సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. నిర్ణీత గడువు ముగిసినా ఏళ్లకేళ్లుగా జీహెచ్‌ఎంసీని పట్టుకొని వదలకుండా అతుక్కున్న ఆరుగురు సహాయ వైద్యాధికారులను (ఏఎంఓహెచ్) వదిలించుకుంది. ఆరుగురు ఏఎంఓహెచ్‌లను వారి మాతృసంస్థ అయిన పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కు పంపించింది. దీనికి ముందు ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. ఏళ్లకేళ్లుగా కొనసాగుతున్న.. పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన వీరిని మాతృసంస్థకు పంపించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
దాన్ని అమలు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్‌ను ఆదేశించారు. అందుకనుగుణంగా, తమను మాతృసంస్థలకు పంపించాల్సిందిగా కోరుతూ స్వీయలేఖలు అందజేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సంబంధిత ఏఎంఓహెచ్‌లకు సూచించారు. లేని పక్షంలో ఎదురయ్యే తీవ్ర పరిణామాలను వివరించి హెచ్చరించినట్లు సమాచారం. వీరిలో జీహెచ్‌ఎంసీలో డిప్యుటేషన్ మూడేళ్లు, ఐదేళ్లు మించిన వారు కూడా ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో వారు లేఖలు రాయడం.. వారిని వెంటనే మాతృసంస్థలకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఆగమేఘాల మీద జరిగాయి.
వారు రిలీవ్ అయినట్లుగా కూడా పరిగణిస్తూ, వారిని మాతృశాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంబంధిత సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు రిలీవ్ అయిన ఏఎంఓహెచ్‌ల స్థానాల్లో తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించడంతో పాటు దాన్ని అమలు చేసినట్లు నివేదించాలని ఆదేశించారు. ఈ అంశంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జోనల్ కమిషనర్లకు సూచించారు.
చదవండి: బోయిగూడ అగ్ని ప్రమాదం: గోదాంలో ఉండేది 8 మందే.. ఆ నలుగురు ఎవరంటే!
చెత్త పనిలో అవినీతి తగ్గేనా?
►ప్రజలకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు జీహెచ్‌ఎంసీలోని ఆరోగ్యం– పారిశుద్ధ్య విభాగంలోకి ఏఎంఓహెచ్‌లుగా వచ్చారంటే చాలు ‘చెత్త’ పనులు చేస్తున్నారు. సక్రమ పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యం బాగుంటుందనే బ్రిటిష్ హయాం నాటి ప్రాథమిక సూత్రం ఆధారంగా జీహెచ్‌ఎంసీలో ఏఎంఓహెచ్‌లకు పారిశుద్ధ్య బాధ్యతలప్పగించారు. దాన్ని ఒక బాధ్యతగా చూడాల్సిన వారు చెత్త పనుల్లోని అవినీతిలో కూరుకుపోతున్నారు. స్వీపర్ల నియామకాల నుంచి మొదలు పెడితే బల్క్ చెత్త ఉత్పత్తి చేసే హోటళ్లు, ఫంక్షన్ల హాళ్ల నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేసేంతదాకా దిగజారారు.
►జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో ఎంతో కాలంగా అవినీతి ఆరోపణలున్నా, ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వాటికి అడ్డుకట్ట పడలేదని జీహెచ్‌ఎంసీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాల కనుగుణంగా కమిషనర్ లోకేశ్‌కుమార్ వారిని మాతృశాఖలకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇది బల్దియా చరిత్రలోనే రికార్డు. ఇక రాబోయే రోజుల్లో ఏఎంఓహెచ్‌లనే వారు జీహెచ్‌ఎంసీలో ఉండరని తెలుస్తోంది.
మిగతా విభాగాలపైనా దృష్టి సారిస్తారా?
జీహెచ్‌ఎంసీకి ఒకసారి వచ్చారంటే చాలు మాతృశాఖలకు తిరిగి వెళ్లకుండా ఇక్కడే ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారు వివిధ విభాగాల్లో ఎందరో ఉన్నారు. అంతేకాదు.. డిప్యుటేషన్ ముగిసినా, కొనసాగింపు లేకుండానే పని చేస్తున్నవారు కూడా ఉన్నారు. డిప్యుటేషన్ ముగిసిన వారిపై, దీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిపై కూడా తగిన చర్యలు తీసుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment