ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాల వినియోగాన్ని భారతదేశం ప్రోత్సహిస్తోంది. కోవిడ్–19 సమయంలో అభివృద్ధి చేసి అమలు చేసిన కో–విన్, ఈ–సంజీవని వంటివి లక్ష్యాల సాధన కోసం ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే ఒకరితో సంబంధం లేకుండా మరొకరు పనిచేసినప్పుడు ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంవత్సరాల తరబడి వినియోగంలో ఉన్న వ్యవస్థ మరో ప్రాంతంలో మళ్లీ మొదటి నుంచి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో జరుగుతున్నది ఇదే. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠంగా అమలు జరగడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణిక వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. జీ–20 అధ్యక్ష హోదాలో ఏకాభిప్రాయం సాధించడానికి భారతదేశం పని చేస్తోంది.
ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకోండి. ఇంటర్నెట్ సౌకర్యం లేక ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విడివిడిగా పనిచేస్తున్న కంప్యూటర్ నెట్‌వర్క్‌ల పనితీరు ఎలా ఉంటుంది? ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కంప్యూటర్ నెట్‌వర్క్ పనిచేసినప్పుడు ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంవత్సరాల తరబడి వినియోగంలో ఉన్న వ్యవస్థ మరో ప్రాంతంలో నూతన వ్యవస్థగా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రామాణిక ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) అమలులో లేకపోతే పరిస్థితి అసంబద్ధంగా ఉండేది.
ఇది ప్రస్తుతం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో నెలకొని ఉన్న పరిస్థితిని గుర్తు చేస్తోంది. వివిధ సాంకేతిక అంశాల ఆధారంగా, వివిధ ప్రాంతాల్లో వివిధ విధాలుగా డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ సాగుతోంది. సరైన విధంగా అమలు జరిగి ఆశించిన ఫలితాలు ఇవ్వడానికి ఆ వ్యవస్థ మార్గనిర్దేశకుల కోసం ఎదురు చూస్తోంది. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠంగా అమలు జరగడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణిక వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. వ్యవస్థను పటిష్ఠంగా అమలు చేయడానికి అంతర్జాతీయ నాయకత్వం అవసరం ఉంటుంది.
డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పరిమాణం చిన్నదిగా కనిపించవచ్చు. అయితే, ఈ రంగం అనేక రంగాల్లో అవకాశాలను అందిస్తుంది. స్మార్ట్ వేరియబుల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ కేర్, రీమోట్ మానిటరింగ్, కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్, బ్లాక్–చైన్, రీమోట్ డేటా లాంటి రంగాల్లో అపారమైన అవకాశాలు వస్తాయి. డిజిటల్ పరికరాల సామర్థ్యం, అవసరం కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన చర్యల ప్రాధాన్యాన్ని గుర్తించాల్సి ఉంటుంది.
డిజిటల్ సాధనాల వినియోగం
ఇటీవలి కాలంలో ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాల వినియోగాన్ని భారతదేశం ప్రోత్సహిస్తోంది. కోవిడ్–19 సమయంలో అభివృద్ధి చేసి అమలు చేసిన కో–విన్, ఈ–సంజీవని వంటివి లక్ష్యాల సాధన కోసం ఉపయోగపడ్డాయి. టీకా కార్యక్రమం, ఆరోగ్య సంరక్షణ చర్యల అమలులో సమూల మార్పులు వచ్చాయి. డిజిటల్ సాధనాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే అంశంలో ప్రభుత్వం విజయం సాధించింది.
భారతదేశంలో అమలు జరిగిన అతిపెద్ద టీకా కార్యక్రమానికి కో–విన్ వెన్నెముకగా నిలిచింది. కో–విన్ ద్వారా వ్యాక్సిన్ రవాణా కార్యక్రమం అమలు జరిగిన తీరును ప్రభుత్వం పర్యవేక్షించింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ టీకా కోసం నమోదు చేసుకోవడం, డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేయడం లాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కో–విన్ సహకారంతో జరిగాయి.
ఇక్కడ మరో డిజిటల్ సాధనం ఈ– సంజీవని గురించి ప్రస్తావించాలి. ఈ–సంజీవని ద్వారా ప్రజలు ఆన్‌లైన్ ద్వారా ఆరోగ్య సంప్రదింపులను పొందుతున్నారు. తమ ఇళ్ల నుంచే నిపుణులను సంప్రదించి సలహాలు పొందే అవకాశాన్ని ఈ–సంజీవని అందుబాటులోకి తెచ్చింది. 10 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ–సంజీవని ద్వారా ప్రయోజనం పొందారు. గరిష్ఠ స్థాయిలో ఈ–సంజీవని ద్వారా రోజుకు 5 లక్షల సంప్రదింపులు జరిగాయి.
డిజిటల్ విధానంలో నిర్వహించిన కోవిడ్ వార్ రూమ్ వల్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలిగింది. దీని ద్వారా జాతీయ, రాష్ట్ర , జిల్లా స్థాయిలో వ్యాధి తీవ్రత తెలుసుకుని అవసరమైన సామగ్రి సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం కలిగింది. ఆరోగ్య సేతు, ఆర్టీ –పీసీఆర్ యాప్, ఇతర డిజిటల్ సాధనాలను విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించిన ప్రభుత్వం కోవిడ్–19 మహమ్మారి రూపంలో వచ్చిన భారీ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించగలిగింది.
ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాలను పూర్తి సామర్థ్యం మేరకు ఉపయోగించుకోవడానికి పటిష్ఠమైన వ్యవస్థ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ– ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్) పని చేయడం ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు వారి వైద్య రికార్డులు నిల్వ చేయడానికి, అవసరమైన సమయంలో చూసి అవసరమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి నిపుణులకు పంపడానికి అవకాశం కలుగుతుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి సాధించిన విజయాలు, ప్రణాళికలను ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది.
ముఖ్యంగా తక్కువ, మధ్య–ఆదాయ దేశాలు భారతదేశం అనుసరించిన విధానాలు అనుసరించి తమ దేశ ప్రజలకు డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావడానికి వీలవుతుంది. దీనివల్ల సార్వత్రిక ఆరోగ్య కల సాకారం అవుతుంది.
ఎదుర్కొంటున్న సవాళ్లు
కాపీరైట్, ఇతర నిర్వహణ యాజమాన్య వ్యవస్థల వల్ల డిజిటల్ పరిష్కార వేదికలు అందరికీ అందుబాటులోకి రావడం లేదు. కొన్ని డిజిటల్ సాధనాలు లేదా ఓపెన్ సోర్స్ పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి వినియోగం పరిమితంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం అని చెప్పుకోవచ్చు.
ప్రపంచ స్థాయిలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రయత్నాలు విడివిడిగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా దేశాల మధ్య సహకారం లేకుండా సాగుతున్నాయి. దీనికోసం ప్రపంచ దేశాలు ఒక వేదిక పైకి వచ్చి సంఘటిత ప్రయత్నాలు సాగించాలి. దీనికి జీ–20 ఒక సమగ్ర, పటిష్ట వేదికగా పనిచేస్తుంది. ఈ ప్రయత్నాలు భవిష్యత్తు అవసరాలకు అవసరమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి దారి తీస్తాయి.
జీ–20 అధ్యక్ష హోదాలో...
ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. దీనికి అవసరమైన ప్రణాళిక కూడా భారతదేశం వద్ద సిద్ధంగా ఉంది.
ముందుగా విడివిడిగా జరుగుతున్న ప్రయత్నాలను సంఘటితం చేయాల్సి ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ ప్రయోజనం కలిగించేలా ఈ చర్యలు అమలు జరగాలి. దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ అభివృద్ధి కోసం జరిగిన ప్రయత్నం, కృషి మరోసారి డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి కోసం జరగాల్సి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సమాచార మార్పిడిపై దేశాల మధ్య నమ్మకం పెరిగేలా చూసి, అవసరమైన నిధులు సమకూర్చ డానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరగాలి.
జీ–20 అధ్యక్ష హోదాలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం సాధించడానికి భారతదేశం పని చేస్తోంది. ఆచరణ సాధ్యమైన వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలు ముఖ్యంగా దక్షిణ దేశాలు ప్రయోజనం పొందేలా చూసేందుకు భారతదేశం కృషి చేస్తోంది. స్వప్రయోజ నాలను పక్కన పెట్టి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ప్రపంచ ఆరోగ్యం కోసం కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమయింది.
డాక్టర్ మన్‌సుఖ్ మండావియా
వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు – ఎరువుల శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment