సాక్షి, హైదరాబాద్: దేశంలో వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులు, క్వారంటైన్‌లో ఉన్న బాధితులు కొందరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండలేక పారిపోతున్నారని అంతర్జాతీయ జర్నల్ ‘లాన్సెట్’ ఘాటైన విమర్శ చేసింది. భారత్‌లో కరోనా వ్యాధి నియంత్రణ చర్యలపై ‘లాన్సెట్’ తాజాగా నివేదిక విడుదల చేసింది. గత కొన్ని వారాలుగా కరోనా రోగులు, లక్షణాలున్న వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల నుంచి పారిపోతున్నారని, తమ ప్రయాణ చరిత్రను దాచడానికి ప్రయత్నించిన అనేక సంఘటనలున్నాయని తెలిపింది. ఈ పరిస్థితి కరోనాపై చేస్తున్న నియంత్రణ చర్యలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే దీనికి కారణమని విశ్లేషించింది. ఈ నేపథ్యంలో ఒంటరిగా క్వారంటైన్‌లో ఉండటానికి కరోనా బాధితులు, రోగులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న కంటైన్మెంట్ ప్రణాళిక ఎన్నో లోటుపాట్లను చూపిస్తుంది. క్వారంటైన్, ఐసోలేషన్‌లు క్లస్టర్ల ఏర్పాటులో కీలకమైనవి. క్వారంటైన్ అంటే కరోనాకు గురైన వ్యక్తుల నుంచి సాధారణ ప్రజలను వేరు చేయడం, వారిని వైరస్ బారి నుంచి కాపాడటం. కానీ వివిధ ప్రాంతాల్లో ప్రజారోగ్య వ్యవస్థపై నమ్మకం లేకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారిందని లాన్సెట్ అభిప్రాయపడింది. చదవండి: కరోనా ఆగట్లేదు.. జర జాగ్రత్త
కరోనా నియంత్రణ వ్యూహాలకు సవాళ్లు
లాన్సెట్ నివేదిక ప్రకారం భారత్‌లో కరోనాతో ఈ నెల 14వ తేదీ నాటికి 356 మంది మరణించారని తెలిపింది. (శనివారం సాయంత్రానికి మృతి చెందినవారి సంఖ్య 480). మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగించింది. అయితే కరోనాతో అత్యంత దెబ్బతిన్న దేశాల సరసన భారత్ లేకపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కానీ దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య ప్రజారోగ్యంలో పెట్టుబడుల విషయంలో భారీ వ్యత్యాసాలున్నాయి. ఈ పరిస్థితి వ్యాధుల నియంత్రణ వ్యూహాలకు అనేక సవాళ్లను విసురుతుంది.
ప్రజారోగ్యంపై పెట్టే ఖర్చులను పెంచడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంపొందించడానికి వీలు కలుగుతుందని ప్రజారోగ్య నిపుణులు అంటున్నారు. అప్పుడు కరోనా వంటి వైరస్‌లు ప్రబలినప్పుడు క్వారంటైన్‌ల నుంచి తప్పించుకునే పరిస్థితులుండవు. దేశంలో కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యముంది. తక్కువ ఆదాయ వర్గాల్లో ఇదెక్కువ. అందువల్ల ప్రజలు ఐసోలేషన్, క్వారంటైన్ ప్రాముఖ్యతలను అర్థం చేసుకోవడం కష్టమని నివేదిక తెలిపింది. కరోనా ఒక మహమ్మారి అని భావించినా, వారిలో ప్రజారోగ్య వ్యవస్థపై నమ్మకం లేకపోవడంతో ముందుకు రావడం లేదని తెలిపింది.
జీడీపీలో ఆరోగ్యరంగానికి 1.5 శాతమే..
దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ సరిగా లేకపోవడంతో లక్షలాది మంది ప్రైవేటు వైద్య ఆరోగ్య రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. మన దేశ జీడీపీలో ప్రభుత్వం ఆరోగ్యం కోసం కేవలం 1.5 శాతమే ఖర్చు చేస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువని లాన్సెట్ తన నివేదికలో స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లోని 52 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 44 శాతం కుటుంబాలు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రైవేటు రంగమే కీలకంగా ఉంటుందని భావిస్తున్నారని తెలిపింది. అంటువ్యాధులను గుర్తించడం, ముందస్తు హెచ్చరికలు చేయడం ఆరోగ్య వ్యవస్థల ప్రత్యేకమైన పని.
కరోనా వంటి మహమ్మారి వచ్చినప్పుడు సరైన విధానంతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే సమయమిది. ఆరోగ్య బీమా ద్వారా కాకుండా, ప్రభుత్వం ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో పెంచాలని లాన్సెట్ సూచించింది. ప్రజారోగ్య సిబ్బందిలో నమ్మకం కలిగించాలని పేర్కొంది. మరోవైపు కింది స్థాయిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలు తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోనన్న భయాందోళనలకు గురవుతున్నారు. అలాంటి వారు సురక్షితంగా ఉండటానికి కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేసి ముందుకు నడిచేవారు సమాజానికి గొప్ప సేవ చేసే ‘కరోనా–యోధులు’అవుతారని నివేదిక తెలిపింది.
కేరళ ఆదర్శం..
రెండేళ్ల క్రితం నిఫా వైరస్ వ్యాప్తిని విజయవంతంగా కేరళ ఎదుర్కొంది. ఆ ముప్పు నుంచి కేరళ అనేక గుణపాఠాలు నేర్చుకుంది. కరోనా చికిత్స ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కేంద్రీకృతమై ఉంది. అయితే ప్రభుత్వ ఆస్పత్రులను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో సిబ్బంది నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలకు కావాల్సింది ప్రభుత్వంపై నమ్మకం. కేరళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన సాంకేతిక పరిజ్ఞానం దేశానికి గర్వకారణమని లాన్సెట్ నివేదిక ప్రస్తావించింది. 2005 నుంచి ప్రభుత్వ ఆసుపత్రులపై ఆ రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని నివేదిక తెలిపింది. చదవండి: బ్యాంక్ ఖాతా లేకుంటే ‘పోస్టల్’ నగదు
Comments
Please login to add a commentAdd a comment