కస్తుర్బా విషయంలో అది రుజువైంది | special story to mahatma gandhi's wife Kasturba | Sakshi
Sakshi News home page

కస్తుర్బా విషయంలో అది రుజువైంది

Published Sun, Oct 1 2017 11:33 PM | Last Updated on Mon, Oct 2 2017 2:52 PM

special   story to  mahatma gandhi's wife Kasturba

నా దృష్టిలో బాను మించిన విద్యావంతులు లేరు.
నిజమైన చదువుకి నిఖార్సయిన ఉదాహరణ బా!

‘ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది’ అన్నది పాత నానుడే అయినా ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. గాంధీ, ఆయన సహధర్మచారిణి కస్తూర్బా విషయంలోనూ నిజమైంది. అనుక్షణం ఆమె జాతిపిత వెన్నంటి లేకపోతే స్వాతంత్య్ర పోరాటం సఫలమయ్యేదే కాదన్న మాటలో ఆవగింజంతైనా అతిశయోక్తి లేదు. అందుకే ఆ మహాత్ముడి జన్మదినం సందర్భంగా ఆ మహాఇల్లాలి బయోగ్రఫీ...

1869లో పుట్టారు కస్తూర్బా. ఆమె జన్మస్థలం కూడా గుజరాత్‌లోని పోరుబందరే. వ్రజ్‌కుంవర్, గోకుల్‌దాస్‌.. ఆమె తల్లిదండ్రులు. గోకుల్‌దాస్‌ పెద్ద వ్యాపారి. పశ్చిమాసియా, ఆఫ్రికా మార్కెట్లలో ఆహారధాన్యాలు, దుస్తులను అమ్మేవాడు. పోర్‌బందర్‌కు మేయర్‌గా కూడా పనిచేశారు. తల్లి గృహిణి. కస్తూర్బాకు ఇద్దరు అన్నదమ్ములు. కస్తూర్బా కుటుంబానికి, గాంధీ కుటుంబానికీ మొదటినుంచి మంచి స్నేహం ఉంది. కస్తూర్బా, గాంధీలకు పెళ్లి చేసి ఆ స్నేహాన్ని మరింత బలపర్చుకుందామనుకున్నారు ఇటు కస్తూర్బా తల్లిదండ్రులు అటు గాంధీ తల్లిదండ్రులు. అందుకే ఏడేళ్ల కస్తూర్బాకు గాంధీతో నిశ్చితార్థం చేసేసి పెళ్లి ఖాయం చేసుకున్నారు. పదమూడేళ్లు రాగానే పెళ్లి చేశారు. పెళ్లయిన కొత్తలోనే గాంధీ... మొగుడిగా కస్తూర్బా మీద పెత్తనం చలాయించడానికి, ఆమెను కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించారు. కాని తనకు నచ్చని విషయాల్లో ఆమె గాంధీ అభిప్రాయాలతో ఏకీభవించేవారు కాదు. స్వంతంగా ఆలోచించేవారు.. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేవారు. ప్రొఫెషనల్‌ కోర్స్‌ అయిన బారిష్టర్‌ చదువుకోసం గాంధీ ఇంగ్లండ్‌కు, లా ప్రాక్టీస్‌ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లడంతో కొన్నేళ్లపాటు ఆయనకు దూరంగానే ఉన్నారు కస్తూర్బా. బాల్యవివాహం కావడం వల్ల చదువుకూ దూరంగానే ఉంచారు ఆమె తల్లిదండ్రులు. ఈ కారణం వల్లే గాంధీ విదేశాల్లో ఉన్నప్పుడు వాళ్ల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు పెద్ద సమస్యగా తయారయ్యాయి.

స్వతంత్ర వ్యక్తిత్వం.. చెదరని ధైర్యం.. సమభాగస్వామ్యం
గాంధీ దక్షిణాఫ్రికా వెళ్లిన కొన్నాళ్లకు కస్తూర్బాను తీసుకెళ్లారు. అప్పటికే వాళ్లకు పిల్లలు. అక్కడ భారతీయులను మూడోతరగతి పౌరులుగా చూడడం, భారతీయుల పని పరిస్థితులు సరిగా లేకపోవడం గాంధీని కలవరపర్చింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక మనవాళ్లకు సముచిత గౌరవం అందించడానికి, వాళ్ల పరిస్థితులు మెరుగుపడడానికి ఉద్యమం ప్రారంభించారు ఆయన. భర్తకు అండగా ఆ ఉద్యమంలో పాలుపంచుకున్నారు కస్తూర్బా. 1913, సెప్టెంబర్‌లో ఆమె అరెస్ట్‌ అయ్యారు. మూడు నెలలు జైల్లో ఉన్నారు. దేశం కాని దేశం.. భాష రాదు.. చదువు లేదు.. పైగా జైలు.. సహజంగానే ధైర్యస్థురాలైన కస్తూర్బా ఆ సమస్యకు కుంగిపోలేదు సరికదా.. జైల్లో ఉన్న తోటి మహిళా ఖైదీలకూ ధీమాగా నిలబడ్డారు. శిక్షను ఎదుర్కొనే శక్తినిచ్చారు. అప్పుడే కాదు తాను తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టినప్పడూ అదే స్థయిర్యంతో ఉన్నారు. కాలానికే పరీక్ష పెట్టి ఆరోగ్యాన్ని సాధించారు. ఒకసారి గాంధీని బ్రిటిష్‌ పోలీసులు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయనను ఇంటి నుంచి తప్పించి తాను పిల్లలను తీసుకొని వెరే ఇంటికి మకాం మర్చారు కస్తూర్బా. గాంధీ సహాయం లేకుండానే పిల్లలను పోషిస్తూ రోజులు నెట్టుకొచ్చారు. సంయమనం, సామరస్యంతో ఉంటూ ఇరుగుపొరుగుకు తలలో నాలుకయ్యారు. పుట్టెడు కష్టాన్ని పొట్టలో పెట్టుకొని పెదవుల మీద మాత్రం చిరునవ్వుతోనే కనిపించేవారు. దక్షిణా ఆఫ్రికాలోనే కాదు గాంధీ భారతదేశానికి వచ్చి సాగించిన స్ట్రగుల్‌లోనూ సగపాలు తీసుకున్నారు కస్తూర్బా. సత్యాగ్రహం, విదేశీవస్తు బహిష్కరణ, క్విట్‌ ఇండియా.. ఇలా ఏ ఉద్యమంలో అయినా సమభాగస్వామ్యం నెరపారు. గాంధీ అరెస్ట్‌ అయితే ఆ స్ఫూర్తిని తాను కొనసాగించారు. మహిళా వాలంటీర్లలో ఉత్సాహాన్ని నింపారు.

బా.. గొప్ప నాయకురాలు
స్వాతంత్య్ర సమరంలో ఆమెదొక పాత్ర మాత్రమే కాదు.. గాంధీకి కొనసాగింపుగా ఆమెను వర్ణిస్తారు చరిత్రకారులు. క్విట్‌ ఇండియా ఉద్యమం ఊపందుకున్న సమయం అది. బొంబాయిలోని శివాజీ పార్క్‌లో గాంధీ ప్రసంగించాల్సి ఉండింది. ఈ లోపే బ్రిటిష్‌ పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఆ మీటింగ్‌లో కస్తూర్బా మాట్లాడాలని అనుకున్నారు గాంధీ. ఆ మాట జనాలకు తెలిసి తాము ఆప్యాయంగా బా అని పిలుచుకునే కస్తూర్బా ఉపన్యాసం వినాలనే ఆత్రంతో లక్షమంది దాకా గుమిగూడారు పార్క్‌లో. మీటింగ్‌కి బయలుదేరారు కస్తూర్బా. కాని మార్గమధ్యంలోనే పోలీసులు ఆమెను అడ్డుకొని ఆర్థర్‌ రోడ్డులోని జైలుకి తరలించారు. ఆ సమయంలో ఆమె అనుచరురాలు సుశీలా నాయర్‌ కస్తూర్బా పక్కనే ఉన్నారు. జైలుకి వెళుతూ ‘నేను ప్రాణాలతో బయటకి రాలేననిపిస్తోంది సుశీలా’ అని అన్నారట కస్తూర్బా. అన్నట్టుగానే జరిగింది. ఆర్థర్‌రోడ్‌లోని జైలు ఓ మురికి కూపం. అందులోకి వెళ్లగానే ఆమె అనారోగ్యం పాలయ్యారు. కొన్ని రోజులకు అక్కడి నుంచి ఆమెను పుణెలోని ఆగాఖాన్‌ ప్యాలెస్‌కు తరలించారు. అక్కడే 1944 ఫిబ్రవరి 22న గాంధీ ఒడిలో ప్రాణాలు వదిలారు కస్తూర్బా. మరుసటి రోజు అదే కంపౌండ్‌లో ఆమెకు అంతిమ సంస్కారాలు జరిగాయి. డస్సి పోయిన మొహంతో నిలబడ్డ గాంధీని అనుచరులంతా లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకొమ్మని అడిగారట.

‘62 ఏళ్ల సహజీవన అంతిమ ఘడియలివి. ఈ కార్యక్రమం పూర్తయ్యే వరకు నన్ను ఇక్కడనే ఉండనివ్వండి.. బా లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను’ అని అన్నారట గాంధీ బాధగా. ‘నేనంత ఒత్తిడి చేసినా.. బలవంత పెట్టినా తాను నమ్మిందే ఆచరించింది. నా కన్నా తనే గొప్పది అన్నిట్లో. నాతో అభిప్రాయా భేదాలున్నప్పటికీ నాతో కలిసి నడిచింది జీవితంలోనే కాదు.. నా పోరాటంలో, రాజకీయ యుద్ధంలో కూడా. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంది తప్ప వెనక్కి తగ్గలేదు.. నా దారి మార్చుకొమ్మని నన్ను పోరలేదు. ఆమె చదువులేనిదే కావచ్చు కాని నా దృష్టిలో బాను మించిన విద్యావంతులు లేరు. నిజమైన చదువుకి నిఖార్సయిన ఉదాహరణ బా. ఆమె ఫక్తు వైష్ణవ భక్తురాలే కావచ్చు. కాని వ్యవహారంలో ఒక హరిజన పిల్లను సాకి కులమత భేదాలు లేవని చూపిన మనిషి. ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో నిరాహార దీక్ష చేపట్టి మరణం అంచుదాకా వెళ్లి వచ్చాను. అప్పుడు ఆమె కళ్లల్లో నీటిని చూడలేదు. ఆశను చూశాను. ధైర్యాన్ని పొందాను. మంచి సాధించే విజయాన్ని పసిగట్టాను’ అని కస్తూర్బా గురించి తన ఆత్మకథలో రాసుకున్నారు గాంధీ.
 

రాతే రాదు... నోట్‌బుక్‌ ఎందుకు?
అంతగా చదువురాకపోయినా లెక్కలు, పద్దులు పర్‌ఫెక్ట్‌గా చూసేవారట కస్తూర్బా. అయితే చేతిరాత మాత్రం చిన్నపిల్లలా ఉండేదట. ప్రతి అక్షరం విడివిడిగా, అ క్షరానికి అక్షరానికి మధ్య ఒక్కోసారి ఎక్కువ ఎడం, ఇంకోసారి అసలు ఎడమే లేకుండా ఓ పద్ధతి లేకుండా రాసేవారట. ఆమె చేతిరాతను మార్చడానికి గాంధీ చాలానే ప్రయత్నించేవారట. ఒకసారి అందరూ అడిగినట్టే కస్తూర్బా కూడా గాంధీని ఒక నోట్‌బుక్‌ అడిగారట. అందరికీ నోట్‌ బుక్స్‌ ఇచ్చి కస్తూర్బాకు మాత్రం విడిగా పేపర్ల కట్ట ఇచ్చారట. ‘నీ చేతిరాగ ముత్యాల్లా మారిన తర్వాతే నీకు నోట్‌బుక్‌’ అన్నారట. ఆ మాటకామె చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారట. అది గ్రహించిన సుశీలా నాయర్‌ ఆ సంగతిని సరోజినీ నాయుడికి చేరవేశారట. వెంటనే ఆమె కస్తూర్బా కోసం ఓ నోట్‌బుక్‌ పంపారట. కాని ఆ బుక్‌ని బా తీసుకోలేదట. సుశీల బలవంతంగా ఇస్తే... తీసుకొని దాన్ని మహాత్మా గాంధీ దగ్గరున్న నోట్‌బుక్‌ దొంతరలో పెట్టేశారట. ఈ విషయం గాంధీకి తెలిసింది. కస్తూర్బా నొచ్చుకుందని అర్థమైంది. గాంధీకి తన తప్పు తెలిసింది. ‘ఆమె చేతిరాత మార్చడానికి ఇంకో కొత్త మార్గం అన్వేషించక పోగా, ఆమెను అవమానించానే’ అని చాలా బాధపడ్డారట. తరాత స్వయంగా ఆయనే నోట్‌బుక్‌ ఇస్తుంటే.. ‘రాతే రాని దానికి నోట్‌బుక్‌ ఎందుకు? ఏం చేసుకోను?’ అని అక్కడి నుంచి వెళ్లిపోయారట కస్తూర్బా.


రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ – గాంధీజీల సమావేశంలో కస్తూర్బా


గాంధీ, కస్తూర్బా పెళ్లినాటి ఫొటో

భారత స్వాతంత్య్రోద్యమంలో గాంధీతోపాటు కస్తూర్బా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement