సాక్షి, నెల్లూరు : ఈ నెల 8న జిల్లాలో షర్మిల సమైక్య శంఖారావం పూరించనున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో 7న షర్మిల సమైక్య శంఖారావం బస్సుయాత్ర ముగించుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు షర్మిల యాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించనుంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఆమె ఆత్మకూరులో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సంగం, బుచ్చిరెడ్డిపాళెం, రాజుపాళెం మీదుగా కావలికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు కావలిలో జరిగే సభలో ఆమె ప్రసంగిస్తారు.
రాత్రికి కావలిలో బస చేస్తారు. షర్మిల యాత్ర షెడ్యూల్ వివరాలను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నగరంలోని తన అతిథిగృహంలో బుధవారం విలేకరులకు వెల్లడించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పాటు సమైక్యాంధ్ర కోరుకునే ఉద్యోగ, కార్మిక, కర్షక, విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారు షర్మిల యాత్రలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. షర్మిలయాత్ర విజయవంతం చేసేందుకు అన్ని నియోజక వర్గాల పార్టీ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీ తెలిపారు. షర్మిల యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. సమైక్యాంధ్ర కోసం స్పష్టమైన వైఖరితో ఉన్నది వైఎస్సార్ సీపీ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందే
సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వైఎస్సార్‌సీపీ
సీజీసీ మెంబర్, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం నెల్లూరులోని ఆయన అతిధి గృహంలో ఎంపీ విలేకరులతో మాట్లాడారు. సమైక్యాంధ్రపై చిత్తశుద్ధితోనే తాము రాజీనామాలు చేసినట్లు పేర్కొన్నారు. గత జూలై 25న ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు. ఇచ్చాపురంలో జరిగిన షర్మిల సభలో తాను రాజీనామా ప్రకటించానన్నారు. 5 వ తేదీననే స్వీకర్ పార్మెట్‌లో రాజీనామా చేశానని, అప్పటినుండి పార్లమెంట్‌కు వెల్లడం లేదని మేకపాటి వెల్లడించారు. ఎప్పుడైనా తమ రాజీనామాలు ఆమోదించుకోవచ్చని ఎంపీ చెప్పారు. విభజనతో న్యాయం జరగదు కాబట్టే సమైక్యాంధ్ర కోరుతున్నట్లు మేకపాటి పేర్కొన్నారు. విభజన ప్రకటనను కాంగ్రెస్ అధిష్టానం తక్షణం ఉపసంహరించుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు. గురువారం నెల్లూరులో జరిగే సమైక్యాంధ్ర సింహగర్జన సభను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులకు ఎంపీ మేకపాటి పిలుపునిచ్చారు. అలాగే జిల్లాలో 8 వ తేదీన జరిగే షర్మిల యాత్రను అందరూ విజయవంతం చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగమురళీధర్, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి,సూళ్లూరుపేట సమన్వయకర్త సంజీవయ్య,వెంకటేశ్వరరెడ్డి, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.