క్షతగాత్రురాలికి వైద్య సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
సాక్షి, అనపర్తి: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ప్రభుత్వాసుపత్రికి చేరిన క్షతగాత్రురాలికి అత్యవసర వైద్యాన్ని అందించి వైద్యో నారాయణో హరి అన్న ఆర్యోక్తికి నిదర్శనంగా నిలిచారు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి. స్థానిక గంగిరెడ్డి నర్సింగ్ హోమ్ అధినేతగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ రూ.10 వైద్యునిగా ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి పేరొందారు. వైద్యుడిగా తన ధర్మాన్ని పాటిస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై ప్రభుత్వాసుపత్రిలో చేరిన వలంటీర్‌కు అత్యవసర వైద్య సేవలు అందించటం ద్వారా తన వృత్తి ధర్మాన్ని చాటారు.
వివరాల్లోకి వెళితే అనపర్తి గ్రామ సచివాలయం–4లో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.సంధ్య ఆదివారం రాత్రి మండలంలోని లక్ష్మీనరసాపురం సమీపంలో రోడ్డు ప్రమాదానికై గురైంది. ఈ ప్రమాదంలో ఆమె కుడిచేయి మీద నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో చేతి మణికట్టు భాగం నుజ్జయ్యింది. దీంతో ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
చదవండి: (చీరమేను: ఆహా అద్భుత రుచి.. తినండి మైమరిచి..)
అయితే ఈ సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రురాలి బంధువుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి హుటాహుటిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి సంధ్యకు అత్యవసర వైద్య సేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ సైతం అందుబాటులో లేకపోవడం, సిబ్బంది సకాలంలో స్పందిచకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సూపరింటిండెంట్ జి.వరలక్ష్మికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే ఇటువంటివి పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment