Public health sector
-
ప్రపంచ ఆరోగ్యమే లక్ష్యంగా...
ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాల వినియోగాన్ని భారతదేశం ప్రోత్సహిస్తోంది. కోవిడ్–19 సమయంలో అభివృద్ధి చేసి అమలు చేసిన కో–విన్, ఈ–సంజీవని వంటివి లక్ష్యాల సాధన కోసం ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే ఒకరితో సంబంధం లేకుండా మరొకరు పనిచేసినప్పుడు ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంవత్సరాల తరబడి వినియోగంలో ఉన్న వ్యవస్థ మరో ప్రాంతంలో మళ్లీ మొదటి నుంచి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో జరుగుతున్నది ఇదే. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠంగా అమలు జరగడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణిక వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. జీ–20 అధ్యక్ష హోదాలో ఏకాభిప్రాయం సాధించడానికి భారతదేశం పని చేస్తోంది. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకోండి. ఇంటర్నెట్ సౌకర్యం లేక ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విడివిడిగా పనిచేస్తున్న కంప్యూటర్ నెట్‌వర్క్‌ల పనితీరు ఎలా ఉంటుంది? ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కంప్యూటర్ నెట్వర్క్ పనిచేసినప్పుడు ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంవత్సరాల తరబడి వినియోగంలో ఉన్న వ్యవస్థ మరో ప్రాంతంలో నూతన వ్యవస్థగా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రామాణిక ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) అమలులో లేకపోతే పరిస్థితి అసంబద్ధంగా ఉండేది. ఇది ప్రస్తుతం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో నెలకొని ఉన్న పరిస్థితిని గుర్తు చేస్తోంది. వివిధ సాంకేతిక అంశాల ఆధారంగా, వివిధ ప్రాంతాల్లో వివిధ విధాలుగా డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ సాగుతోంది. సరైన విధంగా అమలు జరిగి ఆశించిన ఫలితాలు ఇవ్వడానికి ఆ వ్యవస్థ మార్గనిర్దేశకుల కోసం ఎదురు చూస్తోంది. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠంగా అమలు జరగడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణిక వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. వ్యవస్థను పటిష్ఠంగా అమలు చేయడానికి అంతర్జాతీయ నాయకత్వం అవసరం ఉంటుంది. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పరిమాణం చిన్నదిగా కనిపించవచ్చు. అయితే, ఈ రంగం అనేక రంగాల్లో అవకాశాలను అందిస్తుంది. స్మార్ట్ వేరియబుల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ కేర్, రీమోట్ మానిటరింగ్, కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్, బ్లాక్–చైన్, రీమోట్ డేటా లాంటి రంగాల్లో అపారమైన అవకాశాలు వస్తాయి. డిజిటల్ పరికరాల సామర్థ్యం, అవసరం కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన చర్యల ప్రాధాన్యాన్ని గుర్తించాల్సి ఉంటుంది. డిజిటల్ సాధనాల వినియోగం ఇటీవలి కాలంలో ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాల వినియోగాన్ని భారతదేశం ప్రోత్సహిస్తోంది. కోవిడ్–19 సమయంలో అభివృద్ధి చేసి అమలు చేసిన కో–విన్, ఈ–సంజీవని వంటివి లక్ష్యాల సాధన కోసం ఉపయోగపడ్డాయి. టీకా కార్యక్రమం, ఆరోగ్య సంరక్షణ చర్యల అమలులో సమూల మార్పులు వచ్చాయి. డిజిటల్ సాధనాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే అంశంలో ప్రభుత్వం విజయం సాధించింది. భారతదేశంలో అమలు జరిగిన అతిపెద్ద టీకా కార్యక్రమానికి కో–విన్ వెన్నెముకగా నిలిచింది. కో–విన్ ద్వారా వ్యాక్సిన్ రవాణా కార్యక్రమం అమలు జరిగిన తీరును ప్రభుత్వం పర్యవేక్షించింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ టీకా కోసం నమోదు చేసుకోవడం, డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేయడం లాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కో–విన్ సహకారంతో జరిగాయి. ఇక్కడ మరో డిజిటల్ సాధనం ఈ– సంజీవని గురించి ప్రస్తావించాలి. ఈ–సంజీవని ద్వారా ప్రజలు ఆన్లైన్ ద్వారా ఆరోగ్య సంప్రదింపులను పొందుతున్నారు. తమ ఇళ్ల నుంచే నిపుణులను సంప్రదించి సలహాలు పొందే అవకాశాన్ని ఈ–సంజీవని అందుబాటులోకి తెచ్చింది. 10 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ–సంజీవని ద్వారా ప్రయోజనం పొందారు. గరిష్ఠ స్థాయిలో ఈ–సంజీవని ద్వారా రోజుకు 5 లక్షల సంప్రదింపులు జరిగాయి. డిజిటల్ విధానంలో నిర్వహించిన కోవిడ్ వార్ రూమ్ వల్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలిగింది. దీని ద్వారా జాతీయ, రాష్ట్ర , జిల్లా స్థాయిలో వ్యాధి తీవ్రత తెలుసుకుని అవసరమైన సామగ్రి సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం కలిగింది. ఆరోగ్య సేతు, ఆర్టీ –పీసీఆర్ యాప్, ఇతర డిజిటల్ సాధనాలను విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించిన ప్రభుత్వం కోవిడ్–19 మహమ్మారి రూపంలో వచ్చిన భారీ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించగలిగింది. ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాలను పూర్తి సామర్థ్యం మేరకు ఉపయోగించుకోవడానికి పటిష్ఠమైన వ్యవస్థ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ– ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్) పని చేయడం ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు వారి వైద్య రికార్డులు నిల్వ చేయడానికి, అవసరమైన సమయంలో చూసి అవసరమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి నిపుణులకు పంపడానికి అవకాశం కలుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి సాధించిన విజయాలు, ప్రణాళికలను ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్య–ఆదాయ దేశాలు భారతదేశం అనుసరించిన విధానాలు అనుసరించి తమ దేశ ప్రజలకు డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావడానికి వీలవుతుంది. దీనివల్ల సార్వత్రిక ఆరోగ్య కల సాకారం అవుతుంది. ఎదుర్కొంటున్న సవాళ్లు కాపీరైట్, ఇతర నిర్వహణ యాజమాన్య వ్యవస్థల వల్ల డిజిటల్ పరిష్కార వేదికలు అందరికీ అందుబాటులోకి రావడం లేదు. కొన్ని డిజిటల్ సాధనాలు లేదా ఓపెన్ సోర్స్ పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి వినియోగం పరిమితంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం అని చెప్పుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రయత్నాలు విడివిడిగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా దేశాల మధ్య సహకారం లేకుండా సాగుతున్నాయి. దీనికోసం ప్రపంచ దేశాలు ఒక వేదిక పైకి వచ్చి సంఘటిత ప్రయత్నాలు సాగించాలి. దీనికి జీ–20 ఒక సమగ్ర, పటిష్ట వేదికగా పనిచేస్తుంది. ఈ ప్రయత్నాలు భవిష్యత్తు అవసరాలకు అవసరమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి దారి తీస్తాయి. జీ–20 అధ్యక్ష హోదాలో... ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. దీనికి అవసరమైన ప్రణాళిక కూడా భారతదేశం వద్ద సిద్ధంగా ఉంది. ముందుగా విడివిడిగా జరుగుతున్న ప్రయత్నాలను సంఘటితం చేయాల్సి ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ ప్రయోజనం కలిగించేలా ఈ చర్యలు అమలు జరగాలి. దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ అభివృద్ధి కోసం జరిగిన ప్రయత్నం, కృషి మరోసారి డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి కోసం జరగాల్సి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సమాచార మార్పిడిపై దేశాల మధ్య నమ్మకం పెరిగేలా చూసి, అవసరమైన నిధులు సమకూర్చ డానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరగాలి. జీ–20 అధ్యక్ష హోదాలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం సాధించడానికి భారతదేశం పని చేస్తోంది. ఆచరణ సాధ్యమైన వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలు ముఖ్యంగా దక్షిణ దేశాలు ప్రయోజనం పొందేలా చూసేందుకు భారతదేశం కృషి చేస్తోంది. స్వప్రయోజ నాలను పక్కన పెట్టి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ప్రపంచ ఆరోగ్యం కోసం కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమయింది. డాక్టర్ మన్సుఖ్ మండావియా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు – ఎరువుల శాఖ మంత్రి -
Dilip Mahalanabis: ‘అతిసార’ బాధితులకు జీవామృత ప్రదాత
దిలీప్ మహాలనోబిస్ పేరు చాలా తక్కువమంది వినుంటారు. కానీ అక్టోబర్ 16న మరణించిన ఈయన కొన్ని వేల ప్రాణాలు... మరీ ముఖ్యంగా పసిపిల్లల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషించాడని తెలిస్తే మాత్రం ప్రజారోగ్య రంగంలో ఓ గొప్ప వైద్యుడిని కోల్పోయామని అనిపించక మానదు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను జనాభా స్థాయిలో ఒక చికిత్సా పద్ధతిగా అందుబాటులోకి తీసుకురావడంలో మహాలనోబిస్ది చాలా ముఖ్యమైన పాత్ర. ఈ ఓఆర్ఎస్ పుణ్యమా అని అతిసార, కలరా వంటి వ్యాధుల నుంచి వేగంగా కోలుకోగలుగుతున్నారు. ఇలా కొన్ని వేల మంది ప్రాణాలను ఓఆర్ఎస్ కాపాడగలిగింది. ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ఓఆర్టీ) అంటే.. నీటికి సూక్ష్మ మోతాదుల్లో చక్కెరలు, లవణాలు కలిపి ఇవ్వడమే. లవణాల్లో ముఖ్యంగా సోడియం, పొటాషియంలు ప్రధానంగా ఉంటాయి. అతిసార వల్ల శరీరంలోని ద్రవాల మోతాదు తగ్గడానికి విరుగుడుగా ఈ ఓఆర్ఎస్ పనిచేస్తుంది. ఐక్య రాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు భారత ఉప ఖండం అందించిన అతి గొప్ప ఆయుధం ఈ ఓఆర్టీ అని ‘కరెంట్ సైన్స్’ పత్రిక పేర్కొంది. ఓఆర్ఎస్ అందుబాటులోకి వచ్చేంతవరకూ కలరా వంటి వ్యాధుల చికిత్సలో రక్తనాళాల ద్వారా ద్రవాలను శరీ రానికి అందించడమే ప్రధానంగా ఉండేది. పొట్టకు విశ్రాంతి కలిగించే పేరుతో కలరా వ్యాధిగ్రస్థులకు ఆహారం ఇచ్చేవారు కాదు. నీళ్లు కూడా కొద్దికొద్దిగా తాగించే వాళ్లు. దీంతో పౌష్టి కాహార లోపం ముదిరి సమస్య జటిలమయ్యేది. ఓఆర్టీ దీనికి పూర్తి విరుద్ధమైనది. 1978–2008 మధ్యకాలంలో ఓఆర్టీ వల్ల కోట్లమంది అతిసారతో మరణించకుండా నివా రించగలిగామని గణాంకాలు చెబుతున్నాయి. తీవ్రమైన అతిసార వ్యాధికి చికిత్స చేసేందుకు 1960 లలోనే ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. అత్యధికుల ప్రాణాలు తీస్తున్న అతిసారకు ‘ఓఆర్ఎస్’ చాలా సులువైన, సమర్థమైన చికిత్స. అయితే అప్పట్లో వైద్యులు చాలామంది దీన్ని ప్రతిఘటించారు. దాదాపు ఈ సమయంలోనే ప్రపంచం కలరా మహమ్మారి గుప్పిట్లో ఉండేది. 1961లో ఇండోనేసియాలో మొదలై 1963కల్లా బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్)కు వ్యాపించి, 1964లో భారత్ లోకి వచ్చింది. ఓఆర్ఎస్పై అప్పటికే పరిశోధనలు జరుగు తున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ 1970 నాటికి గానీ ఇంట్రా వీనస్ ఫ్లూయిడ్లను భారీ ఎత్తున పంపిణీ చేయడం ద్వారా మేల్కోలేదు. ఈ సమయంలోనే ఢాకా కేంద్రంగా కలరా రీసెర్చ్ లాబొరేటరీ టీకా తయారీకి పరిశోధనలు చేస్తూండేది. దక్షిణాసియాలో ఉన్న అమెరికా సైనికులను కాపాడుకునేందుకు ఈ టీకా ఉపయోగపడుతుందని అనుకునేవారు. 1971లోనే తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్‌గా అవతరించింది. అనేక సమస్యల కారణంగా కలరా రీసెర్చ్ లాబొరేటరీ... కలరా టీకాతోపాటు ఓఆర్టీ ప్రయోగాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. దిలీప్ మహాలనోబిస్ 1966లో కలకత్తాలోని ‘జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్’లో పని చేస్తూ ఉండేవారు. ఈ సంస్థ ద్వారా కలరా రీసెర్చ్ ప్రోగ్రామ్‌లోనూ పని చేస్తూండేవారు. పశ్చిమ బెంగాల్లో సుమారు 3.5 లక్షల మంది బంగ్లాదేశ్ శరణార్థులున్న ‘బనగాన్’ శిబిరంలో కలరా బాధితులకు చికిత్స అందిస్తూండేవారు. ఒక దశలో అందుబాటులో ఉన్న ఇంట్రా వీనస్ ఫ్లూయిడ్లు పూర్తిగా ఖర్చయి పోయాయి. ఓఆర్ఎస్ను వాడేందుకు ఇదే తగిన సమయమని మహాలనోబిస్ అనుకున్నారు. అయితే ప్యాకెట్లేవీ అందుబాటులో లేవు. దీంతో వారు చక్కెర, ఉప్పు తీసుకొచ్చి డ్రమ్ముల్లో ద్రావణాన్ని సిద్ధం చేశారు. క్యాంపుల్లో ఉన్న కలరా వ్యాధిగ్రస్థులకు ఇవ్వడం మొదలుపెట్టారు. జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్లోని గ్రంథాలయం కాస్తా ఓఆర్ఎస్ ఫ్యాక్టరీగా మారింది. అనుమతులున్న చికిత్స పద్ధతి కాక పోవడంతో మహాలనోబిస్ చాలా రిస్క్ చేశారు. రెండు మూడు వారాల్లోనే తమ నిర్ణయం తప్పేమీ కాదని స్పష్టమైంది. ఎందుకంటే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకున్న వారికి స్వస్థత చేకూరింది. శిక్షణ పొందిన సిబ్బంది లేకపోయినా కార్యకర్తల ద్వారానే ఈ ఓఆర్ఎస్ను అందించ వచ్చునని అర్థమైంది. బనగాన్ శిబిరంలో ఓఆర్ఎస్ ద్రావణం ఇచ్చిన తరువాత ఏం జరిగిందో విశ్లేషించినప్పుడు మరణాల రేటు గణ నీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. ఈ తగ్గుదల ఐదు శాతం నుంచి 40 శాతం వరకూ ఉన్నట్లు గుర్తించారు. మహాల నోబిస్ బృందం ఈ ఓఆర్ఎస్కు ‘ఓరల్ సెలైన్’ అని పేరు పెట్టింది. ఓఆర్ఎస్ను తయారు చేసుకునే పద్ధతులను వివ రిస్తూ పాంప్లెట్ల ద్వారా సరిహద్దుల్లో పంచిపెట్టారు. ఈ విషయాన్ని అందిపుచ్చుకున్న బంగ్లాదేశ్ రేడియో స్టేషన్ కూడా ఓఆర్ఎస్ తయారీ ప్రక్రియ వివరాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. అయినా చాలా సైన్స్ పత్రికలు మహాల నోబిస్ పరిశోధనా ఫలితాల ప్రచురణకు తిరస్కరించాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థలో అప్పట్లో బ్యాక్టీరియా వ్యాధుల విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న ధీమన్ బారువాకు మహాలనోబిస్ సమర్పించిన సమాచారం నమ్మదగిందిగానే అనిపించింది. అదే విషయాన్ని ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థలోనూ వివరించారు. ఫలితంగా 1978లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓఆర్టీపై ప్రపంచ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది. మహాలనోబిస్ పనులకు గుర్తింపుగా అదే ఏడాది జూలై 29న ‘పోలెన్ పీడియాట్రిక్ రీసెర్చ్ ప్రైజ్’ను అందించారు. ఈ రోజునే ప్రపంచ ఓఆర్ఎస్ దినంగా జరుపుకుంటున్నారు. 2006లో ‘ప్రిన్స్ మహీడాల్’ అవార్డు కూడా మహాలనోబిస్కు లభించింది. ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలో అతిసార వ్యాధి నియంత్రణ కార్యక్రమానికి అధ్య క్షుడిగానూ వ్యవహరించారు. 1990లో ‘మహాలనోబిస్ సొసైటీ ఫర్ అప్లైడ్ స్టడీస్’ను పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేసి నాణ్యమైన జీవితం, మెరుగైన ఆరోగ్యం అందరికీ అందాలన్న లక్ష్యంతో పనిచేశారు. ముఖ్యంగా తన వారసత్వాన్ని కొనసాగించగల యువ శాస్త్రవేత్తలనూ సిద్ధం చేశారు. (క్లిక్ చేయండి: కరోనా మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతోంది...) – రజీబ్ దాస్‌గుప్తా, సెంటర్ ఫర్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్, జేఎన్‌యూ, ఢిల్లీ -
జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. నిర్ణీత గడువు ముగిసినా ఏళ్లకేళ్లుగా జీహెచ్ఎంసీని పట్టుకొని వదలకుండా అతుక్కున్న ఆరుగురు సహాయ వైద్యాధికారులను (ఏఎంఓహెచ్) వదిలించుకుంది. ఆరుగురు ఏఎంఓహెచ్‌లను వారి మాతృసంస్థ అయిన పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు పంపించింది. దీనికి ముందు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ఏళ్లకేళ్లుగా కొనసాగుతున్న.. పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వీరిని మాతృసంస్థకు పంపించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దాన్ని అమలు చేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను ఆదేశించారు. అందుకనుగుణంగా, తమను మాతృసంస్థలకు పంపించాల్సిందిగా కోరుతూ స్వీయలేఖలు అందజేయాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సంబంధిత ఏఎంఓహెచ్‌లకు సూచించారు. లేని పక్షంలో ఎదురయ్యే తీవ్ర పరిణామాలను వివరించి హెచ్చరించినట్లు సమాచారం. వీరిలో జీహెచ్ఎంసీలో డిప్యుటేషన్ మూడేళ్లు, ఐదేళ్లు మించిన వారు కూడా ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో వారు లేఖలు రాయడం.. వారిని వెంటనే మాతృసంస్థలకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆగమేఘాల మీద జరిగాయి. వారు రిలీవ్ అయినట్లుగా కూడా పరిగణిస్తూ, వారిని మాతృశాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంబంధిత సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు రిలీవ్ అయిన ఏఎంఓహెచ్‌ల స్థానాల్లో తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించడంతో పాటు దాన్ని అమలు చేసినట్లు నివేదించాలని ఆదేశించారు. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జోనల్ కమిషనర్లకు సూచించారు. చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం: గోదాంలో ఉండేది 8 మందే.. ఆ నలుగురు ఎవరంటే! చెత్త పనిలో అవినీతి తగ్గేనా? ►ప్రజలకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు జీహెచ్ఎంసీలోని ఆరోగ్యం– పారిశుద్ధ్య విభాగంలోకి ఏఎంఓహెచ్‌లుగా వచ్చారంటే చాలు ‘చెత్త’ పనులు చేస్తున్నారు. సక్రమ పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం బాగుంటుందనే బ్రిటిష్ హయాం నాటి ప్రాథమిక సూత్రం ఆధారంగా జీహెచ్ఎంసీలో ఏఎంఓహెచ్‌లకు పారిశుద్ధ్య బాధ్యతలప్పగించారు. దాన్ని ఒక బాధ్యతగా చూడాల్సిన వారు చెత్త పనుల్లోని అవినీతిలో కూరుకుపోతున్నారు. స్వీపర్ల నియామకాల నుంచి మొదలు పెడితే బల్క్ చెత్త ఉత్పత్తి చేసే హోటళ్లు, ఫంక్షన్ల హాళ్ల నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేసేంతదాకా దిగజారారు. ►జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎంతో కాలంగా అవినీతి ఆరోపణలున్నా, ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వాటికి అడ్డుకట్ట పడలేదని జీహెచ్ఎంసీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాల కనుగుణంగా కమిషనర్ లోకేశ్‌కుమార్ వారిని మాతృశాఖలకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇది బల్దియా చరిత్రలోనే రికార్డు. ఇక రాబోయే రోజుల్లో ఏఎంఓహెచ్లనే వారు జీహెచ్ఎంసీలో ఉండరని తెలుస్తోంది. మిగతా విభాగాలపైనా దృష్టి సారిస్తారా? జీహెచ్ఎంసీకి ఒకసారి వచ్చారంటే చాలు మాతృశాఖలకు తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారు వివిధ విభాగాల్లో ఎందరో ఉన్నారు. అంతేకాదు.. డిప్యుటేషన్ ముగిసినా, కొనసాగింపు లేకుండానే పని చేస్తున్నవారు కూడా ఉన్నారు. డిప్యుటేషన్ ముగిసిన వారిపై, దీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిపై కూడా తగిన చర్యలు తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. -
కోవిడ్ కట్టడిలో కేరళ కంటే.. ఏపీ చర్యలు భేష్
సాక్షి, అమరావతి: ‘దక్షిణాది రాష్ట్రాల్లో బలమైన ప్రజారోగ్య వ్యవస్థ కేరళలో మాత్రమే ఉంది. అయినా సరే.. కోవిడ్ కట్టడి, నిర్వహణ విషయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయి’ అన్నారు ప్రముఖ న్యూరో సర్జన్, ఆరోగ్యశ్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ డా.సాంబశివారెడ్డి. మన రాష్ట్రంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో కోవిడ్ బాధితులపై ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరించి.. మెరుగైన చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ఉచితంగా టెస్టులు చేయడం, స్వల్ప లక్షణాలున్న వారిని కోవిడ్ కేర్ సెంటర్లలో ఉంచడం, హోం ఐసొలేషన్ కిట్లు అందించడం ఇలా అన్ని విధాలా కోవిడ్ సమయంలో ఏపీ తీసుకున్న నిర్ణయాలు పేద ప్రజలకు అండగా నిలిచాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలు కోవిడ్ విషయంలో ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోలేక పోయాయని, ఈ విషయంలో మన రాష్ట్రాన్ని చూసి ఆ రాష్ట్రాలు నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు. కేరళలో ఆరోగ్య పరిస్థితులు, పద్ధతులను పరిశీలించేందుకు వెళ్లిన బృందంలో సాంబశివారెడ్డి ఒకరు. కేరళ వెళ్లివచ్చిన అనంతరం ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రాథమిక వైద్యం స్థానిక సంస్థల ఆధ్వర్యంలోనే.. కేరళలో రెండే విధానాలున్నాయి. మొదటిది ప్రాథమిక వైద్యం కాగా.. రెండోది బోధనాస్పత్రులు. ప్రాథమిక ఆస్పత్రులన్నీ పంచాయతీల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ప్రాథమిక వైద్య వ్యవస్థ అక్కడ చాలా బాగుంది. మెడికల్ కాలేజీలు చక్కగా ఉన్నాయి. అక్కడ ఇ–హెల్త్ సిస్టం అమలు చేస్తున్నారు. దీనివల్ల రోగులు వచ్చినప్పుడు రద్దీ ఉండదు. టోకెన్ తీసుకోవడం, సమయానికి ఆస్పత్రికి వెళ్లడం చేస్తున్నారు. ఈ విధానాన్ని మనమూ అనుసరించాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్‌కు అనుమతి లేదు కేరళలోని వైద్య బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులెవరైనా సరే ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి ప్రభుత్వ అనుమతి లేదు. ప్రభుత్వ పరిధిలో లేనివారు మాత్రమే ప్రైవేటు వైద్యం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పరిధిలో పనిచేసే వైద్యులకు అక్కడెక్కడా క్లినిక్‌లు కనిపించనే కనిపించవు. కేరళ ప్రజల్లో మంచి అవగాహన ఉంది. కోవిడ్ నిబంధనలు పాటించడంలో వాళ్లు చాలా ముందున్నారు. ఇప్పటికీ 50 శాతం మంది డబుల్ మాస్క్ వినియోగిస్తున్నారు. కేరళలో ఇంకా కేరళలో ఇంకా కేరళలో చాలామంది థర్డ్‌వేవ్ అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఇప్పుడు అక్కడ సెకండ్ వేవ్ నడుస్తోంది. అక్కడ లాక్డౌన్ ఎక్కువ సమయం పెట్టారు. దీంతో మొదటి వేవ్‌లో పెద్దగా కేసులు రాలేదు. లాక్డౌన్ ఎత్తేశాక ఓనం పండుగలతో పాటు రకరకాల స్థానిక వేడుకలు జరిగాయి. దీంతో అక్కడ సెకండ్ వేవ్ ఆలస్యంగా మొదలైంది. సెకండ్ వేవ్ నాటికి అక్కడ 42 శాతమే సీరో సర్వెలెన్స్ ఉంది. అప్పటికే మన దగ్గర 70 శాతం పైగా ఉంది. అక్కడ సర్వీస్ కమిషన్ యాక్టివ్‌గా ఉంది ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలన్నీ ఆరోగ్య శాఖ పరిధిలోనే జరుగుతాయి. కానీ.. అక్కడ వైద్యులు, సిబ్బంది నియామకాన్ని సర్వీస్ కమిషన్ చేపడుతుంది. వైద్య శాఖలో ఖాళీలు ఏర్పడగానే నియామకాలు చేపడుతుంది. అక్కడ సర్వీస్ కమిషన్ చాలా యాక్టివ్‌గా ఉంది. డాక్టర్లకు కొరత లేదు. వైద్యులకు ఇక్కడ మనమిచ్చే వేతనాల కంటే అక్కడ తక్కువే ఉన్నాయి. కానీ.. అక్కడ వైద్యులు బాగా కమిట్మెంట్తో పని చేస్తారు. ధరల్ని నియంత్రణలో పెట్టగలిగాం మన రాష్ట్రంలో కోవిడ్ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల్ని నియంత్రణ చేయగలిగాం. అంతేకాదు కోవిడ్, బ్లాక్ఫంగస్లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. దీనివల్ల ఎక్కువ సంఖ్యలో ప్రజలు లబ్ధి పొందారు. మిగతా రాష్ట్రాలు అలా చేయలేకపోయాయి. కరోనా సమయంలో ఏపీ తీసుకున్న నిర్ణయాలను మరే రాష్ట్రం తీసుకోలేకపోయింది. -
భారీగా నిధులు: ప్రజావైద్యానికి తెలంగాణ పెద్దపీట
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2,500 మంది స్పెషలిస్టు వైద్యులు ఉన్నా ప్రజలకు వైద్య సేవలు అందకపోవడానికి గల కారణం ఏమిటి? కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులను కాదని రూ. లక్షల్లో అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రులవైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు? లోపం ఎక్కడుంది? ఈ సమస్య మూలాలను కనుగొని తగిన ‘మందు’ వేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, మానవవనరులను సమకూర్చి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు వచ్చే రెండేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమయ్యే నిధులను సాధారణ బడ్జెట్‌తో సంబంధం లేకుండా అదనంగా కేటాయించనుంది. ‘రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి రాకూడదు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే రూ.10 వేల కోట్లు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది’ అని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నిధులను ఎక్కడెక్కడ ఖర్చు చేయాలన్న దానిపై ప్రాధాన్యాలను గుర్తించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,295 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌ను సాధారణ అవసరాలకు, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. వైద్య, ఆరోగ్యశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై మేధోమథనం ప్రారంభించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాల మేరకు అధికారులు ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించారు. ప్రైవేటు ప్రాక్టీసు వీడితేనే... ప్రభుత్వ డాకర్లు ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందడం లేదని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. తమిళనాడు తరహా ప్రభుత్వ వైద్య విధానాన్ని తీసుకురావడమే ఇందుకు పరిష్కారమని సూచిస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లేదు. ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. అర్హతలేని ప్రాక్టీషనర్లు లేకపోవడంతో ప్రాథమిక వైద్యాన్ని అక్కడ బలోపేతం చేశారు. ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా నిర్ణీత వేళల్లో విధులు నిర్వహించాల్సిందే. ప్రజారోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పట్టాక రాష్ట్ర అధికారులు తమిళనాడు, కేరళలలో పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిమ్స్ తరహా విధానం మేలు.. నిమ్స్‌లో పనిచేసే డాక్టర్లు బయట ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీలులేదు. అయితే సాయంత్రం వేళల్లో ఆసుపత్రిలోనే ప్రాక్టీస్ చేస్తే కొద్ది మొత్తంలో రోగుల నుంచి కన్సల్టేషన్ ఫీజు తీసుకోవచ్చు. రెండు దశాబ్దాల క్రితం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఇటువంటి పద్ధతి ఉండేదని ఒక సీనియర్ వైద్యాధికారి వెల్లడించారు. ఇటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా చేయడానికి వీలు కలుగుతుందని అంటున్నారు. -
వైద్యారోగ్యం రూ. 6,295 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖకు గతేడాదితో పోలిస్తే కేటాయింపులు స్వల్పంగా పెంచింది. గతేడాది రూ.6,185.97 కో ట్లు కేటాయించగా ఈ ఏడాది రూ. 6,295 కోట్లు కే టాయించింది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల పథకాలకు యథాతథ కేటాయింపులు చేసిన ప్రభుత్వం, ఆరో గ్య మిషన్ పథకాలకు మాత్రం అధిక నిధులు కేటాయించింది. ఔషధాల కొనుగోలుకు మాత్రం గతంతో పోలిస్తే ఈ ఏడాది నిధులు తగ్గించింది. ముఖ్యమైన పథకాలకు కేటాయింపులు ఇలా.. గతేడాది మాదిరిగానే ఆరోగ్యశ్రీ ట్రస్టుకు రుణంగా రూ. 720.12 కోట్లు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి గతేడాది మాదిరిగానే రూ. 211.86 కోట్లు, పెన్షన్‌దారుల ఆరోగ్య పథకానికి రూ. 150 కోట్లు, జర్నలిస్టుల ఆరోగ్య పథకానికి రూ. 45.88 కోట్లు కలిపి మొత్తం కేటాయింపులు రూ. 410.35 కోట్లు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని బీపీఎల్ కుటుంబాలు నిమ్స్‌లో చికిత్స పొందితే వారికి సాయం చేసేందుకు రూ. కోటి కేటాయింపు. ళీఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలో ఈసారి రూ.1,213 కోట్లు కేటాయింపులు. నిమ్స్‌లో వేతనాల పెంపును అమలు చేయడంలో భాగంగా ఈసారి రూ. 213. 85 కోట్లు (గతేడాది రూ. 113.85 కోట్లు) కేటాయింపు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ పరికరాల కొనుగోలుకు రూ. 13.54 కోట్లు. ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య, భద్రత కార్మికులకు రూ. 48.15 కోట్లు కేటాయింపు. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల బలోపేతం చేసేందుకు రూ. కోటి. ళీవైద్య విద్యలో సర్జికల్ వస్తువుల కోసం రూ.3 కోట్లు. పారిశుద్ధ్య, భద్రతా సిబ్బంది కోసం రూ. 40 కోట్లు. ళీ ఔషధాల కొనుగోలుకు రూ. 254 కోట్లు. గతేడాది కేటాయింపులు రూ. 262.41 కోట్లు 108 అత్యవసర వాహన సేవలు కోసం రూ. 52.94 కోట్లు. గతేడాది కేటాయింపులు రూ. 49 కోట్లు. 104 మొబైల్ వాహన సేవల కోసం రూ. 36.82 కోట్లు. ళీ కేసీఆర్ కిట్ అమ్మఒడి కోసం రూ. 330 కోట్లు. 102 అమ్మ ఒడి పథకానికి రూ. 15 కోట్లు. రాష్ట్ర వాటాలో భాగంగా జాతీయ ఆరోగ్య మిషన్‌కు రూ. 182 కోట్లు. ఆశా వర్కర్ల ప్రోత్సాహకాలకు రూ.105.65 కోట్లు.ళీ ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి గతేడాది మాదిరిగానే రూ. 20 కోట్లతోపాటు నూతన భవన నిర్మాణం కోసం మరో 3 కోట్లు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు రూ. 10 లక్షలు. నిమ్స్‌కు రూ. 3.67 కోట్లు.. ళీ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల సమగ్ర నిర్వహణ సేవలకు రూ. 48.15 కోట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రూ. 1.60 కోట్లు బోధనాసుపత్రుల ఏర్పాటు కోసం రూ. 36.68 కోట్లు ళీమెడికల్ కాలేజీల అభివృద్ధికి రూ. 120.50 కోట్లు బోధనాసుపత్రుల నిర్వహణ సేవల సమగ్రాభివృద్ధి కోసం రూ. 40 కోట్లు ళీపార్థివ దేహాలను తరలించే ఉచిత వాహన సర్వీసులకు రూ. 5 కోట్లు కోవిడ్ నిర్వహణ కోసం ఆర్థిక సాయం రూ. 92 కోట్లు.. అందుకే విద్య, వైద్యంలో వెనుకబాటు ఆర్థిక నిపుణులు, పరిశోధకురాలు ఎన్.శ్రీదేవి సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రాల బడ్జెట్లు ఉండేవి. పంచవర్ష ప్రణాళికలు ఒకటి నుంచి ఐదు వరకు ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిల్లోనూ అవే విధా నాలు అమలయ్యాయి. పంచవర్ష ప్రణాళికలకు అనుగుణంగా రాష్ట్రాల బడ్జెట్లు కూడా అవే ప్రాధాన్యతలను కొనసాగించాయి. ఆర్థికాభివృద్ధి జరిగితే దాని ఫలాలు అందరికీ అంది సామాజిక అభివృద్ధి దానంతటే అదే జరుగుతుందనేది ఆనా టి అభిప్రాయం. అయితే ఆర్థికాభివృద్ధి జరిగింది కానీ, దాని ఫలాలు అందరికీ అందలేదు. సామాజిక అభివృద్ధి జరగలేదు. ఆరో పంచవర్ష ప్రణా ళికలో సామాజిక అభివృద్ధికి పెద్దపీట వేశారు. దీంతో ప్రణాళికల ఓరియెంటేషన్ మారిపోయింది. రాష్ట్రాల్లోనూ దానినే అనుసరించారు. దీనిని అన్వయించుకునే క్రమంలో సోషల్ డెవలప్మెంట్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ప్రధానం కాగా, కేంద్రం తో సహా రాష్ట్రాలు కూడా వీటిపై దృష్టి పెట్టకుండా ప్రజాకర్షక, సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపాయి. దీంతో విద్య, వైద్యం వెనుకబడ్డాయి. ఈ రెండూ అభివృద్ధి చెంది ఉంటే సమాజం తన కాళ్లపై తాను నిలబడేది. అయితే అలా జరగలేదు. ఈ విధంగా రెండు కీలక సందర్భాల్లో జరిగిన పొరపాట్లు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. -
ప్రజారోగ్యానికి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజారోగ్య రంగం పూర్తిస్థాయిలో బలోపేతం కానుంది. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు (సబ్ సెంటర్లు), మెడికల్ కాలేజీలు, నాడు –నేడు కార్యక్రమాలు తదితరాల కోసం ప్రజారోగ్యంపై రూ.16,202 కోట్లకుపైగా ఖర్చు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు లక్ష్యాలను నిర్దేశించారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి జూన్ 15లోగా స్థలాల గుర్తింపు పూర్తి కావాలని ఆదేశించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. 10 వేల వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు (సబ్ సెంటర్లు) ► ప్రతి గ్రామ సచివాలయంలో వైఎస్సార్ హెల్త్ విలేజ్ క్లినిక్ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కరోనా లాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు గ్రామ స్థాయిలో 24 గంటల పాటు సేవలందించే వైద్య సదుపాయాలు ఉండాలి. దాదాపు 10 వేల వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,026 కోట్లు ఖర్చు చేయనుంది. ఇవి కాకుండా ఇప్పటికే 1086 సబ్ సెంటర్లలో నాడు–నేడు ద్వారా సదుపాయాలను కల్పిస్తుంది. ► సబ్ సెంటర్ల నిర్మాణానికి ఇప్పటివరకు 4 వేల స్థలాలను గుర్తించగా మరో 6 వేల కేంద్రాలకు స్థలాలను గుర్తించాల్సి ఉంది. జూన్ 15 లోగా స్థలాల గుర్తింపు పూర్తి కావాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు కల్లా సబ్ సెంటర్ల నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు. పీహెచ్‌సీల కోసం రూ.670 కోట్లు.. రాష్ట్రవ్యాప్తంగా 1,138 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ( పీహెచ్‌సీలు ) ఉండగా 149 కొత్త పీహెచ్‌సీల నిర్మాణం కోసం రూ.256.99 కోట్లు ఖర్చు చేయనున్నారు.మరో 989 పీహెచ్‌సీల్లో అభివృద్ధి పనుల కోసం రూ.413.01 కోట్లు వెచ్చించనున్నారు.మొత్తంగా రూ. 671 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల అభివృద్ధి... ► 52 ఏరియా ఆస్పత్రుల్లో నాడు– నేడు కింద రూ.695 కోట్లు ఖర్చు చేయనున్నారు. 169 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రూ.541 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం రూ.1,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కొత్త మెడికల్, నర్సింగ్ కాలేజీలు... ► రాష్ట్రంలో ప్రస్తుతం 11 మెడికల్ కాలేజీలు ఉండగా వైద్య కళాశాలలకు అనుబంధంగా 6, గిరిజన ప్రాంతాల్లో 7 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కొత్తగా రానున్నాయి. వీటన్నిటి కోసం రూ.6,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ► ఇవి కాకుండా 15 కొత్త మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, కడపలో 3 వైద్య సంస్థలు, సూపర్ స్పెషాల్టీ, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసం మొత్తం రూ.6,170 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ► మొత్తం ప్రజారోగ్య రంగంలో నాడు–నేడు, కొత్తవాటి నిర్మాణాల కోసం రూ.16,202 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మెడికల్ కాలేజీల నమూనాల పరిశీలన ► ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఉండాలని సీఎం జగన్ సూచించారు. కొత్తగా నిర్మించే మెడికల్ కాలేజీల నమూనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నాడు –నేడు కార్యక్రమాల నాణ్యతలో రాజీ పడొద్దని, నిర్మాణాలు పటిష్టంగా, నాణ్యంగా ఉండాలని ఆదేశించారు. ► సమీక్షలో డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోరుకో.. కొత్త ఆరోగ్య లోకం!
ఉపద్రవాలు మానవ సమాజానికి ఎంత నష్టం కలిగిస్తాయో, ఏ మాత్రం తగ్గని రీతిలో గుణపాఠాలూ నేర్పుతాయి. సరిగ్గా నేర్చుకొని తమ పరిస్థితిని చక్కదిద్దుకున్న సమాజాలు బాగుపడటం చరిత్ర చెప్పే సత్యం! ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కోవిడ్– 19 కూడా ఏకకాలంలో ఎన్నో పాఠాలు చెబు తోంది. అందులో వైద్యం ఒకటి! ముఖ్యంగా భారత్ వంటి దేశాలు ప్రజావైద్యం విష యంలో నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో! మర్చిపోయిన మంచి, అల వాటుపడ్డ తప్పు, జరుగుతున్న అనర్థం... ఇవన్నీ ఎత్తి చూపింది కోవిడ్. ప్రజావైద్యానికి ఏటా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో అటూఇటూగా ఒక శాతం మాత్రమే వెచ్చించే దేశమిది. కానీ, విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే ఉద్దీపనలకే జీడీపీలో 10 శాతం, అంటే రూ. 20 లక్షల కోట్లు వెచ్చించాల్సి రావడం పెద్ద గుణపాఠమే! ప్రజా వైద్య వ్యవస్థలు గొప్పగా ఉన్న చిన్న దేశాలు కూడా ఉపద్రవాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. వైద్యం ప్రయివేటీకరించిన అగ్ర రాజ్యం అమెరికా తుఫాన్లో అరటి తీగలా అల్లాడుతోంది. ప్రజా వైద్యం నుంచి ప్రయివేటు వైపు దారిమళ్లిన ఇటలీ, ఉన్న ప్రజా వైద్యాన్ని కొన్నేళ్లుగా చిన్నచూపు చూస్తున్న బ్రిటన్ వంటి దేశాలకూ కోవిడ్‌లో చేదు అనుభవాలు తప్పలేదు. (చదవండి: వదంతుల మహమ్మారి) మూడు నెలలుగా ఈ దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలానికి అల్లాడిన జనాన్ని ఏ వైద్యులు ఆదుకున్నారు? ప్రయివేటు వైద్యులా! ప్రజా వైద్యులా? ఈ పాటికే సదరు ప్రశ్న ఎన్నో మెదళ్లను తొలిచే ఉంటుంది. సమాధానం నిస్సందేహంగా ఒకటే! అవును... మన ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులే! దేశ ప్రజావైద్య వ్యవస్థలో భాగమైన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది మొక్కవోని ధైర్యంతో, దీక్షతో, నిబద్ధతతో కోవిడ్ వార్డుల్లో మృత్యువును వెనక్కి నెట్టి వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. వ్యాధిగ్రస్తులకు దన్నుగా నిలుస్తున్నారు. మరి మనకెందుకు ప్రభుత్వ ఆస్పత్రులంటే, ప్రజా వైద్యులంటే చిన్న చూపు? గత కొన్నేళ్లుగా ప్రజా వైద్యానికి మన ప్రభుత్వాలిచ్చే ప్రాధా న్యత అలాంటిది. దానికి తోడు ఎక్కడికక్కడ అవినీతి, స్వార్థం పెచ్చ రిల్లి ప్రయివేటు వైద్య రంగ వికాసం కోసం ప్రజా వైద్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన సందర్భాలూ కొల్లలు. కరోనాతో మన సహజీవనం అనివార్యమంటున్నారు కనుక, ఈ పరిస్థితి మారాలి. పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి అయినా ప్రజావైద్య రంగాన్ని బలోపేతం చేయాలి. సమగ్ర, సంక్లిష్ట వైద్యానికి ప్రయివేటు రంగంలో ఆరోగ్యకర పోటీని ఆహ్వానిస్తూనే ప్రజావైద్య రంగాన్ని పటిష్టపరచాలన్నది కోవిడ్ నేర్పుతున్న పాఠం. (చదవండి: భారీ ప్యాకేజీ: భారత్‌పై ఐరాస ప్రశంసలు) తుప్పుపట్టిన తుపాకులతోనే.... అరకొర వసతులతోనే మన సర్కారు వైద్యులు అద్భుతాలు సృష్టిస్తు న్నారు. సహజ వాతావరణ పరిస్థితులు కొంత, సార్స్ తెగ వైరస్‌లను తట్టుకునే మన దేశీయుల రోగనిరోధక శక్తి కొంత, తగినన్ని పరీక్షలు జరిపించకపోవడం వల్ల కొంత... మొత్తానికి దేశంలో తక్కువ సంఖ్య కరోనా కేసులు నమోదై ఉండవచ్చు. అంత మాత్రాన మన సర్కారు వైద్యులు, నర్సులు, సిబ్బంది కృషిని తక్కువచేసి చూడలేం. వైరస్ సోకిన వారికి వైద్యం చేసే క్రమంలో పాజిటివ్ లక్షణాలు వచ్చిన వైద్యులు, సిబ్బంది ఆపై కోలుకొని, 14 రోజుల క్వరైంటైన్ తర్వాత కూడా అవే వార్డుల్లో విధులు నిర్వహిస్తున్నారు. తగినన్ని కిట్లు, వెంటి లేటర్లు లేకున్నా, ఎన్–95 మాస్కుల కొరత ఉన్నా, సరైన ప్రమా ణాలతో పీపీఈలు లేకున్నా... ఎక్కడా తగ్గకుండా 75 వేలకు పైబడి పాజిటివ్ కేసుల్లో వైద్యం అందిస్తూ, దాదాపు మూడో వంతు రోగుల్ని చికిత్స చేసి ఇళ్లకు పంపారు. దీన్నంతటినీ ప్రయివేటు వైద్యరంగం గత మూడు నెలలుగా దూరం నుంచి చూస్తోంది. కార్పొరేట్ నుంచి మధ్య, చిన్న తరహా ప్రయివేటు ఆస్పత్రుల దాకా.. పూర్తిగానో, పాక్షికంగానో మూతబడి ఉన్నాయి. లేదా అక్కడక్కడ ఎమర్జెన్సీ కేసులు మాత్రం చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే దశలవారీగా వైద్య సేవల్ని పునరుద్ధరి స్తున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల నుంచి ప్రిస్కిప్షన్లు, ఫార్మా కంపెనీ లకు ఇన్వాయిస్లు రమారమి తగ్గాయి. ప్రయివేటు డయాగ్నసిస్ ల్యాబ్‌ల పరీక్షలు కూడా 3, 4 శాతానికి పడిపోయినట్టు నివేదికలు న్నాయి. ప్రయివేటు రంగం ఇలా ఉంటే, మరో పక్క ప్రభుత్వ రంగంలో క్రమేపీ కరోనా పరీక్షల్ని దేశ వ్యాప్తంగా పెంచారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పరీక్షలు, పద్ధతులు, చికిత్సలు నిర్వహిస్తున్నారు. మార్చి 12న కేవలం 90 మందికి మాత్రమే పరీక్షలు జరుపగలిగిన స్థితి నుంచి, మే 12 నాటికి ఒకేరోజు పదివేల మందికి పరీక్ష జరిపే సామర్థ్యాన్ని మెరుగు పరిచారు. ప్రభుత్వ వైద్యుల సేవలు ప్రజా మన్నన పొందుతున్న క్రమంలోనే ప్రజా వైద్యాన్ని ప్రభుత్వం మెరుగపరచాల్సిన అవసరం ఉంది. వారం కింద విశాఖపట్నం శివారుల్లో గ్యాస్ లీక్ దుర్ఘటన చోటు చేసుకున్నపుడు అక్కడి కేజీహెచ్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల సేవలకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. చికిత్స కోసం 324 మంది బాధి తులు అక్కడ చేరగా తీవ్రంగా ప్రభావితులైన ముగ్గురు మరణించారు. మిగతా అందరికీ చికిత్స అందించి, గురువారం వరకు విడతలుగా వారిని ఇళ్లకు పంపించారు. అప్పటికే అక్కడ ఉన్న వైద్య వ్యవస్థ, వైద్యుల సంఖ్య, వారి నిబద్ధత అందుకు దోహదపడింది. ఈ స్థితి దేశమంతటా రావాలి. కరోనా కేసులు ఒక్క పెట్టున పెరిగే సరికి వాటికి తట్టుకోలేని పరిస్థితి నేడు ముంబయిలో తలెత్తుతోంది. ఏమంటే సదుపాయాల కొరత! ప్రభుత్వ వైద్య రంగంలో మౌలిక సదుపాయాల లేమి దేశ వ్యాప్తంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే, ప్రధాని మోదీతో వీడియో సమావేశం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి వైద్య మౌలిక రంగ పటిష్టతకు వడ్డీలేని, లేదా స్వల్ప వడ్డీ రుణ సదుపాయం కల్పించాలని కోరారు. తద్వారా గ్రామ స్థాయి నుంచి బోధనాసుపత్రుల స్థాయివరకు వైద్యసదుపాయాల్ని మెరుగు పరుస్తామన్నారు. ప్రాధాన్యతలు మారాలి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజావైద్యానికి నిధులు పెంచాలి. కేంద్రీకృత వైద్య సదుపాయాల వ్యవస్థ సరైంది కాదు. వికేద్రీకరణ జరగాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి సదుపాయాల్ని మెరు గుపరచాలి. ఇప్పటికీ వైద్యం కోసం పెట్టే తలసరి వ్యయం భారత్‌లో చాలా తక్కువ. ‘బ్రిక్స్’ దేశాలు, ఇటీవలే పారిశ్రామికీకరణ జరిగిన ఇతర దేశాలతో పోల్చి చూసినా మనం అట్టడుగునే ఉంటాం. బ్రెజిల్ (947), రష్యా (893), దక్షిణాఫ్రికా (570), టర్కీ (568), మలేషియా (456), చైనా (420), ఇండొనేషియా (99) తదితర దేశాల్లో తలసరి వైద్య వ్యయం అన్నేసి డాలర్లలో ఉంటే, భారత్‌లో అది 75 డాలర్లు మాత్రమే! అందులోనూ... 30 శాతమే ప్రభుత్వ రంగంలో జరుగు తుంటే, 70 శాతం వ్యయం ప్రయివేటు రంగంలో రోగులు నేరుగా జేబుల్లోంచి వెచ్చిస్తున్నారు. కేంద్రం–రాష్ట్రాలు కలిపి, 2008–09 నుంచి 2019–20 వరకు ప్రజారోగ్య–వైద్యానికి వెచ్చించింది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.2 శాతం నుంచి 1.6 శాతం మాత్రమే! ఇది ఏ మాత్రం సరిపోదు. అందుకే, కనీస వైద్యావసరాలు తీర్చు కోవడానికి పౌరులు పెద్దమొత్తం తమ కష్టార్జితాన్ని మంచి నీళ్లలా ప్రయివేటు వైద్యరంగంలో ఖర్చు చేస్తున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సగటున 72 శాతం మంది, పట్టణ–నగర ప్రాంతాల్లో సగటున 79 శాతం మంది ప్రయివేటు వైద్య రంగ సేవల్ని వినియో గించుకోవాల్సి వస్తోంది. జాతీయ నమూనా సర్వే (ఎన్ఎస్ఎస్) 2017–18 ఫలితాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. ఈశాన్యంలోని చిన్న రాష్ట్రాలు కాకుండా... హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనే పౌరులు 50 శాతానికి పైబడి ప్రభుత్వ వైద్య సేవల్ని పొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాల్లో పౌరులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పొందుతున్న వైద్య సేవలు 25 శాతం లోపే! ప్రజారోగ్యం–ఉత్పత్తి, ఉపాధికి అనుసంధానం ప్రతి వెయ్యి మంది జనాభాకి కనీసం ఒక డాక్టర్ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) చెబుతోంది. మన దగ్గర 1:1400 నిష్పత్తి ఉంది. వైద్య కళాశాలలు, వైద్యుల్ని పెంచాలి. బ్రిటన్‌లో ఈ నిష్పత్తి 1:800 ఉంటే, క్యూబా వంటి చిన్న దేశంలో ఇది 1:150. కానీ, అమెరికా వాణిజ్య ఆంక్షలతో పెద్ద ఎత్తున మౌలిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో క్యూబా చికిత్స కన్నా వ్యాధినిరోధక పరిస్థితుల్నే నమ్ముకుంటుంది. అక్కడి వైద్య ప్రమాణాలకు మూలాలు విప్లవో ద్యమాల నుంచి పుట్టిన సామ్యవాద విధానాల్లో ఉన్నాయి. ఏపీలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ కోవిడ్‌ను ఎదుర్కో వడంలో, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమర్థంగా పనికొచ్చింది. కేరళలో ప్రాథమిక–కమ్యూనిటీ వైద్య వ్యవస్థ, 67 వేల అంగన్వాడీలు, 27 వేల ఆశావర్కర్లు కీలకపాత్ర పోషించారు. ఈ పరిస్థితుల్ని దేశ వ్యాప్తం చేయాలి. కోవిడ్ ఇప్పుడప్పుడే సమిసేది కాదంటున్నారు. మనుషులకు వైరస్‌తో సహజీవనం అనివార్యమైనందున మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరాలు పాటించే క్రమంలో ఎంతో కొంత ఆరోగ్య పరిస్థితులు స్థూలంగా మెరుగవుతాయి. ఇదే అదునుగా వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి తెస్తే దేశ భవిష్యత్తు ఆరోగ్య దాయకంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అంటువ్యాధుల నివారణ కోసం సిబ్బందికి, యువతకు స్వల్ప కాలిక కోర్సును కూడా రూపొందించాలి. ఏపీలో 16 కోట్ల మాస్క్‌లు తయారు చేసినట్టు ఇకపై వివిధ వైద్యోపకరణాల తయారీకి పూనుకోవాలి. వైద్యానికి ఉత్పత్తి, ఉపాధిని అనుసంధానం చేస్తే నిరుద్యోగ సమస్యను కూడా కొంత పరిష్కరించినట్టవుతుంది. కోవిడ్ నేర్పిన పాఠాలతో కొత్త ఆరోగ్య లోకాన్ని ఆవిష్కరించాలి. -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఆసుపత్రుల నుంచి జంప్..
సాక్షి, హైదరాబాద్: దేశంలో వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు, క్వారంటైన్లో ఉన్న బాధితులు కొందరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండలేక పారిపోతున్నారని అంతర్జాతీయ జర్నల్ ‘లాన్సెట్’ ఘాటైన విమర్శ చేసింది. భారత్‌లో కరోనా వ్యాధి నియంత్రణ చర్యలపై ‘లాన్సెట్’ తాజాగా నివేదిక విడుదల చేసింది. గత కొన్ని వారాలుగా కరోనా రోగులు, లక్షణాలున్న వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల నుంచి పారిపోతున్నారని, తమ ప్రయాణ చరిత్రను దాచడానికి ప్రయత్నించిన అనేక సంఘటనలున్నాయని తెలిపింది. ఈ పరిస్థితి కరోనాపై చేస్తున్న నియంత్రణ చర్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే దీనికి కారణమని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో ఒంటరిగా క్వారంటైన్లో ఉండటానికి కరోనా బాధితులు, రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న కంటైన్మెంట్ ప్రణాళిక ఎన్నో లోటుపాట్లను చూపిస్తుంది. క్వారంటైన్, ఐసోలేషన్లు క్లస్టర్ల ఏర్పాటులో కీలకమైనవి. క్వారంటైన్ అంటే కరోనాకు గురైన వ్యక్తుల నుంచి సాధారణ ప్రజలను వేరు చేయడం, వారిని వైరస్ బారి నుంచి కాపాడటం. కానీ వివిధ ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థపై నమ్మకం లేకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారిందని లాన్సెట్ అభిప్రాయపడింది. చదవండి: కరోనా ఆగట్లేదు.. జర జాగ్రత్త కరోనా నియంత్రణ వ్యూహాలకు సవాళ్లు లాన్సెట్ నివేదిక ప్రకారం భారత్‌లో కరోనాతో ఈ నెల 14వ తేదీ నాటికి 356 మంది మరణించారని తెలిపింది. (శనివారం సాయంత్రానికి మృతి చెందినవారి సంఖ్య 480). మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉంది. ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగించింది. అయితే కరోనాతో అత్యంత దెబ్బతిన్న దేశాల సరసన భారత్ లేకపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కానీ దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య ప్రజారోగ్యంలో పెట్టుబడుల విషయంలో భారీ వ్యత్యాసాలున్నాయి. ఈ పరిస్థితి వ్యాధుల నియంత్రణ వ్యూహాలకు అనేక సవాళ్లను విసురుతుంది. ప్రజారోగ్యంపై పెట్టే ఖర్చులను పెంచడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంపొందించడానికి వీలు కలుగుతుందని ప్రజారోగ్య నిపుణులు అంటున్నారు. అప్పుడు కరోనా వంటి వైరస్లు ప్రబలినప్పుడు క్వారంటైన్ల నుంచి తప్పించుకునే పరిస్థితులుండవు. దేశంలో కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యముంది. తక్కువ ఆదాయ వర్గాల్లో ఇదెక్కువ. అందువల్ల ప్రజలు ఐసోలేషన్, క్వారంటైన్ ప్రాముఖ్యతలను అర్థం చేసుకోవడం కష్టమని నివేదిక తెలిపింది. కరోనా ఒక మహమ్మారి అని భావించినా, వారిలో ప్రజారోగ్య వ్యవస్థపై నమ్మకం లేకపోవడంతో ముందుకు రావడం లేదని తెలిపింది. జీడీపీలో ఆరోగ్యరంగానికి 1.5 శాతమే.. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ సరిగా లేకపోవడంతో లక్షలాది మంది ప్రైవేటు వైద్య ఆరోగ్య రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. మన దేశ జీడీపీలో ప్రభుత్వం ఆరోగ్యం కోసం కేవలం 1.5 శాతమే ఖర్చు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువని లాన్సెట్ తన నివేదికలో స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లోని 52 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 44 శాతం కుటుంబాలు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రైవేటు రంగమే కీలకంగా ఉంటుందని భావిస్తున్నారని తెలిపింది. అంటువ్యాధులను గుర్తించడం, ముందస్తు హెచ్చరికలు చేయడం ఆరోగ్య వ్యవస్థల ప్రత్యేకమైన పని. కరోనా వంటి మహమ్మారి వచ్చినప్పుడు సరైన విధానంతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే సమయమిది. ఆరోగ్య బీమా ద్వారా కాకుండా, ప్రభుత్వం ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో పెంచాలని లాన్సెట్ సూచించింది. ప్రజారోగ్య సిబ్బందిలో నమ్మకం కలిగించాలని పేర్కొంది. మరోవైపు కింది స్థాయిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోనన్న భయాందోళనలకు గురవుతున్నారు. అలాంటి వారు సురక్షితంగా ఉండటానికి కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేసి ముందుకు నడిచేవారు సమాజానికి గొప్ప సేవ చేసే ‘కరోనా–యోధులు’అవుతారని నివేదిక తెలిపింది. కేరళ ఆదర్శం.. రెండేళ్ల క్రితం నిఫా వైరస్ వ్యాప్తిని విజయవంతంగా కేరళ ఎదుర్కొంది. ఆ ముప్పు నుంచి కేరళ అనేక గుణపాఠాలు నేర్చుకుంది. కరోనా చికిత్స ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కేంద్రీకృతమై ఉంది. అయితే ప్రభుత్వ ఆస్పత్రులను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో సిబ్బంది నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలకు కావాల్సింది ప్రభుత్వంపై నమ్మకం. కేరళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం దేశానికి గర్వకారణమని లాన్సెట్ నివేదిక ప్రస్తావించింది. 2005 నుంచి ప్రభుత్వ ఆసుపత్రులపై ఆ రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని నివేదిక తెలిపింది. చదవండి: బ్యాంక్ ఖాతా లేకుంటే ‘పోస్టల్’ నగదు -
జీవనశైలి జబ్బులకు 'చెక్'..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న జీవనశైలి జబ్బుల (నాన్ కమ్యునికబుల్ డిసీజెస్..ఎన్సీడీ – అసాంక్రమిక వ్యాధులు)ను ప్రాథమిక దశలోనే నియంత్రించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉన్న ఎన్సీడీ క్లినిక్‌ల సంఖ్యను మరింతగా పెంచేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 85 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 13 జిల్లా ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 98చోట్ల ఈ ఎన్సీడీ క్లినిక్‌లు ఉన్నాయి. బాధితుల సంఖ్య ఎప్పటికప్పుడు గణనీయంగా పెరుగుతుండటంతో ఇవి ఏమాత్రం సరిపోవడంలేదు. దీంతో మరో 110 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఎన్సీడీ క్లినిక్‌లు ఏర్పాటుచేయనున్నారు. ఓపీ సేవలతో పాటు ఇక్కడే రక్త పరీక్షలు కూడా చేస్తారు. కాగా, కొత్తగా ఏర్పాటుచేసే ఒక్కో క్లినిక్‌కూ ఒక డాక్టరు, స్టాఫ్ నర్సు, ఫిజియోథెరపిస్ట్‌ను నియమిస్తారు. క్లినిక్‌ల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలకు జాతీయ ఆరోగ్య మిషన్ ఆమోదం తెలిపి అక్కడ నుంచి అనుమతులు రాగానే ఈ 110 క్లినిక్‌లలో ఓపీ సేవలు నిర్వహిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఆదివారం మినహా మిగతా అన్ని రోజుల్లోనూ వీటిల్లో సేవలు అందుబాటులో ఉంటాయి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో జీవనశైలి జబ్బుల రిస్క్‌కు చేరువవుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోందని, వీటి నియంత్రణకు చర్యలు తీసుకోకపోతే మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ భావించింది. అంతేకాక.. ఈ శాఖలో సంస్కరణల కోసం సుజాతారావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సైతం రాష్ట్రంలో జీవనశైలి జబ్బుల ప్రభావం తీవ్రంగా ఉందని, దీనివల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో.. వీటి నియంత్రణకు విధిగా చర్యలు అవసరమని అధికారులు భావించి అదనంగా ఎన్సీడీ క్లినిక్‌లను ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, చాలామంది గ్రామీణ ప్రాంత వాసులకు మధుమేహం, రక్తపోటు తదితర జబ్బులపై అవగాహన లేనందున.. ప్రతీ నియోజకవర్గ స్థాయిలోనూ ప్రజలకు వీటిపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ప్రాథమిక దశలోనే వ్యాధుల గుర్తింపు కొత్తగా ఏర్పాటుచేసే క్లినిక్‌ల ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించే వీలు కలుగుతుంది. తద్వారా సకాలంలో వైద్య సేవలు అందించవచ్చు. అన్నింటికీ మించి.. బీపీ బాధితులు ఏటా పెరుగుతున్నారు. దీన్ని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉంది. – డాక్టర్ గీతాప్రసాదిని, ప్రజారోగ్య శాఖ అదనపు సంచాలకులు -
వైద్య రంగం ప్రైవేటీకరణకు కుట్ర:విమలక్క
భోలక్‌పూర్: ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటు శక్తులకు అప్పగించేందుకే తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అరుణోదయ సంస్థ కన్వీనర్ విమలక్క విమర్శించారు. గత 38 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మంగళవారం జూనియర్ డాక్టర్ల రిలే నిరాహార దీక్షలకు విమలక్క సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో శాశ్వత నియామకాలను చేపట్టాలని, జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సమ్మెతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల ఉద్యమానికి పూర్తిగా మద్దతునిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యక్షులు క్రాంతి చైతన్య, నాయకులు నాగారు ్జన, అనిల్ తదితరులు పాల్గొన్నారు.