సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇ–సంజీవని కార్యక్రమం వరంలా ఉపయోగపడుతోంది. గ్రామీణ ప్రాంతాలకు స్పెషలిస్టు సేవలు అందుబాటులోకి తెస్తూ ఇ–సంజీవని ద్వారా ప్రయోజనం చేకూర్చడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో వుంది. దేశంలో జూన్ 7వ తేదీ నాటికి 59.28 లక్షల మందికిపైగా ఇ–సంజీవని ద్వారా సేవలు పొందగా అందులో 11.84 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు.
ఇ–సంజీవని ఇలా
రాష్ట్రవ్యాప్తంగా బోధనాసుపత్రుల్లో 13 టెలీమెడిసిన్ హబ్స్ ఏర్పాటు కాగా ప్రతి హబ్‌లో జనరల్ మెడిసిన్, పీడియాట్రిషియన్, గైనకాలజిస్ట్‌తో పాటు ఇద్దరు ఎంబీబీఎస్ అర్హత ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. హబ్‌ను పీహెచ్‌సీలో మానిటర్‌కు అనుసంధానిస్తారు. దీంతో రోగిని నేరుగా హబ్‌నుంచి చూసే అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులను మెడికల్ ఆఫీసర్లు పరీక్షించి వారి పరిధిలో లేనివి, అంతుచిక్కని జబ్బుల బాధితులను అక్కడ నుంచే టెలీహబ్‌కు కనెక్ట్ చేస్తారు. ఇ–సంజీవని హబ్‌లో స్పెషలిస్టు డాక్టర్లు పేషెంటును పరిశీలించి మందులు సూచించడం లేదా పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తారు. మొత్తం 13 హబ్‌లలో 39 మంది స్పెషలిస్టు వైద్యులు, 26మంది మెడికల్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు.
గ్రామీణులకు మెరుగైన సేవలు
గ్రామీణ ప్రాంత ప్రజలకు స్పెషలిస్ట్ సేవలతో మేలు జరుగుతోంది. గ్రామాల్లో వైఎస్సార్ హెల్త్‌క్లినిక్స్‌లో ఉన్న మిడ్‌లెవెల్ హెల్త్‌ప్రొవైడర్లు ప్రత్యేక యాప్‌ద్వారా పీహెచ్‌సీకి కనెక్ట్ చేస్తారు. ఎంబీబీఎస్ డాక్టరు పరీక్షించిన అనంతరం తన పరిధిలో లేని జబ్బుల బాధితులను బోధనాసుపత్రిలోని టెలీహబ్‌కు కనెక్ట్ చేసి చూపిస్తారు. దీనివల్ల పేదలు పట్టణాలకు రావాల్సిన అవసరం లేకుండానే స్పెషలిస్టు సేవలు పొందగలుగుతున్నారు. సగటున రోజుకు రాష్ట్రంలో ఇలా 15 వేల మందికిపైగా సేవలు పొందుతున్నట్టు అంచనా. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో ఇ–సంజీవని మెరుగ్గా అమలు జరుగుతున్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా లబ్ధిదారుల్లో 19.71 శాతం మంది ఏపీలోనే ఉండటం గమనార్హం.
స్పెషలిస్టు సేవలు గ్రామాల్లోకే
గతంలో స్పెషలిస్టు డాక్టరు సేవలు పొందాలంటే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు టెలీహబ్ ద్వారా ఆ భారం తప్పింది. దీన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దితే ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఆ దిశగా కసరత్తు చేస్తున్నాం.
–అనిల్‌కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment