అమ్మో ఆంత్రాక్స్!?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. వేసవి సీజన్ ముగిసి, వర్షాలు మొదలయ్యాక ఈ వ్యాధి బయటపడుతోంది. కుళ్లిన, నిల్వ ఉంచిన పశుమాంసం తిన్న వారికి ఆంత్రాక్స్ సోకుతుంది. ఏజెన్సీలో గత పన్నెండేళ్ల నుంచి ఆంత్రాక్స్ ఉనికిని చాటుకుంటూనే ఉంది. అప్పట్నుంచి ఏడాదికి, రెండేళ్లకోసారి ఈ వ్యాధి సోకుతోంది. తరచూ ఆయా ప్రాంతాల్లో గిరిజనులు ఈ వ్యాధిన బారిన పడుతూనే ఉన్నారు. కుళ్లిన పశుమాంసం తిన్న వారి చేతి వేళ్లకు పొక్కులు, బొబ్బలు మాదిరిగా ఏర్పడతాయి. వీరికి తక్షణమే తగిన వైద్యం అందకపోతే ప్రాణాంతకమవుతుంది. 2005లో మన్యంలో ఐదుగురికి ఆంత్రాక్స్ వ్యాధి నిర్ధారణ అయింది. అప్పట్నుంచి వ్యాధిగ్రస్తుల సంఖ్య నమోదవుతూనే ఉంది. 2007, 2009, 2010, 2011, 2013, 2016ల్లో ఆంత్రాక్స్ వ్యాధి ప్రభావం చూపింది.
గత ఏడాది ఏప్రిల్‌లో హుకుంపేట మండలం పనసపుట్టులో 13 మందికి సోకగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. గత మార్చిలో డుంబ్రిగుడ మండలం గత్తరజిల్లెడ గ్రామంలో నలుగురికి ఆంత్రాక్స్ సోకింది. తాజాగా అరకులోయ మండలం సిరగాం పంచాయతీ కోడిపుంజువలస గ్రామంలో ఐదుగురు గిరిజనుల్లో ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయి. గ్రామానికి చెందిన కె.కృష్ణ, జె.సోమన్న, జి.మంగళయ్య, జి.గుండు, పి.గుండులకు శనివారం చేతి వేళ్లపై పొక్కులు ఏర్పడ్డాయి. దీంతో వీరిని తొలుత అరకు ఏరియా ఆస్పత్రికి, ఆ తర్వాత అక్కడ నుంచి కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. కేజీహెచ్‌లోని చర్మవ్యాధుల వార్డులో చేర్చి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.
ప్రాథమిక లక్షణాలను బట్టి వారికి ఆంత్రాక్స్ సోకినట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు. వారి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. వీరికి సోకినది ఆంత్రాక్సా? కాదా? అన్నది సోమవారం వచ్చే నివేదికల ఆధారంగా నిర్ధారణ అవుతుందని డీఎంహెచ్‌వో ఉమాసుందరి ‘సాక్షి’కి చెప్పారు. ప్రస్తుతం వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, నివేదిక వచ్చాక అవసరమైన చికిత్సనందిస్తామని తెలిపారు. కోడిపుంజుల వలస, పరిసర గ్రామాల్లో పరిస్థితిని ఏజెన్సీలోని అదనపు జిల్లా వైద్యాధికారి గురునాథరావు సమీక్షిస్తున్నారన్నారు. మరోవైపు నిల్వ ఉంచిన మేక మాంసాన్ని తిన్నామని, ఆ తర్వాత చే తులకు బొబ్బలు వచ్చాయని బాధితులు చెబుతున్నారు.