మన్యం పట్టని మంత్రులు | MP, MLA'S neglecting agency areas in visakhapatnam | Sakshi
Sakshi News home page

మన్యం పట్టని మంత్రులు

Published Fri, Jun 30 2017 1:52 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

మన్యం పట్టని మంత్రులు - Sakshi

మన్యం పట్టని మంత్రులు

► కొడుకు సినిమా ప్రమోషన్‌లో ఒకరు
► వ్యక్తిగత పనుల్లో మరొకరు
► పట్టించుకోని జిల్లా ప్రజాప్రతినిధులు
► ముఖం చాటేసిన అరకు ఎంపీ, ఎమ్మెల్యేలు
► ప్రిన్సిపల్‌ సెక్రటరీ సమీక్షకు హాజరు కాని వైనం
► ఏజెన్సీలో పర్యటిస్తున్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డిఈశ్వరి


సాక్షి, విశాఖపట్నం: ఆంత్రాక్స్‌..ఇప్పటికే 10 మంది ఈ మహమ్మారి బారిన పడి విలవిల్లాడిపోతున్నారు. ఇక విషజ్వరాలతో మన్యం మంచంపట్టింది. రక్తహీనత, సికిల్‌సెల్‌ వంటి వ్యాధులతో వందలాది మంది అల్లాడిపోతున్నారు. ఏజెన్సీలో పరిస్థితి రోజురోజుకు దయనీయంగా ఉంటోంది. జిల్లా మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు మాత్రం ఇది పట్టడం లేదు.  ఇప్పటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. రాష్ట్ర మానవ వనరులశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తన కొడుకు రవితేజ సినిమా ప్రమోషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఏజెన్సీవాసుల ఆరోగ్యం పట్ల ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. రవితేజ నటించిన జయదేవ్‌ సినిమా శుక్రవారం విడుదల కానుండడంతో ఆ సినిమా ప్రమోషన్‌ కోసం గంటా నానా హైరానా పడుతున్నారు.

మరో సీనియర్‌ మంత్రి సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు కూడా ఇదే రీతిలో ముఖం చాటేశారు. ఆంత్రాక్స్‌తో ఏజెన్సీ అల్లాడి పోతున్నా అయ్యన్న అటువైపు చూడకపోవడం పట్ల ఏజెన్సీ వాసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరే కాదు..అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఏ ఒక్కరూ అటు వైపు తొంగి చూడకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. చివరకు అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులు సైతం సొంత నియోజకవర్గం పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నా చీమకుట్టినట్టయినా లేకపోవడం గమనార్హం. ఏజెన్సీలో పరిస్థితి ఎలా ఉంది? ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి పూనం మాలకొండయ్య మన్యంలో పర్యటించి జిల్లా అధికారులతో సమీక్షించినప్పటికీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ హాజరుకాకపోవడం ఏజెన్సీ వాసుల ఆరోగ్య పరిరక్షణ పట్ల వీరికి ఏపాటి శ్రద్ధ ఉందో తేటతెల్లమవుతోంది.

గిడ్డి ఈశ్వరి ఒక్కరే
వైఎస్సార్‌సీపీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఒక్కరే ఏజెన్సీలో కలియతిరుగుతున్నారు. ఆంత్రాక్స్‌ విజృంభించిన అరకు నియోజకవర్గంతో పాటు పాడేరులో నియోజకవర్గంలోని మారుమూల పల్లెల్లో సైతం పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. బాధితులకు ధైర్యం చెబుతున్నారు.ఆంత్రాక్స్‌ లక్షణాలున్న వారినే కాదు..జ్వరపీడితులు ఎçక్కడెక్కడ ఉన్నారో గుర్తించి మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించే కార్యక్రమాన్ని ఆమె దగ్గరుండి చూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement