సాక్షి, అమరావతి: గ్రామీణ వైద్యం రూపురేఖలు మార్చేసి, ప్రజలకు ఇంటి ముంగిటకే వైద్యం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను ఏడాదిలోగా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,458 ఆరోగ్య ఉప కేంద్రాలుండగా వీటిలో 80 శాతం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని చిన్న చిన్న గుడిసెల్లో నడుస్తుండగా మరికొన్ని కూలిపోయే దశలో ఉన్న భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, అన్ని కేంద్రాలూ పూర్తి సదుపాయాలతో కూడిన ప్రభుత్వ భవనాల్లోనే ఉండాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ నూతన భవనాల నిర్మాణం చేపట్టింది. ప్రతి 2,500 మందికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది వేలకు పైగా వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా 8,890 కేంద్రాలు కొత్తగా నిర్మిస్తున్నారు. 8,724 కేంద్రాల్లో పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు అందుబాటులోకి వస్తే...
► ప్రతి 2,500 మందికి ఒక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉంటుంది
► చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకూ దూరంగా ఉండే పీహెచ్‌సీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
► ప్రతి క్లినిక్‌లోనూ బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్‌ను నియమిస్తారు.
► ప్రస్తుతం ఉన్న ఏఎన్‌ఎం కూడా అందుబాటులో ఉంటుంది.
► కనీసం 90 రకాల మందులు అందుబాటులో ఉంటాయి.
► అన్నిరకాల టీకాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయి.
► గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఇక్కడే టీకాలు వేయించుకోవచ్చు.
► తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,100 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు నిర్మిస్తున్నారు.
► ఒక్కో విలేజ్ క్లినిక్‌కు రూ.18 లక్షలు వ్యయం అవుతుందని అంచనా.
► ఇందులో రూ.9 లక్షలు వైద్య ఆరోగ్యశాఖ, మరో రూ.9 లక్షలు పంచాయతీ రాజ్ (నరేగా) నుంచి ఖర్చు చేస్తారు.
ఏడాదిలోగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు
Published Thu, Sep 10 2020 3:02 AM | Last Updated on Thu, Sep 10 2020 5:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment