బాలికల ఆకలి వేదన
కస్తూరిబాలో బాలికలకు కష్టాలు
♦ సమయానికి అన్నం పెట్టని అధికారులు
♦ కడుపు మాడ్చుకుంటున్న విద్యార్థినులు
♦ ఇష్టారాజ్యంగా పాఠశాల అడ్మిషన్లు
♦ పట్టించుకోని ఉన్నతాధికారులు
సమయం మధ్యాహ్నం ఒంటి గంట..ఆ బాలికల కళ్లల్లో జీవం లేదు.. ముఖాల్లో కాంతి లేదు. కడుపులో పేగులు బాధతో మెలిపెడుతున్నాయి. ప్రతి ఒక్కరూ పొట్ట చేతపట్టి వంట మనుషుల వైపు దీనంగా చూస్తున్నారు. ఇప్పటికైనా వంట ప్రారంభిస్తారేమోనని.. అయితే అప్పటికే ఆ సిబ్బంది కడుపులు నిండాయనుకుంటా..పిల్లల ఆకలి కేకలు వారి చెవులకు చేరలేదు. నీరసించిన చిట్టి తల్లుల కన్నీటి పొర వారి హృదయాలను కరిగించ లేదు. సోమవారం అచ్చంపేటలోని కస్తూరిబా పాఠశాల్లో గుప్పెడు మెతుకుల కోసం బాలికలు ఇలా విలవిలలాడారు.
అచ్చంపేట:
బాలికలు వంటింటికే పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదవాలన్న కాంక్షతో 2008లో మండలానికి ఒక కస్తూరిబా పాఠశాలను ఏర్పాటు చేశారు. కానీ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా పాఠశాలలు నానాటికీ కునారిల్లుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పాఠశాల ప్రవేశాల్లోనూ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ నాయకులు చెబితేనే పాఠశాలలో సీట్లు ఇస్తామనే స్థాయికి పరిస్థితులు దిగజారాయి. పాఠశాల్లో మెనూ పాటించడం లేదు. సమయానికి అన్నం పెట్టడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కస్తూరిబా పాఠశాల అంటేనే తల్లిదండ్రులు వణికిపోయేలా మారుస్తున్నారు. ఇది అచ్చంపేటలోని కస్తూరిబా బాలిక పాఠశాల దుస్థితి. సోమవారం వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ సందెపోగు సత్యం పార్టీ నాయకులతో కలసి పాఠశాలకు అడ్మిషన్ కోసం వెళ్లి పరిస్థితులు చూసి విస్తుబోయారు. వీరితోపాటు కొందరు ఎమ్మార్పీఎస్ నాయకులు కూడా ఉన్నారు.
ఆకలి కేకలతో విద్యార్థులు
పాఠశాలలో ఐదు నుంచి పదో తరగతి వరకు 200 మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ప్రతి రోజూ మెనూ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు భోజనం వడ్డించాలి. సోమవారం ఒంటి గంటకు కూడా వంట ప్రారంభం కాలేదు. ఇదేమిటని ఇన్‌చార్జి ఎస్‌వో సంధ్యారాణిని ప్రశ్నిస్తే కూరగాయలు రావడం ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. రెండు మూడు రోజులకు ఒకసారి ఇదే విధంగా చేస్తున్నారని, వేళకు భోజనం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.
తినలేకపోతున్నాం..
రోజుకో రకం కూరగాయలతో భోజనం పెట్టాల్సి ఉన్నా..ప్రతి రోజూ ఒకే కూర, సాంబారు, మజ్జిగ, అప్పుడప్పుడు గుడ్డు ఇస్తున్నారని, అవీ పాడైన గుడ్లు పెడుతున్నారని విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. సాంబారు, మజ్జిగలో ఈగలు వస్తున్నాయని, లావు బియ్యంతో వండటం వల్ల తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సన్న బియ్యంతో వండేవారని, వారంలో ఒక రోజు చికెన్ పెట్టేవారని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వాటి ఊసే, అదేమని అడిగితే కొడుతున్నారని వాపోయారు.
సస్పెండైనా హవా కొనసాగిస్తున్న ఎస్‌వో
గతేడాది పాఠశాలలో ఓ విద్యార్థి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించింది. దీంతో ఎస్‌వో లక్ష్మిపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఉన్నతాధికారులు రెండు నెలల క్రితం ఆమెను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆమెకు ఏ అధికారం లేకపోయినా పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు, నిర్వహణ విషయంలో కొందరు రాజకీయ నాయకుల అండదండలతో హవా కొనసాగిస్తున్నారు. తన మాట వినే ఒక ఉపాధ్యాయురాలికి అనధికారికంగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు.
అడ్మిషన్లలోనూ రాజకీయం
పాఠశాలలో విద్యార్థులు ప్రవేశాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. కొత్తపల్లి గ్రామానికి చెందిన యాకోబు తన కుమారై సంజీవ రాణిని ఏడో తరగతి ప్రవేశానికి తీసుకెళ్లాడు. ముందుగా టీసీ తెచ్చుకోవాలని ఉపాధ్యాయులు చెప్పారు. టీసీ తీసుకొచ్చాక యాకోబు వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తని సీలు ఇవ్వ లేదు. ఆ తరువాత టీడీపీ నాయకుల సిఫార్సు మేరకు అనేక మంది బాలికలకు అడ్మిషన్లు ఇచ్చారు. అదేమిటని అడిగితే ఎస్‌వో మేడం చెబితేనే చేర్చుకుంటామని ఇన్‌చార్జ్ ఎస్‌వో సంధ్యారాణి తెలిపారని యాకోబు చెప్పాడు.
చర్యలు తీసుకుంటా
నేను ఇటీవలనే చార్జి తీసుకున్నా. నాకూ అచ్చంపేట పాఠశాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఫైల్ తెప్పించుకుని పరిశీలిస్తున్నా. పాఠశాల ఎస్‌వో సస్పెన్షలో ఉన్నారు. ఇన్‌స్పెక్షన్ చేసి విద్యార్థులకు వేళకు భోజనం అందేలా చర్యలు తీసుకుంటా. అర్హులైన విద్యార్థులందరీ అడ్మిషన్స్ ఉంటాయి. – సత్యవతి, ప్రాజెక్టు ఆఫీసర్,రాజీవ్‌విద్యామిషన్, గుంటూరు.