సీలేరు(పాడేరు): కేజీహెచ్‌లో గందరగోళ పరిస్థితులు, సిబ్బంది సరిగా పట్టించుకోకపోవడంతో చికిత్స పూర్తికాకుండానే తన కుమార్తెను తీసుకుని ఇంటికి వచ్చేసిన సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపునకు చెందిన వ్యక్తికి వైద్య సిబ్బంది, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ కేజీహెచ్‌కు పంపించారు. వివరాలు ఉన్నాయి. చింతపల్లి క్యాంప్‌నకు చెందిన కిల్లో పార్వతి అనే బాలికకు తలపై గాయమైంది. వైద్యం సకాలంలో అందక గాయం నుంచి పురుగులు వచ్చాయి. దీంతో స్థానిక వైద్యసిబ్బంది మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కేజీహెచ్‌లో ఎస్టీసెల్‌లో ఆమెకు వైద్యసేవలందించి, 65 పురుగులను తొలగించారు.
నెల రోజులపాటు ఆస్పత్రిలో ఉంచాలని వైద్యనిపుణులు సూచిం చారు. అయితే అక్కడంతా గందరగోళంగా ఉందని, ఎవరూ సక్రమంగా పట్టించుకోవడం లేదంటూ బాలిక తండ్రి కిల్లో శ్రీనివాస్ తన కుమార్తెను వెంట పెట్టుకుని ఆస్పత్రి సిబ్బందికి చెప్పకుండా తన గ్రామానికి తిరిగి వచ్చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సీలేరు వైద్యాధికారి శ్రీనివాస్, ఎస్‌ఐ విభూషణరావు ఆ గ్రామానికి వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్పీ కార్యాలయం అధికారులతో ఎస్‌ఐ మాట్లాడి విశాఖలో నాలుగు రోజులపాటు ఆ బాలిక వద్ద ఉండే విధంగా ఒక కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేశారు. కేజీహెచ్‌లో వైద్యం చేసిన మాట వాస్తవమేగాని 29వ నంబరు వార్డుకు వెళ్లాలని సూచించారని, అక్కడికి వెళితే 19వ నంబరు వార్డుకు వెళ్లామని చెప్పి, తమను పట్టించుకోలేదని బాలిక తండ్రి శ్రీనివాసరావు ఆరోపించాడు.
Comments
Please login to add a commentAdd a comment