దిలీప్ మహాలనోబిస్
దిలీప్ మహాలనోబిస్ పేరు చాలా తక్కువమంది వినుంటారు. కానీ అక్టోబర్ 16న మరణించిన ఈయన కొన్ని వేల ప్రాణాలు... మరీ ముఖ్యంగా పసిపిల్లల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషించాడని తెలిస్తే మాత్రం ప్రజారోగ్య రంగంలో ఓ గొప్ప వైద్యుడిని కోల్పోయామని అనిపించక మానదు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్)ను జనాభా స్థాయిలో ఒక చికిత్సా పద్ధతిగా అందుబాటులోకి తీసుకురావడంలో మహాలనోబిస్‌ది చాలా ముఖ్యమైన పాత్ర. ఈ ఓఆర్‌ఎస్ పుణ్యమా అని అతిసార, కలరా వంటి వ్యాధుల నుంచి వేగంగా కోలుకోగలుగుతున్నారు. ఇలా కొన్ని వేల మంది ప్రాణాలను ఓఆర్‌ఎస్ కాపాడగలిగింది. ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ఓఆర్‌టీ) అంటే.. నీటికి సూక్ష్మ మోతాదుల్లో చక్కెరలు, లవణాలు కలిపి ఇవ్వడమే. లవణాల్లో ముఖ్యంగా సోడియం, పొటాషియంలు ప్రధానంగా ఉంటాయి. అతిసార వల్ల శరీరంలోని ద్రవాల మోతాదు తగ్గడానికి విరుగుడుగా ఈ ఓఆర్‌ఎస్ పనిచేస్తుంది. ఐక్య రాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు భారత ఉప ఖండం అందించిన అతి గొప్ప ఆయుధం ఈ ఓఆర్‌టీ అని ‘కరెంట్ సైన్స్’ పత్రిక పేర్కొంది.
ఓఆర్‌ఎస్ అందుబాటులోకి వచ్చేంతవరకూ కలరా వంటి వ్యాధుల చికిత్సలో రక్తనాళాల ద్వారా ద్రవాలను శరీ రానికి అందించడమే ప్రధానంగా ఉండేది. పొట్టకు విశ్రాంతి కలిగించే పేరుతో కలరా వ్యాధిగ్రస్థులకు ఆహారం ఇచ్చేవారు కాదు. నీళ్లు కూడా కొద్దికొద్దిగా తాగించే వాళ్లు. దీంతో పౌష్టి కాహార లోపం ముదిరి సమస్య జటిలమయ్యేది. ఓఆర్‌టీ దీనికి పూర్తి విరుద్ధమైనది. 1978–2008 మధ్యకాలంలో ఓఆర్‌టీ వల్ల కోట్లమంది అతిసారతో మరణించకుండా నివా రించగలిగామని గణాంకాలు చెబుతున్నాయి.
తీవ్రమైన అతిసార వ్యాధికి చికిత్స చేసేందుకు 1960 లలోనే ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. అత్యధికుల ప్రాణాలు తీస్తున్న అతిసారకు ‘ఓఆర్‌ఎస్’ చాలా సులువైన, సమర్థమైన చికిత్స. అయితే అప్పట్లో వైద్యులు చాలామంది దీన్ని ప్రతిఘటించారు. దాదాపు ఈ సమయంలోనే ప్రపంచం కలరా మహమ్మారి గుప్పిట్లో ఉండేది. 1961లో ఇండోనేసియాలో మొదలై 1963కల్లా బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్)కు వ్యాపించి, 1964లో భారత్ లోకి వచ్చింది. ఓఆర్‌ఎస్‌పై అప్పటికే పరిశోధనలు జరుగు తున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ 1970 నాటికి గానీ ఇంట్రా వీనస్ ఫ్లూయిడ్లను భారీ ఎత్తున పంపిణీ చేయడం ద్వారా మేల్కోలేదు. ఈ సమయంలోనే ఢాకా కేంద్రంగా కలరా రీసెర్చ్ లాబొరేటరీ టీకా తయారీకి పరిశోధనలు చేస్తూండేది. దక్షిణాసియాలో ఉన్న అమెరికా సైనికులను కాపాడుకునేందుకు ఈ టీకా ఉపయోగపడుతుందని అనుకునేవారు.
1971లోనే తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్‌గా అవతరించింది. అనేక సమస్యల కారణంగా కలరా రీసెర్చ్ లాబొరేటరీ... కలరా టీకాతోపాటు ఓఆర్‌టీ ప్రయోగాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. దిలీప్ మహాలనోబిస్ 1966లో కలకత్తాలోని ‘జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్’లో పని చేస్తూ ఉండేవారు. ఈ సంస్థ ద్వారా కలరా రీసెర్చ్ ప్రోగ్రామ్‌లోనూ పని చేస్తూండేవారు. పశ్చిమ బెంగాల్‌లో సుమారు 3.5 లక్షల మంది బంగ్లాదేశ్ శరణార్థులున్న ‘బనగాన్’ శిబిరంలో కలరా బాధితులకు చికిత్స అందిస్తూండేవారు. ఒక దశలో అందుబాటులో ఉన్న ఇంట్రా వీనస్ ఫ్లూయిడ్లు పూర్తిగా ఖర్చయి పోయాయి.
ఓఆర్‌ఎస్‌ను వాడేందుకు ఇదే తగిన సమయమని మహాలనోబిస్ అనుకున్నారు. అయితే ప్యాకెట్లేవీ అందుబాటులో లేవు. దీంతో వారు చక్కెర, ఉప్పు తీసుకొచ్చి డ్రమ్ముల్లో ద్రావణాన్ని సిద్ధం చేశారు. క్యాంపుల్లో ఉన్న కలరా వ్యాధిగ్రస్థులకు ఇవ్వడం మొదలుపెట్టారు. జాన్ హాప్కిన్స్ ఇన్‌స్టిట్యూట్‌లోని గ్రంథాలయం కాస్తా ఓఆర్‌ఎస్ ఫ్యాక్టరీగా మారింది. అనుమతులున్న చికిత్స పద్ధతి కాక పోవడంతో మహాలనోబిస్ చాలా రిస్క్ చేశారు. రెండు మూడు వారాల్లోనే తమ నిర్ణయం తప్పేమీ కాదని స్పష్టమైంది. ఎందుకంటే ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తీసుకున్న వారికి స్వస్థత చేకూరింది. శిక్షణ పొందిన సిబ్బంది లేకపోయినా కార్యకర్తల ద్వారానే ఈ ఓఆర్‌ఎస్‌ను అందించ వచ్చునని అర్థమైంది.
బనగాన్ శిబిరంలో ఓఆర్‌ఎస్ ద్రావణం ఇచ్చిన తరువాత ఏం జరిగిందో విశ్లేషించినప్పుడు మరణాల రేటు గణ నీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. ఈ తగ్గుదల ఐదు శాతం నుంచి 40 శాతం వరకూ ఉన్నట్లు గుర్తించారు. మహాల నోబిస్ బృందం ఈ ఓఆర్‌ఎస్‌కు ‘ఓరల్ సెలైన్’ అని పేరు పెట్టింది. ఓఆర్‌ఎస్‌ను తయారు చేసుకునే పద్ధతులను వివ రిస్తూ పాంప్లెట్ల ద్వారా సరిహద్దుల్లో పంచిపెట్టారు. ఈ విషయాన్ని అందిపుచ్చుకున్న బంగ్లాదేశ్ రేడియో స్టేషన్ కూడా ఓఆర్‌ఎస్ తయారీ ప్రక్రియ వివరాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. అయినా చాలా సైన్స్ పత్రికలు మహాల నోబిస్ పరిశోధనా ఫలితాల ప్రచురణకు తిరస్కరించాయి.
అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థలో అప్పట్లో బ్యాక్టీరియా వ్యాధుల విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న ధీమన్ బారువాకు మహాలనోబిస్ సమర్పించిన సమాచారం నమ్మదగిందిగానే అనిపించింది. అదే విషయాన్ని ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థలోనూ వివరించారు. ఫలితంగా 1978లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓఆర్‌టీపై ప్రపంచ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది. మహాలనోబిస్ పనులకు గుర్తింపుగా అదే ఏడాది జూలై 29న ‘పోలెన్ పీడియాట్రిక్ రీసెర్చ్ ప్రైజ్’ను అందించారు. ఈ రోజునే ప్రపంచ ఓఆర్‌ఎస్ దినంగా జరుపుకుంటున్నారు. 2006లో ‘ప్రిన్స్ మహీడాల్’ అవార్డు కూడా మహాలనోబిస్‌కు లభించింది.
ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలో అతిసార వ్యాధి నియంత్రణ కార్యక్రమానికి అధ్య క్షుడిగానూ వ్యవహరించారు. 1990లో ‘మహాలనోబిస్ సొసైటీ ఫర్ అప్లైడ్ స్టడీస్’ను పశ్చిమ బెంగాల్‌లో ఏర్పాటు చేసి నాణ్యమైన జీవితం, మెరుగైన ఆరోగ్యం అందరికీ అందాలన్న లక్ష్యంతో పనిచేశారు. ముఖ్యంగా తన వారసత్వాన్ని కొనసాగించగల యువ శాస్త్రవేత్తలనూ సిద్ధం చేశారు. (క్లిక్ చేయండి: కరోనా మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతోంది...)
– రజీబ్ దాస్‌గుప్తా, సెంటర్ ఫర్ సోషల్ మెడిసిన్
అండ్ కమ్యూనిటీ హెల్త్, జేఎన్‌యూ, ఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment