సాక్షి, విశాఖపట్నం: లంబసింగి.. ఈ పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది అందమైన, ఎత్తయిన కొండ ప్రాంతం. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఓ కుగ్రామం. పర్వత శ్రేణుల్లో మంచు సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకర్షించే పర్యాటక ప్రదేశం. ఆంధ్రా కశీ్మరుగా ఖ్యాతి గడించింది. ‘0’(సున్నా) డిగ్రీల కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతల నమోదుతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అందుకే శీతాకాలం వచ్చిందంటే చాలు.. లంబసింగికి టూరిస్టులు క్యూ కడతారు. దేశ, విదేశాల నుంచి వచ్చి వాలతారు. అక్కడ ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదిస్తారు.
శీతాకాలంలో లంబసింగిలో ‘జీరో’ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట! అంటూ జనం తరచూ విశేషంగా చర్చించుకుంటారు. కానీ ఆ లెక్క పక్కా కాదని ఎంతమందికి తెలుసు? అక్కడ ఉష్ణోగ్రతలను గాని, వర్షపాతాన్ని గాని నమోదు చేసే యంత్రాంగం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో లంబసింగి ఉంది. ఇక్కడికి 19.7 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్)లో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతల కంటే లంబసింగిలో రెండు డిగ్రీలు తక్కువగా రికార్డయినట్టు చెబుతున్నారు.
ఉదాహరణకు చింతపల్లిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే లంబసింగిలో ‘0’ డిగ్రీలు రికార్డయినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లూ దీనినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లంబసింగిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఏడబ్ల్యూఎస్)ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. దీనిని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో దీనిపై కొంత కసరత్తు జరిగినా ఆ తర్వాత మరుగున పడింది.
లంబసింగిలో ఏఆర్‌జీ..
తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లంబసింగిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్‌జీ) స్టేషన్‌ను మంజూరు చేసింది. లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) సమీపంలో దీనిని ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ ఏఆర్‌జీ ఏర్పాటయితే ఆ ప్రాంతంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షపాతం, గాలిలో తేమ శాతం రికార్డవుతాయి. దీని నిర్వహణను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం (సీడబ్ల్యూసీ) చూస్తుంది. మరికొన్నాళ్లలో లంబసింగిలో ఏఆర్‌జీ సిస్టం అందుబాటులోకి వస్తుందని, అప్పటినుంచి అక్కడ కచ్చితమైన వాతావరణ సమాచారం రికార్డవుతుందని సీడబ్ల్యూసీ డైరెక్టర్ సునంద ‘సాక్షి’కి చెప్పారు.
సముద్రమట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో..
లంబసింగి తూర్పు కనుమల పర్వత శ్రేణుల్లో ఎత్తయిన ప్రదేశంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ కాఫీ తోటలు, యూకలిప్టస్ చెట్లతో నిండి ఉంటుంది. సముద్రమట్టానికి అరకు 2,700 అడుగులు, చింతపల్లి 2,800 అడుగుల ఎత్తులోనూ ఉంటే లంబసింగి 3,000 అడుగుల (వెయ్యి మీటర్ల) ఎత్తులో ఉంది. దీంతో లంబసింగి శీతాకాలంలో పొగమంచు దట్టంగా అలముకుని ఆహ్లాదం పంచుతుంది. మంచు ఐస్‌లా గడ్డ కట్టుకుపోతుంది. అంతేకాదు.. అత్యల్ప (0–3 డిగ్రీల) ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. లంబసింగి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం పర్యాటకశాఖ గుడారాలను కూడా ఏర్పాటు చేసింది.
కొర్రబయలు నుంచి లంబసింగి..
లంబసింగికి కొర్రబయలు అనే పేరు కూడా ఉంది. కొర్ర అంటే కర్ర. బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా చలికాలంలో మంచు తీవ్రతకు ఇంటి బయట పడుకుంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారని, అందుకే కొర్రబయలు పేరు వచ్చిందని చరిత్ర కారులు చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment