పరిగి, న్యూస్‌లైన్: మండలంలో అతిసార వ్యాధిఅదుపులోకి రాకపోగా ఇతర గ్రామాల్లోకి కూడా విస్తరిస్తోంది. మండల పరిధిలోని 12 గ్రామాల నుంచి ఇప్పటి వరకు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో 230 కేసులు నమోదు కాగా మరో 200 వరకు కేసులు ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యాయి. మంగళవారం పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో 15 కేసులు, చిగురాల్‌పల్లిలో 14 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 53 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చిగురాల్‌పల్లిలో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ ఒక్క గ్రామం నుంచే ఈ వారం వ్యవధిలో 100కు పైగా అతిసార కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 74 మంది చికిత్స నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన మరో 40 మంది పరిగి ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా మంగళవారం ఈ గ్రామం నుంచి పరిగిలో నాలుగు, గ్రామంలోని వైద్య శిబిరంలో 14 అతిసార కేసులు నమోదయ్యాయి.
అధికారుల భిన్నవాదనలు..
పరిగి మండలంలో అతిసార ప్రబల డానికి గల కారణాల విషయంలో అధికారులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఒక్కో శాఖ అధికారులు ఒక్కో రకమైన కారణాలు పేర్కొంటున్నారు. నీరు కలుషితమవడంతోనే అతిసార ప్రబలిందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే నీరు కలుషితం కాలేదని, పారిశుద్ధ్యలోపమే వ్యాధి ప్రబలడానికి కారణం కావచ్చని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు జేసీకి వివరించారు. కాగా నాలుగు రోజులుగా గ్రామంలో ట్యాంకు ద్వారా నీటి సరఫరా నిలిపివేశారు. గ్రామస్తులందరూ పరిగి నుంచి మినరల్ వాటర్ తెచ్చుకుని తాగుతున్నారు.
అవగాహనతోనే అతిసార కట్టడి:జేసీ
నిరంతర అవగాహనతోనే అతిసారలాంటి వ్యాధులు ప్రబలకుండా నియంత్రించగలమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. అతిసార వ్యాధితో వణికిపోతున్న చిగురాల్‌పల్లిలో ఆయన మంగళవారం సాయంత్రం పర్యటించారు. గ్రామంలోని నీటి ట్యాంకును, మురుగు కాల్వలు, రోడ్లను ఆయన పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న వైద్యశిబిరానికి వెళ్లి రోగులను పరామర్శించారు. జేసీతో మాట్లాడిన గ్రామస్తులు అతిసార వ్యాధి ప్రబలడానికి ఈఓఆర్డీ వెంకటేశం, గ్రామకార్యదర్శి మొగులయ్యల నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదు చేశారు. ఆరు నెలలకొకసారి కూడా వాటర్ ట్యాంకు కడగటం లేదని, పైప్‌లైన్ల లీకేజీలను పట్టించుకోలేదని వారు జేసీకి వివరించారు. అనంతరం పరిగికి వచ్చిన ఆయన మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ విలేకరులతో మాట్లాడుతూ.. ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులపై విచారణ జరిపిస్తామని చెప్పారు. గ్రామంలో అతిసార వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుద్ధ్యలోపం, పెంటకుప్పలు, పేరుకుపోయిన మురుగు, పైప్‌లైన్ల లీకేజి తదితరాలు వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణాలని చెప్పారు. ఆయనతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంఅండ్ హెచ్‌ఓ సుభాష్‌చంద్రబోస్, ఎస్పీహెచ్‌ఓ దశరథ్, తహసీల్దార్ బాల్‌రాజ్, ఎంపీడీఓ విజయప్ప, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ న ర్సింహులు, ఏఈ జైపాల్‌రెడ్డి తదితరులున్నారు.
అదుపులోకి రాని అతిసార
Published Wed, Aug 7 2013 12:44 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement