health system
-
ప్రపంచ ఆరోగ్యమే లక్ష్యంగా...
ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాల వినియోగాన్ని భారతదేశం ప్రోత్సహిస్తోంది. కోవిడ్–19 సమయంలో అభివృద్ధి చేసి అమలు చేసిన కో–విన్, ఈ–సంజీవని వంటివి లక్ష్యాల సాధన కోసం ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే ఒకరితో సంబంధం లేకుండా మరొకరు పనిచేసినప్పుడు ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంవత్సరాల తరబడి వినియోగంలో ఉన్న వ్యవస్థ మరో ప్రాంతంలో మళ్లీ మొదటి నుంచి వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో జరుగుతున్నది ఇదే. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠంగా అమలు జరగడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణిక వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. జీ–20 అధ్యక్ష హోదాలో ఏకాభిప్రాయం సాధించడానికి భారతదేశం పని చేస్తోంది. ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించుకోండి. ఇంటర్నెట్ సౌకర్యం లేక ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా విడివిడిగా పనిచేస్తున్న కంప్యూటర్ నెట్‌వర్క్‌ల పనితీరు ఎలా ఉంటుంది? ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కంప్యూటర్ నెట్వర్క్ పనిచేసినప్పుడు ప్రపంచంలో ఒక ప్రాంతంలో సంవత్సరాల తరబడి వినియోగంలో ఉన్న వ్యవస్థ మరో ప్రాంతంలో నూతన వ్యవస్థగా వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రామాణిక ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) అమలులో లేకపోతే పరిస్థితి అసంబద్ధంగా ఉండేది. ఇది ప్రస్తుతం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో నెలకొని ఉన్న పరిస్థితిని గుర్తు చేస్తోంది. వివిధ సాంకేతిక అంశాల ఆధారంగా, వివిధ ప్రాంతాల్లో వివిధ విధాలుగా డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ సాగుతోంది. సరైన విధంగా అమలు జరిగి ఆశించిన ఫలితాలు ఇవ్వడానికి ఆ వ్యవస్థ మార్గనిర్దేశకుల కోసం ఎదురు చూస్తోంది. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పటిష్ఠంగా అమలు జరగడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణిక వ్యవస్థ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. వ్యవస్థను పటిష్ఠంగా అమలు చేయడానికి అంతర్జాతీయ నాయకత్వం అవసరం ఉంటుంది. డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ పరిమాణం చిన్నదిగా కనిపించవచ్చు. అయితే, ఈ రంగం అనేక రంగాల్లో అవకాశాలను అందిస్తుంది. స్మార్ట్ వేరియబుల్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ కేర్, రీమోట్ మానిటరింగ్, కృత్రిమ మేధస్సు, డేటా అనలిటిక్స్, బ్లాక్–చైన్, రీమోట్ డేటా లాంటి రంగాల్లో అపారమైన అవకాశాలు వస్తాయి. డిజిటల్ పరికరాల సామర్థ్యం, అవసరం కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన చర్యల ప్రాధాన్యాన్ని గుర్తించాల్సి ఉంటుంది. డిజిటల్ సాధనాల వినియోగం ఇటీవలి కాలంలో ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాల వినియోగాన్ని భారతదేశం ప్రోత్సహిస్తోంది. కోవిడ్–19 సమయంలో అభివృద్ధి చేసి అమలు చేసిన కో–విన్, ఈ–సంజీవని వంటివి లక్ష్యాల సాధన కోసం ఉపయోగపడ్డాయి. టీకా కార్యక్రమం, ఆరోగ్య సంరక్షణ చర్యల అమలులో సమూల మార్పులు వచ్చాయి. డిజిటల్ సాధనాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షలాది మంది ప్రజలకు ఆరోగ్య సేవలు అందించే అంశంలో ప్రభుత్వం విజయం సాధించింది. భారతదేశంలో అమలు జరిగిన అతిపెద్ద టీకా కార్యక్రమానికి కో–విన్ వెన్నెముకగా నిలిచింది. కో–విన్ ద్వారా వ్యాక్సిన్ రవాణా కార్యక్రమం అమలు జరిగిన తీరును ప్రభుత్వం పర్యవేక్షించింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ టీకా కోసం నమోదు చేసుకోవడం, డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేయడం లాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కో–విన్ సహకారంతో జరిగాయి. ఇక్కడ మరో డిజిటల్ సాధనం ఈ– సంజీవని గురించి ప్రస్తావించాలి. ఈ–సంజీవని ద్వారా ప్రజలు ఆన్లైన్ ద్వారా ఆరోగ్య సంప్రదింపులను పొందుతున్నారు. తమ ఇళ్ల నుంచే నిపుణులను సంప్రదించి సలహాలు పొందే అవకాశాన్ని ఈ–సంజీవని అందుబాటులోకి తెచ్చింది. 10 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ–సంజీవని ద్వారా ప్రయోజనం పొందారు. గరిష్ఠ స్థాయిలో ఈ–సంజీవని ద్వారా రోజుకు 5 లక్షల సంప్రదింపులు జరిగాయి. డిజిటల్ విధానంలో నిర్వహించిన కోవిడ్ వార్ రూమ్ వల్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలిగింది. దీని ద్వారా జాతీయ, రాష్ట్ర , జిల్లా స్థాయిలో వ్యాధి తీవ్రత తెలుసుకుని అవసరమైన సామగ్రి సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం కలిగింది. ఆరోగ్య సేతు, ఆర్టీ –పీసీఆర్ యాప్, ఇతర డిజిటల్ సాధనాలను విధాన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించిన ప్రభుత్వం కోవిడ్–19 మహమ్మారి రూపంలో వచ్చిన భారీ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించగలిగింది. ప్రజారోగ్య రంగంలో డిజిటల్ సాధనాలను పూర్తి సామర్థ్యం మేరకు ఉపయోగించుకోవడానికి పటిష్ఠమైన వ్యవస్థ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ– ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎమ్) పని చేయడం ప్రారంభించింది. దీని ద్వారా ప్రజలు వారి వైద్య రికార్డులు నిల్వ చేయడానికి, అవసరమైన సమయంలో చూసి అవసరమైన ఆరోగ్య సంరక్షణ పొందడానికి నిపుణులకు పంపడానికి అవకాశం కలుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం డిజిటల్ ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి సాధించిన విజయాలు, ప్రణాళికలను ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా తక్కువ, మధ్య–ఆదాయ దేశాలు భారతదేశం అనుసరించిన విధానాలు అనుసరించి తమ దేశ ప్రజలకు డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావడానికి వీలవుతుంది. దీనివల్ల సార్వత్రిక ఆరోగ్య కల సాకారం అవుతుంది. ఎదుర్కొంటున్న సవాళ్లు కాపీరైట్, ఇతర నిర్వహణ యాజమాన్య వ్యవస్థల వల్ల డిజిటల్ పరిష్కార వేదికలు అందరికీ అందుబాటులోకి రావడం లేదు. కొన్ని డిజిటల్ సాధనాలు లేదా ఓపెన్ సోర్స్ పరిష్కార మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి వినియోగం పరిమితంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ లేకపోవడం అని చెప్పుకోవచ్చు. ప్రపంచ స్థాయిలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రయత్నాలు విడివిడిగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా దేశాల మధ్య సహకారం లేకుండా సాగుతున్నాయి. దీనికోసం ప్రపంచ దేశాలు ఒక వేదిక పైకి వచ్చి సంఘటిత ప్రయత్నాలు సాగించాలి. దీనికి జీ–20 ఒక సమగ్ర, పటిష్ట వేదికగా పనిచేస్తుంది. ఈ ప్రయత్నాలు భవిష్యత్తు అవసరాలకు అవసరమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధికి దారి తీస్తాయి. జీ–20 అధ్యక్ష హోదాలో... ప్రపంచ ప్రజల సంక్షేమం కోసం పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను అభివృద్ధి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉంది. దీనికి అవసరమైన ప్రణాళిక కూడా భారతదేశం వద్ద సిద్ధంగా ఉంది. ముందుగా విడివిడిగా జరుగుతున్న ప్రయత్నాలను సంఘటితం చేయాల్సి ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ ప్రయోజనం కలిగించేలా ఈ చర్యలు అమలు జరగాలి. దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ అభివృద్ధి కోసం జరిగిన ప్రయత్నం, కృషి మరోసారి డిజిటల్ ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి కోసం జరగాల్సి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సమాచార మార్పిడిపై దేశాల మధ్య నమ్మకం పెరిగేలా చూసి, అవసరమైన నిధులు సమకూర్చ డానికి ప్రపంచ స్థాయిలో ప్రయత్నాలు జరగాలి. జీ–20 అధ్యక్ష హోదాలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం సాధించడానికి భారతదేశం పని చేస్తోంది. ఆచరణ సాధ్యమైన వ్యవస్థను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలు ముఖ్యంగా దక్షిణ దేశాలు ప్రయోజనం పొందేలా చూసేందుకు భారతదేశం కృషి చేస్తోంది. స్వప్రయోజ నాలను పక్కన పెట్టి సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. ‘వసుధైక కుటుంబం’ స్ఫూర్తితో ప్రపంచ ఆరోగ్యం కోసం కృషి చేయాల్సిన తరుణం ఆసన్నమయింది. డాక్టర్ మన్సుఖ్ మండావియా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు – ఎరువుల శాఖ మంత్రి -
ఏకో ఇండియాతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఎంవోయూ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, ఆరోగ్య కార్యకర్తల సామర్ధ్యం పెంపుదల కార్యక్రమాల అమలుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్.. న్యూఢిల్లీకి చెందిన ఎకో ఇండియా సంస్థతో అవగాహనా పత్రంపై(ఎంవోయూ) సంతకాలు చేసింది. శుక్రవారం మంగళగిరిలోని ఎపీఐఐసీ భవనం, ఐదో అంతస్థులో తన ఛాంబర్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు ఎన్ హెచ్ఎం మిషన్ డైరెక్టర్ జె. నివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎల్ బిఎస్ హెచ్ దేవి, ఎకో ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సందీప్ భల్లా, డిప్యూటీ జనరల్ మేనేజర్ దీపా ఝా ఈ అవగాహనా పత్రంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సందీప్ భల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఎకో ఇండియా సంస్థల మధ్య కుదిరిన ఈ భాగస్వామ్య ఒప్పందం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను ప్రభావశీలంగా నిర్వహించటానికి దోహదపడుతుందని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై సిబ్బందికి ఉచితంగా వర్చువల్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ అవగాహనా పత్రంపై సంతకాలు జరగటానికి ముందు ఎకో ఇండియా బృందం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబుతో భేటీ అయ్యింది. ఈ భాగస్వామ్య ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన ఎకో ఇండియా బృందానికి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కుదిరిన ఈ ఒప్పందంపై ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. చదవండి: అమాంతంగా పెరిగిన నిమ్మ ధర.. రేటు ఎంతంటే..? -
సకల జనుల తెలంగాణే లక్ష్యం: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: సకల జనుల తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతానని దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి కూతురు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. త్వరలో మంచి రోజులొస్తున్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముసలవ్వలు నడిచేందుకు ఊతకర్రనవుతానని, బడి ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్న ఇంటికి పెద్దక్కనవుతానని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో షర్మిల పేర్కొన్నారు. డిగ్రీ పట్టా పట్టుకొని రోడ్డు మీదకొచ్చే తమ్ముళ్లు, చెల్లెమ్మల కోసం ఉద్యోగ బాటలు వేస్తానని తెలిపారు. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందిస్తానన్నారు. మెరుగైన వైద్యం కోసం పడిగాపులు కాసే పరిస్థితిని సమూలంగా మార్చేస్తానని చెప్పారు. -
అలా చేస్తేనే మూడో వేవ్ వచ్చినా.. ప్రభావం ఉండదు
న్యూఢిల్లీ: ప్రజలు సరైన జాగ్రత్తలు పాటిస్తే కరోనా మూడో వేవ్ ప్రభావం పెద్దగా ఉండబోదని ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. అప్రమత్తతో ఉండడం వల్ల కేసుల సంఖ్య తగ్గుతుందని, తద్వారా దేశ వైద్య రంగంపై ఒత్తిడి పెద్దగా ఉండదన్నారు. ఇప్పటివరకు దేశ జనాభాలో 2.2% మంది కరోనా బారిన పడ్డారన్నారు. ‘జాగ్రత్తలు మరవద్దు. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అలా చేస్తే, ఒకవేళ మూడో వేవ్ వచ్చినా, పెద్ద ప్రభావం చూపబోదు. అలాగే, వైద్య వ్యవస్థను ఒత్తిడిలోకి తీసుకువెళ్లే స్థాయిలో కేసుల సంఖ్య ఉండదు’ అన్నారు. వివిధ అపోహల కారణంగా ప్రజల్లో, ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఇంకా టీకా పట్ల వ్యతిరేకత కనిపిస్తోందని, కోవిడ్‌పై పోరులో అదే పెద్ద సవాలని అగర్వాల్ పేరొన్నారు. సోషల్ మీడియాతో కూడా వ్యాక్సిన్ల విషయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోందన్నారు. కరోనా జాగ్రత్తలను ప్రచారం చేయడంతో పాటు, టీకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలు, అపార్ధాలను తొలగించడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందన్నారు. యూనిసెఫ్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ఒక మీడియా వర్క్‌షాప్‌లో అగర్వాల్ మాట్లాడారు. రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను వేసుకోవడంపై మీడియా ప్రశ్నకు మరో అధికారి వీణా ధావన్ సమాధానమిచ్చారు. ప్రస్తుతమున్న డేటా ప్రకారం వేర్వేరు డోసులకు వేర్వేరు టీకాలను వేసుకోవడం సరికాదన్నారు. టీకాకు తీవ్రమైన దుష్ప్రభావాలేమైనా ఉంటే.. టీకా తీసుకున్న మొదటి అరగంటలోనే తెలుస్తుందని, అందువల్లనే అరగంట అబ్జర్వేషన్‌ను తప్పనిసరి చేశామన్నారు. -
‘కరోనా’ ప్యాకేజీ 15 వేల కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దశల వారీగా మొత్తం రూ.15,000 కోట్లు అందజేయనుంది. వచ్చే నాలుగేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు లేఖ రాసింది. మొదటి దశ కింద రూ.7,774 కోట్లు 2020 జనవరి నుంచి జూన్ వరకు మొదటి దశ, 2021 జూలై నుంచి మార్చి వరకు రెండో దశ, 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ అమలవుతుంది. మొదటి దశ అమలు కోసం కేంద్రం అతి త్వరలో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.7,774 కోట్లు విడుదల చేయనుంది. తొలి దశ కింద ఇచ్చే నిధులను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రత్యేక ఆసుపత్రులు, ఐసోలేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూలు నెలకొల్పాలి. ల్యాబ్‌ల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి. అదనంగా ఉద్యోగులను నియమించుకోవాలి. ఔషధాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), ఎన్–95 మాస్కులు, వెంటిలేటర్ల కొనుగోలుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ స్థలాలు, అంబులెన్స్‌లను శుద్ధి చేయడానికి కూడా వెచ్చించవచ్చు. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం, బాధితులకు వైద్య సేవలందించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరడంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి తాజాగా ఆమోదం తెలిపింది. మరో 20 మరణాలు ఒక్క రోజులో 591 పాజిటివ్‌లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా బుధవారం నుంచి గురువారం వరకు.. ఒక్కరోజులో 591 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో 8 మంది, గుజరాత్లో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 169కు చేరిందని, ఇప్పటిదాకా 5,865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశంలో ప్రకటించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 1,30,000 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం కరోనాతో దేశవ్యాప్తంగా 196 మంది మృతి చెందగా, పాజిటివ్ కేసులు 6,500కు చేరాయి. కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నిఘాను తీవ్రతరం చేశాయి. పీపీఈల లభ్యతపై ఆందోళన వద్దు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) లభ్యతపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వదంతులను నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం సరిపడా పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. దేశంలో 20 సంస్థలు పీపీఈలను తయారు చేస్తున్నాయని, 1.7 కోట్ల పరికరాలు సరఫరా చేయాలంటూ ఆయా సంస్థలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 49,000 వెంటిలేటర్లు త్వరలో అందనున్నాయని చెప్పారు. కరోనా బాధితుల కోసం 10 వైద్య బృందాలను 9 రాష్ట్రాలకు పంపించామని పేర్కొన్నారు. రైల్వే శాఖ 3,250 కోచ్‌లను ఐసోలేషన్ యూనిట్లుగా మార్చిందన్నారు. రైల్వే శాఖ 6 లక్షల ఫేస్ మాస్కులను ఉత్పత్తి చేసిందని, వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చని, అలాగే 4,000 లీటర్ల శానిటైజర్‌ను తయారు చేసిందని తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ను డౌన్లోడ్ చేసుకోండి: మోదీ న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో ఎంతో ఉపయుక్తంగా ఉండే ఆరోగ్యసేతు యాప్‌ను మొబైల్‌లలో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ‘కోవిడ్‌ను చూసి భయపడితే ఎలాంటి లాభం ఉండదు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ దిశగా కీలకమైన మొదటి అడుగు ఆరోగ్య సేతు. ఇది మీ చుట్టూ కోవిడ్ వైరస్ బాధితులెవరైనా ఉంటే కనిపెడుతుంది. అన్ని రాష్ట్రాల్లోని హెల్ప్‌డెస్క్‌ల ఫోన్ నంబర్లు ఇందులో ఉన్నాయి’అని ట్విట్టర్లో తెలిపారు. -
హక్కుల జాబితాలో ఆరోగ్యం!
జబ్బు పడివున్న మన ఆరోగ్య వ్యవస్థకు జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలైనట్టు కనబడుతున్నది. ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించే దిశగా ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంకల్పించింది. ఈమధ్య విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానం-2015లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వం పొందుపరిచింది. విద్యా హక్కు చట్టం తరహాలో జాతీయ ఆరోగ్య హక్కుల చట్టాన్ని రూపొందించి ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా చేయాలను కుంటున్నట్టు అందులో తెలిపింది. ఇది అమల్లోకొస్తే వైద్య సౌకర్యాన్ని నిరాకరిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి పౌరులకు వీలవుతుంది. జాతీయ ఆరోగ్య విధానం రూపకల్పనపై స్వాతంత్య్రానంతరం ఇప్పటికి రెండుసార్లు మాత్రమే కేంద్రం దృష్టిపెట్టిందంటే ఈ రంగంపై మన పాలకుల్లో ఎంతగా నిర్లక్ష్యం గూడుకట్టుకుని ఉన్నదో అర్థమవుతుంది. 1983లో తొలిసారి ఈ తరహా విధాన పత్రాన్ని రూపొందించగా 2002లో మరోసారి ఆ పని జరిగింది. అలాగని మన దేశంలో ప్రజారోగ్య స్థితిగతులు అంత ‘పట్టించుకోనవసరం లేనంత’గా ఏం లేవు. సామాజిక, ఆర్థిక అసమానతలు ఆరోగ్యరంగంలో ప్రస్ఫుటంగా ప్రతిఫలిస్తున్నాయి. డబ్బున్న మారాజులకే జబ్బులనుంచి విముక్తి... సామాన్యులకు చావే శరణ్యమనే స్థితి ఏర్పడింది. మారిన కాలమాన పరిస్థితులవల్ల ‘అభివృద్ధి’ అనే పదానికి నిర్వచనమే మారిపోయింది. అది స్థూల జాతీయోత్పత్తి (జీఎన్‌పీ), స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) చుట్టూ గిరికీలు కొడుతుంటే సామాన్యుల బతుకులు మాత్రం జబ్బుల్లో కొడిగడుతున్నాయి. వైద్య సేవలకయ్యే వ్యయంలో ప్రభుత్వాలపరంగా ఖర్చు పెడుతున్నది కేవలం 22 శాతం మాత్రమే. మిగిలిన 78 శాతం వ్యయాన్ని జనమే భరించవలసివస్తున్నది. వాస్తవానికి ఆరోగ్య హక్కు రాజ్యాంగం ప్రకారం ఇప్పటికే ప్రాథమిక హక్కు. జీవించే హక్కుకు హామీపడుతున్న 21వ అధికరణంలో ఆరోగ్యంగా ఉండే హక్కు అంతర్లీనంగా ఇమిడి ఉన్నదని 1984లోనే సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. జీవన ప్రమాణాన్ని, ప్రజారోగ్యాన్ని పెంచాల్సిన బాధ్యత...పోషకాహారం ప్రజలందరికీ అందేలా చూడవలసిన కర్తవ్యం రాజ్యంపై ఉన్నాయని రాజ్యాంగంలోని ఆదే శిక సూత్రాలు కూడా చెబుతున్నాయి. కానీ, అన్నిటిలాగే ప్రజారోగ్యాన్ని కూడా ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయి. ప్రణాళిక, ప్రణాళికేతర రంగాలద్వారా దేశంలో ప్రజారోగ్యానికి వ్యయం చేస్తున్నది జీడీపీలో ఒకటిన్నర శాతం కూడా లేదని గమనిస్తే ఈ నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరుకున్నదో అర్థమవుతుంది. 2002నాటి జాతీయ ఆరోగ్య విధానంలో ప్రజారోగ్యానికి జీడీపీలో కనీసం 2శాతం వ్యయం చేయాలని ఘనంగా సంకల్పం చెప్పుకున్నా ఆచరణలో అది ఎటో కొట్టుకుపోయింది. మనం చాలా వెనకబడిన దేశాలనుకుంటున్న అఫ్ఘానిస్థాన్ 7.6 శాతం, భూటాన్ 5.2 శాతం, రువాండా 10.5 శాతం, సుడాన్ 6.3 శాతం చొప్పున ఖర్చుచేస్తున్నాయి. ఇక సంపన్న దేశాల విషయానికొస్తే అమెరికా 17.6 శాతం, కెనడా 11.3 శాతం, బ్రిటన్ 9.6 శాతం వ్యయం చేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండటమంటే కేవలం జబ్బు లేకుండా ఉండటమే కాదు... భౌతిక, మానసిక, భావోద్వేగ అంశాలన్నిటా దృఢంగా ఉండటం. ఒక పౌరుడు తన శారీరక, మానసిక శక్తియుక్తులను సంపూర్ణంగా సమాజాభివృద్ధికి వినియోగించగలిగేలా ఉండటం. కనీస సౌకర్యాలతో గౌరవంగా, తలెత్తుకు తిరిగేలా బతకగలగటం. ఇవన్నీ మన దేశంలో సామాన్య పౌరులకు మృగ్యమయ్యాయి. మన దేశంలో 10,000 మంది జనాభాకు 9 పడకలున్నాయి. ప్రపంచ సగటు 30తో పోలిస్తే ఇదెంత అథమస్థాయిలో ఉన్నదో స్పష్టమవుతుంది. వైద్యుల విషయానికొస్తే 10,000 మందికి మన దేశంలో 6.5 శాతంమంది ఉన్నారు. ఈ అంశంలో ప్రపంచ సగటు 14.5! నివారించదగిన డెంగ్యూ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో భారత్‌లో 20 లక్షలమంది మృత్యువాత పడ్డారని... అవసరమైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని 2008లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. ఎన్డీయే సర్కారు ఇప్పుడు ప్రతిపాదించిన జాతీయ ఆరోగ్య విధానం ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తానని ప్రకటించడం హర్షించదగ్గదే. అందు కోసం విద్యా సెస్ తరహాలో ఆరోగ్య సెస్ వసూలుకు కూడా సంకల్పించింది. దానివల్ల నిధుల సమీకరణ సులభమవుతుంది. అయితే, ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణపైనా... మరీ ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపైనా, వారి పునరుత్పత్తి ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టని ఎలాంటి చర్యలైనా ఆచరణలో మెరుగైన ఫలితాలను అందించలేవని పాలకులు తెలుసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమర్థవంతంగా పనిచేస్తే ఏ వ్యాధినైనా మొగ్గలోనే తుంచేయడానికి వీలుంటుంది. జబ్బులబారినుంచి రక్షించుకోవడానికి పేద జనం చేసే వ్యయంలో చాలా భాగం తగ్గిపోతుంది. మారుమూల ప్రాంతాలకు సైతం సమర్థవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ వంటి పథకాన్ని, 108, 104 సేవలను అందుబాటులోకి తెచ్చారు. అనంతరకాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలకు ఇవి ఆదర్శనీయమయ్యాయి. ప్రజారోగ్యం సరిగా లేనప్పుడు నష్టపోయేది సంబంధిత కుటుంబాలు, వ్యక్తులు మాత్రమే కాదు... మొత్తంగా సమాజంపైనే దాని ప్రభావం పడుతుంది. పనిదినాలు నష్టపోవడం, ఉత్పాదకత క్షీణించడంతోపాటు ఆరోగ్యం కోసం చేసే ఖర్చు తడిసిమోపెడై ఏటా కోట్లాదిమంది అదనంగా దారిద్య్రరేఖ దిగువకు చేరుకుంటున్నారు. అయితే ఆచరణలో విద్యాహక్కు చట్టం కొరగానిదిగా తయారైనట్టు ఇది మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. నిరంతరం అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇలాంటి అపురూపమైన, ప్రాణావసరమైన హక్కును సంరక్షించుకోగలమని పౌరులు కూడా తెలుసుకోవాలి.