బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు వల్ల జలాశయానికి భారీ గా వరద ప్రవాహం రానుంది.
సోమశిల, న్యూస్‌లైన్ : బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు వల్ల జలాశయానికి భారీ గా వరద ప్రవాహం రానుంది. బుధవా రం ఉదయం జలాశయానికి 17 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుం డగా సాయంత్రానికి 30 వేలకు పెరి గినట్లు సమాచారం. జలాశయంలో నీటి నిల్వ ప్రస్తుతం 53 టీఎంసీలకు చేరువలో ఉంది.
జలాశయానికి ఈ దఫా కురుస్తు న్న వర్షాలు మరింత ఊతమిస్తున్నాయి. పెన్నానది పైతట్టు ప్రాంతాలైన నంద్యా ల సమీపంలోని రాజోలుబండ వద్ద 5 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది. వైఎస్సార్ జిల్లా పైతట్టుప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కుందూ, పాపాగ్ని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పెన్నానది ప్రధాన హెడ్ రెగ్యులేటర్ అయిన ఆదినిమ్మాయపల్లి వద్ద ఉదయం 20,380 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా మధ్యాహ్నానికి 23,600 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రానికి 32,500 క్యూసెక్కుల వంతున వరద ఉధృతి నమోదైంది. ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చెన్నూరు గేజి వద్ద ఉదయం 20 వేల క్యూసెక్కుల వరద నమోదైంది. మధ్యాహ్నం 26 వేలకు పెరిగింది. గరిష్టంగా సాయంత్రానికి 30 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది.
ఉధృతంగా సగిలేరు
వైఎస్సార్ జిల్లా బీకోడూరు మండలంలోని సగిలేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సగిలేరు ఉదయం 22 వేల క్యూసెక్కుల వంతున నీరు ప్రవహిస్తోంది. మధ్యాహ్నానికి సగిలేరుకు వరద ఉధృతి పెరగడంతో అవుట్‌ఫ్లోను పెంచి 24,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలను సాయంత్రానికి 26 వేల క్యూసెక్కులను పెంచారు. 16 ఏళ్లలో ఇంత వరద ఉధృతంగా రావడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు.
కండలేరుకు నీటి విడుదల పెంపు
సోమశిల జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తున్న నేపథ్యంలో కండలేరుకు నీటి విడుదలను పెంచారు. ఉదయం 6 వేల క్యూసెక్కుల వంతున వరద కాలువ ద్వారా విడుదల చేశారు. జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో కండలేరుకు నీటి విడుదలను పెంచి 10 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయానికి వస్తున్న వరద మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగితే పూర్తి నీటి నిల్వ 72 టీఎంసీలకు చేరుకోనుంది.