kgh doctors
-
వైద్యులూ.. ఇదేం తీరు.!
పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణం): కేజీహెచ్‌లోని చర్మవ్యాధుల ఓపీ విభాగంలో వైద్యుల తీరుతో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. సమయ పాలన పాటించకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. క్యూలో నిల్చోలేక నీరసించిపోతున్నారు. ఈ విభాగం ఓపీ సేవలందించే బ్లాకు రెండో అంతస్తులో ఉంది. ఈ ఓపీకి సగటున రోజుకు 150 నుంచి 200 మంది రోగులు వస్తుంటారు. వీరంతా ఉదయం 8.30 గంటలకే ఓపీ చీటీ రాయించుకుని పడుతూ లేస్తూ రెండో అంతస్తుకు చేరుకుని క్యూలైన్లో కూర్చుంటారు. వైద్యుడు రాగానే చూపించుకుని అవసరమైన మందులు తీసుకుని ఎండకు చిక్కకుండా ఇంటికి చేరుకోవాలని ప్రతి రోగి మనసులో అనుకుంటాడు. కానీ అది ఆచరణ సాధ్యం కావడం లేదు. ఉదయం 9 గంటలకు ఓపీకి వచ్చి వైద్య పరీక్షలు చేయాల్సిన వైద్యులు 10.30 దాటితే కాని రావడం లేదు. ముఖ్యంగా పురుషుల ఓపీకి వచ్చే వైద్యులు ఆలస్యంగా రావడంతో రోగులు క్యూలైన్లో పడిగాపులు పడాల్సి వస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలు దాటిన తర్వాత వైద్యులు రావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ మండిపోతుండడంతో చర్మవ్యాధులతో వచ్చే రోగులు ఎక్కువ సేపు కూర్చోలేకపోయారు. క్యూలైన్లో ఎక్కువ మంది ఉండడంతో వైద్య పరీక్షలు చాలా ఆలస్యంగా జరిగాయి. పరీక్షల అనంతరం మందుల కోసం చాంతాడంత లైన్లో నిల్చున్నారు. వృద్ధులు, పిల్లలను ఎత్తుకుని వచ్చే మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజు సకాలంలో ఓపీని తెరవాలని పలువురు కోరుతున్నారు. ఉదయం నుంచి క్యూలో ఉన్నా.. ఉదయం 8.30 గంటలకు వచ్చి క్యూలో కూర్చున్నాను. ఎండ వేడి పెరిగిపోవడంతో కూర్చోవడం చాలా కష్టంగా ఉంది. 9 గంటలకు రావలసిన వైద్యులు 11 గంటలు దాటిన తర్వాత వచ్చారు. ప్రతి రోజు ఉదయాన్నే వైద్యులు వచ్చి పరీక్షలు చేస్తే రోగులకు వెసులుబాటుగా ఉంటుంది. – ఎస్.అప్పలరాజు, గాజువాక రెండంతస్తులు ఎక్కడం కష్టమే.. వైద్యం కోసం రెండంతస్తులు కష్టపడి ఎక్కాక.. అక్కడ వైద్యులు లేకపోతే ప్రాణం ఉసూరుమంటుంది. వైద్యులు వచ్చే వేళకు లైను కూడా పెరిగిపోతోంది. వైద్య పరీక్షలు చేయించుకున్న తరువాత మందులు చీటీ తీసుకుని మందులు ఇచ్చే లైన్లో నిల్చోవాలి. వైద్యులు ఉదయాన్నే వస్తే బాగుంటుంది. – ఎస్.మల్లేష్, మధురవాడ -
ఆన్‌డ్యూటీ 'ఓన్' డ్యూటీ
ఉదయం 9 గంటలైతే చాలు.. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ వైద్యులు, రోగులతో కిటకిటలాడుతూ ఉంటుంది. గంట.. గంటన్నర తర్వాత చూస్తే చాలా విభాగాల్లో వైద్యులు కనిపించరు. అరె.. ఇప్పుడే ఈ డాక్టర్ని బయోమెట్రిక్ హాజరు వద్ద చూశానే.. అని అనుకునేలోపే మాయమైపోతారు. వైద్యులొస్తారని వేచి చూసి చూసీ.. చివరికి పక్కనే ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ ఇదే డాక్టర్ బిజీ బిజీగా ట్రీట్మెంట్ చేస్తూ కనిపిస్తుంటారు.ఎందుకంటే.. అక్కడ ఆన్ డ్యూటీ.. ఇక్కడ ఓన్ డ్యూటీ.కేజీహెచ్‌లోని పలు విభాగాల వైద్యులు ఉదయాన్నే ఇక్కడ హాజరు వేసుకొని... తరువాత పక్కన ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు... అక్కడే పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి గైర్హాజరు.. వైద్య విద్యార్థులకు, రోగులకు తీరని అన్యాయం చేస్తుంది. విశాఖసిటీ: ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని కేజీహెచ్‌లో నిపుణులైన వైద్యులు చాలామంది ఉన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వారు చికిత్స అందిస్తే చాలు రోగాలు మటుమాయమవుతాయి. అయితే వచ్చిన చిక్కల్లా ఉదయం 9 నుంచి 9.30లోపు బయోమెట్రిక్‌లో హాజరు వేసినప్పటికీ వారు ఇటు ఓపీలో కాని అటు వార్డులో కాని కనిపించరు. కేజీహెచ్‌లో ఉండాల్సిన సమయంలో వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలందిస్తూ రెండు చేతులాసంపాదించుకుంటున్నారు. కొంత మంది వైద్యులకు సొంత నర్సింగ్ హోంలు కూడా ఉన్నాయి. వీరి ప్రవర్తన రోగులకే కాదు వైద్య విద్యార్థులకు కూడా శాపంగా మారింది. అడపాదడపా వైద్యాధికారులు, మంత్రులు వీరి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అండదండలతోనే వీరిలా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు ఆసుపత్రిలో బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా మూడేళ్ల క్రితం అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కేజీహెచ్‌ని సందర్శించిన సమయంలో.. ఆసుపత్రిలో ఉండాల్సిన సమయంలో వైద్యులు ఉండకపోతే తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆ తర్వాత రోజు కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. వచ్చినవారు వచ్చినట్టే వచ్చి.. హాజరు వేసుకొని ఎంచక్కా.. సొంత నర్సింగ్ హోమ్‌లకు, ప్రైవేట్ ఆస్పత్రులకు చెక్కేస్తున్నారు. కేజీహెచ్‌లోని వైద్యుల తీరును పరిశీలిస్తున్న వివిధ శాఖలకు చెందిన మంత్రులు హెచ్చరిస్తున్నా ఫలితం మాత్రం సున్నా. ప్రైవేటు ఆసుపత్రుల్లో, సొంత నర్సింగ్ హోంలో శస్త్రచికిత్సలు, ఓపీ సేవలు అందిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. జూడాలపైనే భారమంతా.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అసిస్టెంట్, అసోసియేట్, హెచ్ఓడీలు ఓపీల్లోనూ, వార్డుల్లోనూ వైద్య సేవలు విధిగా అందించాలి. వైద్య విద్యార్థులకు బెడ్‌సైడ్ శిక్షణ ఇవ్వాలి. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు వారి విద్యా సంవత్సరాన్ని బట్టి రోగులను చూపిస్తూ వ్యాధుల గురించి బోధించాలి. రోగులకు అందిచే వైద్య సేవలను వివరించాలి. ఇటువంటి పరిస్థితి కేజీహెచ్‌లోని కొన్ని విభాగాల్లో కనిపించడం లేదు. ఓపీల్లో పీజీలు, జూనియర్ వైద్యులు మాత్రమే అధికంగా కనిపిస్తున్నారు. మరి కొన్నింటిలో అసిసెంట్ ప్రొఫెసర్లు కనిపిస్తుంటారు. అసోసియేట్లు, హెచ్ఓడీలు వారంలో మూడు రోజులు ఓపీకి రావాల్సి ఉండగా చాలా మంది మాత్రం ఒక్కరోజు మాత్రమే వస్తున్నారు. అదీ మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల సమయంలో మాత్రమే దర్శనం ఇస్తున్నారు. విశ్వాసాన్ని మంటగలుపుతున్నారు.. ఉత్తరాంధ్రతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్ఘడ్ రాష్ట్రాల ప్రజలకు కేజీహెచ్ వైద్య సంజీవని వంటిది. ఎంతో మంది నిపుణులైన వైద్య ప్రముఖులు రోగులకు అందించిన సేవలే కేజీహెచ్‌కు పేరు, ప్రఖ్యాతలు తీసుకువచ్చాయి. అందువల్లనే వందలాది మంది పేదలు సర్కారీ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతుందన్న భరోసాతో ఇక్కడకు వస్తుంటారు. అదేవిధంగా వైద్య విద్యార్థులను నిష్ణాతులైనవారిగా తీర్చి దిద్దే అవకాశమూ ఉంది. సర్కారీ ఆసుపత్రిలోని వైద్యుల గైర్హాజరు.. వైద్య విద్యార్థులకు, రోగులకు తీరని అన్యాయం చేస్తుంది. వీరి వల్ల ఆసుపత్రికి, ఆంధ్ర వైద్య కళాశాలకు మాయని మచ్చ ఏర్పడుతోంది. కేజీహెచ్‌కు వెళ్తే రోగం పూర్తిగా తగ్గిపోతుందన్న భరోసా రోగులకు ఉండేది. వారు కూడా అదేవిధంగా భావించేవారు, ఈ నమ్మకం క్రమంగా దూరం అయిపోతుంది. వైద్య విద్యార్థులకు తరగతుల్లో చెబుతున్న పాఠాలే తప్ప, బెడ్ సైడ్ శిక్షణ, ఓపీల్లో బోధన క్రమంగా తగ్గిపోతుంది. అధికార పార్టీ అండతో కొందరు అధికారం, అండ ఉంటే.. అడ్డేముంది అన్న రీతిలో కొంతమంది వైద్యులు వ్యవహరిస్తున్నారు. కొంతమంది వైద్యులు ఉదయం వచ్చి గంట పాటు సేవలందించి వేరే ఆస్పత్రులకు వెళ్లిపోతుండగా.. మరికొందరు మాత్రం కేజీహెచ్‌కు రావడం.. హాజరు వేసుకోవడం.. ప్రైవేటుకు పయనమవ్వడం.. ఇదే తంతుగా వ్యవహరిస్తున్నారు. వారిపై ఎవరైనా హెచ్ఓడీలుగానీ, అధికారులు గానీ ఆగ్రహం వ్యక్తం చేసిన మరుక్షణమే.. మంత్రి నుంచి, ఎమ్మెల్యే నుంచి ఫోన్ వస్తుంది. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలెయ్యాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, వైద్య విద్యా శాఖ మీద ఉంది. వీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేకపోవడంతో సర్కారీ సేవలు అందించే వైద్యులు ధైర్యంగా ప్రైవేటు సేవలు అందిస్తూ, సర్కారీ జీతాలు తీసుకుంటున్నారు. ఈ తరహా అర్థాంతర సేవలు అందుతున్న పరిస్థితి ఆర్థోపెడిక్, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరో మెడిసిన్, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. -
ప్రాణాలు తీసిన రసాయనం!
సాక్షి, విశాఖపట్నం/గాజువాక : చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే కుటుంబాల్లో విప్పసారా రూపంలోని విషపూరిత రసాయనం తీవ్ర విషాదం నింపింది. ఎప్పట్నుంచో నిషాకు అలవాటుపడిన ఆ బడుగు జీవులు తాము సేవిస్తున్నది విషమని గమనించలేకపోయారు. రోజంతా కష్టపడ్డ శ్రమను గుక్కెడు సారాతో మరచిపోవచ్చని భావించారే తప్ప అది తమను శాశ్వత నిద్రలోకి తీసుకెళ్తుందని ఊహించలేదు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఇంకో 11మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. విశాఖ నగర శివారు పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీలో చోటుచేసుకున్న ఈ విషాదంపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీకి చెందిన వారు చిత్తు కాగితాలు ఏరుకుని జీవిస్తుంటారు. ఎప్పటిలాగే కాలనీకి చెందిన వాడపల్లి అంకమ్మ శనివారం సాయంత్రం సమీపంలోని డంపింగ్ యార్డుకు చిత్తు కాగితాల కోసం వెళ్లింది. అక్కడ తుప్పల మాటున నల్లని ప్లాస్టిక్ డబ్బా (20 లీటర్ల సామర్థ్యం) కనిపించడంతో దాని మూతతెరచి వాసన చూసింది. విప్ప సారాగా భావించి ఆ డబ్బాను ఇంటికి తీసుకొచ్చింది. రాత్రి తన మామ వాడపల్లి అప్పడు (75), అతని చెల్లెలు పెండ్ర అప్పాయమ్మ (70)లకు ఇచ్చి ఆమె కూడా తాగింది. సమీప బంధువులు ఆసనాల కొండోడు, ఆసనాల చిన్నారావు, ఆసనాల రమణమ్మ, పెండ్ర లోవరాజు సహా మరో 20 మంది వరకు ఇచ్చింది. వారంతా రాత్రి తాగి నిద్రించారు. వీరిలో కొందరు వాంతులు చేసుకున్నారు. ఉదయానికి పెండ్ర అప్పాయమ్మ మృతి చెందింది. ఈమె అనారోగ్యంతో చనిపోయిందనుకుని దహన సంస్కారాలు కూడా పూర్తి చేసేశారు. ఆ కాసేపటికి అప్పడు కూడా చనిపోయాడు. ఆందోళనతో కాలనీ వాసులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వీరిలో అంకమ్మను గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి, కొండోడుతో పాటు మిగతా వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మార్గమధ్యంలో కొండోడు కూడా మరణించాడు. వీరిలో ఆసనాల రమణమ్మ, ఆసనాల చిన్నారావుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంకమ్మ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆదివారం రాత్రి కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ప్రస్తుతం కేజీహెచ్ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 11కి చేరింది. ఆ రసాయనాన్ని కొన్నారా? ఈ ఘటనలో రసాయన డబ్బా దొరకడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాగుడు అలవాటు ఉన్న కాలనీ వాసులు మద్యంతో పాటు మత్తెక్కించే ద్రావణాలను రహస్యంగా సేవిస్తారని తెలుస్తోంది. తనకు డంపింగ్ యార్డులో రసాయన డబ్బా దొరికిందని, అది విప్ప సారాగా భావించి తీసుకొచ్చానని కాలనీ వాసులకు అంకమ్మ చెప్పింది. అయితే, దీనిని తాగిన మరికొందరు బాధితులు తాము వంద రూపాయల చొప్పున కొనుగోలు చేశామని చెబుతున్నారు. మీడియా ప్రతినిధులతో పాటు కేజీహెచ్ వైద్యులకు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. అంకమ్మ చెబుతున్నట్టు డంపింగ్ యార్డులో దొరికిందా? లేక కొన్నాళ్లుగా ఎవరైనా కాలనీ వాసులకు విప్పసారా పేరిట మత్తునిచ్చే ఇతర ద్రావణాలను తెచ్చి విక్రయిస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది. పరీక్షకు రసాయనం.. కాగా, ఎక్సైజ్ అధికారులు ఆ ద్రావణాన్ని పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపించారు. ఆదివారం రాత్రి వరకు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో అది పరిశ్రమలకు వినియోగించే నాన్‌పోటబుల్ కెమికల్గా తేల్చారు. పూర్తిస్థాయి నివేదిక సోమవారం వస్తుందని ఎక్సైజ్ అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. మద్యంలో పోటబుల్ లిక్కర్‌ను మాత్రమే వాడతారని తెలిపారు. బాధితులకు పరామర్శ స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే వెంకట్రామయ్య, వైఎస్సార్సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, ఏసీపీ ప్రవీణ్‌కుమార్, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్‌లు సందర్శించారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను కలెక్టర్ కె.భాస్కర్, ఎక్సైజ్ డీసీ టి.శ్రీనివాసరావు తదితరులు పరామర్శించారు. ఈ రసాయనం ప్రాణాంతకమైనదే.. బాధితులు సేవించినది స్పిరిట్లాంటి ప్రాణాంతక రసాయనంగా భావిస్తున్నాం. ఇందులో మత్తు కలిగించే ఆల్కహాల్ కూడా ఉండడంవల్ల దీనిని సేవించిన వారికి కిక్కు ఇస్తుంది. ఇలాంటి రసాయనాలు పరిశ్రమల్లో వాడతారు. తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసి దీనిని తాగామని బాధితులు చెబుతున్నారు. మత్తు, న్యూరో వైద్యులతో నిరంతర వైద్యం అందిస్తూ అప్రమత్తంగా ఉన్నాం. – డా. జి.అర్జున, సూపరింటెండెంట్, కేజీహెచ్ -
వైద్యానికి ఆంత్రాక్స్ రోగులు ససేమిరా
సీలేరు(పాడేరు): జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ ఏవోబీ సరిహద్దు చిన్నగంగవరం, పెద్దగంగవరం గ్రామాల్లో ఆంత్రాక్స్ రోగులు... వైద్యాధికారులను, సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఆంత్రాక్స్ వ్యాధి మిగతా గిరిజనులకు సోకకుండా చర్యలు చేపట్టేందుకు వైద్యసిబ్బంది నానాపాట్లు పడుతుంటే, ఆ వ్యాధి బారిన పడిన వారు కేజీహెచ్‌కు వెళ్లి వైద్యం చేయించుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఆంత్రాక్స్ బారిన పడిన 11 మందిని గురువారం చింతపల్లికి తరలించారు. అక్కడ నుంచి కేజీహెచ్‌కు తరలించే లోపు వారు తప్పించుకుని గ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో కంగారు పడిన ఐటీడీఏ బృందం, వైద్యసిబ్బంది శుక్రవారం ఉదయం గ్రామాలకు వెళ్లి ఆరా తీయగా రోగులందరూ వచ్చేశారని స్థానికులు తెలిపారు. దారకొండ వైద్యాధికా రి రామ్‌నాయక్, వైద్యసిబ్బంది, వెలుగు, పశువైద్యశాఖ, రెవెన్యూశాఖ ఉద్యోగులు, గ్రామ కార్యదర్శులు కలిసి వారిని పట్టుకుని ఆంత్రాక్స్ వ్యాధిపై అవగాహన కల్పించి, నచ్చజెప్పారు. చింతపల్లి నుంచి ఒకే అంబులెన్స్‌లో కిల్లో అర్జున్, గెమ్మెలి సువర్ణ, పి.దళపతి, కొర్రా రామన్న, గెమ్మెలి రాజు, కిల్లో రాందాసు, కిల్లో పోత్తి అనే అనే ఏడుగుర్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మరో నలుగురి కోసం గాలింపు: ఆంత్రాక్స్ సోకిన 11 మందిలో ఏడుగురికి కౌన్సెలింగ్ ఇచ్చి కేజీహెచ్‌కు పంపించగా మిగతా నలుగురు వైద్యం చేయించుకునేందుకు, కేజీహెచ్‌కు వెళ్లేందుకు మొండికేస్తున్నారు. దారకొండ వైద్యసిబ్బంది కనబడకుండా గ్రామం నుంచి పరారయ్యారు. వీరి కోసం వైద్యసిబ్బంది, స్థానిక అధికారులు గాలిస్తున్నారు. వీరికి తక్షణమే వైద్యం అందించకపోతే మరికొందరికి సోకే ప్రమాదముందని వైద్య సిబ్బంది తెలిపారు. శుక్రవారం ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరకి ఆంత్రాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. పాంగి సద్దు, పాంగి కొండబాబులకు ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయని, వీరు కూడా వైద్యానికి అంగీకరించడం లేదని వైద్యసిబ్బంది తెలిపారు. -
ఛీ...ఇంత దిగజారుడా..!
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ):వైద్యో నారాయణో హరీ అని అంతా అంటుంటారు. దైవంతో సమానమని గౌరవిస్తారు. అటువంటి వైద్యుడు మానవత్వం మరిచి డబ్బులకు కక్కుర్తిపడిన ఉదంతం అందరినీ విస్మయానికి గురిచేసింది. చేతికి అందొచ్చిన కొడుకుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను... పోస్టుమార్టం రిపోర్టు కోసం రూ.10వేలు డిమాండ్ చేసి వైద్య వృత్తికే మచ్చ తెచ్చేందుకు యత్నించాడు. ఈ జుగుప్సాకర ఘటన సోమవారం కేజీహెచ్‌లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 5వ వార్డు మారికవలస పరిధి రాజీవ్‌గృహకల్ప సముదాయం బ్లాక్ నంబర్ 27లో నివసిస్తున్న కెల్లా వెంకటేశ్వరాచారి కుమారుడు వెంకటేష్ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో విశాఖ నగరంలోకి వెళ్తుండగా... వైఎస్సార్ క్రికెట్ స్టేడియం ఎదురుగా వచ్చేసరికి హైవేపై నడుచుకుని వెళ్తున్న వ్యక్తిని తప్పించేందుకు యత్నించి కింద పడిపోయాడు. అదే సమయంలో వచ్చిన లారీ వెంకటేష్ పైనుంచి దూసుకుపోవడంతో ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీఎం పాలెం పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. ఇక్కడే కేజీహెచ్‌లో పోస్టుమార్టం చేసే వైద్యుడు తన వికృత రూపం ప్రదర్శించాడు. రూ.10 వేలు ఇవ్వకుంటే... రిపోర్టు తారుమారు సోమవారం ఉదయం 10 గంటలకల్లా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉన్నా చేయకపోవడంతో వెంకటేష్ బంధువులు, స్నేహితులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు వెళ్లి వైద్యుడిని సంప్రదించారు. పోస్టుమార్టం నిర్వహించాల్సిన డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ... మృతి చెందే సమయానికి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానంగా ఉందని, అందువల్ల పోస్టుమార్టం రిపోర్టులో మద్యం తాగి వాహనం నడపలేదని రాసేందుకు, పోస్టుమార్టం నిర్వహించేందుకు రూ.10వేలు లంచమివ్వాలని డిమాండ్ చేశాడని వెంకటేష్ బంధువులు, స్నేహితులు ఆరోపించారు. సాధారణంగా అందరూ పోస్టుమార్టం చేసే డాక్టర్‌కు ఇస్తున్నట్టుగానే రూ.2వేలు ఇచ్చేందుకు సిద్ధపడినా రూ.10వేలు ఇస్తేనే పోస్టుమార్టం చేస్తానని చెప్పడంతో మృతుడి బంధువులు, స్నేహితులు నిరసనకు దిగారు. ముందుగా ఆంధ్ర వైద్య కళాశాల ముందు, తరువాత పోస్టుమార్టం నిర్వహించే భవనం ముందు నిరసన చేపట్టారు. విషయాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున, ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పి.వి.సుధాకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు సదరు పోస్టుమార్టం వైద్యుడితో సంప్రదించారు. విషయాన్ని ఏఎంసీ కార్యాలయానికి రిపోర్టు చేస్తే దర్యాప్తు చేపడతామని చెప్పడంతో బాధితులు ఆందోళన విరమించారు. లారీ యజమానితో కుమ్మక్కై..! ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవరుతో సహా దాని యజమాని సదరు పోస్టుమార్టం చేసే వైద్యుడికి లంచం ఎర చూపడం వల్లనే చెడు అలవాట్లు లేని వెంకటేష్‌కు మద్యం అలవాటు ఉందని ఆరోపించారన్న అనుమానం మృతుని కుటుంబీకులు వ్యక్తం చేశారు. పదిమందికి న్యాయం చేయాల్సిన ప్రభుత్వ వైద్యులు ఈ విధంగా ప్రవర్తించడం అన్యాయమని, ప్రభుత్వ వైద్యులను ఇకపై పేద ప్రజలు భయంతో చూస్తారని అందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగించారు. కుమారుడి మృతదేహంపై పడి తల్లి రోదిస్తున్న దృశ్యం చూపరులను కలిచివేసింది. రూ.10వేలు డిమాండ్ చేశారు పోస్టుమార్టం చేసే వైద్యుడు డాక్టర్ చంద్రశేఖర్ రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. మృతుడు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానంగా ఉందని, మద్యం తాగి వాహనం నడపలేదని పోస్టుమార్టం రిపోర్టులో రాయాలంటే రూ.10వేలు ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేయడం అన్యాయం. ప్రభుత్వ వైద్యులంటే ప్రజలకు ప్రాణభయం పట్టుకుంది. రూ.10వేలు ఇవ్వడానికి నిరాకరించడం వల్లే ఉదయం చేయాల్సిన పోస్టుమార్టం మధ్యాహ్నం 2 గంటలకు చేశారు. – బేతా దుర్గారావు, బంధువు మద్యం అలవాటు లేదు వెంకటేష్‌కు మద్యం అలవాటు లేదు. స్నేహితులు మద్యం సేవిస్తే వారిని మందలించేవాడు. లేని అలవాటును ఉన్నదని చెప్పడం ఎంతవరకూ సబబు. లారీ డ్రైవరు, యజమాని ఇచ్చే లంచాలకు పోస్టుమార్టం చేసే వైద్యుడు చంద్రశేఖర్ ఆశపడినట్టున్నాడు. అందువల్లే లేని అలవాటు ఉన్నట్టుగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు.– నూకరాజు, స్నేహితుడు మంచి బాక్సర్ నా మేనల్లుడు వెంకటేష్ మంచి బాక్సర్. తల్లిదండ్రులను, తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. చిన్నవయసులోనే బరువు బాధ్యతలు మోస్తూ తండ్రికి అండగా నిలబడ్డాడు. అటువంటి మంచివాడిపై నిందలు వేస్తున్నారు. మద్యం అలవాటు ఉన్నదనడం నిజం కాదు. మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేయాలి.– శ్రీదేవి, మృతుని మేనత్త -
వైద్యం పూర్తికాకుండానే ఇంటికి..
సీలేరు(పాడేరు): కేజీహెచ్‌లో గందరగోళ పరిస్థితులు, సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడంతో చికిత్స పూర్తికాకుండానే తన కుమార్తెను తీసుకుని ఇంటికి వచ్చేసిన సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపునకు చెందిన వ్యక్తికి వైద్య సిబ్బంది, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ కేజీహెచ్‌కు పంపించారు. వివరాలు ఉన్నాయి. చింతపల్లి క్యాంప్‌నకు చెందిన కిల్లో పార్వతి అనే బాలికకు తలపై గాయమైంది. వైద్యం సకాలంలో అందక గాయం నుంచి పురుగులు వచ్చాయి. దీంతో స్థానిక వైద్యసిబ్బంది మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కేజీహెచ్‌లో ఎస్టీసెల్‌లో ఆమెకు వైద్యసేవలందించి, 65 పురుగులను తొలగించారు. నెల రోజులపాటు ఆస్పత్రిలో ఉంచాలని వైద్యనిపుణులు సూచిం చారు. అయితే అక్కడంతా గందరగోళంగా ఉందని, ఎవరూ సక్రమంగా పట్టించుకోవడం లేదంటూ బాలిక తండ్రి కిల్లో శ్రీనివాస్ తన కుమార్తెను వెంట పెట్టుకుని ఆస్పత్రి సిబ్బందికి చెప్పకుండా తన గ్రామానికి తిరిగి వచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సీలేరు వైద్యాధికారి శ్రీనివాస్, ఎస్ఐ విభూషణరావు ఆ గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్పీ కార్యాలయం అధికారులతో ఎస్ఐ మాట్లాడి విశాఖలో నాలుగు రోజులపాటు ఆ బాలిక వద్ద ఉండే విధంగా ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేశారు. కేజీహెచ్‌లో వైద్యం చేసిన మాట వాస్తవమేగాని 29వ నంబరు వార్డుకు వెళ్లాలని సూచించారని, అక్కడికి వెళితే 19వ నంబరు వార్డుకు వెళ్లామని చెప్పి, తమను పట్టించుకోలేదని బాలిక తండ్రి శ్రీనివాసరావు ఆరోపించాడు. -
108కి డీజిల్ లేక.. ఆగిన యువకుడి ఊపిరి
సబ్బవరం (పెందుర్తి): సకాలంలో ఆదుకోవాల్సిన ఆపద్బాంధవి (108 అంబులెన్స్) చేతులెత్తేయడంతో ఓ యువకుడి ఊపిరి ఆగిపోయింది. ఆ వాహనానికి డీజిల్ లేకపోవడంతో.. సమయానికి చికిత్స అందక విశాఖ జిల్లాకు చెందిన యువకుడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. వివరాలు.. సబ్బవరం సమీపంలోని దుర్గానగర్‌కు చెందిన పాల నాయుడికి (21) మంగళవారం అర్థరాత్రి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి తలెత్తడంతో కుటుంబసభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు. డీజిల్ లేనందువల్ల సమీపంలోని వాహనం రాకపోవచ్చని, మరో వాహనం రావాలంటే 2, 3 గంటల సమయం పడుతుందంటూ 108 సిబ్బంది నుంచి సమాధానం వచ్చింది. దీంతో చేసేది లేక ఆటోలోనే కేజీహెచ్‌కు తరలించగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు. 108 సకాలంలో వచ్చి ఉంటే తమ బిడ్డ బతికేవాడని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
14 ఏళ్ల తర్వాత..
బయట పడిన డిఫ్తీరియాబాధితురాలు విశాఖకు చెందిన 8 ఏళ్ల చిన్నారి ఐదు రోజులుగా వైద్య సేవలు నక్కపల్లి: చిన్నపిల్లల్లో చాలా అరుదుగా వచ్చే డిఫ్తీరియా(కంఠసర్పి)వ్యాధిని కేజీహెచ్ వైద్యులు తాజాగా గుర్తించారు. ఈ విషయాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి జె.సరోజిని గురువారం నక్కపల్లిలో వెల్లడించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత విశాఖ జిల్లాలో ఈ వ్యాధి బయటపడటం వైద్యవర్గాలను విస్మయపరిచింది. విశాఖపట్నం చినవాల్తేరులోని ఎనిమిదేళ్ల చిన్నారికి ఈ వ్యాధి సోకింది. స్వైన్‌ఫ్లూగా భావించి బంధువులు ఈ నెల 7న కేజీహెచ్‌కు తీసుకువచ్చారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరపగా డిఫ్తీరియాగా తేలింది. వెంటనే ఆస్పత్రిలోచేర్చుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. ఇటీవల జిల్లాలో ఎక్కడా డిఫ్తీరియా నమోదు కాలేదు. రాష్ట్రంలోనే ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలో నాలుగేళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఒక కేసును గుర్తించారు. ఇప్పుడు మళ్లీ ఈ కేసు నమోదయింది. చిన్నారిని కేజీహెచ్ అత్యవసర వార్డులో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారని,ఆమె ఆరోగ్యపరిస్థితి మెరుగుపడిందని, ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని డీఎంహెచ్‌వో తెలిపారు. డిఫ్తీరియా లక్షణాలు కనిపించిన విశాఖ చినవాల్తేరు పరిధి 17,18 వార్డుల్లో 20 ప్రత్యేక బృందాలను నియమించి సహాయక చర్యలు, గుర్తింపు సర్వే చేపట్టామన్నారు. గతంలో ఈ ప్రాంతంలో బీసీజీ టీకాలు వేసిందీ, లేనిదీ నిర్ధారిస్తున్నామన్నారు. అవసరమైతే ఈ రెండు వార్డుల్లో 50వేల మందికి టీకాలు వేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విశాఖ జిల్లా చరిత్రలో దాదాపు 14 ఏళ్ల క్రితం ఈ వ్యాధి న మోదయిన విషయం తెలుసుకున్నానని, తర్వాత ఎక్కడా ఇటువంటి కేసులు నమోదయిన దాఖలాలు లేవన్నారు. ఈ వ్యాధిసోకితే విపరీతమైన జలుబు, ముక్కకారుట, గొంతులో తెల్లటి జిగురువంటి పదార్థం ఏర్పడుతుందని, దాదాపు స్వైన్‌ఫ్లూ లక్షణాలను పోలి ఉంటుందన్నారు. జిల్లాలో10స్వైన్‌ఫూ ్లకేసులు నమోదు జిల్లాలో 10 స్వైన్‌ఫ్లూ కేసులు నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి జె.సరోజిని వెల్లడించారు. గురువారం ఆమె గొడిచర్ల పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం నక్కపల్లి సీహెచ్‌సీలో క్లస్టర్పీహెచ్సీ పనివిధానాన్ని పరిశీలించారు. క్లస్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో 10 కేసులు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలోని చెస్ట్ ఆస్పత్రితోపాటు, మరో రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స అందిస్తున్నామన్నారు. మధురవాడ, అక్కయ్యపాలెం, ఇసుకతోట,పెందుర్తి, మునగపాక తదితర ప్రాంతాల నుంచి ఈ లక్షణాలతో రోగులు వస్తున్నారన్నారు. జిల్లాలో 85 పీహెచ్‌సీల పరిధిలో 21 వైద్యాధికారి పోస్టులు, 51 ఎంపీహెచ్ఏ(ఎం), 75 ఎంపీహెచ్ఏ(ఎఫ్), నాలుగు ల్యాబ్టెక్నీషియన్లు,21 స్టాఫ్‌నర్సు,15 ఫార్మాసిస్టు పోస్టులు ఖాళీలున్నాయన్నారు. వీటి భర్తీకి ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిని 350 పడకల స్థాయికి పెంచుతూ అనుమతులు వచ్చాయన్నారు. ఎలమంచిలి ఆస్పత్రిని 100 పడకల స్థాయికి, నక్కపల్లి ఆస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారు. చినదొడ్డిగల్లు పీహెచ్సీలో అసంపూర్తిగా ఉన్న పనుల పూర్తికి అవసరమై బడ్జెట్ విడుదలతోపాటు, అవసరమైన సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో 35 పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య బాగుందన్నారు. కుటుంబ నియంత్రణ శ్రస్త్రచికిత్సలు కూడా లక్ష్యానికి మించి జరుగుతున్నాయన్నారు. గతేడాది 15వేల శ్రస్త్రచికిత్సలు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతికోసం 600 ప్రైవేటు నర్సింగ్‌హోంలు దరఖాస్తుచేసుకున్నాయన్నారు. 400హోంలకు అనుమతి ఇచ్చామని,100హోంలు పరిశీలన పూర్తయ్యాయని, మరో 100హోంలను పరిశీలించాల్సి ఉందన్నారు. అనుమతులు లేని నర్సింగ్‌హోంలు ఎనిమిది ఉన్నాయని వాటికి నోటీసులు జారీ చేశామన్నారు. సమావేశంలో నక్కపల్లి ఆస్పత్రి వైద్యాధికారి పూర్ణచంద్రరావు, ఎంపీహెచ్‌ఈవో అప్పలనాయుడు ఉన్నారు. -
కేజీహెచ్ వైద్యులు ఇద్దరు అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఎట్టిపరిస్థితుల్లో విభజించవద్దని విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వారిద్దరు కేజీహెచ్ భవనం పైకెక్కారు. సమైక్యంగా ఉంచేంతవరకు తాము కిందకు దిగమని వారు స్పష్టం చేశారు. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్నారు. కేజీహెచ్ ఆసుపత్రిపైకి ఎక్కిన వైద్యులను పోలీసులు బుజ్జగించి కిందకి దింపారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.