Governement Hospital
-
వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో ఏటా వైఎస్సార్ జిల్లా రాయచోటి నుంచి నెల్లూరు రొట్టెల పండగకు వస్తున్న వారికి ఇదే జీవితంలో చివరి ప్రయాణమనే విషయం తెలియదు. వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, మరో ఇద్దర్ని పెద్దాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం బలిగొంది. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబ సభ్యులు. ఈ దుర్ఘటన ఇటు నెల్లూరు, అటు వైఎస్సార్ జిల్లాల్లో విషాదం నింపింది. వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి, నెల్లూరు: నగర శివారులోని ఎన్‌హెచ్ 5 శనివారం నెత్తురోడింది. దైవదర్శనానికి వస్తున్న వారిలో ఆరుగురి ప్రాణాలను డ్రైవర్ నిర్లక్ష్యం అక్కడికక్కడే బలిగొనగా, నెల్లూరు డీఎస్సార్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్యుల అలసత్వం మరో రెండు ప్రాణాలను గాలిలో కలిపింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. తాము దర్శించుకునేందుకు వస్తున్న బారాషహీద్ దర్గాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ దుర్ఘటన వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో చోటు చేసుకొంది. కూలికి వెళితే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి విషాదంలో మునిగాయి. అండ కోల్పోయి వీధినపడ్డాయి. ఈ ఘటన ఇటు నెల్లూరు, అటు వైఎస్సార్ జిల్లా వాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. రొట్టెల పండగ సందర్భంగా నెల్లూరులోని బారా షహీద్ దర్గాను దర్శించుకునేందుకు వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణం కొత్తపల్లి ప్రాంతానికి చెందిన సాహెబ్‌పీర్, రోషన్‌బీ దంపతులు తమ కుటుంబ సభ్యులతో పాటు అదే ప్రాంతానికి చెందిన మొత్తం 13 మంది ఏపీ04 టీవీ 1117 నంబర్ టాటాస్పేషియోలో నెల్లూరుకు బయల్దేరారు. శనివారం తెల్లవారు జామున 4:40 గంటల ప్రాంతంలో వెంకటాచలం టోల్‌ప్లాజావద్ద డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో వేగంగా వెళుతున్న వాహనం అదుపుతప్పి రాంగ్రూట్లో దూసుకెళ్లి విజయవాడ నుంచి శ్రీహరికోటకు జేసీబీ మిషన్‌ను తీసుకెళుతున్న లారీని ఢీకొట్టింది. సుమో నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన రోషన్‌బీ, ఆమె కుమారులు ఖాదర్‌వలి, ముస్తాఫాఅలీ, హసన్ అలీ, దర్బార్, డ్రైవర్ బాలరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షంషాద్, నూర్‌అహ్మద్, ఇర్ఫాన్, ఆరిపుల్లాఖాన్, రెడ్డెప్పరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరిగిందో, ఎక్కడున్నామో తెలియని స్థితిలో కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశారు. వీరి ఆర్తనాదాలు విన్న టోల్‌ప్లాజా సిబ్బంది స్పందించి క్షతగాత్రులను వాహనంలో నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరి మృతి డీఎస్సార్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలో క్షతగాత్రులను నెల్లూరు డీఎస్సార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా వారికి వైద్యం అందలేదు. ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లతో పాటు వైద్యసిబ్బంది సైతం లేరు. ప్రమాదం గురించి తెలిసినా స్పందించిన పాపాన పోలేదు. సకాలంలో వైద్యం అందక పోవడంతో ఆరు గంటల ప్రాంతంలో సాహెబ్‌పీర్, ఆయన కుమారుడు ఖాజావలి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలైన చిన్నపిల్లలు ఇర్ఫాన్, నూర్అహ్మద్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ పట్టించునేవారులేరు. అప్పటికి కూడా డీసీఓ, ఆర్ఎంఓ, సూపరింటెండెంట్‌తో పాటు ఒకరిద్దరు మినహా వైద్యులెవరూ ఆస్పత్రికి రాలేదు. ఆర్టీఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డి 8:30 గంటలకు ఆస్పత్రికి చేరుకొని అక్కడి పరిస్థితిని కళ్లారా చూసి చలించిపోయారు. ఒకరిద్దరు వైద్యులను, సిబ్బందికి చీవాట్లు పెట్టారు. మిగిలిన డాక్టర్లకు ఫోన్ చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని బొల్లినేని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అనంతరం 9 గంటలకు జేసీ లక్ష్మీకాంతం, 9:15కు కలెక్టర్ శ్రీకాంత్ ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికీ సూపరింటెండెంట్ ఆస్పత్రికి రాలేదు. కలెక్టర్ వచ్చారని తెలుసుకున్న తర్వాత నింపాదిగా ఆస్పత్రికి చేరుకున్నారు. వారిని చూసిన అక్కడి ప్రజలు, పాత్రికేయులు ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో వైద్యాధికారులపై కలెక్టర్ మండిపడ్డారు. ‘వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు. కొంచమైనా బాధ్యత లేదా?’. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా! మానవత్వంలేదా?’ అంటూ నిలదీశారు. వైద్యుల నిర్లక్ష్యంపై వెంటనే ఆర్డీఓతో విచారణ జరిపిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యులు ఆస్పత్రులలో ఎందుకు ఉండడం లేదు? వారికి సక్రమంగా డ్యూటీలు వేస్తున్నారా? అని మెడికల్ కళాశాల ఇన్చార్జిని కలెక్టర్ ప్రశ్నించారు. సాయంత్రంలోగా వైద్యుల డ్యూటీలకు సంబంధించిన వివరాలు అందచేయాలని ఆదేశించారు. ఆ తర్వాత క్షతగాత్రులను బొల్లినేనికి తరలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బొల్లినేనిలో వైద్యసేవలు అందిస్తున్నారు. అందరూ పేదలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారితో పాటు తీవ్రగాయాలపాలైన వారంతా నిరుపేదలే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. అందరూ భవన నిర్మాణ కార్మికులే. సీఎం ఆరా: రోడ్డు ప్రమాదంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరా తీశారు. కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున వైద్యసేవలు అందించాల కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. -
జిల్లా కేంద్రం నుంచి పెద్దాస్పత్రి బోధన్‌కు తరలింపు
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రం నుంచి పెద్దాస్పత్రిని మంత్రి పి సుదర్శన్ రెడ్డి నియోజకవర్గమైన బోధన్‌కు తరలించడం దాదాపుగా ఖరారైంది. రెండు రోజుల క్రితం ఇక్కడి నుంచి 23 మంది వైద్య ఉద్యోగులను బోధన్‌కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కేం ద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అనంతరం జిల్లా ఆస్పత్రిని తరలించడం అనివార్యమైంది. ఇదివరకే జిల్లా జాయింట్ కలెక్టర్ బోధన్‌లో స్థలపరిశీలన చేశారు. అయితే ఇటీవల వైద్యవిధాన పరిషత్ కమిషనర్ నాగార్జున బోధన్ ఆస్పత్రిని పరిశీలించారు. జిల్లా ఆస్పత్రిని ఇక్కడే ఏర్పాటు చేసేందుకు పడకల స్థాయి పెంపుపై సమీక్షించారు. పెద్దాస్పత్రి ఏర్పాటుతో బోధన్ చుట్టు పక్కల కోటగిరి, వర్ని, రెంజల్, ఎడపల్లి, మండలాలకు మైద్య సేవలు మెరుగుపడతాయి. ఇది లా ఉండగా జిల్లా ఆస్పత్రిని బాన్సువాడకు తరలించాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి 54 కిలోమీటర్ల దూరంలో ఉండే బాన్సువాడ వెనుకబడిన ప్రాంతమైనందున వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. బాన్సువాడ మూడు నియోజక వర్గాలు, 16 మండలాలకు కేంద్ర బిందువుగా ఉంది. జుక్కల్, మద్నూరు, పిట్లం, బిచ్కుంద, బీర్కూర్, నిజాంసాగర్, వర్ని, ఎల్లారెడ్డి తది తర మండలాలు ఈ ప్రాంతానికి దగ్గరగా ఉంటాయి. అధికారులు కూడా బాన్సువాడకే ఆస్పత్రిని తరలించాలని మొదట భావిం చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో బాన్సువాడ ఆస్పత్రిలో ఔట్పేషెంట్లు 18246 మంది, ఇన్ పేషెంట్లు 2744 మంది, బోధన్‌లో ఔట్ పేషెంట్లు 16,627 మంది , ఇన్‌పేషెంట్లు 948 మంది నమోదు అయ్యారు. జూన్‌లో బాన్సువాడలో ఔట్పేషెంట్లు 15686 మంది, ఇన్‌పేషెంట్లు 1749 మంది, బోధన్‌లో ఔట్పేషెంట్లు 16068 మంది, ఇన్‌పేషెంట్లు 972 మంది నమోదు అయ్యారు. జూలైలో బాన్సువాడలో ఔట్పేషెంట్లు 15553 మంది, ఇన్‌పేషెంట్లు 1591 మం ది, బోధన్‌లో ఔట్పేషెంట్లు 16647 మం ది, ఇన్‌పేషెంట్లు 970 మంది నమోదు అయ్యారు. ఈ వివరాల ప్రకారం రోగుల తాకిడి బాన్సువాడకే ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. బాన్సువాడకే తరలించాలి.... జిల్లా ఆసుపత్రిని బాన్సువాడకే తరలించాలి. వెనుకబడిన ప్రాంతం కాట్టి మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది. లేదంటే ఆందోళనలు చేసైనా సాధించుకుంటాం. -శ్రీనివాస్‌గౌడ్, జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ ఉన్నతాధికారుల నిర్ణయమే.. జిల్లా ఆస్పత్రి తరలింపు రాష్ట్ర ఉన్నతాధికారుల నిర్ణయం ప్రకారం జరుగుతుంది. తరలింపుపై పరిశీలన జరుగుతుంది. వారం రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. -బాలకృష్ణరావ్, ఇన్చార్జి డీసీహెచ్ఎస్ -
వరదల సమయంలో జాడలేని వైద్యులు..
కూనవరం, న్యూస్‌లైన్: అతిసార వ్యాధికి గురై మండలంలోని టేకులబోరుకు చెందిన ఎడ్ల వేదవతి(40) మంగళవారం తెల్లవారుజామున స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితుల కథనం ప్రకారం.. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వేదవతిని తొలుత ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగుపడకపోవడంతో చుట్టూ వరద నీరు ఉన్నప్పటికీ నాటు పడవ ద్వారా సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలోని వైద్యులు అందుబాటులో లేకపోవడంతో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ చికిత్స చేసినప్పటికీ అతిసార అదుపులోకి రాలేదు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. వరదల సమయంలో తప్పని సరిగా ఉండాల్సిన వైద్యులు విధుల్లో లేకపోవడం వల్లే మెరుగైన చికిత్స అందలేదని, ఈ కార ణంగానే వేదవతి మృతి చెందిందని ఆమె బంధువులు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వరదల సమయంలో ప్రతి అధికారి స్థానికంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా.. ఇక్కడి వైద్యులు నిర్లక్ష్యం వీడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మండలంలో ఇది మూడవ కేసు కావడంతో వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.