వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం | Venkatachalam at toll plaza deadly accident | Sakshi
Sakshi News home page

వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Published Sun, Nov 17 2013 4:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Venkatachalam at toll plaza deadly accident

కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో ఏటా వైఎస్సార్ జిల్లా రాయచోటి నుంచి నెల్లూరు రొట్టెల పండగకు వస్తున్న వారికి ఇదే జీవితంలో చివరి ప్రయాణమనే విషయం తెలియదు. వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, మరో ఇద్దర్ని పెద్దాస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం బలిగొంది. మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబ సభ్యులు. ఈ దుర్ఘటన ఇటు నెల్లూరు, అటు వైఎస్సార్ జిల్లాల్లో విషాదం నింపింది. వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
 
 సాక్షి, నెల్లూరు: నగర శివారులోని ఎన్‌హెచ్ 5 శనివారం నెత్తురోడింది. దైవదర్శనానికి వస్తున్న వారిలో ఆరుగురి ప్రాణాలను  డ్రైవర్ నిర్లక్ష్యం అక్కడికక్కడే బలిగొనగా, నెల్లూరు డీఎస్సార్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్యుల అలసత్వం మరో రెండు ప్రాణాలను గాలిలో కలిపింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

 మృతుల్లో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. తాము దర్శించుకునేందుకు వస్తున్న బారాషహీద్ దర్గాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ దుర్ఘటన వెంకటాచలం టోల్‌ప్లాజా సమీపంలో చోటు చేసుకొంది. కూలికి వెళితే తప్ప పూట గడవని నిరుపేద కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి విషాదంలో మునిగాయి. అండ కోల్పోయి వీధినపడ్డాయి. ఈ ఘటన ఇటు నెల్లూరు, అటు వైఎస్సార్ జిల్లా వాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. రొట్టెల పండగ సందర్భంగా నెల్లూరులోని బారా షహీద్ దర్గాను దర్శించుకునేందుకు వైఎస్సార్ జిల్లా రాయచోటి పట్టణం కొత్తపల్లి ప్రాంతానికి చెందిన సాహెబ్‌పీర్, రోషన్‌బీ దంపతులు తమ కుటుంబ సభ్యులతో పాటు అదే ప్రాంతానికి చెందిన మొత్తం 13 మంది ఏపీ04 టీవీ 1117 నంబర్ టాటాస్పేషియోలో నెల్లూరుకు బయల్దేరారు.

శనివారం తెల్లవారు జామున 4:40 గంటల ప్రాంతంలో వెంకటాచలం టోల్‌ప్లాజావద్ద డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు.  దీంతో వేగంగా వెళుతున్న వాహనం అదుపుతప్పి రాంగ్‌రూట్‌లో దూసుకెళ్లి విజయవాడ నుంచి శ్రీహరికోటకు జేసీబీ మిషన్‌ను తీసుకెళుతున్న లారీని ఢీకొట్టింది. సుమో నుజ్జునుజ్జైంది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన రోషన్‌బీ, ఆమె కుమారులు ఖాదర్‌వలి, ముస్తాఫాఅలీ, హసన్ అలీ, దర్బార్, డ్రైవర్ బాలరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షంషాద్, నూర్‌అహ్మద్, ఇర్ఫాన్, ఆరిపుల్లాఖాన్, రెడ్డెప్పరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఏం జరిగిందో, ఎక్కడున్నామో తెలియని స్థితిలో కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశారు. వీరి ఆర్తనాదాలు విన్న టోల్‌ప్లాజా సిబ్బంది స్పందించి క్షతగాత్రులను వాహనంలో నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
 
 వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరి మృతి
 డీఎస్సార్ ఆస్పత్రి  వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలో క్షతగాత్రులను నెల్లూరు డీఎస్సార్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా వారికి వైద్యం అందలేదు. ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లతో పాటు వైద్యసిబ్బంది సైతం లేరు. ప్రమాదం గురించి  తెలిసినా స్పందించిన పాపాన పోలేదు. సకాలంలో వైద్యం అందక పోవడంతో ఆరు గంటల ప్రాంతంలో సాహెబ్‌పీర్, ఆయన కుమారుడు ఖాజావలి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలైన చిన్నపిల్లలు ఇర్ఫాన్, నూర్‌అహ్మద్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ పట్టించునేవారులేరు. అప్పటికి కూడా డీసీఓ, ఆర్‌ఎంఓ, సూపరింటెండెంట్‌తో పాటు ఒకరిద్దరు మినహా వైద్యులెవరూ ఆస్పత్రికి రాలేదు.
 
  ఆర్టీఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డి 8:30 గంటలకు  ఆస్పత్రికి చేరుకొని అక్కడి పరిస్థితిని కళ్లారా చూసి చలించిపోయారు. ఒకరిద్దరు వైద్యులను, సిబ్బందికి చీవాట్లు పెట్టారు. మిగిలిన డాక్టర్లకు ఫోన్ చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని బొల్లినేని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. అనంతరం 9 గంటలకు  జేసీ లక్ష్మీకాంతం, 9:15కు కలెక్టర్ శ్రీకాంత్ ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికీ సూపరింటెండెంట్ ఆస్పత్రికి రాలేదు. కలెక్టర్ వచ్చారని తెలుసుకున్న తర్వాత నింపాదిగా ఆస్పత్రికి చేరుకున్నారు. వారిని చూసిన అక్కడి ప్రజలు, పాత్రికేయులు ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో వైద్యాధికారులపై  కలెక్టర్ మండిపడ్డారు. ‘వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు. కొంచమైనా బాధ్యత లేదా?’. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా! మానవత్వంలేదా?’ అంటూ నిలదీశారు. వైద్యుల నిర్లక్ష్యంపై వెంటనే ఆర్డీఓతో విచారణ జరిపిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యులు ఆస్పత్రులలో ఎందుకు ఉండడం లేదు? వారికి సక్రమంగా డ్యూటీలు వేస్తున్నారా? అని మెడికల్ కళాశాల ఇన్‌చార్జిని కలెక్టర్ ప్రశ్నించారు. సాయంత్రంలోగా వైద్యుల డ్యూటీలకు సంబంధించిన వివరాలు అందచేయాలని ఆదేశించారు. ఆ తర్వాత క్షతగాత్రులను బొల్లినేనికి తరలించారు.   కలెక్టర్ ఆదేశాల మేరకు బొల్లినేనిలో వైద్యసేవలు అందిస్తున్నారు.  
 
 అందరూ పేదలే
 రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారితో పాటు తీవ్రగాయాలపాలైన వారంతా నిరుపేదలే. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు. అందరూ భవన నిర్మాణ కార్మికులే.  
 సీఎం ఆరా: రోడ్డు ప్రమాదంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరా తీశారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మృతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున వైద్యసేవలు అందించాల కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement