కోరుకో.. కొత్త ఆరోగ్య లోకం! | Coronavirus Teach Lessons Priority Of Public Medical System | Sakshi
Sakshi News home page

కోరుకో.. కొత్త ఆరోగ్య లోకం!

Published Fri, May 15 2020 12:25 AM | Last Updated on Fri, May 15 2020 12:26 AM

Coronavirus Teach Lessons Priority Of Public Medical System - Sakshi

ఉపద్రవాలు మానవ సమాజానికి ఎంత నష్టం కలిగిస్తాయో, ఏ మాత్రం తగ్గని రీతిలో గుణపాఠాలూ నేర్పుతాయి. సరిగ్గా నేర్చుకొని తమ పరిస్థితిని చక్కదిద్దుకున్న సమాజాలు బాగుపడటం చరిత్ర చెప్పే సత్యం! ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కోవిడ్‌– 19 కూడా ఏకకాలంలో ఎన్నో పాఠాలు చెబు తోంది. అందులో వైద్యం ఒకటి! ముఖ్యంగా భారత్‌ వంటి దేశాలు ప్రజావైద్యం విష యంలో నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో! మర్చిపోయిన మంచి, అల వాటుపడ్డ తప్పు, జరుగుతున్న అనర్థం... ఇవన్నీ ఎత్తి చూపింది కోవిడ్‌.

ప్రజావైద్యానికి ఏటా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో అటూఇటూగా ఒక శాతం మాత్రమే వెచ్చించే దేశమిది. కానీ, విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే ఉద్దీపనలకే జీడీపీలో 10 శాతం, అంటే రూ. 20 లక్షల కోట్లు వెచ్చించాల్సి రావడం పెద్ద గుణపాఠమే! ప్రజా వైద్య వ్యవస్థలు గొప్పగా ఉన్న చిన్న దేశాలు కూడా ఉపద్రవాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. వైద్యం ప్రయివేటీకరించిన అగ్ర రాజ్యం అమెరికా తుఫాన్‌లో అరటి తీగలా అల్లాడుతోంది. ప్రజా వైద్యం నుంచి ప్రయివేటు వైపు దారిమళ్లిన ఇటలీ, ఉన్న ప్రజా వైద్యాన్ని కొన్నేళ్లుగా చిన్నచూపు చూస్తున్న బ్రిటన్‌ వంటి దేశాలకూ కోవిడ్‌లో చేదు అనుభవాలు తప్పలేదు.
(చదవండి: వదంతుల మహమ్మారి)

మూడు నెలలుగా ఈ దేశంలో కరోనా సృష్టిస్తున్న కల్లోలానికి అల్లాడిన జనాన్ని ఏ వైద్యులు ఆదుకున్నారు? ప్రయివేటు వైద్యులా! ప్రజా వైద్యులా? ఈ పాటికే సదరు ప్రశ్న ఎన్నో మెదళ్లను తొలిచే ఉంటుంది. సమాధానం నిస్సందేహంగా ఒకటే! అవును... మన ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులే! దేశ ప్రజావైద్య వ్యవస్థలో భాగమైన వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది మొక్కవోని ధైర్యంతో, దీక్షతో, నిబద్ధతతో కోవిడ్‌ వార్డుల్లో మృత్యువును వెనక్కి నెట్టి వైరస్‌తో యుద్ధం చేస్తున్నారు. వ్యాధిగ్రస్తులకు దన్నుగా నిలుస్తున్నారు.

మరి మనకెందుకు ప్రభుత్వ ఆస్పత్రులంటే, ప్రజా వైద్యులంటే చిన్న చూపు? గత కొన్నేళ్లుగా ప్రజా వైద్యానికి మన ప్రభుత్వాలిచ్చే ప్రాధా న్యత అలాంటిది. దానికి తోడు ఎక్కడికక్కడ అవినీతి, స్వార్థం పెచ్చ రిల్లి ప్రయివేటు వైద్య రంగ వికాసం కోసం ప్రజా వైద్య వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన సందర్భాలూ కొల్లలు. కరోనాతో మన సహజీవనం అనివార్యమంటున్నారు కనుక, ఈ పరిస్థితి మారాలి. పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి అయినా ప్రజావైద్య రంగాన్ని బలోపేతం చేయాలి. సమగ్ర, సంక్లిష్ట వైద్యానికి ప్రయివేటు రంగంలో ఆరోగ్యకర పోటీని ఆహ్వానిస్తూనే ప్రజావైద్య రంగాన్ని పటిష్టపరచాలన్నది కోవిడ్‌ నేర్పుతున్న పాఠం.
(చదవండి: భారీ ప్యాకేజీ: భారత్‌పై ఐరాస ప్రశంసలు)

తుప్పుపట్టిన తుపాకులతోనే....
అరకొర వసతులతోనే మన సర్కారు వైద్యులు అద్భుతాలు సృష్టిస్తు న్నారు. సహజ వాతావరణ పరిస్థితులు కొంత, సార్స్‌ తెగ వైరస్‌లను తట్టుకునే మన దేశీయుల రోగనిరోధక శక్తి కొంత, తగినన్ని పరీక్షలు జరిపించకపోవడం వల్ల కొంత... మొత్తానికి దేశంలో తక్కువ సంఖ్య కరోనా కేసులు నమోదై ఉండవచ్చు. అంత మాత్రాన మన సర్కారు వైద్యులు, నర్సులు, సిబ్బంది కృషిని తక్కువచేసి చూడలేం. వైరస్‌ సోకిన వారికి వైద్యం చేసే క్రమంలో పాజిటివ్‌ లక్షణాలు వచ్చిన వైద్యులు, సిబ్బంది ఆపై కోలుకొని, 14 రోజుల క్వరైంటైన్‌ తర్వాత కూడా అవే వార్డుల్లో విధులు నిర్వహిస్తున్నారు.

తగినన్ని కిట్లు, వెంటి లేటర్లు లేకున్నా, ఎన్‌–95 మాస్కుల కొరత ఉన్నా, సరైన ప్రమా ణాలతో పీపీఈలు లేకున్నా... ఎక్కడా తగ్గకుండా 75 వేలకు పైబడి పాజిటివ్‌ కేసుల్లో వైద్యం అందిస్తూ, దాదాపు మూడో వంతు రోగుల్ని చికిత్స చేసి ఇళ్లకు పంపారు. దీన్నంతటినీ ప్రయివేటు వైద్యరంగం గత మూడు నెలలుగా దూరం నుంచి చూస్తోంది. కార్పొరేట్‌ నుంచి మధ్య, చిన్న తరహా ప్రయివేటు ఆస్పత్రుల దాకా.. పూర్తిగానో, పాక్షికంగానో మూతబడి ఉన్నాయి. లేదా అక్కడక్కడ ఎమర్జెన్సీ కేసులు మాత్రం చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే దశలవారీగా వైద్య సేవల్ని పునరుద్ధరి స్తున్నారు.

ప్రయివేటు ఆస్పత్రుల నుంచి ప్రిస్కిప్షన్లు, ఫార్మా కంపెనీ లకు ఇన్వాయిస్‌లు రమారమి తగ్గాయి. ప్రయివేటు డయాగ్నసిస్‌ ల్యాబ్‌ల పరీక్షలు కూడా 3, 4 శాతానికి పడిపోయినట్టు నివేదికలు న్నాయి. ప్రయివేటు రంగం ఇలా ఉంటే, మరో పక్క ప్రభుత్వ రంగంలో క్రమేపీ కరోనా పరీక్షల్ని దేశ వ్యాప్తంగా పెంచారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పరీక్షలు, పద్ధతులు, చికిత్సలు నిర్వహిస్తున్నారు. మార్చి 12న కేవలం 90 మందికి మాత్రమే పరీక్షలు జరుపగలిగిన స్థితి నుంచి, మే 12 నాటికి ఒకేరోజు పదివేల మందికి పరీక్ష జరిపే సామర్థ్యాన్ని మెరుగు పరిచారు.

ప్రభుత్వ వైద్యుల సేవలు ప్రజా మన్నన పొందుతున్న క్రమంలోనే ప్రజా వైద్యాన్ని ప్రభుత్వం మెరుగపరచాల్సిన అవసరం ఉంది. వారం కింద విశాఖపట్నం శివారుల్లో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన చోటు చేసుకున్నపుడు అక్కడి కేజీహెచ్‌ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల సేవలకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. చికిత్స కోసం 324 మంది బాధి తులు అక్కడ చేరగా తీవ్రంగా ప్రభావితులైన ముగ్గురు మరణించారు. మిగతా అందరికీ చికిత్స అందించి, గురువారం వరకు విడతలుగా వారిని ఇళ్లకు పంపించారు. అప్పటికే అక్కడ ఉన్న వైద్య వ్యవస్థ, వైద్యుల సంఖ్య, వారి నిబద్ధత అందుకు దోహదపడింది.

ఈ స్థితి దేశమంతటా రావాలి. కరోనా కేసులు ఒక్క పెట్టున పెరిగే సరికి వాటికి తట్టుకోలేని పరిస్థితి నేడు ముంబయిలో తలెత్తుతోంది. ఏమంటే సదుపాయాల కొరత! ప్రభుత్వ వైద్య రంగంలో మౌలిక సదుపాయాల లేమి దేశ వ్యాప్తంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే, ప్రధాని మోదీతో వీడియో సమావేశం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి వైద్య మౌలిక రంగ పటిష్టతకు వడ్డీలేని, లేదా స్వల్ప వడ్డీ రుణ సదుపాయం కల్పించాలని కోరారు. తద్వారా గ్రామ స్థాయి నుంచి బోధనాసుపత్రుల స్థాయివరకు వైద్యసదుపాయాల్ని మెరుగు పరుస్తామన్నారు.

ప్రాధాన్యతలు మారాలి
కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజావైద్యానికి నిధులు పెంచాలి. కేంద్రీకృత వైద్య సదుపాయాల వ్యవస్థ సరైంది కాదు. వికేద్రీకరణ జరగాలి. గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి సదుపాయాల్ని మెరు గుపరచాలి. ఇప్పటికీ వైద్యం కోసం పెట్టే తలసరి వ్యయం భారత్‌లో చాలా తక్కువ. ‘బ్రిక్స్‌’ దేశాలు, ఇటీవలే పారిశ్రామికీకరణ జరిగిన ఇతర దేశాలతో పోల్చి చూసినా మనం అట్టడుగునే ఉంటాం. బ్రెజిల్‌ (947), రష్యా (893), దక్షిణాఫ్రికా (570), టర్కీ (568), మలేషియా (456), చైనా (420), ఇండొనేషియా (99) తదితర దేశాల్లో తలసరి వైద్య వ్యయం అన్నేసి డాలర్లలో ఉంటే, భారత్‌లో అది 75 డాలర్లు మాత్రమే! అందులోనూ... 30 శాతమే ప్రభుత్వ రంగంలో జరుగు తుంటే, 70 శాతం వ్యయం ప్రయివేటు రంగంలో రోగులు నేరుగా జేబుల్లోంచి వెచ్చిస్తున్నారు.

కేంద్రం–రాష్ట్రాలు కలిపి, 2008–09 నుంచి 2019–20 వరకు ప్రజారోగ్య–వైద్యానికి వెచ్చించింది స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 1.2 శాతం నుంచి 1.6 శాతం మాత్రమే! ఇది ఏ మాత్రం సరిపోదు. అందుకే, కనీస వైద్యావసరాలు తీర్చు కోవడానికి పౌరులు పెద్దమొత్తం తమ కష్టార్జితాన్ని మంచి నీళ్లలా ప్రయివేటు వైద్యరంగంలో ఖర్చు చేస్తున్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సగటున 72 శాతం మంది, పట్టణ–నగర ప్రాంతాల్లో సగటున 79 శాతం మంది ప్రయివేటు వైద్య రంగ సేవల్ని వినియో గించుకోవాల్సి వస్తోంది.

జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) 2017–18 ఫలితాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. ఈశాన్యంలోని చిన్న రాష్ట్రాలు కాకుండా... హిమాచల్‌ ప్రదేశ్, ఒడిషా, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనే పౌరులు 50 శాతానికి పైబడి ప్రభుత్వ వైద్య సేవల్ని పొందుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో పౌరులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పొందుతున్న వైద్య సేవలు 25 శాతం లోపే!

ప్రజారోగ్యం–ఉత్పత్తి, ఉపాధికి అనుసంధానం
ప్రతి వెయ్యి మంది జనాభాకి కనీసం ఒక డాక్టర్‌ ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) చెబుతోంది. మన దగ్గర 1:1400 నిష్పత్తి ఉంది. వైద్య కళాశాలలు, వైద్యుల్ని పెంచాలి. బ్రిటన్‌లో ఈ నిష్పత్తి 1:800 ఉంటే, క్యూబా వంటి చిన్న దేశంలో ఇది 1:150. కానీ, అమెరికా వాణిజ్య ఆంక్షలతో పెద్ద ఎత్తున మౌలిక వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేని దుస్థితిలో క్యూబా చికిత్స కన్నా వ్యాధినిరోధక పరిస్థితుల్నే నమ్ముకుంటుంది. అక్కడి వైద్య ప్రమాణాలకు మూలాలు విప్లవో ద్యమాల నుంచి పుట్టిన సామ్యవాద విధానాల్లో ఉన్నాయి.

ఏపీలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ కోవిడ్‌ను ఎదుర్కో వడంలో, వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమర్థంగా పనికొచ్చింది. కేరళలో ప్రాథమిక–కమ్యూనిటీ వైద్య వ్యవస్థ, 67 వేల అంగన్‌వాడీలు, 27 వేల ఆశావర్కర్లు కీలకపాత్ర పోషించారు. ఈ పరిస్థితుల్ని దేశ వ్యాప్తం చేయాలి. కోవిడ్‌ ఇప్పుడప్పుడే సమిసేది కాదంటున్నారు. మనుషులకు వైరస్‌తో సహజీవనం అనివార్యమైనందున మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరాలు పాటించే క్రమంలో ఎంతో కొంత ఆరోగ్య పరిస్థితులు స్థూలంగా మెరుగవుతాయి.

ఇదే అదునుగా వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి తెస్తే దేశ భవిష్యత్తు ఆరోగ్య దాయకంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అంటువ్యాధుల నివారణ కోసం సిబ్బందికి, యువతకు స్వల్ప కాలిక కోర్సును కూడా రూపొందించాలి. ఏపీలో 16 కోట్ల మాస్క్‌లు తయారు చేసినట్టు ఇకపై వివిధ వైద్యోపకరణాల తయారీకి పూనుకోవాలి. వైద్యానికి ఉత్పత్తి, ఉపాధిని అనుసంధానం చేస్తే నిరుద్యోగ సమస్యను కూడా కొంత పరిష్కరించినట్టవుతుంది. కోవిడ్‌ నేర్పిన పాఠాలతో కొత్త ఆరోగ్య లోకాన్ని ఆవిష్కరించాలి.

-దిలీప్‌ రెడ్డి

ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement