Health Clinic
-
మీర్జా పేటలో సచివాలయం, హెల్త్ క్లినిక్ ప్రారంభించిన ఎమ్మెల్యే
-
టెలి మెడిసిన్‌లో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: వయో వృద్ధులు, మహిళలకు టెలీ మెడిసిన్ సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 19వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 1,10,12,570 మంది వయో వృద్ధులు టెలిమెడిసిన్ సేవలు పొందగా ఆంధ్రప్రదేశ్‌లో 34.17 లక్షల మందికి ప్రయోజనం చేకూరినట్లు ఇటీవల పార్లమెంట్‌కు తెలిపింది. దేశవ్యాప్తంగా పోలిస్తే 31.04 శాతం వయో వృద్ధులకు ఏపీలో సేవలు అందాయి. మహిళలకు టెలిమెడిసిన్ సేవలందించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో 5,22,15,224 మంది మహిళలకు టెలిమెడిసిన్ సేవలు అందగా ఆంధ్రప్రదేశ్‌లోనే 1.37 కోట్ల మంది మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పోలిస్తే ఏపీలో 26.41 శాతం మంది మహిళలు టెలి మెడిసిన్ సేవలు పొందారు. ఆంధ్రప్రదేశ్ మినహా మరే రాష్ట్రంలోనూ కోటి మందికి పైగా మహిళలకు టెలిమెడిసిన్ సేవలు అందలేదు. పశ్చిమ బెంగాల్లో 85.16 లక్షల మంది మహిళలు, తమిళనాడులో 62.94 లక్షల మంది మహిళలకు టెలిమెడిసిన్ సేవలను వినియోగించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 21,236 స్పోక్స్ హబ్‌లు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టెలి మెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు సైతం అందుబాటులోకి తెచ్చింది. టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, జిల్లా అస్పత్రుల్లో ప్రత్యేక హబ్‌లను ఏర్పాటు చేసింది. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లతో అనుసంధానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా హెల్త్ వెల్నెస్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలిమెడిసిన్ సేవలకు సంబంధించి 21,236 స్పోక్స్ హబ్‌లను ఏర్పాటు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉంటారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలు అవసరమైతే టెలిమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్ నుంచి వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి తగిన ఎలాంటి మందులు వాడాలో సూచిస్తారు. ఆ మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ఈ–సంజీవని (ఓపీడీ) యాప్‌తో ఇంటి నుంచే వైద్య సేవలను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ లేని వారితో పాటు వాటిని వినియోగించలేని వారి కోసం ఇంటి వద్దే ఈ–సంజీవని ఓపీ డిపార్ట్మెంట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్ ల కు అనుసంధానించారు. దీంతో మారుమూల ప్రాంతాల్లోని వారు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్టు డాక్టర్ల వైద్య సేవలను పొందగలుగుతున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున అందిస్తున్న టెలిమెడిసిన్ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అవగాహన కల్పించడంతో అత్యధికంగా వృద్ధులు, మహిళలకు టెలి మెడిసిన్ సేవలు అందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. -
ఇ–సంజీవనిలో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇ–సంజీవని కార్యక్రమం వరంలా ఉపయోగపడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి తెస్తూ ఇ–సంజీవని ద్వారా ప్రయోజనం చేకూర్చడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో వుంది. దేశంలో జూన్ 7వ తేదీ నాటికి 59.28 లక్షల మందికిపైగా ఇ–సంజీవని ద్వారా సేవలు పొందగా అందులో 11.84 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. ఇ–సంజీవని ఇలా రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో 13 టెలీమెడిసిన్ హబ్స్ ఏర్పాటు కాగా ప్రతి హబ్‌లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్‌తో పాటు ఇద్దరు ఎంబీబీఎస్ అర్హత ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. హబ్‌ను పీహెచ్సీలో మానిటర్‌కు అనుసంధానిస్తారు. దీంతో రోగిని నేరుగా హబ్‌నుంచి చూసే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులను మెడికల్ ఆఫీసర్లు పరీక్షించి వారి పరిధిలో లేనివి, అంతుచిక్కని జబ్బుల బాధితులను అక్కడ నుంచే టెలీహబ్‌కు కనెక్ట్ చేస్తారు. ఇ–సంజీవని హబ్‌లో స్పెషలిస్టు డాక్టర్లు పేషెంటును పరిశీలించి మందులు సూచించడం లేదా పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తారు. మొత్తం 13 హబ్‌లలో 39 మంది స్పెషలిస్టు వైద్యులు, 26మంది మెడికల్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. గ్రామీణులకు మెరుగైన సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్పెషలిస్ట్ సేవలతో మేలు జరుగుతోంది. గ్రామాల్లో వైఎస్సార్ హెల్త్‌క్లినిక్స్‌లో ఉన్న మిడ్‌లెవెల్ హెల్త్‌ప్రొవైడర్లు ప్రత్యేక యాప్‌ద్వారా పీహెచ్‌సీకి కనెక్ట్ చేస్తారు. ఎంబీబీఎస్ డాక్టరు పరీక్షించిన అనంతరం తన పరిధిలో లేని జబ్బుల బాధితులను బోధనాసుపత్రిలోని టెలీహబ్‌కు కనెక్ట్ చేసి చూపిస్తారు. దీనివల్ల పేదలు పట్టణాలకు రావాల్సిన అవసరం లేకుండానే స్పెషలిస్టు సేవలు పొందగలుగుతున్నారు. సగటున రోజుకు రాష్ట్రంలో ఇలా 15 వేల మందికిపైగా సేవలు పొందుతున్నట్టు అంచనా. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో ఇ–సంజీవని మెరుగ్గా అమలు జరుగుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా లబ్ధిదారుల్లో 19.71 శాతం మంది ఏపీలోనే ఉండటం గమనార్హం. స్పెషలిస్టు సేవలు గ్రామాల్లోకే గతంలో స్పెషలిస్టు డాక్టరు సేవలు పొందాలంటే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు టెలీహబ్ ద్వారా ఆ భారం తప్పింది. దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దితే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం. –అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి -
ఉన్న ఊళ్లోనే అత్యాధునిక వైద్యం
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని ప్రజలు వైద్య చికిత్సలకు ఊరు దాటి వెళ్లకుండా, ఉన్న ఊరిలోనే చికిత్స అందించేందుకు చేపట్టిన వైఎస్సార్ గ్రామీణ హెల్త్ క్లినిక్‌ల కొత్త భవనాల నిర్మాణం ఊపందుకుంది. దీంతో గ్రామాల్లోని వైద్య రంగంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రాధాన్యత ఇస్తే, సీఎం జగన్ సామాజిక బాధ్యతగా ప్రభుత్వ రంగంలోనే మరింత బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారు. చిన్న చిన్న జబ్బులకు గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను మార్చేసి, జ్వరంతో పాటు ఇతర చిన్న అస్వస్థలకు గ్రామాల్లోనే చికిత్స అందించాలనే తపనతో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రూ.1,443.09 కోట్ల అంచనాతో 8,585 వైఎస్సార్ గ్రామీణ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. మరో 1,426 క్లినిక్స్ ఇప్పటికే ఉన్నాయి. (మొత్తంగా 10,011) వైఎస్సార్ క్లినిక్‌ల నిర్మాణాల పురోగతిపై స్పందన సమీక్షల్లో సీఎం ఆరా తీస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నిర్వహించిన స్పందన సమీక్ష నాటికి గ్రామీణ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల కొత్త భవనాల నిర్మాణాలన్నీ ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తేలింది. జూన్ ఆఖరుకు భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. అనంతరం పూర్తి స్థాయిలో వైద్య చికిత్స పరికరాలు ఏర్పాటు చేస్తారు. సీఎం సూచనల మేరకు నిర్మాణాల నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా జాయింట్ కలెక్టర్లు దృష్టి సారించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం ► గ్రామీణ హెల్త్ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పీహెచ్సీ) అనుసంధానం చేయడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను కూడా త్వరలో అమల్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ప్రయోగాత్మకంగా కొనసాగుతోంది. ► ఇందులో భాగంగా ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,145 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి మండలానికి రెండు చొప్పున లేని చోట్ల కొత్తగా ఏర్పాటు చేస్తారు. (560 అర్బన్ హెల్త్ క్లినిక్‌లు వీటికి అదనం) ► ఒక్కో పీహెచ్సీలో ఇద్దరు వైద్యుల చొప్పన నలుగురు వైద్యులు ఉంటారు. 24 గంటల పాటు వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ప్రతి పీహెచ్సీలో డాక్టర్‌తో కూడిన అంబులెన్స్ (104) అందుబాటులో ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో మండలంలో ఆరుగురు వైద్యులు అందుబాటులో ఉంటారు. (108 అంబులెన్స్ ప్రతి మండలంలో ఒకటి అందుబాటులో ఉంటుంది.) ► ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్టలో భాగంగా ఒక్కో వైద్యుడు తన పరిధిలోని గ్రామాలను నెలలో ఏడెనిమిది సార్లు విజిట్ చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. తద్వారా ఉన్న ఊరిలోనే ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ► ఇదే సమయంలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తారు. ఎప్పటికప్పుడు వారు పొందుతున్న వైద్యం వివరాలను ఇందులో అప్డేట్ చేస్తారు. భవిష్యత్‌లో ఎవరికైనా ఏదైనా జబ్బు చేస్తే సత్వరమే ఉత్తమ వైద్యం అందించడానికి హెల్త్ ప్రొఫైల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. హెల్త్ క్లినిక్‌లతో ఇవీ ఉపయోగాలు ► ప్రతి 2,500 మంది జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉంటుంది. చిన్న చిన్న జబ్బులకు పీహెచ్సీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ► ప్రతి క్లినిక్‌లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌ను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంటుంది. ఆశా వర్కర్లు కూడా ఉంటారు. ► కనిష్టంగా 90 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. 12 రకాల వైద్య సేవలందించనున్నారు. గర్భిణులు, చిన్నారుల సంరక్షణ, నవజాత శిశువులకు, ఏడాదిలోపు వయసున్న శిశువులకు ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకుంటారు. ► అన్ని రకాల వ్యాక్సిన్లు ఉంటాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకునే అవకాశం ఉంటుంది. అసాంక్రమిక వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు వివరిస్తారు. ► తరచూ వచ్చే చిన్న చిన్న సమస్యలు, ఈఎన్టీ సమస్యలపై అవగాహన కల్పిస్తారు. వయసు పైబడినప్పుడు వచ్చే సమస్యల నివారణతో పాటు అత్యవసర మెడికల్ సర్వీసెస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తారు. మానసిక వ్యాధులను ముందే గుర్తించి నియంత్రించే చర్యలను చేపడతారు. -
‘ఆస్పత్రుల నిర్వహణ తేలిగ్గా తీసుకోవద్దు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ది కార్యక్రమాలు, కొత్త వాటి నిర్మాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ... వైద్యం, విద్యా రంగాల్లో నాడు- నేడు కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. నాడు - నేడు పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణలోకాని, ఇతరత్రా ఏ విషయంలోనైనా సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుందామని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, కొత్తగా నిర్మాణం అవుతున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, శుభ్రత విషయంలో పాటిస్తున్న ప్రమాణాలన్నీ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండాలని పేర్కొన్నారు. ఆ తరహా నాణ్యమైన సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందేలా కచ్చితంగా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఎస్ఓపీలను తయారుచేసి, వాటిని అమలు చేయాలన్నారు. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే లక్ష్యం మనం ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీకూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదవాడికి లభ్యం కావాలన్నారు. బెడ్షీట్ల దగ్గరనుంచి, శానిటేషన్ సహా అన్ని అంశాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు.పేషెంట్‌కు ఇచ్చిన గది, పడక దీంతోపాటు ఆస్పత్రి వాతావరణం, అలాగే రోగులకు అందిస్తున్న భోజనం ఈ మూడు అంశాల్లో మార్పులు కచ్చితంగా కనిపించాలని తెలిపారు. ఎక్కడా కూడా అపరిశుభ్రత అన్నది కనిపించకూడదన్నారు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలపై ఎస్ఓపీలను తయారుచేయాలని తెలిపారు.ఆస్పత్రిలో పరికరాలు పనిచేయట్లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని అధికారులను ఆదేశించారు. కొత్త ఆస్పత్రుల నిర్మాణం ఎంత ముఖ్యమో, నిర్వహణ అన్నది కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఇన్నివేల కోట్ల ఖర్చుచేసి ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త ఆస్రపత్రుల నిర్మాణాలు చేసిన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరు అన్నమాట రాకూడదని సీఎం జగన్ అన్నారు. ఎంతమంది వైద్యులు అవసరమో.. అందర్నీ తీసుకోండి భవనాలు, వైద్య పరికరాలు, అలాగే పేషెంట్ గది, పడక, అందిస్తున్న ఆహారం, ఆస్పత్రిలో వాతావరణం వీటిలో ఉత్తమ యాజమాన్య విధానాలు తయారుకావాలని సీఎం జగన్ అన్నారు. దీనికోసం ఏవి అవసరమో అన్నీ చేయాలని, ప్రతి ఆస్పత్రినీ కూడా నిర్వహించే యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణలో అనుభవమున్న నిపుణులను ఇందులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు రెండింటినీ వేరుగా చూడాలన్నారు. విలేజ్ క్లినిక్‌ల దగ్గరనుంచి బోధనాసుపత్రుల వరకూ ఈ విధానం అమలు కావాలన్నారు. దీనికి ఎస్ఓపీలను తయారు చేయాలని తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణను తేలిగ్గా తీసుకోవద్దు ఇదే మాదిరిగా స్కూళ్లలో కూడా నిర్వహణపై గట్టి చర్యలు తీసుకోవాలని, స్కూళ్ల నిర్వహణ ఎలా ఉండాలన్నదానిపై ఎస్ఓపీలను తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ మొత్తం వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లు 10,011, వాటిలో 1,426 పాతవాటి పునరుద్ధరణ చేపట్టాలని, వాటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం జగన్ ఆధికారులను ఆదేశించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సెప్టెంబరు నాటికి వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పనులు, బోధనాసుపత్రుల నిర్మాణంలో రూపొందించిన తరహాలోనే, హెల్త్ క్లినిక్‌ల కార్యకలాపాలకు సంబంధించి కూడా ఎస్ఓపీలను తయారుచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వాటికి సిబ్బంది సరిపడా ఉన్నారా? లేదా? చూడాలని లేని పక్షంలో వాటి భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్త పీహెచ్‌సీల నిర్మాణానికి స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు వెల్లడించారు. అక్టోబరు నాటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తవాటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అర్బన్ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో అభివృద్ది కార్యక్రమాలు, కొత్తవాటి నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తిచేసేదిశగా కార్యాచరణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు - నేడు పనులు డిసెంబర్ నాటికి పూర్తిచేసేలా ముందకెళ్తున్నామని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. మెడికల్ కళాశాలలు- మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం సహా కొత్త మెడికల్ కాలేజీలు, గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు, తదితర పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మార్చి నెలాఖరు కల్లా వైద్యకళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మే 15 కల్లా కొత్తగా నిర్మించనున్న అన్ని మెడికల్ కాలేజీలకు టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ఉన్న మెడికల్ కాలేజీల్లో కూడా అభివృద్ది పనులకు ఏప్రిల్ నెలాఖరుకల్లా టెండర్లు ఖరారవుతున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, పాజిటివ్ కేసులకు సంబంధించి అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరాలు అందించారు. 69 ఆస్పత్రుల్లో 9,625 బెడ్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని సీఎంకు తెలిపారు. ప్రస్తుతం వైరస్ విస్తరణ మునుపటి ఉద్ధృతితో లేకపోయినా అప్రమత్తంగానే ఉన్నామని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ- ఎంఎస్ఐడీసీ) వీసీ అండ్ ఎండీ వి విజయరామరాజు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ మల్లిఖార్జున, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆరోగ్య పథకాల 'అమలులో ఏపీ టాప్'
సాక్షి, అమరావతి: జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఆరోగ్య పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోభివృద్ధి సాధించింది. ఏడాదిన్నర కాలంలో కొన్ని పథకాల అమలులో మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిశీలనలో వెల్లడైంది. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చాలా పథకాల్లో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడేవి. ఈ పరిస్థితుల్లో గుజరాత్‌ను రెండో స్థానానికి నెట్టి ఏపీ మొదటి స్థానానికి వచ్చిందని ఎన్హెచ్ఎం అధికార వర్గాలు తెలిపాయి. మిగతా కొన్ని పథకాల అమలులోనూ త్వరలోనే ముందంజ వేసే అవకాశం ఉందని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఎన్సీడీలో మొదటి స్థానం ► నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) అంటే అసాంక్రమిక వ్యాధుల నియంత్రణకు జాతీయ ఆరోగ్యమిషన్ ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఇందులో మన రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వాటిని గుర్తించేందుకు ఐదు కోట్ల జనాభాకు సంబంధించి ఇంటింటి సర్వే చేయించారు. ► 104 వాహనాల ద్వారా ప్రతి ఊరికీ వెళ్లి మందులు ఉచితంగా ఇచ్చేందుకు చర్యలు మరింత మెరుగైనట్టు ఎన్హెచ్ఎం పరిశీలనలో వెల్లడైంది. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల (వీటినే ఇప్పుడు వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ అంటున్నాం) నిర్వహణలోనూ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ► రాష్ట్రంలో 10 వేలకు పైగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఉండగా, వీటిలో 8,604 సెంటర్లకు కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే సగం కేంద్రాలకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్‌గా బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని నియమించారు. ► ఇందులో ప్రధానంగా 12 రకాల సేవలను అందించడంలో గణనీయమైన వృద్ధి సాధించారు. దీనివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు పైస్థాయి ఆస్పత్రులకు వెళ్లాల్సిన భారం తప్పింది. ► ఆర్సీహెచ్ (రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్) అంటే గర్భిణుల ఆరోగ్యం, ప్రసవం అయ్యాక చిన్నారులకు సంరక్షణ వంటి వాటిని ఎప్పటికప్పుడు కేంద్ర పరిధిలో పనిచేసే పోర్టల్‌కు అనుసంధానించే ప్రక్రియలో ఎక్కడో ఉన్న ఏపీ ఇప్పుడు మొదటి స్థానానికి వచ్చింది. ► మాతా శిశు మరణాల నియంత్రణ, కుటుంబ నియంత్రణల్లో కేరళ, తమిళనాడులు ముందంజలో ఉన్నాయి. -
చురుగ్గా 8,585 గ్రామ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం
సాక్షి, అమరావతి: గ్రామీణ వైద్యరంగంలో విప్లవాత్మకమార్పులు తెచ్చే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన మొత్తం 8,585 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం మార్చినాటికి పూర్తికానుంది. దేశంలో ఏ రాష్ట్రంలోను లేని విధంగా వైద్య ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఉన్న ఊళ్లోనే వైద్యసదుపాయాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్‌పరం చేయడానికి ప్రాధాన్యత ఇస్తే జగన్మోహన్రెడ్డి మాత్రం ప్రభుత్వపరంగానే వైద్య ఆరోగ్య రంగాన్నిబలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం చిన్నచిన్న జబ్బులు వస్తే గ్రామాల్లోని ప్రజలు మండల కేంద్రాలకు, సమీప పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితులున్నాయి. ఈ పరిస్థితులను మార్చేసి గ్రామాల్లోనే జ్వరంతో పాటు ఇతర చిన్న అనారోగ్యాలకు చికిత్స అందించాలని ముఖ్యమంత్రి.. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని, వైద్య పరికరాలను సమకూర్చాలని నిర్ణయించారు. రూ.1,745 కోట్లతో రాష్ట్రంలో మొత్తం 10,030 గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 8,585 గ్రామ వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లున్నాయి. ప్రతి స్పందన కార్యక్రమంలోను వీటి నిర్మాణ పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. ఈనెల 18న సీఎం నిర్వహించిన స్పందన కార్యక్రమం నాటికి 2,969 గ్రామాల్లో బేస్మెంట్ స్థాయి పైవరకు పనులు జరిగాయి. వచ్చే మార్చి నెలాఖరుకు నిర్మాణాలు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాణ్యత లోపాలు లేకుండా, సకాలంలో నిర్మాణాలు పూర్తిచేయడంపై జాయింట్ కలెక్టర్లు మరింత శ్రద్ధతీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. వైఎస్సార్ క్లినిక్‌లు అందుబాటులోకి వస్తే.. ► ప్రతి 2,500 మంది జనాభాకు ఒక వైఎస్సార్ విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉంటుంది. ► చిన్నచిన్న జబ్బులకు కూడా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన ఇబ్బందులు ఉండవు. ► ప్రతి క్లినిక్‌లోనూ బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌ను నియమిస్తారు. ► ప్రస్తుతం ఉన్న ఏఎన్‌ఎంతోపాటు హెల్త్ అసిస్టెంట్, ఆశా వర్కర్లు క్లినిక్‌లో ఉంటారు. ► కనీసం 90 రకాల మందులు అందుబాటులో ఉంచుతారు. ► అన్నిరకాల వ్యాక్సిన్లు ఇక్కడే ఉంటాయి. ► గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకునే అవకాశం ఉంటుంది. -
ఏడాదిలోగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు
సాక్షి, అమరావతి: గ్రామీణ వైద్యం రూపురేఖలు మార్చేసి, ప్రజలకు ఇంటి ముంగిటకే వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఏడాదిలోగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,458 ఆరోగ్య ఉప కేంద్రాలుండగా వీటిలో 80 శాతం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని చిన్న చిన్న గుడిసెల్లో నడుస్తుండగా మరికొన్ని కూలిపోయే దశలో ఉన్న భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, అన్ని కేంద్రాలూ పూర్తి సదుపాయాలతో కూడిన ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ నూతన భవనాల నిర్మాణం చేపట్టింది. ప్రతి 2,500 మందికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది వేలకు పైగా వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా 8,890 కేంద్రాలు కొత్తగా నిర్మిస్తున్నారు. 8,724 కేంద్రాల్లో పనులు ఇప్పటికే మొదలయ్యాయి. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు అందుబాటులోకి వస్తే... ► ప్రతి 2,500 మందికి ఒక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉంటుంది ► చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకూ దూరంగా ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ► ప్రతి క్లినిక్‌లోనూ బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌ను నియమిస్తారు. ► ప్రస్తుతం ఉన్న ఏఎన్ఎం కూడా అందుబాటులో ఉంటుంది. ► కనీసం 90 రకాల మందులు అందుబాటులో ఉంటాయి. ► అన్నిరకాల టీకాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయి. ► గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకోవచ్చు. ► తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,100 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు నిర్మిస్తున్నారు. ► ఒక్కో విలేజ్ క్లినిక్‌కు రూ.18 లక్షలు వ్యయం అవుతుందని అంచనా. ► ఇందులో రూ.9 లక్షలు వైద్య ఆరోగ్యశాఖ, మరో రూ.9 లక్షలు పంచాయతీ రాజ్ (నరేగా) నుంచి ఖర్చు చేస్తారు. -
ప్రజారోగ్యానికి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య రంగం పూర్తిస్థాయిలో బలోపేతం కానుంది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు (సబ్ సెంటర్లు), మెడికల్ కాలేజీలు, నాడు –నేడు కార్యక్రమాలు తదితరాల కోసం ప్రజారోగ్యంపై రూ.16,202 కోట్లకుపైగా ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు లక్ష్యాలను నిర్దేశించారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి జూన్ 15లోగా స్థలాల గుర్తింపు పూర్తి కావాలని ఆదేశించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 10 వేల వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు (సబ్ సెంటర్లు) ► ప్రతి గ్రామ సచివాలయంలో వైఎస్సార్ హెల్త్ విలేజ్ క్లినిక్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కరోనా లాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో 24 గంటల పాటు సేవలందించే వైద్య సదుపాయాలు ఉండాలి. దాదాపు 10 వేల వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,026 కోట్లు ఖర్చు చేయనుంది. ఇవి కాకుండా ఇప్పటికే 1086 సబ్ సెంటర్లలో నాడు–నేడు ద్వారా సదుపాయాలను కల్పిస్తుంది. ► సబ్ సెంటర్ల నిర్మాణానికి ఇప్పటివరకు 4 వేల స్థలాలను గుర్తించగా మరో 6 వేల కేంద్రాలకు స్థలాలను గుర్తించాల్సి ఉంది. జూన్ 15 లోగా స్థలాల గుర్తింపు పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా సబ్ సెంటర్ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. పీహెచ్‌సీల కోసం రూ.670 కోట్లు.. రాష్ట్రవ్యాప్తంగా 1,138 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ( పీహెచ్‌సీలు ) ఉండగా 149 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కోసం రూ.256.99 కోట్లు ఖర్చు చేయనున్నారు.మరో 989 పీహెచ్‌సీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.413.01 కోట్లు వెచ్చించనున్నారు.మొత్తంగా రూ. 671 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల అభివృద్ధి... ► 52 ఏరియా ఆస్పత్రుల్లో నాడు– నేడు కింద రూ.695 కోట్లు ఖర్చు చేయనున్నారు. 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రూ.541 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం రూ.1,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజీలు... ► రాష్ట్రంలో ప్రస్తుతం 11 మెడికల్ కాలేజీలు ఉండగా వైద్య కళాశాలలకు అనుబంధంగా 6, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కొత్తగా రానున్నాయి. వీటన్నిటి కోసం రూ.6,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇవి కాకుండా 15 కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, కడపలో 3 వైద్య సంస్థలు, సూపర్ స్పెషాల్టీ, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం మొత్తం రూ.6,170 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ► మొత్తం ప్రజారోగ్య రంగంలో నాడు–నేడు, కొత్తవాటి నిర్మాణాల కోసం రూ.16,202 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మెడికల్ కాలేజీల నమూనాల పరిశీలన ► ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఉండాలని సీఎం జగన్ సూచించారు. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీల నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నాడు –నేడు కార్యక్రమాల నాణ్యతలో రాజీ పడొద్దని, నిర్మాణాలు పటిష్టంగా, నాణ్యంగా ఉండాలని ఆదేశించారు. ► సమీక్షలో డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణ
♦ అందుకు ఫెసిలిటేషన్ కౌన్సిల్, ‘హెల్త్ క్లినిక్’: కేటీఆర్ ♦ పరిశోధనలు, ఆవిష్కరణల కోసం ‘రిచ్’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘ఇందుకు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ పేరుతో రూ.100 కోట్లతో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తాం. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణకు కేంద్ర మంత్రితో చర్చించాం. సిరూపర్ పేపర్, ఏపీ రెయాన్స్ వంటి సంస్థల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు. ఆయా శాఖల పద్దులపై విపక్షాల ప్రశ్నలకు గురువారం సభలో ఆయన సమాధానమిచ్చారు. మైనారిటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిం చేందుకు త్వరలో టీఎస్–ప్రైమ్ విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు. ‘‘రాష్ట్రంలో 30 కేంద్ర ప్రభుత్వ రంగ పరిశోధన సంస్థల దాకా ఉన్నా అవి విద్యాపరమైన సంస్థలుగానే మిగిలి పోయాయి. ఈ నేపథ్యంలో పరిశోధనలు, ఆవిష్కరణలు, కొత్త పారిశ్రామికీకరణ, సంపద సృష్టి, ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం రిచ్ అనే కొత్త విధానం తేనుంది’’ అని ప్రకటించారు. పెట్టుబడులు రాబట్టడంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. జిల్లాల వారీగా వనరులను గుర్తించి, అందుకు తగ్గట్లు పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘వెనకబడిన జిల్లాల్లో పరిశ్రమలు పెట్టే సంస్థలకు ప్రత్యేక రాయితీ ఇస్తాం. హైదరాబాద్‌లో ఉన్న 1,140 పై చిలుకు కాలుష్యకారక పరిశ్రమలను కాలుష్యరహిత ఏర్పాట్లతో దశలవారీగా శివార్లకు తరలిస్తాం. వాటి కార్మికులకు నివాస సదుపాయం కల్పిస్తాం. గతంలో పరిశ్రమలకు విచ్చలవిడిగా భూ కేటాయింపులు చేశారు. మేం అవసరాల మేరకే కేటాయిస్తున్నాం. పరిశ్రమలు ఏర్పాటు చేయనందుకు 790 ఎకరాలను వెనక్కు తీసుకున్నాం. రామగుండంలో ఆటో పార్కును శనివారం 25న సీఎం ప్రారంభిస్తారు. మిర్యాలగూడలో మరో పార్కు వస్తుంది. బెజ్జంకిలో గ్రైనైడ్ క్లస్టర్ రానుంది. చేనేత పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. రూ.1,200 కోట్ల కేటాయింపుల్లో రూ.400 కోట్లు చేనేత కోసమే ప్రత్యేకించాం. బతుకమ్మ, దసరా పండుగలకు పేదలకు చేనేత వస్త్రాల పంపిణీకి రూ.160 కోట్లు కేటాయించాం. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కును ఏప్రిల్‌లో సీఎం ప్రారంభిస్తారు. వచ్చే సమావేశాల నాటికి అసెంబ్లీలో సభ్యుల డెస్కుల ముందు సభా వ్యవహారాలు తిలకించేలా స్క్రీన్లు ఏర్పాటు చేస్తాం’’ అని కేటీఆర్ చెప్పారు.