సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ప్రజారోగ్య రంగంలో నాడు-నేడు కార్యక్రమం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ది కార్యక్రమాలు, కొత్త వాటి నిర్మాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ... వైద్యం, విద్యా రంగాల్లో నాడు- నేడు కార్యక్రమాలను ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. నాడు - నేడు పనులకు సంబంధించి నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణలోకాని, ఇతరత్రా ఏ విషయంలోనైనా సమస్యలు వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.
అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుందామని తెలిపారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులు, కొత్తగా నిర్మాణం అవుతున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, నిర్వహణ, శుభ్రత విషయంలో పాటిస్తున్న ప్రమాణాలన్నీ కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండాలని పేర్కొన్నారు. ఆ తరహా నాణ్యమైన సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందేలా కచ్చితంగా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. దీనికోసం ఎస్‌ఓపీలను తయారుచేసి, వాటిని అమలు చేయాలన్నారు.
ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే లక్ష్యం
మనం ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీకూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదవాడికి లభ్యం కావాలన్నారు. బెడ్‌షీట్ల దగ్గరనుంచి, శానిటేషన్ సహా అన్ని అంశాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు.పేషెంట్‌కు ఇచ్చిన గది, పడక దీంతోపాటు ఆస్పత్రి వాతావరణం, అలాగే రోగులకు అందిస్తున్న భోజనం ఈ మూడు అంశాల్లో మార్పులు కచ్చితంగా కనిపించాలని తెలిపారు. ఎక్కడా కూడా అపరిశుభ్రత అన్నది కనిపించకూడదన్నారు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలపై ఎస్‌ఓపీలను తయారుచేయాలని తెలిపారు.ఆస్పత్రిలో పరికరాలు పనిచేయట్లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని అధికారులను ఆదేశించారు. కొత్త ఆస్పత్రుల నిర్మాణం ఎంత ముఖ్యమో, నిర్వహణ అన్నది కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఇన్నివేల కోట్ల ఖర్చుచేసి ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త ఆస్రపత్రుల నిర్మాణాలు చేసిన తర్వాత వైద్యులు లేరు, సిబ్బంది లేరు అన్నమాట రాకూడదని సీఎం జగన్ అన్నారు.
ఎంతమంది వైద్యులు అవసరమో.. అందర్నీ తీసుకోండి
భవనాలు, వైద్య పరికరాలు, అలాగే పేషెంట్ గది, పడక, అందిస్తున్న ఆహారం, ఆస్పత్రిలో వాతావరణం వీటిలో ఉత్తమ యాజమాన్య విధానాలు తయారుకావాలని సీఎం జగన్ అన్నారు. దీనికోసం ఏవి అవసరమో అన్నీ చేయాలని, ప్రతి ఆస్పత్రినీ కూడా నిర్వహించే యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలని తెలిపారు. ఆస్పత్రుల నిర్వహణలో అనుభవమున్న నిపుణులను ఇందులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రిలో పరిపాలన, క్లినికల్ వ్యవహారాలు రెండింటినీ వేరుగా చూడాలన్నారు. విలేజ్ క్లినిక్‌ల దగ్గరనుంచి బోధనాసుపత్రుల వరకూ ఈ విధానం అమలు కావాలన్నారు. దీనికి ఎస్‌ఓపీలను తయారు చేయాలని తెలిపారు.
ఆస్పత్రుల నిర్వహణను తేలిగ్గా తీసుకోవద్దు
ఇదే మాదిరిగా స్కూళ్లలో కూడా నిర్వహణపై గట్టి చర్యలు తీసుకోవాలని, స్కూళ్ల నిర్వహణ ఎలా ఉండాలన్నదానిపై ఎస్‌ఓపీలను తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్
మొత్తం వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌లు 10,011, వాటిలో 1,426 పాతవాటి పునరుద్ధరణ చేపట్టాలని, వాటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం జగన్ ఆధికారులను ఆదేశించారు. పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సెప్టెంబరు నాటికి వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. నాడు-నేడు పనులు, బోధనాసుపత్రుల నిర్మాణంలో రూపొందించిన తరహాలోనే, హెల్త్ క్లినిక్‌ల కార్యకలాపాలకు సంబంధించి కూడా ఎస్‌ఓపీలను తయారుచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వాటికి సిబ్బంది సరిపడా ఉన్నారా? లేదా? చూడాలని లేని పక్షంలో వాటి భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కొత్త పీహెచ్‌సీల నిర్మాణానికి స్థలాల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు వెల్లడించారు. అక్టోబరు నాటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, కొత్తవాటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అర్బన్ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో అభివృద్ది కార్యక్రమాలు, కొత్తవాటి నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తిచేసేదిశగా కార్యాచరణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో నాడు - నేడు పనులు డిసెంబర్ నాటికి పూర్తిచేసేలా ముందకెళ్తున్నామని అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు.
మెడికల్ కళాశాలలు- మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం
పాడేరు, పులివెందుల, పిడుగురాళ్ల, మచిలీపట్నం సహా కొత్త మెడికల్ కాలేజీలు, గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు, తదితర పనులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మార్చి నెలాఖరు కల్లా వైద్యకళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మే 15 కల్లా కొత్తగా నిర్మించనున్న అన్ని మెడికల్ కాలేజీలకు టెండర్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ఉన్న మెడికల్ కాలేజీల్లో కూడా అభివృద్ది పనులకు ఏప్రిల్ నెలాఖరుకల్లా టెండర్లు ఖరారవుతున్నాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రస్తుత పరిస్థితి, పాజిటివ్ కేసులకు సంబంధించి అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరాలు అందించారు. 69 ఆస్పత్రుల్లో 9,625 బెడ్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని సీఎంకు తెలిపారు. ప్రస్తుతం వైరస్ విస్తరణ మునుపటి ఉద్ధృతితో లేకపోయినా అప్రమత్తంగానే ఉన్నామని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీ- ఎంఎస్‌ఐడీసీ) వీసీ అండ్ ఎండీ వి విజయరామరాజు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ ఎ మల్లిఖార్జున, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment