రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2,500 మంది స్పెషలిస్టు వైద్యులు ఉన్నా ప్రజలకు వైద్య సేవలు అందకపోవడానికి గల కారణం ఏమిటి? కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులను కాదని రూ. లక్షల్లో అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రులవైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు? లోపం ఎక్కడుంది? ఈ సమస్య మూలాలను కనుగొని తగిన ‘మందు’ వేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది.
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, మానవవనరులను సమకూర్చి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు వచ్చే రెండేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమయ్యే నిధులను సాధారణ బడ్జెట్‌తో సంబంధం లేకుండా అదనంగా కేటాయించనుంది. ‘రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి రాకూడదు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే రూ.10 వేల కోట్లు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది’ అని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నిధులను ఎక్కడెక్కడ ఖర్చు చేయాలన్న దానిపై ప్రాధాన్యాలను గుర్తించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,295 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌ను సాధారణ అవసరాలకు, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. వైద్య, ఆరోగ్యశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై మేధోమథనం ప్రారంభించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాల మేరకు అధికారులు ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించారు.
ప్రైవేటు ప్రాక్టీసు వీడితేనే...
ప్రభుత్వ డాకర్లు ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందడం లేదని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. తమిళనాడు తరహా ప్రభుత్వ వైద్య విధానాన్ని తీసుకురావడమే ఇందుకు పరిష్కారమని సూచిస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లేదు. ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. అర్హతలేని ప్రాక్టీషనర్లు లేకపోవడంతో ప్రాథమిక వైద్యాన్ని అక్కడ బలోపేతం చేశారు. ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా నిర్ణీత వేళల్లో విధులు నిర్వహించాల్సిందే. ప్రజారోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పట్టాక రాష్ట్ర అధికారులు తమిళనాడు, కేరళలలో పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
నిమ్స్ తరహా విధానం మేలు..
నిమ్స్‌లో పనిచేసే డాక్టర్లు బయట ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీలులేదు. అయితే సాయంత్రం వేళల్లో ఆసుపత్రిలోనే ప్రాక్టీస్ చేస్తే కొద్ది మొత్తంలో రోగుల నుంచి కన్సల్టేషన్ ఫీజు తీసుకోవచ్చు. రెండు దశాబ్దాల క్రితం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఇటువంటి పద్ధతి ఉండేదని ఒక సీనియర్ వైద్యాధికారి వెల్లడించారు. ఇటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా చేయడానికి వీలు కలుగుతుందని అంటున్నారు.
భారీగా నిధులు: ప్రజావైద్యానికి తెలంగాణ పెద్దపీట
Published Sun, Jun 20 2021 2:15 AM | Last Updated on Sun, Jun 20 2021 2:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment