Diarrhoeal disease
-
Dilip Mahalanabis: ‘అతిసార’ బాధితులకు జీవామృత ప్రదాత
దిలీప్ మహాలనోబిస్ పేరు చాలా తక్కువమంది వినుంటారు. కానీ అక్టోబర్ 16న మరణించిన ఈయన కొన్ని వేల ప్రాణాలు... మరీ ముఖ్యంగా పసిపిల్లల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషించాడని తెలిస్తే మాత్రం ప్రజారోగ్య రంగంలో ఓ గొప్ప వైద్యుడిని కోల్పోయామని అనిపించక మానదు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)ను జనాభా స్థాయిలో ఒక చికిత్సా పద్ధతిగా అందుబాటులోకి తీసుకురావడంలో మహాలనోబిస్ది చాలా ముఖ్యమైన పాత్ర. ఈ ఓఆర్ఎస్ పుణ్యమా అని అతిసార, కలరా వంటి వ్యాధుల నుంచి వేగంగా కోలుకోగలుగుతున్నారు. ఇలా కొన్ని వేల మంది ప్రాణాలను ఓఆర్ఎస్ కాపాడగలిగింది. ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ (ఓఆర్టీ) అంటే.. నీటికి సూక్ష్మ మోతాదుల్లో చక్కెరలు, లవణాలు కలిపి ఇవ్వడమే. లవణాల్లో ముఖ్యంగా సోడియం, పొటాషియంలు ప్రధానంగా ఉంటాయి. అతిసార వల్ల శరీరంలోని ద్రవాల మోతాదు తగ్గడానికి విరుగుడుగా ఈ ఓఆర్ఎస్ పనిచేస్తుంది. ఐక్య రాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు భారత ఉప ఖండం అందించిన అతి గొప్ప ఆయుధం ఈ ఓఆర్టీ అని ‘కరెంట్ సైన్స్’ పత్రిక పేర్కొంది. ఓఆర్ఎస్ అందుబాటులోకి వచ్చేంతవరకూ కలరా వంటి వ్యాధుల చికిత్సలో రక్తనాళాల ద్వారా ద్రవాలను శరీ రానికి అందించడమే ప్రధానంగా ఉండేది. పొట్టకు విశ్రాంతి కలిగించే పేరుతో కలరా వ్యాధిగ్రస్థులకు ఆహారం ఇచ్చేవారు కాదు. నీళ్లు కూడా కొద్దికొద్దిగా తాగించే వాళ్లు. దీంతో పౌష్టి కాహార లోపం ముదిరి సమస్య జటిలమయ్యేది. ఓఆర్టీ దీనికి పూర్తి విరుద్ధమైనది. 1978–2008 మధ్యకాలంలో ఓఆర్టీ వల్ల కోట్లమంది అతిసారతో మరణించకుండా నివా రించగలిగామని గణాంకాలు చెబుతున్నాయి. తీవ్రమైన అతిసార వ్యాధికి చికిత్స చేసేందుకు 1960 లలోనే ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. అత్యధికుల ప్రాణాలు తీస్తున్న అతిసారకు ‘ఓఆర్ఎస్’ చాలా సులువైన, సమర్థమైన చికిత్స. అయితే అప్పట్లో వైద్యులు చాలామంది దీన్ని ప్రతిఘటించారు. దాదాపు ఈ సమయంలోనే ప్రపంచం కలరా మహమ్మారి గుప్పిట్లో ఉండేది. 1961లో ఇండోనేసియాలో మొదలై 1963కల్లా బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్)కు వ్యాపించి, 1964లో భారత్ లోకి వచ్చింది. ఓఆర్ఎస్పై అప్పటికే పరిశోధనలు జరుగు తున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ 1970 నాటికి గానీ ఇంట్రా వీనస్ ఫ్లూయిడ్లను భారీ ఎత్తున పంపిణీ చేయడం ద్వారా మేల్కోలేదు. ఈ సమయంలోనే ఢాకా కేంద్రంగా కలరా రీసెర్చ్ లాబొరేటరీ టీకా తయారీకి పరిశోధనలు చేస్తూండేది. దక్షిణాసియాలో ఉన్న అమెరికా సైనికులను కాపాడుకునేందుకు ఈ టీకా ఉపయోగపడుతుందని అనుకునేవారు. 1971లోనే తూర్పు పాకిస్తాన్ కాస్తా బంగ్లాదేశ్‌గా అవతరించింది. అనేక సమస్యల కారణంగా కలరా రీసెర్చ్ లాబొరేటరీ... కలరా టీకాతోపాటు ఓఆర్టీ ప్రయోగాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. దిలీప్ మహాలనోబిస్ 1966లో కలకత్తాలోని ‘జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్’లో పని చేస్తూ ఉండేవారు. ఈ సంస్థ ద్వారా కలరా రీసెర్చ్ ప్రోగ్రామ్‌లోనూ పని చేస్తూండేవారు. పశ్చిమ బెంగాల్లో సుమారు 3.5 లక్షల మంది బంగ్లాదేశ్ శరణార్థులున్న ‘బనగాన్’ శిబిరంలో కలరా బాధితులకు చికిత్స అందిస్తూండేవారు. ఒక దశలో అందుబాటులో ఉన్న ఇంట్రా వీనస్ ఫ్లూయిడ్లు పూర్తిగా ఖర్చయి పోయాయి. ఓఆర్ఎస్ను వాడేందుకు ఇదే తగిన సమయమని మహాలనోబిస్ అనుకున్నారు. అయితే ప్యాకెట్లేవీ అందుబాటులో లేవు. దీంతో వారు చక్కెర, ఉప్పు తీసుకొచ్చి డ్రమ్ముల్లో ద్రావణాన్ని సిద్ధం చేశారు. క్యాంపుల్లో ఉన్న కలరా వ్యాధిగ్రస్థులకు ఇవ్వడం మొదలుపెట్టారు. జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్లోని గ్రంథాలయం కాస్తా ఓఆర్ఎస్ ఫ్యాక్టరీగా మారింది. అనుమతులున్న చికిత్స పద్ధతి కాక పోవడంతో మహాలనోబిస్ చాలా రిస్క్ చేశారు. రెండు మూడు వారాల్లోనే తమ నిర్ణయం తప్పేమీ కాదని స్పష్టమైంది. ఎందుకంటే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకున్న వారికి స్వస్థత చేకూరింది. శిక్షణ పొందిన సిబ్బంది లేకపోయినా కార్యకర్తల ద్వారానే ఈ ఓఆర్ఎస్ను అందించ వచ్చునని అర్థమైంది. బనగాన్ శిబిరంలో ఓఆర్ఎస్ ద్రావణం ఇచ్చిన తరువాత ఏం జరిగిందో విశ్లేషించినప్పుడు మరణాల రేటు గణ నీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. ఈ తగ్గుదల ఐదు శాతం నుంచి 40 శాతం వరకూ ఉన్నట్లు గుర్తించారు. మహాల నోబిస్ బృందం ఈ ఓఆర్ఎస్కు ‘ఓరల్ సెలైన్’ అని పేరు పెట్టింది. ఓఆర్ఎస్ను తయారు చేసుకునే పద్ధతులను వివ రిస్తూ పాంప్లెట్ల ద్వారా సరిహద్దుల్లో పంచిపెట్టారు. ఈ విషయాన్ని అందిపుచ్చుకున్న బంగ్లాదేశ్ రేడియో స్టేషన్ కూడా ఓఆర్ఎస్ తయారీ ప్రక్రియ వివరాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. అయినా చాలా సైన్స్ పత్రికలు మహాల నోబిస్ పరిశోధనా ఫలితాల ప్రచురణకు తిరస్కరించాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థలో అప్పట్లో బ్యాక్టీరియా వ్యాధుల విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న ధీమన్ బారువాకు మహాలనోబిస్ సమర్పించిన సమాచారం నమ్మదగిందిగానే అనిపించింది. అదే విషయాన్ని ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థలోనూ వివరించారు. ఫలితంగా 1978లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓఆర్టీపై ప్రపంచ స్థాయిలో ప్రచారం మొదలుపెట్టింది. మహాలనోబిస్ పనులకు గుర్తింపుగా అదే ఏడాది జూలై 29న ‘పోలెన్ పీడియాట్రిక్ రీసెర్చ్ ప్రైజ్’ను అందించారు. ఈ రోజునే ప్రపంచ ఓఆర్ఎస్ దినంగా జరుపుకుంటున్నారు. 2006లో ‘ప్రిన్స్ మహీడాల్’ అవార్డు కూడా మహాలనోబిస్కు లభించింది. ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయంలో అతిసార వ్యాధి నియంత్రణ కార్యక్రమానికి అధ్య క్షుడిగానూ వ్యవహరించారు. 1990లో ‘మహాలనోబిస్ సొసైటీ ఫర్ అప్లైడ్ స్టడీస్’ను పశ్చిమ బెంగాల్లో ఏర్పాటు చేసి నాణ్యమైన జీవితం, మెరుగైన ఆరోగ్యం అందరికీ అందాలన్న లక్ష్యంతో పనిచేశారు. ముఖ్యంగా తన వారసత్వాన్ని కొనసాగించగల యువ శాస్త్రవేత్తలనూ సిద్ధం చేశారు. (క్లిక్ చేయండి: కరోనా మరోసారి విజృంభించడానికి సిద్ధమవుతోంది...) – రజీబ్ దాస్‌గుప్తా, సెంటర్ ఫర్ సోషల్ మెడిసిన్ అండ్ కమ్యూనిటీ హెల్త్, జేఎన్‌యూ, ఢిల్లీ -
హైదరాబాద్‌లో వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా
సాక్షి, హైదరాబాద్: బస్తీకి సుస్తీ చేసింది. మారిన వాతావరణ పరిస్థితులకు తోడు ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గిన కరోనా వైరస్ సహా డెంగీ జ్వరాలు మళ్లీ చాపకింది నీరులా విస్తరిస్తూ ప్రజారోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరంతో మంచం పడుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణం చల్లబడటంతో పాటు తరచూ వర్షంలో తడుస్తుండటంతో శ్వాసకోశ సమస్యలు కూడా రెట్టింపయ్యాయి. నీటితో పాటు ఆహారం కూడా కలుషితమై అనేక మంది వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, డిఫ్తీరియా (కంఠసర్పి) బారిన పడుతున్నారు. ఫలితంగానల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా ఏరియా ఆస్పత్రులు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలకు రోగులు క్యూ కడుతున్నారు. డెంగీ జ్వరాలు డేంజర్.. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. ఇంటి ఆవరణలోని పూల కుండీలే కాదు ఇంటిపై ఉన్న ఖాళీ డబ్బాలు, టైర్లు, ఇంటికి అటు ఇటుగా ఖాళీగా ఉన్న ప్రదేశా ల్లో తాగిపడేసిన కొబ్బరి బోండాల్లో వర్షపు నీరు చేరడం, రోజుల తరబడి నిల్వ ఉండటం వల్ల దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా సంపన్నులు ఎక్కువగా నివసించే గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శేరిలింగంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, కూకట్పల్లి సహా శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలసిన గెజిటెట్ కమ్యూనిటీలు, విల్లాల్లో ఎక్కువ కేసులు నమోదువుతున్నాయి. వీటిలో ముఖ్యంగా డెంగీ కారక ఈడిస్ ఈజిప్టే దోమలు వృద్ధి చెంది మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోయిన చిన్నారులు, మహిళలు, వృద్ధులపై దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 200పైగా డెంగీ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 61 కేసులు, మేడ్చల్ జిల్లాలో 42 డెంగీ కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపు ఉన్నట్లు అంచనా. చదవండి: తస్మాత్ జాగ్రత్త.. కాల్ చేసి ]401]తో కలిపి డయల్ చేయాలని చెబుతున్నారా.. మళ్లీ విజృంభిస్తున్న కరోనా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సగటున 250– 260, రంగారెడ్డి జిల్లాలో 50 నుంచి 60, మేడ్చల్ జిల్లాలో30 నుంచి 40 కేసులు నమోదుతున్నాయి. కరోనా వైరస్ సోకిన వారిలోనే కాదు సాధారణ జ్వరపీడితుల్లోనూ లక్షణాలు ఒకే విధంగా ఉండటం వైరస్ గుర్తింపు, చికిత్స కష్టంగా మారింది. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. వాంతులు.. విరేచనాలు నగరానికి కృష్ణా, గోదావరితో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల నుంచి నీరు సరఫరా అవుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆయా ప్రాజెక్టులకు వరద నీరు చేరుతోంది. కలషిత నీరు నదుల్లోకి చేరుతుండటం, సరిగా ఫిల్టర్ చేయకుండా పంపింగ్ చేస్తుండటంతో ఈ నీటిని తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారినపడుతున్నారు. ప్రస్తుతం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న రోగుల్లో ఎక్కువ శాతం వీరే ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అప్పుడే వండిన తాజా ఆహారానికి బదులు నిల్వ చేసిన ఆహార పదార్థాలు తినడంతో అనారోగ్యం పాలవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో కాచి వడపోసిన నీరు తాగడం, అప్పుడే వండిన తాజా ఆహారం తీసుకోవడం, ముక్కుకు మాస్క్‌లు ధరించడం, చేతులను తరచూ శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
ఆదిలాబాద్‌లో ప్రబలిన డయేరియా.. 50 మందికి అస్వస్థత
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో డయేరియా ప్రబలతోంది. సిరికొండ మండలం తుమ్మల్ పాడ్ గ్రామంలో డయేరియా ఛాయలు కనడబడుతున్నాయి. చాలా మంది డయేరియా బారిన పడుతున్నారు. ఇప్పటకే 50 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో 20 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి వాంతులు, విరేచనాలవుతున్నాయి. వాంతులు, విరేచనాలతో నీరసంగా మారి గ్రామంలో చాలామంది మంచాన పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.. -
విజృంభిస్తున్న అతిసార
జహీరాబాద్, న్యూస్‌లైన్: మండలంలోని రంజోల్ గ్రామంలో అతిసార విజృంభిస్తోంది. తాజాగా శుక్రవా రం చంద్రమ్మ(55) అనే మహిళ అతిసార సోకి మరణించింది. దీంతో ఇప్పటివరకు ఈ అతిసార బారిన పడి మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. రెండు రోజుల క్రితం లక్ష్మయ్య అనే వ్యక్తి మరణించగా, గురువారం ఉదయ్‌కిరణ్ అనే బాలుడు మరణించిన విషయం తెలిసిందే. దీంతో గ్రామ ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు. చంద్రమ్మ అతిసారతో నీరసించడంతో గురువారం రాత్రి ఆమెను కుటుంబ సభ్యులు జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శుక్రవారం తెల్లవారుజామున బీదర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి తరలించిన కొద్దిసేపటికే ఆమె మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతదేహాన్ని రంజోల్ గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన 12 మంది అతిసార బారినపడి జహీరాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలోనూ పలువురు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో అతిసారం వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించడంతో శుక్రవారం కలెక్టర్ దినకర్‌బాబు గ్రామాన్ని సందర్శించారు. చంద్రమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్యం పనులను సత్వరం నిర్వహించేందుకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కలెక్టర్ గ్రామ ప్రజలను కోరారు. అతిసార వ్యాధిని అదుపులో ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందిని అదేశించారు. మంచినీటి సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని, ఎక్కడైనా పైపులైన్ లీకేజీలు ఉంటే సరిచేయించాలని ఆదేశించారు. అనంతరం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వైద్యం పొందుతున్న అతిసారగ్రస్థులను పరామర్శించారు. రోగుల పరిస్థితి గురించి వైద్యురాలు కిరణ్మయిని అడిగి తెలుసుకున్నారు. వారి పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా మల్చల్మ పీహెచ్సీ సిబ్బందిని అస్పత్రికి అటాచ్ చేయాల్సిందిగా సూచించారు. గ్రామ ప్రజలు వ్యాధి తీవ్రత గురించి కలెక్టర్‌కు వివరించారు. అధికారులతో సమీక్ష రంజోల్ గ్రామంలో వ్యాపించిన అతిసారను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చేందుకు కలెక్టర్ దినకర్‌బాబు ఆయా శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా వైద్యాధికారి రంగారెడ్డి, సంగారెడ్డి ఆర్డీఓ రాంచందర్‌రావు, జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి ఇన్చార్జి వైద్యుడు శ్రీనివాసన్, డీఎల్పీఓ మనోహర్, అర్డబ్ల్యూఎస్, మల్చల్మ, మొగుడంపల్లి వైద్యాధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ విక్రంసిహారెడ్డిలతో సమావేశమయ్యారు. అతిసారను అదుపులో చేయడంతో పాటు మరింత విస్తరించకుండా ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
వరదల సమయంలో జాడలేని వైద్యులు..
కూనవరం, న్యూస్‌లైన్: అతిసార వ్యాధికి గురై మండలంలోని టేకులబోరుకు చెందిన ఎడ్ల వేదవతి(40) మంగళవారం తెల్లవారుజామున స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితుల కథనం ప్రకారం.. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వేదవతిని తొలుత ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో చుట్టూ వరద నీరు ఉన్నప్పటికీ నాటు పడవ ద్వారా సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోని వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ చికిత్స చేసినప్పటికీ అతిసార అదుపులోకి రాలేదు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. వరదల సమయంలో తప్పని సరిగా ఉండాల్సిన వైద్యులు విధుల్లో లేకపోవడం వల్లే మెరుగైన చికిత్స అందలేదని, ఈ కార ణంగానే వేదవతి మృతి చెందిందని ఆమె బంధువులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వరదల సమయంలో ప్రతి అధికారి స్థానికంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. ఇక్కడి వైద్యులు నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మండలంలో ఇది మూడవ కేసు కావడంతో వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అదుపులోకి రాని అతిసార
పరిగి, న్యూస్‌లైన్: మండలంలో అతిసార వ్యాధిఅదుపులోకి రాకపోగా ఇతర గ్రామాల్లోకి కూడా విస్తరిస్తోంది. మండల పరిధిలోని 12 గ్రామాల నుంచి ఇప్పటి వరకు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో 230 కేసులు నమోదు కాగా మరో 200 వరకు కేసులు ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యాయి. మంగళవారం పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో 15 కేసులు, చిగురాల్‌పల్లిలో 14 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 53 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిగురాల్‌పల్లిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఒక్క గ్రామం నుంచే ఈ వారం వ్యవధిలో 100కు పైగా అతిసార కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 74 మంది చికిత్స నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన మరో 40 మంది పరిగి ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా మంగళవారం ఈ గ్రామం నుంచి పరిగిలో నాలుగు, గ్రామంలోని వైద్య శిబిరంలో 14 అతిసార కేసులు నమోదయ్యాయి. అధికారుల భిన్నవాదనలు.. పరిగి మండలంలో అతిసార ప్రబల డానికి గల కారణాల విషయంలో అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒక్కో శాఖ అధికారులు ఒక్కో రకమైన కారణాలు పేర్కొంటున్నారు. నీరు కలుషితమవడంతోనే అతిసార ప్రబలిందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే నీరు కలుషితం కాలేదని, పారిశుద్ధ్యలోపమే వ్యాధి ప్రబలడానికి కారణం కావచ్చని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జేసీకి వివరించారు. కాగా నాలుగు రోజులుగా గ్రామంలో ట్యాంకు ద్వారా నీటి సరఫరా నిలిపివేశారు. గ్రామస్తులందరూ పరిగి నుంచి మినరల్ వాటర్ తెచ్చుకుని తాగుతున్నారు. అవగాహనతోనే అతిసార కట్టడి:జేసీ నిరంతర అవగాహనతోనే అతిసారలాంటి వ్యాధులు ప్రబలకుండా నియంత్రించగలమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. అతిసార వ్యాధితో వణికిపోతున్న చిగురాల్‌పల్లిలో ఆయన మంగళవారం సాయంత్రం పర్యటించారు. గ్రామంలోని నీటి ట్యాంకును, మురుగు కాల్వలు, రోడ్లను ఆయన పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న వైద్యశిబిరానికి వెళ్లి రోగులను పరామర్శించారు. జేసీతో మాట్లాడిన గ్రామస్తులు అతిసార వ్యాధి ప్రబలడానికి ఈఓఆర్డీ వెంకటేశం, గ్రామకార్యదర్శి మొగులయ్యల నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదు చేశారు. ఆరు నెలలకొకసారి కూడా వాటర్ ట్యాంకు కడగటం లేదని, పైప్లైన్ల లీకేజీలను పట్టించుకోలేదని వారు జేసీకి వివరించారు. అనంతరం పరిగికి వచ్చిన ఆయన మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ విలేకరులతో మాట్లాడుతూ.. ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులపై విచారణ జరిపిస్తామని చెప్పారు. గ్రామంలో అతిసార వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుద్ధ్యలోపం, పెంటకుప్పలు, పేరుకుపోయిన మురుగు, పైప్లైన్ల లీకేజి తదితరాలు వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఆయనతో పాటు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంఅండ్ హెచ్ఓ సుభాష్‌చంద్రబోస్, ఎస్పీహెచ్ఓ దశరథ్, తహసీల్దార్ బాల్‌రాజ్, ఎంపీడీఓ విజయప్ప, ఆర్డబ్ల్యూఎస్ డీఈ న ర్సింహులు, ఏఈ జైపాల్‌రెడ్డి తదితరులున్నారు.