నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : ఆర్థికలావాదేవీల వివాదాల నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా కోరుగుంటపల్లి నివాసి తుమ్మల అరుణ్‌కుమార్‌రెడ్డి అనే రియల్టర్‌ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి భార్య ఉమాకాత్యాయిని, బంధువులు ఆరోపించారు. తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆమె వాపోయింది.
అరుణ్‌కుమార్‌రెడ్డి, రాధాకుమార్‌రెడ్డి మధ్య ఆర్థికపరమైన విభేదాలున్నాయి. మదనపల్లెలోని స్థలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని అరుణ్‌కుమార్‌రెడ్డిపై రాధాకుమార్‌రెడ్డి ఒత్తిడి పెంచాడు. దీంతో వివాదం ముదిరింది. నగరంలోని హోటల్ పావని రెసిడెన్సీ రూం నంబర్ 502లో శనివారం అనుమానాస్పద స్థితిలో అరుణ్ మృతి చెందాడు. మృతుని భార్య ఉమాకాత్యాయిని, కుమారుడు సాయిరాఘవరెడ్డి, కుమార్తె మల్లికారెడ్డి, బంధువులు ఆదివారం తెల్లవారుజామున నెల్లూరుకు చేరుకున్నారు. మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. ఓ పథకం ప్రకారం అరుణ్‌కుమార్‌రెడ్డిని కిడ్నాప్ చేసి హత్య చేశారని బాధితులు ఆరోపించారు. ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు.
రాధాకుమార్‌రెడ్డితోనే విభేదాలు
తన భర్తకు రాధాకుమార్‌రెడ్డితో మినహా మరెవ్వరితోనూ విభేదాలు లేవని ఉమా కాత్యాయిని పేర్కొన్నారు. కొంతకాలంగా మదనపల్లిలోని భూమి విషయమై వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయన్నారు. గతనెల 27న అరుణ్‌కుమార్‌రెడ్డి పని నిమిత్తం హైద రాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారన్నారు. అప్పటి నుంచి ప్రతి రోజు తనతో ఫోనులో మాట్లాడుతున్నారన్నారు.
చివరిసారిగా డిసెంబర్ 31వ తేదీ తనతో మాట్లాడినట్టు ఆమె తెలి పారు. రాధాకుమార్‌రెడ్డి, అతని కుమారుడు చైతన్యరెడ్డి, వియ్యంకుడు దేవకుమార్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారు చంపుతామని బెదిరిస్తున్నారని ఫోన్‌లో తనకు చెప్పినట్టు ఆమె వివరించారు. ఒకటో తేదీ నుంచి అరుణ్‌కుమార్‌రెడ్డి ఫోన్ స్విచ్ ఆప్ వేసి ఉందన్నారు. నాల్గోతేదీ ఉదయం 10.30 గంటలకు తన భర్త పనిచేసే సంస్థ యజమాని సుదర్శన్‌రెడ్డి తమకు ఫోన్ చేసి అరుణ్‌కుమార్‌రెడ్డి పనైపోయిందని దేవకుమార్‌రెడ్డి తనతో చెప్పాడని, పావనిలాడ్జిలో మృతదేహం ఉం దని సమాచారం ఇచ్చినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మహత్యపై పలు అనుమానాలు
అరుణ్‌కుమార్‌రెడ్డి ఆత్మహత్య పలు అనుమానాలకు తావిచ్చేలా ఉందని బాధితులు వాపోయారు. బెంగళూరులో ఉండాల్సిన అరుణ్‌కుమార్‌రెడ్డి నెల్లూరుకు ఎందుకు వచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు? లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్న సమయంలో తప్పుడు సెల్‌నంబరు ఎందుకు ఇచ్చాడు? అతనితో పాటు గదిలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? రాధాకుమార్‌రెడ్డి లాడ్జికి ఎందుకు వచ్చాడు? తదితర అనుమానాలను వ్యక్తం చేశారు.
సంఘటన స్థలాన్ని
పరిశీలించిన ఎస్పీ
బాధితులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆదివారం సంఘటన స్థలాన్ని ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ పరిశీలించారు. మృతుడి స్నేహితుడు చల్లా రవీంద్రరెడ్డిని, హోటల్ సిబ్బందిని ఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరుణ్‌కుమార్‌రెడ్డి దిగిన గదిని ఎవరు బుక్ చేశారు? ఎవరెవరు గదికి వచ్చి వెళ్లారు? ఏ సమయంలో గది తలుపులు తెరిచారు? గదికి గడియ వేసి ఉందా లేదా? అన్న వివరాలను సేకరించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన నగర డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డి, నాల్గో నగర సీఐ జి.రామారావును ఆదేశించారు. రాధాకుమార్‌రెడ్డి, చైతన్యరెడ్డి, దేవకుమార్‌రెడ్డి వల్ల తమకు ప్రాణహాని ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఎస్పీ దృష్టికి తీసుకురావడంతో విచారించి తగిన రక్షణ కల్పిస్తామన్నారు. మృతిపై నాల్గోనగర సిఐ జి.రామారావు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
నా భర్తను చంపేశారు
Published Mon, Jan 6 2014 5:55 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement