ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: మండల కేంద్రంలోని ప్రభుత్వ (కస్తూర్బా) బాలికల గురుకుల వసతిగృహంలో అంటువ్యాధులు ప్రబలాయి. దాదాపు 20 మంది బాలికలు చేతులకు, కాళ్లకు చీము పుండ్లతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈ వసతి గృహంలో 147 మంది బాలికలు చదువుకుంటున్నారు. వసతి గృహ ంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో పాటు గదులు ఇరుకుగా ఉండి బాలికలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
కాగా వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అంటువ్యాధులు మరింత మంది బాలికలకు ప్రబలే ప్రమాదం ఉంది. వసతి గృహంలోనే ఉండి బాలికల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఏఎన్‌ఎం అనురాధ కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. దీంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురి కాగా వీరికి వెంటనే వైద్య సౌకర్యం అందలేదు. మొదట్లో నలుగైదుగురు విద్యార్థినిలకు మాత్రమే చేతులు, కాళ్లకు పుండ్లు ఏర్పడగా ఆ తర్వాత 20 మంది బాలికలకు ఈ అంటువ్యాధి సోకింది. బుధవారం వీరిని ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్సకు వచ్చిన వారిలో పలువురు బాలికలు జ్వరంతో కూడా బాధపడుతున్నారు.
వీరిలో టి. మహేశ్వరి అనే ఏడో తరగతి బాలిక విపరీతమైన జ్వరంతో పాటు చేతి వేళ్ల మధ్య పుండ్లతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఐదో తరగతి చదువుతున్న వనిత అనే బాలిక పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరిపించినా ఫలితం లేకపోవడంతో మహేశ్వరిని బుధవారం సాయంత్రం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా వసతి గృహం వార్డెన్ దశరాథరామిరెడ్డి మాట్లాడుతూ ..ఏఎన్‌ఎం విధులకు రాకపోవడం వల్ల బాలికలను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని చెప్పారు. వసతి గృహంలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, కొద్ది మంది బాలికలు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.
బాలికల గురుకుల వసతిగృహంలో ప్రబలిన అంటువ్యాధులు
Published Thu, Aug 8 2013 2:42 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement