలో రాక్ఫెల్లర్ సంస్థ సైంటిస్టులు వ్యాక్సిన్ కనుగొన్నారు. మాక్స్ ధీలర్ 1937లో తొలిసారి యెల్లోఫీవర్కు విజయవంతమైన టీకా తయారు చేశారు. 1951లో ఆయనకు నోబెల్ వచ్చింది. టీకా ఉత్పత్తికి నోబెల్ అందుకున్న తొలి శాస్త్రవేత్త ఆయనే. హెపటైటిస్ బీ ఇటీవల కాలంలో కనుగొన్న వైరస్ ఇది. 1965లో దీన్ని గుర్తించిన డా. బరూచ్ బ్లుంబర్గ్ నాలుగేళ్ల అనంతరం దీనికి వ్యాక్సిన్‌ను తయారు చేయగలిగారు. 1986లో హెపటైటిస్ బీకి సింథటిక్ టీకాను కనుగొన్నారు. ఈ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీని టీకాతో లివర్ క్యాన్సర్‌ను నివారించడం జరుగుతుంది కనుక ఈ టీకాను తొలి యాంటీ క్యాన్సర్ టీకాగా పేర్కొంటారు. -
ఆంత్రాక్స్‌పై పాక్, చైనా పరిశోధనలు?
ఇస్లామాబాద్: రసాయన యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వీలుగా ప్రాణాంతక ఆంత్రాక్స్‌పై పాకిస్తాన్, చైనా కలసికట్టుగా పరిశోధనలు చేయాలని నిర్ణయించినట్టుగా ఇటీవల వచ్చిన వార్తల్ని పాక్ కొట్టిపారేసింది. అవన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడిన తప్పుడు వార్తలని వ్యాఖ్యానించింది. ఆంత్రాక్స్ వంటి వాటిపై ప్రయోగాలు చేయడం కోసం చైనా, పాక్ రహస్యంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఆరోపిస్తూ ఆస్ట్రేలియా వార్తా పత్రిక ది క్లాక్సన్ ఒక కథనాన్ని ప్రచురించింది. పరిశోధనాత్మక వ్యాసాలను అందించే ఆ పత్రిక ఇటీవల కాలంలో ప్రబలుతున్న అంటువ్యాధులపై పరిశోధనలు చేయడానికి మూడేళ్లపాటు కలిసి పనిచేయాలని పాక్, చైనాల మధ్య ఒప్పందం కుదిరినట్టుగా ఆ కథనంలో వెల్లడించింది. అయితే ఈ కథనంలో ఏ మాత్రం వాస్తవం లేదని పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తోసిపుచ్చింది. దానిని రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యగా అభివర్ణించింది. -
ఆంత్రాక్స్ ముప్పు పట్టించుకోని గిరిజనం
హుకుంపేట (అరకులోయ): మన్యంలో ప్రతి ఏడాది ఆంత్రాక్స్ వ్యాధి తీవ్రత నెలకొంటున్నప్పటికీ గిరిజనులు మాత్రం ఆ వ్యాధి గురించి ఏ మాత్రం భయపడడం లేదు. కొన్ని వర్గాల గిరిజనులు మాత్రం పశుమాంసం వినియోగాన్ని మానడం లేదు. అయితే పశు వైద్యుల పరీక్షలు అనంతరం పశువులను వధించి, తరువాత మాంసంపై పశుసంవర్థ్ధకశాఖ సీల్ వేయాలనే నిబంధనలను పశువైద్యులు, సంబంధిచ వ్యాపారులు పట్టించుకోవడం లేదు. పశువైద్యుల సూచనలు మేరకు తాజా పశు మాంసాన్ని బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ ఏజెన్సీలో మాత్రం వ్యాపారులు గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పలు వ్యాధులతో బక్కచిక్కిన పశువులు, చనిపోవడానికి కొన ఊపిరితో ఉన్న పశువులు, ఒక్కో సమయంలో గుట్టుచప్పుడు కాకుండా మృతి చెందిన పశువులను వధించి, సంతల్లో విచ్చలవిడిగా పశుమాంసం అమ్మకాలు జరుపుతున్నారు. అయితే పశు మాంసం అమ్మకాలు వ్యాపారులకు సిరులు కురిపిస్తుండగా వినియోగిస్తున్న గిరిజనులు మాత్రం పలు రోగాల బారిన పడుతున్నారు. వ్యాధులతో చనిపోయిన పశువులను ఖననం చేయకుండా, వాటిని కోసిన వారికి, అలాగే ఈ మాంసం వండుకు తిన్నవారికి ఆంత్రాక్స్ వ్యాధి సోకే ప్రమాదం ఉందని చర్మవ్యా«ధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి శనివారం హుకుంపేట సంతలో ఆవులను వ«ధించిన వ్యాపారులు, ఎలాంటి పశువైద్యులు పరీక్షలు లేకుండానే యథేచ్ఛగా∙ఈ మాంసాన్ని భారీగా విక్రయిస్తున్నారు. అయితే బక్కచిక్కి,బాగా నీరసించిన పశువులనే కోస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమాయక గిరిజనులు ఈ పశు మాంసాన్నే కొనుగోలు చేసి తమ ఇళ్లకు తీసుకు వెళుతున్నారు. సంతలోనే వంటలు.. పశుమాంసాన్ని కొంతమంది సంతలోనే వండి ఫాస్ట్‌ఫుడ్ మాదిరిగా వ్యాపారం చేస్తున్నారు. సంతల్లో కల్లు, ఇతర మద్యం సేవిస్తున్న గిరిజనులు ఈ పశుమాంసం తింటున్నారు. పశుమాంసంను బాగా ఉడకబెట్టి నాణ్యంగా తయారు చేసిన తరువాత తింటే అనారోగ్య సమస్యలు ఉండవని వైద్యులు చెబుతుండగా, ఈ సంతలో మాత్రం నామమాత్రంగా అక్కడికక్కడే ఉప్పు కారం వేసి, ఉడకబెట్టి విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతున్నారు. ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా ఈ పశుమాంసంను తింటున్నారు. తనిఖీలు జరుపుతాం.. సంతలో పశువుల వధ. మాంసం నాణ్యతను నిర్థారించేందుకు తనిఖీలు చేపడుతున్నాం. అనారోగ్యంతో బాధపడే పశువులు, మృతి చెందిన పశువుల మాంసం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – సునీల్, పశువైద్యాధికారి -
వైద్యానికి ఆంత్రాక్స్ రోగులు ససేమిరా
సీలేరు(పాడేరు): జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ ఏవోబీ సరిహద్దు చిన్నగంగవరం, పెద్దగంగవరం గ్రామాల్లో ఆంత్రాక్స్ రోగులు... వైద్యాధికారులను, సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఆంత్రాక్స్ వ్యాధి మిగతా గిరిజనులకు సోకకుండా చర్యలు చేపట్టేందుకు వైద్యసిబ్బంది నానాపాట్లు పడుతుంటే, ఆ వ్యాధి బారిన పడిన వారు కేజీహెచ్‌కు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఆంత్రాక్స్ బారిన పడిన 11 మందిని గురువారం చింతపల్లికి తరలించారు. అక్కడ నుంచి కేజీహెచ్‌కు తరలించే లోపు వారు తప్పించుకుని గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో కంగారు పడిన ఐటీడీఏ బృందం, వైద్యసిబ్బంది శుక్రవారం ఉదయం గ్రామాలకు వెళ్లి ఆరా తీయగా రోగులందరూ వచ్చేశారని స్థానికులు తెలిపారు. దారకొండ వైద్యాధికా రి రామ్‌నాయక్, వైద్యసిబ్బంది, వెలుగు, పశువైద్యశాఖ, రెవెన్యూశాఖ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులు కలిసి వారిని పట్టుకుని ఆంత్రాక్స్ వ్యాధిపై అవగాహన కల్పించి, నచ్చజెప్పారు. చింతపల్లి నుంచి ఒకే అంబులెన్స్‌లో కిల్లో అర్జున్, గెమ్మెలి సువర్ణ, పి.దళపతి, కొర్రా రామన్న, గెమ్మెలి రాజు, కిల్లో రాందాసు, కిల్లో పోత్తి అనే అనే ఏడుగుర్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మరో నలుగురి కోసం గాలింపు: ఆంత్రాక్స్ సోకిన 11 మందిలో ఏడుగురికి కౌన్సెలింగ్ ఇచ్చి కేజీహెచ్‌కు పంపించగా మిగతా నలుగురు వైద్యం చేయించుకునేందుకు, కేజీహెచ్‌కు వెళ్లేందుకు మొండికేస్తున్నారు. దారకొండ వైద్యసిబ్బంది కనబడకుండా గ్రామం నుంచి పరారయ్యారు. వీరి కోసం వైద్యసిబ్బంది, స్థానిక అధికారులు గాలిస్తున్నారు. వీరికి తక్షణమే వైద్యం అందించకపోతే మరికొందరికి సోకే ప్రమాదముందని వైద్య సిబ్బంది తెలిపారు. శుక్రవారం ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరకి ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. పాంగి సద్దు, పాంగి కొండబాబులకు ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయని, వీరు కూడా వైద్యానికి అంగీకరించడం లేదని వైద్యసిబ్బంది తెలిపారు. -
విశాఖ మన్యంలో ఆంత్రాక్స్ కలకలం
-
ఖండాంతర క్షిపణి ద్వారా ‘ఆంత్రాక్స్’
సియోల్ : అణు సాయుధ సంపత్తి కోసం ఆరాటపడి, పలు ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆందోళనలకు గురి ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్.. రసాయన ఆయుధాలను తయారు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)లకు ఆంత్రాక్స్ బాక్టీరియాను అమర్చి శత్రు దేశాలపై ప్రయోగించాలని కిమ్ యోచన చేస్తున్నట్లు జపాన్ పత్రిక ‘అసాహీ’ బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది. అమెరికా ప్రభుత్వానికి ఈ విషయంపై సమాచారం కూడా ఉందని వెల్లడించింది. ఖండాంతర క్షిపణికి ప్రయోగం వల్ల వెలువడే ఉష్ణానికి ఆంత్రాక్స్ బాక్టీరియా బ్రతుకుతుందా? లేదా? అనే అంశాన్ని నిర్ధారించుకునేందుకు కిమ్ దేశం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ‘ఆంత్రాక్స్’అంటే ఏంటి? ‘బాసిల్లస్ ఆంత్రాసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఆంత్రాక్స్ వ్యాధి సోకుతుంది. ఆంత్రాక్స్ను మిలటరీ ఆయుధాలకు(బాంబులు, క్షిపణులు, రాకెట్లు) జోడించి ప్రయోగించడానికి అవకాశం ఉంది. ఆంత్రాక్స్ అణువులను ఎంచుకున్న ప్రాంతంలో విమానాల ద్వారా కూడా వెదజల్లవచ్చు. దీనివల్ల దశాబ్దాల పాటు ఆ ప్రాంతంలోని జీవులకు ఆంత్రాక్స్ వ్యాధి సోకుతూనే ఉంటుంది. ఆంత్రాక్స్ సోకిన తొలి దశలో రెండు నుంచి మూడు రోజుల పాటు ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. అనంతరం తీవ్ర జ్వరం, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోలేకపోవటం, షాక్‌కు గురవడం వంటి లక్షణాలు ప్రారంభమవుతాయి. మూడు దశకు చేరుకున్న రెండు రోజుల్లో వ్యాధి సోకిన వ్యక్తి లేదా జీవికి మరణం తప్పదు. 1932 నుంచి 1945ల మధ్యకాలంలో చైనా జపాన్ల మధ్య యుద్ధం జరిగింది. జపాన్ను దురాక్రమించేందుకు యత్నించిన చైనా ‘ఆంత్రాక్స్’ను ఆయుధాల్లో వినియోగించింది. ఖండించిన ఉత్తరకొరియా రసాయన ఆయుధాల తయారీ చేపడుతున్నట్లు వస్తున్న వార్తలను ఉత్తరకొరియా ఖండిచింది. ఈ మేరకు ఆ దేశ మీడియాలో ఓ అధికారిక ప్రకటన ప్రసారమైంది. రసాయన ఆయుధాలతో తమకు ఎలాంటి సంబంధం లేకపోయిన తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న అమెరికాను విడిచిపెట్టబోమని హెచ్చరించింది. -
మన్యం పట్టని మంత్రులు
► కొడుకు సినిమా ప్రమోషన్లో ఒకరు ► వ్యక్తిగత పనుల్లో మరొకరు ► పట్టించుకోని జిల్లా ప్రజాప్రతినిధులు ► ముఖం చాటేసిన అరకు ఎంపీ, ఎమ్మెల్యేలు ► ప్రిన్సిపల్ సెక్రటరీ సమీక్షకు హాజరు కాని వైనం ► ఏజెన్సీలో పర్యటిస్తున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి సాక్షి, విశాఖపట్నం: ఆంత్రాక్స్..ఇప్పటికే 10 మంది ఈ మహమ్మారి బారిన పడి విలవిల్లాడిపోతున్నారు. ఇక విషజ్వరాలతో మన్యం మంచంపట్టింది. రక్తహీనత, సికిల్‌సెల్ వంటి వ్యాధులతో వందలాది మంది అల్లాడిపోతున్నారు. ఏజెన్సీలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా ఉంటోంది. జిల్లా మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు మాత్రం ఇది పట్టడం లేదు. ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర మానవ వనరులశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తన కొడుకు రవితేజ సినిమా ప్రమోషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఏజెన్సీవాసుల ఆరోగ్యం పట్ల ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. రవితేజ నటించిన జయదేవ్ సినిమా శుక్రవారం విడుదల కానుండడంతో ఆ సినిమా ప్రమోషన్ కోసం గంటా నానా హైరానా పడుతున్నారు. మరో సీనియర్ మంత్రి సీహెచ్ అయ్యన్న పాత్రుడు కూడా ఇదే రీతిలో ముఖం చాటేశారు. ఆంత్రాక్స్‌తో ఏజెన్సీ అల్లాడి పోతున్నా అయ్యన్న అటువైపు చూడకపోవడం పట్ల ఏజెన్సీ వాసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరే కాదు..అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఏ ఒక్కరూ అటు వైపు తొంగి చూడకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. చివరకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు సైతం సొంత నియోజకవర్గం పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా చీమకుట్టినట్టయినా లేకపోవడం గమనార్హం. ఏజెన్సీలో పరిస్థితి ఎలా ఉంది? ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య మన్యంలో పర్యటించి జిల్లా అధికారులతో సమీక్షించినప్పటికీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ హాజరుకాకపోవడం ఏజెన్సీ వాసుల ఆరోగ్య పరిరక్షణ పట్ల వీరికి ఏపాటి శ్రద్ధ ఉందో తేటతెల్లమవుతోంది. గిడ్డి ఈశ్వరి ఒక్కరే వైఎస్సార్సీపీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒక్కరే ఏజెన్సీలో కలియతిరుగుతున్నారు. ఆంత్రాక్స్ విజృంభించిన అరకు నియోజకవర్గంతో పాటు పాడేరులో నియోజకవర్గంలోని మారుమూల పల్లెల్లో సైతం పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. బాధితులకు ధైర్యం చెబుతున్నారు.ఆంత్రాక్స్ లక్షణాలున్న వారినే కాదు..జ్వరపీడితులు ఎçక్కడెక్కడ ఉన్నారో గుర్తించి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించే కార్యక్రమాన్ని ఆమె దగ్గరుండి చూస్తున్నారు. -
అమ్మో ఆంత్రాక్స్!?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. వేసవి సీజన్ ముగిసి, వర్షాలు మొదలయ్యాక ఈ వ్యాధి బయటపడుతోంది. కుళ్లిన, నిల్వ ఉంచిన పశుమాంసం తిన్న వారికి ఆంత్రాక్స్ సోకుతుంది. ఏజెన్సీలో గత పన్నెండేళ్ల నుంచి ఆంత్రాక్స్ ఉనికిని చాటుకుంటూనే ఉంది. అప్పట్నుంచి ఏడాదికి, రెండేళ్లకోసారి ఈ వ్యాధి సోకుతోంది. తరచూ ఆయా ప్రాంతాల్లో గిరిజనులు ఈ వ్యాధిన బారిన పడుతూనే ఉన్నారు. కుళ్లిన పశుమాంసం తిన్న వారి చేతి వేళ్లకు పొక్కులు, బొబ్బలు మాదిరిగా ఏర్పడతాయి. వీరికి తక్షణమే తగిన వైద్యం అందకపోతే ప్రాణాంతకమవుతుంది. 2005లో మన్యంలో ఐదుగురికి ఆంత్రాక్స్ వ్యాధి నిర్ధారణ అయింది. అప్పట్నుంచి వ్యాధిగ్రస్తుల సంఖ్య నమోదవుతూనే ఉంది. 2007, 2009, 2010, 2011, 2013, 2016ల్లో ఆంత్రాక్స్ వ్యాధి ప్రభావం చూపింది. గత ఏడాది ఏప్రిల్‌లో హుకుంపేట మండలం పనసపుట్టులో 13 మందికి సోకగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. గత మార్చిలో డుంబ్రిగుడ మండలం గత్తరజిల్లెడ గ్రామంలో నలుగురికి ఆంత్రాక్స్ సోకింది. తాజాగా అరకులోయ మండలం సిరగాం పంచాయతీ కోడిపుంజువలస గ్రామంలో ఐదుగురు గిరిజనుల్లో ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయి. గ్రామానికి చెందిన కె.కృష్ణ, జె.సోమన్న, జి.మంగళయ్య, జి.గుండు, పి.గుండులకు శనివారం చేతి వేళ్లపై పొక్కులు ఏర్పడ్డాయి. దీంతో వీరిని తొలుత అరకు ఏరియా ఆస్పత్రికి, ఆ తర్వాత అక్కడ నుంచి కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. కేజీహెచ్‌లోని చర్మవ్యాధుల వార్డులో చేర్చి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ప్రాథమిక లక్షణాలను బట్టి వారికి ఆంత్రాక్స్ సోకినట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు. వారి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. వీరికి సోకినది ఆంత్రాక్సా? కాదా? అన్నది సోమవారం వచ్చే నివేదికల ఆధారంగా నిర్ధారణ అవుతుందని డీఎంహెచ్‌వో ఉమాసుందరి ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, నివేదిక వచ్చాక అవసరమైన చికిత్సనందిస్తామని తెలిపారు. కోడిపుంజుల వలస, పరిసర గ్రామాల్లో పరిస్థితిని ఏజెన్సీలోని అదనపు జిల్లా వైద్యాధికారి గురునాథరావు సమీక్షిస్తున్నారన్నారు. మరోవైపు నిల్వ ఉంచిన మేక మాంసాన్ని తిన్నామని, ఆ తర్వాత చే తులకు బొబ్బలు వచ్చాయని బాధితులు చెబుతున్నారు. -
ఆంత్రాక్స్‌తో 57 గొర్రెలు మృతి
కేపీతండా (చాగలమర్రి): మండలంలోని కేపీ తండాలో ఆంత్రాక్స్ వ్యాధి సోకి 57 గొర్రెలు మృతి చెందాయి. పొలాల్లో మేత కోసం వెళ్లి రక్తం కక్కి ఇవి మృతి చెందాయి. గత నాలుగు రోజులుగా గ్రామానికి చెందిన రాందాస్‌నాయక్, కృష్ణానాయక్, గోవిందు నాయక్, హనుమాన్ నాయక్, తిరుపతి నాయక్‌ల తోపాటు మరికొందరి గొర్రెలు నోరు, ముక్కు నుంచి రక్తం కక్కుతూ మృతి చెందాయని రైతులు తెలిపారు. ఈ విషయంపై మండల పశువైధ్యాది కారి పుల్లయ్య మాట్లాడుతూ..విషపు ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చాన్నారు. కుళ్లిన, బూజు పట్టిన పశుగ్రాసాలు తినకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
రష్యాకు ఆంత్రాక్స్ భయం
మాస్కో: రష్యాకు ఆంత్రాక్స్ భయం పట్టుకుంది. ఈ వ్యాధితో ఓ 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. సుమారు 70 మంది ఆసుపత్రిపాలయ్యారని సోమవారం అధికారులు ప్రకటించారు. రాజధాని మాస్కోకు ఈశాన్యంగా 2 వేల కి.మీల దూరంలోని యామలో-నెనెటెస్కై ప్రాంతంలోని సంచార దుప్పి కాపలాదారుల్లో 9 మందికి ఈ వ్యాధి సోకిందని గుర్తించారు. 1941 తరువాత ఇక్కడ ఆంత్రాక్స్ ప్రబలడం ఇదే ప్రథమం. వాతావరణ మార్పులు కారణంగానే ఆంత్రాక్స్ వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ఆంత్రాక్స్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. -
చికిత్సకు లొంగే ఆంత్రాక్స్
► ఆంత్రాక్స్‌పై అవగాహనకు కరపత్రాలు ► గ్వాలియర్ నుంచి రెండు రోజుల్లో నివేదిక ► జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడి పాడేరు: ఏజెన్సీలో ప్రస్తుతం ఆంత్రాక్స్‌గా అనుమానిస్తున్న వ్యాధి ప్రాణాంతకం కాదని వైద్య సేవలతో నయం చేయవచ్చని, ఆదివాసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. బుధవారం ఆయన ఐటీడీఏలో మోదకొండమ్మ ఉత్సవాలపై సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుకుంపేట మండలం ఉప్ప పీహెచ్సీ పరిధిలోని పనసపుట్టులో సుమారు 16 మంది, జి.మాడుగుల మండలంలోని గొయ్యిగుంట, వెన్నులకోట గ్రామాల్లో మరో 19 మందికి సోకిన చర్మ వ్యాధి ఆంత్రాక్స్‌గా ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. రక్త నమూనాలు సేకరించి అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్ డీఆర్డీవో శాస్త్రవేత్తల బృందం నుంచి దీనిపై మరో రెండు రోజుల్లో నివేదికలు రానున్నాయని చెప్పారు. క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా నిర్ధారణ అయితే తగిన వైద్యసేవలు అందజేస్తామన్నారు. గిరిజనులు చనిపోయిన పశువుల మాంసాన్ని తినడం వల్లే వ్యాధి సోకినట్టు శాస్త్రవేత్తల బృందం నిర్థారించిందని చెప్పారు. ఏజెన్సీలో 178 చెక్‌డ్యాంల మరమ్మతులకు రూ.14 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సెకండ్ ఏఎన్ఎంల నియామకానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ఆంత్రాక్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించి ఇది వ్యాప్తి చెందకుండా నియంత్రణ కోసం గ్రామాల్లో కరపత్రాల పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. అన్ని పీహెచ్‌సీల పరిధిలోనూ ఈ కరపత్రాలు పంపిణీ చేసినట్లు చెప్పారు -
మన్యాన్ని వీడని మహమ్మారి
► 2009లో వెలుగు చూసిన ఆంత్రాక్స్ ► మరో రెండు గ్రామాల్లో వ్యాధి లక్షణాలు ► పాడేరు ఆస్పత్రిలో చేరిన 19 మంది బాధితులు ► ప్రాథమిక సేవల అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలింపు ► పశుమాంసం తినడం వల్లే అంటున్న వైద్య సిబ్బంది పాడేరు: ప్రాణాంతక ఆంత్రాక్స్ మహమ్మారి మన్యాన్ని వీడటం లేదు. 2009 నుంచి ఏదో ఒక ప్రాంతంలో ఈ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత ముంచంగిపుట్టు మండలం కర్లపొదోర్, అత్తికల్లు, ఆడారిలడి, ముక్కిపుట్టు, బరడ గ్రామాల్లో ఆంత్రాక్స్ అలజడి రేపింది. అప్పట్లో 20 మందికి పైగా దీని బారిన పడ్డారు. కాళ్లు,చేతులపై పెద్ద పెద్ద గాయాలు ఏర్పడి శరీరమంతా కబళించడంతో సుమారు పది మంది చనిపోయారు. అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ భీముడువలస వాసులనూ ఇది పీడించింది. ఇక్కడ ఎవరూ చనిపోనప్పటికీ కొన్ని పశువులను కబళించింది. నాటి నుంచి అక్కడక్కడా ఈ వ్యాధి లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి. ఇటీవల హుకుంపేట మండలం పనసపుట్టులో ఈ వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. మరో 18 మంది విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారు కోలుకోక ముందే జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీ వెన్నెలకోటలో ఆరుగురు, గొయ్యిగుంటలో 13 మంది దీని బారిన పడ్డారు. వెన్నెలకోటకు చెందిన కొర్రా సుందరరావు, కొర్రా కృష్ణారావు, కొర్రా సీందు, గెమ్మెలి గంగన్నదొర, కిల్లో దన్ను, గెమ్మెలి భాస్కరరావు, గొయ్యిగుంటకు చెందిన కిల్లో పుల్లయ్య, మర్రినాగేశ్వరరావు, కొర్రా సుబ్బరావు, కిల్లో సుబ్బారావు, కిల్లో సుందరరావు, కిల్లో చిట్టిబాబు, పాంగి చంటి, పాంగి సుబ్బారావు, మర్రి పల్సో, కిల్లో చిట్టిబాబు, కొర్రా కామేశ్వరరావులతో పాటు మహిళలు కిల్లో సావిత్రి, మర్రి కుదే ఆంత్రాక్స్ లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో గెమ్మెలి గంగదొర కుడి కాలు అడుగుభాగం పూర్తిగా కుళ్లిపోయింది. ఇతని పరిస్థితి విషమంగా ఉంది. చర్మవ్యాధిగా కనిపించే ఈ మహమ్మారి కొద్ది రోజుల్లోనే ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుండటంతో ఆదివాసీలు మృత్యువాత పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ కోసం గ్వాలియర్ డీఆర్డీవో శాస్త్రవేత్తల బృందం రక్త నమూనాలు సేకరించి అధ్యయనం చేపట్టింది. గతంలో కూడా వైద్యనిపుణులు ముంచంగిపుట్టు ప్రాంతంలో ఆంత్రాక్స్‌పై పరిశోధనలు జరిపారు. కట్టుదిట్టమైన చర్యలతో ఆ ప్రాంతంలో ఈ వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చింది. పశుమాంసం తినడం వల్లే .. నిల్వ ఉన్న పశుమాంసం తినడం వల్లే ఈ వ్యాధి సంక్రమిస్తున్నట్టు వైద్యబృందాల పరిశీలనలో వెల్లడవుతోంది. ఆంత్రాక్స్ వెలుగు చూసిన ప్రతి గ్రామంలోనూ దీనిపై అధ్యయనం చేసినప్పుడు ఇదే విషయం నిర్ధారణ అయింది. ఏజెన్సీలోని కొన్ని తెగల పీవీటీజీలకు పూర్వం నుంచి పశుమాంసం తినడం అలవాటు. వారపుసంతల్లోనూ దీనిని చాటుమాటుగా విక్రయిస్తుంటారు. చనిపోయినవాటిని తినడం వల్లే ఈ వ్యాధి ప్రబలుతోందన్న వాదన ఉంది. నిల్వ ఉంచిన, చనిపోయిన పశువుల మాంసం తిని వివిధ గ్రామాల వారు డయేరియా బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడిన వెన్నెలకోట, గొయ్యిగుంట గ్రామాల్లో రెండు వారాల్లో వ్యాధులతో 30 పశువులు, 20మేకలు చనిపోయాయి. వాటి మాంసం ఆదివాసీలు తిన్నారు. నాటి నుంచే చర్మంపై కురుపులు, పొక్కులు వచ్చాయని ఆయా గ్రామస్తులు అంగీకరిస్తున్నారు. ఏళ్లమామిడి గ్రామం నుంచి వెన్నెలకోట చుట్టంచూపుగా వచ్చిన పాంగి అప్పారావు కూడా ఈ మాంసం తిని చర్మవ్యాధులకు గురయ్యాడు. క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా అనుమానం వైద్యనిపుణుల బృందం క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా అనుమానిస్తోంది. వారం రోజులుగా పనసపుట్టులో ఈ వ్యాధి లక్షణాలపై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. రక్తనమూనాలను ప్రయోగశాలకు తరలించారు. జి.మాడుగుల మండలం వెన్నెలకోట, గొయ్యిగుంటల్లో ఆంత్రాక్స్ లక్షణాలతో మరో 19 మంది బాధపడుతున్నట్టు వెలుగులోకి రావడంతో అధ్యయనానికి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల బృందం మంగళవారం ఈ గ్రామాల్లో పర్యటించనుంది. క్యుటోనియస్ ఆంత్రాక్స్‌గా నిర్ధారణ అయితే 10 కిలోమీటర్ల పరిధిలో పశువులకు వ్యాక్సినేషన్ చేపడతామని పశుసంవ ర్థకశాఖ ఏడీ ఎం.కిశోర్ తెలిపారు. -
అవినీతి సొమ్ముతో కిడారి ఖుషీ
► గిరిజనుల కష్టాలు గాలికొదిలేశారు ► ఆంత్రాక్స్ బాధితులను పరామర్శించే తీరికా లేదు ► పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఎద్దేవా హుకుంపేట: ప్రమాదకర ఆంత్రాక్స్ లక్షణాలతో గిరిజనులు బాధపడుతుంటే అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాత్రం పెదబాబు, చినబాబు ఇచ్చిన నోట్ల కట్టలు లెక్కపెట్టుకునే పనిలో ఉన్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం పనసపుట్టు గ్రామంలో పర్యటించి అన్ని వీధుల్లోనూ తిరిగి ఆంత్రాక్స్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. వ్యాధి భయంతో ఇళ్లకే పరిమితమైన గ్రామస్తులు ఈశ్వరి రాకతో బయటకు వచ్చి తమ కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలో 16 పశువులు మృతి చెందాయని, ఈ వారం రోజుల్లో 18 మంది గిరిజనులకు చేతులు, కాళ్లు, ముఖంపై పెద్ద కురుపులు ఏర్పడి ఆత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఏర్పడ్డాయని, వీరంతా విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే తమ ఓట్లతో గెలిచిన అర కు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు గాని, ఇతర మండల ప్రజా ప్రతినిధులెవరూ తమ గ్రామానికి ఇంతవరకు రాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి స్పందిస్తూ, ఉన్నత వైద్యసేవలు కల్పించడంతోపాటు భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని, గ్రామంలో అన్ని కుటుంబాలకు నిత్యవసరాలను ప్రభుత్వం పంపిణీ చేసేలా అధికారులపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గతంలో నిర్మించిన గ్రావిటీ పథకం చుక్క నీరు లేక మూలకు చేరిందని, కొత్త తాగునీటి పథకం మంజూరుకు అధికారులతో మాట్లాడాలని ఇక్కడ గిరిజనులంతా ఎమ్మెల్యేను కోరారు. ఈ సమస్యపై ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకెళ్లి తాగునీటి సమస్యను వేగవంతంగా పరిష్కరిస్తానని ఈశ్వరి చెప్పారు. కిడారి చర్య సిగ్గుచేటు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఈశ్వరి మాట్లాడుతూ ఓట్లు వేసి గెలిపించిన గిరిజనులు కష్టాల్లో ఉంటే అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు డబ్బు సంపాదన, అధికారమే ధ్యేయంగా పనిచేయడం సిగ్గుచేటన్నారు. టీడీపీలోకి చేరి అమరావతిలో రూ.20 కోట్ల నోట్ల కట్టలను లెక్కపెట్టుకుంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉండే గిరిజన సాంప్రదాయాన్ని కూడా మట్టిలో కలిపిన ఘనత కిడారికే దక్కిందన్నారు. ఇలాంటి నమ్మక ద్రోహికి మన్యం ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన సమస్యలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను కొనుగోలుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. 244 పంచాయతీల పరిధిలో గిరిజనులు తాగునీటికి అల్లాడుతున్నారని, ఈ సమస్యను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న తాగునీటి పథకాలు కూడా నిర్వహణ లోపంతో మూలకు చేరుతున్నాయని, పనులు నాసిరకంగా చేస్తూ తాగునీటి పథకాల్లో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు గిరిజనుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్సార్సీపీ పోరాటాలను ఉధృతం చేస్తుందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు కె.పద్మకుమారి, పాడేరు వైస్ ఎంపీపీ మాదెల బొజ్జమ్మ, పాడేరు ఎంపీటీసీ సభ్యులు గిడ్డి విజయలక్ష్మి, కూడి దేవి, కిల్లు చంద్రమోహన్, కోఆప్షన్‌సభ్యులు ఎండీ తాజుద్దీన్, వైఎస్సార్సీపీ నేతలు చింతపల్లి సుధాకర్, లకే రత్నాభాయి, కూడి వలసయ్య, బాలాజీ సింగ్ తదితరులు పాల్గొన్నారు -
ఆంత్రాక్స్‌పై ఆందోళన వద్దు
► 19 మంది రోగులకు నిర్ధారణ కాని ఆంత్రాక్స్ ► దిల్లీ, గ్వాలియర్ బృందాలతో సమగ్ర పరీక్షలు ► ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ హుకుంపేట: విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 18 మంది గిరిజనులకు ఇంకా ఆంత్రాక్స్ నిర్ధారణ కాలేదని, గిరిజనులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఐటీడీఏ పీవో ఎం.హరినారాయణన్ సూచించారు. మండలంలోని పాతకోట పంచాయితీ పనసపుట్టు గ్రామాన్ని శుక్రవారం సబ్ కలెక్టర్ శివశంకర్‌తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా పీవో గిరిజనులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కేజీహెచ్‌లోని చికిత్స పొందుతున్న 18 మంది గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు కల్పిస్తున్నారని, వ్యాధి నిర్ధారణకు ప్రత్యేక వైద్య బృందాలు కూడా కేజీహెచ్‌కు వచ్చాయన్నారు. వారందరికి పూర్తిగా నయమయైన తరువాతే గ్రామానికి రప్పిస్తామని పీవో తెలిపారు. ఏజెన్సీలోని మృతి చెందిన పశువులను తినే అలవాటు ఉంటే గిరిజనులు మార్చుకోవాలని, విద్యావంతులైన యువకులు మృతి చెందిన పశుమాంసం తినకుండా గ్రామస్తులను చైతన్యవంతం చేయాలని కోరారు. దోమల నివారణ మందు పిచికారీ పనులు తప్పనిసరిగా ఇంటా బైటా చల్లించాలని తద్వారా మలేరియా బారి నుంచి ఇంటిల్లపాదిని కాపాడాల్సిన అవసరం ఇంటి ఇల్లాలిపైనే ఉందని చెప్పారు. గ్రామంలో పశువులు చనిపోతే పశువైద్యులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. వైద్యాధికారులు, పశువైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. పనసపుట్టుకు పీవో వరాలు గ్రామంలోని సమస్యలపై పీవో ఆరా తీయగా రోడ్డు, తాగునీటి సమస్యలను వివరించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గిరిజనులు చెప్పడంతో పది రోజుల్లోగా గ్రామంలో బోరు బావి నిర్మిస్తామన్నారు. పనసపుట్టు నుంచి పెదగరువు వరకు రోడ్డు నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులతో సర్వే జరిపిస్తామన్నారు. పాలెం గ్రామస్తులు గ్రామానికి తాగునీరు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పడంతో ఈ గ్రామంలో గ్రామసభ నిర్వహించి గిరిజనులకు అవగాహన కల్పించాలని తహశీల్దార్, ఈఓపీఆర్డీలను పీవో ఆదేశించారు. మృతి చెందిన పశువులకు నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కోరగా పీవో సానుకూలంగా స్పందించారు. గిరిజన యువత నైపుణ్యరంగంలో తామందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలన్నారు. సబ్ కలెక్టర్ శివ శంకర్ మాట్లాడుతూ ఆంత్రాక్స్ అంటువ్యాధి కాదని, గిరిజనులు ఎలాంటి భయాందోళనలు చెందవద్దన్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చిన నాడే వ్యాధులకు దూరమవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థకశాఖ ఏడీ కిశోర్, డిప్యుటీ డీఎంహెచ్‌వో పార్ధసారథి, ఉప వైద్యాధికారి అనూష, పశువైద్యాధికారి సునీల్‌కుమార్, సర్పంచ్ కె.లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మన్యాన్ని వీడని ఆంత్రాక్స్ భయం
► పనసపుట్టులో 18 మంది బాధితులు ► 13 మంది కేజీహెచ్‌కు తరలింపు ► వ్యాధి లక్షణాలతో వారం రోజుల్లో ఇద్దరు మృతి ► పూర్తిస్థాయిలో నివారణ చర్యలు చేపట్టని వైద్య ఆరోగ్యశాఖ ► వారం వ్యవధిలో ఇద్దరు మృతి పనసపుట్టు గ్రామంలో వారం వ్యవధిలో పెనుమాల రౌతన్న(55), కొట్టగుల్లి దాసయ్య(45) అనే గిరిజనులు చర్మంపై కురుపులు, వాపు వచ్చి మృత్యువాతపడ్డారు. ఆంత్రాక్స్ లక్షణాలు గిరిజనులకు తెలియకపోవడంతో సాధారణ మరణాలుగానే భావించారు. తరువాత ఈ వ్యాధి విషయం బైటపడటంతో ఇద్దరు గిరిజనులు ఆ వ్యాధి తోనే చనిపోయారని బాధితుల బంధువులు చెబుతున్నారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఆంత్రాక్స్ వ్యాధితో మృతి చెందినట్లు నిర్ధారించడం లేదు. పాడేరు రూరల్ / హుకుంపేట : విశాఖ మన్యాన్ని ఆంత్రాక్స్ భయం వీడటం లేదు. గత అనుభవాలు మర్చిపోక ముందే ఏదో ఒక చోట ఆంత్రాక్స్ బయటపడుతోంది. దీంతో గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 2009లో ముంచంగిపుట్టు మండలం కర్లపొదోర్ గ్రామంలో ఆంత్రాక్స్ సోకి ఏకకాలంలో పది మంది గిరిజనులు మృత్యువాత పడిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇటీవల హుకుంపేట మండలం గడుగుపల్లె గ్రామంలో కూడా ఈ వ్యాధి లక్షణాలు బైటపడ్డాయి. 8 మంది గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటనలు మరవకముందే తాజాగా హుకుంపేట మండలంలోని పనసపుట్టు గ్రామంలో ఆంత్రాక్స్ పడగ విప్పింది. పది రోజులుగా గ్రామంలో గిరిజనులు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ వైద్య సిబ్బంది సకాలంలో గుర్తించ లేకపోయారు. రెండు రోజుల క్రితం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించిన వైద్యసిబ్బంది పలువురు గిరిజనులకు చర్మంపై కురుపులు రావడం గమనించి ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆంత్రాక్స్ సోకినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్థారించారు. 13 మంది గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో . విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగానే గ్రామంలో మరో ఐదుగురు గిరిజనులు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన శెట్టి కొండబాబు, గల్లోంగి భీమన్న, పడాల్ స్వామి, సొనభ అనీల్ కుమార్, బస్కిబారికి రంజిత్‌కుమార్ ఆంత్రాక్స్ లక్షణాలతో బాధపడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బుధవారం గ్రామానికి చేరుకొని వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. మూగజీవుల మృత్యువాత గ్రామానికి చెందిన మూగజీవాలు పలు వ్యాధులతో సతమతమవుతున్నాయి. పశువైద్యశాఖ అధికారులు స్పందించకపోవడంతో వారం వ్యవధిలో పది పశువులు, మరో పది మేకలు మృతి చెందాయి. మరికొన్ని మరణానికి చేరువలో ఉన్నాయి. గ్రామంలో కొందరు ఈ మృతి చెందిన మూగజీవాల మాంసం నిల్వ చేసుకొని తినడం వల్లే ఆంత్రాక్స్ సోకినట్లు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు. -
మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్
కేజీహెచ్‌లో 13 మందికి చికిత్స సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్ అలజడి రేపుతోంది. తాజాగా హుకుంపేట మండలం పనసపుట్టుకు చెందిన 13 మంది ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖ కేజీహెచ్‌లో చేరారు. వివ రాలిలా ఉన్నాయి. పనసపుట్టులో ఇటీవల కొంతమంది గిరిజనులు చనిపోయిన మేక మాంసాన్ని తిన్నారు. దీంతో చేతి వేళ్లపై పొక్కుల్లా వచ్చాయి. వీరు పాడేరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. అక్కడ వైద్యులు వీరికి ఆంత్రాక్స్ సోకినట్టు ప్రాథమికంగా నిర్థారించారు. అనంతరం వీరిని మంగళవారం రాత్రి విశాఖ కేజీహెచ్‌కు తీసుకువచ్చారు. వీరిలో 11 మంది పురుషులు, ఒక మహిళ, ఒక బాలుడు ఉన్నారు. వీరిని కేజీహెచ్‌లోని చర్మవ్యాధుల చికిత్స వార్డులో ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. బాధితులకు చర్మవ్యాధుల చికిత్స విభాగాధిపతి డాక్టర్ అనీలా నాయర్ పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. వీరి శరీరం నుంచి శాంపిళ్లను తీసి పరీక్షలకు పంపుతామని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్‌బాబు తెలిపారు. -
ఆంత్రాక్స్ నుంచి పూర్తిగా కోలుకున్న విద్యార్థి
హిందూపురం : ఆరోగ్యం కుదుట పడడంతో ఆంత్రాక్స్ సోకిన విద్యార్థిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆనందంతో విద్యార్థి తల్లిదండ్రులు డాక్టర్లను సన్మానించారు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో లేపాక్షి మండలం మానెంపల్లికి చెందిన పదో తరగతి విద్యార్థి శ్రీకాంత్ బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా అక్కడి వైద్యులు ఆంత్రాక్స్‌గా తేల్చారు. అనంతరం స్వగ్రామానికి చేరుకున్న శ్రీకాంత్, అతడి తల్లిదండ్రులను గ్రామంలో వెలివేసేందుకు చూశారు. కన్నీరుమున్నీరైన వారు లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాగా డాక్టర్ శివకుమార్, దివాకర్ల సాయంతో హిందూపురం ఆస్పత్రిలో చేరారు. అక్కడి వైద్యులు కూడా సంకోచించి కేసు విషయమై కర్నూలు, అనంతపురం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడగా.. తమ వద్ద ఐసోలేషన్ వార్డు లేదని చెప్పారు. చివరకు ఈ విషయం కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ దృష్టికి వెళ్లడంతో ప్రాథమిక చికిత్స కోసం అడ్మిట్ చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 31వ తేదీ నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్ఎంఓ శ్రీనివాసరెడ్డి, స్థానిక వైద్యుల పర్యవేక్షణలో శ్రీకాంత్‌కు చికిత్స అందించారు. అనంతరం మైసూరు డీఆర్డీఓ రీసెర్చ్ ల్యాబొరేటరీకి రక్తనమూనాలు పంపగా అతడు కోలుకున్నట్లు వైద్యులు చెప్పడంతో గురువారం శ్రీకాంత్‌ను డిశ్చార్జ్ చేశారు. నెల రోజుల పాటు వాడాల్సిన మందులను ఇచ్చి పంపారు. కొడుకు అనారోగ్యం నుంచి కోలుకోవడంతో ఆనందంలో ముగినిపోయిన విద్యార్థి తల్లిదండ్రులు వైద్యులతో పాటు నర్సులు ఇందిరా, శ్యామలమ్మ, ఖుర్షీద్‌బేగం, అటెండర్ లక్ష్మినారాయణను సన్మానించారు. ఈ సమయంలో ఉద్వేగానికి లోనైన వైద్యులు.. ఇకపై మరింత బాధ్యతతో పని చేస్తామని చెప్పారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించి భవిష్యత్‌లో మంచి శాస్త్రవేత్త అయి ఆంత్రాక్స్ వ్యాధిపై రీసెర్స్ చేయాలని శ్రీకాంత్‌కు సూచించారు. వ్యాధి బారి నుంచి శ్రీకాంత్ పూర్తిగా కోలుకున్నాడని, అపోహలను నమ్మకుండా అందరిలో ఒక్కడిగా శ్రీకాంత్‌ను చూసుకోవాలన్నారు. ఈ విషయమై తహశీల్దార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని తెలిపారు. -
పదో తరగతి విద్యార్థికి ఆంత్రాక్స్?
అయోమయంలో విద్యార్థి తల్లిదండ్రులు లేపాక్షి : లేపాక్షి మండలం మానేపల్లికి చెందిన పదవ తరగతి విద్యార్థి శ్రీకాంత్‌కు ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలున్నట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇతను శిరివరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. కర్ణాటకలోని చింతలపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో ఉంటూ నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న శిరివరం హైస్కూల్‌కు రోజూ వచ్చివెళుతుంటాడు. మూడు నెలల క్రితం చింతలపల్లి చెరువులో కలుషిత నీరు సేవించి సుమారు 300 గొర్రెలు చనిపోయాయి. కొంతమంది చింతలపల్లి గ్రామస్తులు వాటి మాంసం తిన్నారు. దీంతో ఒకరిద్దరికి చర్మంపై రంధ్రాలు పడ్డాయి. ఇటీవల శ్రీకాంత్ చేతులపై అదే తరహాలో గుల్లలు, మచ్చలు వచ్చారుు. ఏమైందో.. ఏమో.. శ్రీకాంత్‌కు చేతులపై అక్టోబర్ 27న చిన్న గుల్లల్లాంటివి ఏర్పడినట్లు తల్లిదండ్రులు నరసప్ప, పార్వతమ్మ తెలిపారు.‘‘28న చేతుల కింద, భుజాల వద్ద రెండు, మూడు చోట్ల రంధ్రాలు ఏర్పడ్డారుు. అనుమానం వచ్చి మానేపల్లికి దగ్గరలో వున్న పులమతిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద వైద్యం చేరుుంచాము. ఆయన సూచన మేరకు హిందూపురంలోని ఓ ప్రరుువేటు నర్సింగ్‌హోమ్‌కు తీసుకెళ్లాము. 29న వైద్య పరీక్షలు చేశారు. అక్కడి సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రభుత్వాస్పత్రిలో సరైన వైద్యం చేయలేక.. బెంగ ళూరుకు తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో శ్రీకాంత్‌కు బెంగళూరులోని వాణీవిలాస్, బాప్టిస్ట్ ఆస్పత్రుల్లో చికిత్స చేరుుంచాము. అక్కడి వైద్యులు పలు పరీక్షలు చేసిన అనంతరం ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్లు చెప్పి.. ఐసోలేషన్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ 10 రోజులకు సరిపడే మందులు ఇచ్చి వాటిని క్రమం తప్పకుండా వాడాలని చెప్పినారు. అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం మా ఊరు మానేపల్లికి వచ్చినాము. ఈ వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం వుందని ఊరోళ్లు గోల చేయడంతో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చినాము. ఇదేం వ్యాధో మాకు అర్థం కావడం లేదు. మా బిడ్డకు ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో.. భయంగా ఉంది’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యూరు. శ్రీకాంత్ ఆరోగ్యం బాగానే ఉంది.. శ్రీకాంత్‌కు ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయని బెంగళూరు వైద్య నిపుణులు తేల్చారని, ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చె ందాల్సిన అవసరం లేదని హిందూపురం వైద్యులు దివాకర్, శివకుమార్‌స్వామి చెప్పారు. పశు సంవర్ధక శాఖ జారుుంట్ డెరైక్టర్ శ్యామ్మోహన్రావ్, డి ప్యూటీ డెరైక్టర్ జయకుమార్, స్థానిక ఏడీ శుభదాస్ తదితరులు విద్యార్థిని పరిశీలించారు. ఈ వ్యాధి పశువుల నుంచి మాత్రమే మనుషులకు సోకుతుందని, మనుషుల నుంచి ఇతరులకు రాదని జేడీ చెప్పారు. లేపాక్షి మండలంతో పాటు కర్ణాటక పరిసర గ్రామాల్లోని గొర్రెలకు ఏమైనా ఈ వ్యాధి సోకివుండవచ్చన్నారు. ముందు జాగ్రత్తగా లేపాక్షి మండలంలో గొర్రెలకు వ్యాక్సినేషన్ చేపడతామన్నారు. జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి వెంకటరమణ శుక్రవారం విద్యార్థి శ్రీకాంత్‌ను పరిశీలించి ఎలాంటి ప్రమాదం లేదని ధైర్యం చెప్పారు. చింతలపల్లిలోని నీటిని, గొర్రెలకు సంబంధించిన రక్తాన్ని లేపాక్షి పశు వైద్యశాలలో పరీక్షించారు. కొన్నింటిలో ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది.