కూనవరం, న్యూస్‌లైన్: అతిసార వ్యాధికి గురై మండలంలోని టేకులబోరుకు చెందిన ఎడ్ల వేదవతి(40) మంగళవారం తెల్లవారుజామున స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితుల కథనం ప్రకారం.. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వేదవతిని తొలుత ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో చుట్టూ వరద నీరు ఉన్నప్పటికీ నాటు పడవ ద్వారా సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోని వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ చికిత్స చేసినప్పటికీ అతిసార అదుపులోకి రాలేదు.
దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. వరదల సమయంలో తప్పని సరిగా ఉండాల్సిన వైద్యులు విధుల్లో లేకపోవడం వల్లే మెరుగైన చికిత్స అందలేదని, ఈ కార ణంగానే వేదవతి మృతి చెందిందని ఆమె బంధువులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వరదల సమయంలో ప్రతి అధికారి స్థానికంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. ఇక్కడి వైద్యులు నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మండలంలో ఇది మూడవ కేసు కావడంతో వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరదల సమయంలో జాడలేని వైద్యులు..
Published Wed, Aug 7 2013 4:19 AM | Last Updated on Tue, Oct 9 2018 7:32 PM
Advertisement