సీలేరు(పాడేరు): జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ ఏవోబీ సరిహద్దు చిన్నగంగవరం, పెద్దగంగవరం గ్రామాల్లో ఆంత్రాక్స్ రోగులు... వైద్యాధికారులను, సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఆంత్రాక్స్ వ్యాధి మిగతా గిరిజనులకు సోకకుండా చర్యలు చేపట్టేందుకు వైద్యసిబ్బంది నానాపాట్లు పడుతుంటే, ఆ వ్యాధి బారిన పడిన వారు కేజీహెచ్‌కు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఆంత్రాక్స్ బారిన పడిన 11 మందిని గురువారం చింతపల్లికి తరలించారు. అక్కడ నుంచి కేజీహెచ్‌కు తరలించే లోపు వారు తప్పించుకుని గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో కంగారు పడిన ఐటీడీఏ బృందం, వైద్యసిబ్బంది శుక్రవారం ఉదయం గ్రామాలకు వెళ్లి ఆరా తీయగా రోగులందరూ వచ్చేశారని స్థానికులు తెలిపారు. దారకొండ వైద్యాధికా రి రామ్‌నాయక్, వైద్యసిబ్బంది, వెలుగు, పశువైద్యశాఖ, రెవెన్యూశాఖ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులు కలిసి వారిని పట్టుకుని ఆంత్రాక్స్ వ్యాధిపై అవగాహన కల్పించి, నచ్చజెప్పారు. చింతపల్లి నుంచి ఒకే అంబులెన్స్‌లో కిల్లో అర్జున్, గెమ్మెలి సువర్ణ, పి.దళపతి, కొర్రా రామన్న, గెమ్మెలి రాజు, కిల్లో రాందాసు, కిల్లో పోత్తి అనే అనే ఏడుగుర్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
మరో నలుగురి కోసం గాలింపు: ఆంత్రాక్స్ సోకిన 11 మందిలో ఏడుగురికి కౌన్సెలింగ్ ఇచ్చి కేజీహెచ్‌కు పంపించగా మిగతా నలుగురు వైద్యం చేయించుకునేందుకు, కేజీహెచ్‌కు వెళ్లేందుకు మొండికేస్తున్నారు. దారకొండ వైద్యసిబ్బంది కనబడకుండా గ్రామం నుంచి పరారయ్యారు. వీరి కోసం వైద్యసిబ్బంది, స్థానిక అధికారులు గాలిస్తున్నారు. వీరికి తక్షణమే వైద్యం అందించకపోతే మరికొందరికి సోకే ప్రమాదముందని వైద్య సిబ్బంది తెలిపారు. శుక్రవారం ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరకి ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. పాంగి సద్దు, పాంగి కొండబాబులకు ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయని, వీరు కూడా వైద్యానికి అంగీకరించడం లేదని వైద్యసిబ్బంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment