మన్యాన్ని వీడని ఆంత్రాక్స్ భయం
► పనసపుట్టులో 18 మంది బాధితులు
► 13 మంది కేజీహెచ్‌కు తరలింపు
► వ్యాధి లక్షణాలతో వారం రోజుల్లో ఇద్దరు మృతి
► పూర్తిస్థాయిలో నివారణ చర్యలు చేపట్టని వైద్య ఆరోగ్యశాఖ
► వారం వ్యవధిలో ఇద్దరు మృతి
పనసపుట్టు గ్రామంలో వారం వ్యవధిలో పెనుమాల రౌతన్న(55), కొట్టగుల్లి దాసయ్య(45) అనే గిరిజనులు చర్మంపై కురుపులు, వాపు వచ్చి మృత్యువాతపడ్డారు. ఆంత్రాక్స్ లక్షణాలు గిరిజనులకు తెలియకపోవడంతో సాధారణ మరణాలుగానే భావించారు. తరువాత ఈ వ్యాధి విషయం బైటపడటంతో ఇద్దరు గిరిజనులు ఆ వ్యాధి తోనే చనిపోయారని బాధితుల బంధువులు చెబుతున్నారు. అయితే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఆంత్రాక్స్ వ్యాధితో మృతి చెందినట్లు నిర్ధారించడం లేదు.
పాడేరు రూరల్ / హుకుంపేట : విశాఖ మన్యాన్ని ఆంత్రాక్స్ భయం వీడటం లేదు. గత అనుభవాలు మర్చిపోక ముందే ఏదో ఒక చోట ఆంత్రాక్స్ బయటపడుతోంది. దీంతో గిరిజనులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 2009లో ముంచంగిపుట్టు మండలం కర్లపొదోర్ గ్రామంలో ఆంత్రాక్స్ సోకి ఏకకాలంలో పది మంది గిరిజనులు మృత్యువాత పడిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇటీవల హుకుంపేట మండలం గడుగుపల్లె గ్రామంలో కూడా ఈ వ్యాధి లక్షణాలు బైటపడ్డాయి. 8 మంది గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటనలు మరవకముందే తాజాగా హుకుంపేట మండలంలోని పనసపుట్టు గ్రామంలో ఆంత్రాక్స్ పడగ విప్పింది. పది రోజులుగా గ్రామంలో గిరిజనులు వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ వైద్య సిబ్బంది సకాలంలో గుర్తించ లేకపోయారు. రెండు రోజుల క్రితం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించిన వైద్యసిబ్బంది పలువురు గిరిజనులకు చర్మంపై కురుపులు రావడం గమనించి ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆంత్రాక్స్ సోకినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్థారించారు. 13 మంది గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో .
విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగానే గ్రామంలో మరో ఐదుగురు గిరిజనులు ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. గ్రామానికి చెందిన శెట్టి కొండబాబు, గల్లోంగి భీమన్న, పడాల్ స్వామి, సొనభ అనీల్ కుమార్, బస్కిబారికి రంజిత్‌కుమార్ ఆంత్రాక్స్ లక్షణాలతో బాధపడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బుధవారం గ్రామానికి చేరుకొని వైద్యశిబిరం ఏర్పాటు చేశారు.
మూగజీవుల మృత్యువాత
గ్రామానికి చెందిన మూగజీవాలు పలు వ్యాధులతో సతమతమవుతున్నాయి. పశువైద్యశాఖ అధికారులు స్పందించకపోవడంతో వారం వ్యవధిలో పది పశువులు, మరో పది మేకలు మృతి చెందాయి. మరికొన్ని మరణానికి చేరువలో ఉన్నాయి. గ్రామంలో కొందరు ఈ మృతి చెందిన మూగజీవాల మాంసం నిల్వ చేసుకొని తినడం వల్లే ఆంత్రాక్స్ సోకినట్లు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు.