గండేడ్, న్యూస్‌లైన్: కూరగాయలు తీసుకురావడానికి సంతకు బయలుదేరిన ఓ వ్యక్తి మార్గంమధ్యలో మృత్యువాత పడ్డాడు. బైకును లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బుధవారం మండల పరిధిలోని మొకర్లాబాద్ మలుపులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని మొకర్లాబాద్ ముందు తండాకు చెందిన లింబ్యానాయక్ (45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈయనకు భార్య తులసీబాయి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ భారమవడంతో ఆయన ముంబైకి వలస వెళ్లాడు. ఇటీవల తిరిగి గ్రామానికి వచ్చి వ్యవసాయం చూసుకుంటున్నాడు. బుధవారం సాయంత్రం లింబ్యానాయక్ కూరగాయలు తీసుకురావడానికి బైకుపై మహమ్మదాబాద్ సంతకు వెళ్తున్నాడు. మార్గంమధ్యలో మొకర్లాబాద్ వాగు సమీపంలో మలుపులో ఎదురుగా వస్తున్న లారీ ఈయన బైకును ఢీకొంది. ప్రమాదంలో లింబ్యానాయక్‌తో పాటు బైకు లారీ చక్రాల కిందపడిపోయింది. దీంతో ఆయన తలపగిలి అక్కడిక్కడే మృతి చెందాడు. తండాకు సమీపంలోనే ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. లింబ్యానాయక్ మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. తులిసీబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి..
మొక ర్లాబాద్ మలుపు ప్రమాదకరంగా మారిందని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని పలుమార్లు సంబంధిత అధికారులకు తెలియజేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు ఈ మలుపులో ప్రమాదాలు జరిగాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Thu, Aug 8 2013 3:03 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement