సాక్షి, అమరావతి: గ్రామాల్లోని ప్రజలు వైద్య చికిత్సలకు ఊరు దాటి వెళ్లకుండా, ఉన్న ఊరిలోనే చికిత్స అందించేందుకు చేపట్టిన వైఎస్సార్ గ్రామీణ హెల్త్ క్లినిక్‌ల కొత్త భవనాల నిర్మాణం ఊపందుకుంది. దీంతో గ్రామాల్లోని వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రాధాన్యత ఇస్తే, సీఎం జగన్ సామాజిక బాధ్యతగా ప్రభుత్వ రంగంలోనే మరింత బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారు. చిన్న చిన్న జబ్బులకు గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
ఈ పరిస్థితులను మార్చేసి, జ్వరంతో పాటు ఇతర చిన్న అస్వస్థలకు గ్రామాల్లోనే చికిత్స అందించాలనే తపనతో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రూ.1,443.09 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్ గ్రామీణ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. మరో 1,426 క్లినిక్స్ ఇప్పటికే ఉన్నాయి. (మొత్తంగా 10,011) వైఎస్సార్ క్లినిక్‌ల నిర్మాణాల పురోగతిపై స్పందన సమీక్షల్లో సీఎం ఆరా తీస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నిర్వహించిన స్పందన సమీక్ష నాటికి గ్రామీణ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల కొత్త భవనాల నిర్మాణాలన్నీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తేలింది. జూన్ ఆఖరుకు భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. అనంతరం పూర్తి స్థాయిలో వైద్య చికిత్స పరికరాలు ఏర్పాటు చేస్తారు. సీఎం సూచనల మేరకు నిర్మాణాల నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా జాయింట్ కలెక్టర్లు దృష్టి సారించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం
► గ్రామీణ హెల్త్ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్‌సీ) అనుసంధానం చేయడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను కూడా త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ప్రయోగాత్మకంగా కొనసాగుతోంది.
► ఇందులో భాగంగా ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,145 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి మండలానికి రెండు చొప్పున లేని చోట్ల కొత్తగా ఏర్పాటు చేస్తారు. (560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు వీటికి అదనం)
► ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యుల చొప్పన నలుగురు వైద్యులు ఉంటారు. 24 గంటల పాటు వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ప్రతి పీహెచ్‌సీలో డాక్టర్‌తో కూడిన అంబులెన్స్ (104) అందుబాటులో ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో మండలంలో ఆరుగురు వైద్యులు అందుబాటులో ఉంటారు.
(108 అంబులెన్స్ ప్రతి మండలంలో ఒకటి అందుబాటులో ఉంటుంది.)
► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్టలో భాగంగా ఒక్కో వైద్యుడు తన పరిధిలోని గ్రామాలను నెలలో ఏడెనిమిది సార్లు విజిట్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తద్వారా ఉన్న ఊరిలోనే ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి.
► ఇదే సమయంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తారు. ఎప్పటికప్పుడు వారు పొందుతున్న వైద్యం వివరాలను ఇందులో అప్‌డేట్ చేస్తారు. భవిష్యత్‌లో ఎవరికైనా ఏదైనా జబ్బు చేస్తే సత్వరమే ఉత్తమ వైద్యం అందించడానికి హెల్త్ ప్రొఫైల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
హెల్త్ క్లినిక్‌లతో ఇవీ ఉపయోగాలు
► ప్రతి 2,500 మంది జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న జబ్బులకు పీహెచ్‌సీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
► ప్రతి క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌ను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న ఏఎన్‌ఎం కూడా అందుబాటులో ఉంటుంది. ఆశా వర్కర్లు కూడా ఉంటారు.
► కనిష్టంగా 90 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. 12 రకాల వైద్య సేవలందించనున్నారు. గర్భిణులు, చిన్నారుల సంరక్షణ, నవజాత శిశువులకు, ఏడాదిలోపు వయసున్న శిశువులకు ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటారు.
► అన్ని రకాల వ్యాక్సిన్‌లు ఉంటాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకునే అవకాశం ఉంటుంది. అసాంక్రమిక వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు వివరిస్తారు.
► తరచూ వచ్చే చిన్న చిన్న సమస్యలు, ఈఎన్‌టీ సమస్యలపై అవగాహన కల్పిస్తారు. వయసు పైబడినప్పుడు వచ్చే సమస్యల నివారణతో పాటు అత్యవసర మెడికల్ సర్వీసెస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. మానసిక వ్యాధులను ముందే గుర్తించి నియంత్రించే చర్యలను చేపడతారు.
ఉన్న ఊళ్లోనే అత్యాధునిక వైద్యం
Published Sat, Mar 20 2021 3:41 AM | Last Updated on Sat, Mar 20 2021 7:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment