దోమ, న్యూస్‌లైన్: ప్రభుత్వం చేపట్టిన రెండో విడత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రేషన్ కార్డుల మంజూరుకోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మరికొంత కాలం వేచిచూడక తప్పేలా లేదు. పలు కారణాలతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో రేషన్ కార్డులు వస్తాయని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో కలిపి రెండో విడత రచ్చబండలో 580 మంది కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి వీలైనంత త్వరగా రేషన్ కార్డులు అందిస్తామని అప్పట్లో ప్రభుత్వం, ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. అది మాటలకే పరిమితమైంది. కార్డుల జారీ ప్రక్రియ ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. తాజాగా లబ్ధిదారులకు అధికారులు చేస్తున్న సూచనలు కార్డుల మం జూరు ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని చెప్పకనే చెబుతున్నాయి. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ కుటుంబ సభ్యుల ఫొటోలతో పాటు ఆధార్ కార్డును జతచేసి అందజేయాలని స్థానిక రెవెన్యూ అధికారులు సూచించారు. వాటిని ఉన్నతాధికారులకు పంపిస్తామని, పరిశీలన పూర్తయ్యాకే కార్డులను జారీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఎన్ని నెలలు పడుతుందోనని కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తుచేసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు.