ప్రజారోగ్యానికి ప్రాధాన్యం | CM YS Jagan High level review with Officials about Public Health | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యానికి ప్రాధాన్యం

Published Sat, May 16 2020 3:34 AM | Last Updated on Sat, May 16 2020 11:36 AM

CM YS Jagan High level review with Officials about Public Health - Sakshi

ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు ప్రజారోగ్యంపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని తదితరులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య రంగం పూర్తిస్థాయిలో బలోపేతం కానుంది. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు (సబ్‌ సెంటర్లు), మెడికల్‌ కాలేజీలు, నాడు –నేడు కార్యక్రమాలు తదితరాల కోసం ప్రజారోగ్యంపై రూ.16,202 కోట్లకుపైగా ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు లక్ష్యాలను నిర్దేశించారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణానికి జూన్‌ 15లోగా స్థలాల గుర్తింపు పూర్తి కావాలని ఆదేశించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..

10 వేల వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు (సబ్‌ సెంటర్లు)
► ప్రతి గ్రామ సచివాలయంలో వైఎస్సార్‌ హెల్త్‌ విలేజ్‌ క్లినిక్‌ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కరోనా లాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో 24 గంటల పాటు సేవలందించే వైద్య సదుపాయాలు ఉండాలి. దాదాపు 10 వేల వైఎస్సార్‌ హెల్త్‌  క్లినిక్స్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,026 కోట్లు ఖర్చు చేయనుంది. ఇవి కాకుండా ఇప్పటికే 1086 సబ్‌ సెంటర్లలో నాడు–నేడు ద్వారా సదుపాయాలను కల్పిస్తుంది. 
► సబ్‌ సెంటర్ల నిర్మాణానికి ఇప్పటివరకు 4 వేల స్థలాలను గుర్తించగా మరో 6 వేల కేంద్రాలకు స్థలాలను గుర్తించాల్సి ఉంది. జూన్‌ 15 లోగా స్థలాల గుర్తింపు పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా సబ్‌ సెంటర్ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. 

పీహెచ్‌సీల కోసం రూ.670 కోట్లు..
రాష్ట్రవ్యాప్తంగా 1,138 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ( పీహెచ్‌సీలు ) ఉండగా  149 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కోసం రూ.256.99 కోట్లు ఖర్చు చేయనున్నారు.మరో 989 పీహెచ్‌సీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.413.01 కోట్లు వెచ్చించనున్నారు.మొత్తంగా రూ. 671 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల అభివృద్ధి...
► 52 ఏరియా ఆస్పత్రుల్లో నాడు– నేడు కింద రూ.695 కోట్లు ఖర్చు చేయనున్నారు. 169 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు రూ.541 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం రూ.1,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 

కొత్త మెడికల్, నర్సింగ్‌ కాలేజీలు...
► రాష్ట్రంలో ప్రస్తుతం 11 మెడికల్‌ కాలేజీలు ఉండగా వైద్య కళాశాలలకు అనుబంధంగా 6, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు కొత్తగా రానున్నాయి. వీటన్నిటి కోసం రూ.6,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.
► ఇవి కాకుండా 15 కొత్త మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు, కడపలో 3 వైద్య సంస్థలు, సూపర్‌ స్పెషాల్టీ, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ కోసం మొత్తం రూ.6,170 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.
► మొత్తం ప్రజారోగ్య రంగంలో నాడు–నేడు, కొత్తవాటి నిర్మాణాల కోసం రూ.16,202 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 

మెడికల్‌ కాలేజీల నమూనాల పరిశీలన
► ప్రతి మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీ ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. కొత్తగా నిర్మించే మెడికల్‌ కాలేజీల నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నాడు –నేడు కార్యక్రమాల నాణ్యతలో రాజీ పడొద్దని, నిర్మాణాలు పటిష్టంగా, నాణ్యంగా ఉండాలని ఆదేశించారు.
► సమీక్షలో డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement