
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని, తొలుత హెచ్‌ఎండీఏ పరిధిలో పెంపును వర్తింపజేయాలని, ఆర్థిక వన రుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసం ఘం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ప్రస్తు తం అమల్లో ఉన్న మార్కెట్ ధరలను ఉమ్మడి రాష్ట్ర పాలనలో చాలా కాలం కిందట ఖరారు చేశారని, ప్రస్తుత వాస్తవ మార్కెట్ ధరలు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడుతోంది. కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ విధించడం తో రాష్ట్ర ఆదాయానికి భారీ గండి పడిన నేపథ్యంలో.. ఈ ఏడాది భూముల అమ్మకాల ద్వారా అదనంగా రూ.15 వేల కోట్లను సమీకరించాలనే నిర్ణయానికి ఉప సంఘం వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే భూముల ధరలు పెంచాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లో సమావేశమై ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
ప్రస్తుతం అధిక ధరలకే రిజిస్ట్రేషన్లు
కరోనా సమయంలో భూముల మార్కెట్ ధరలను పెంచితే.. భూకొనుగోళ్లపై ప్రభావం పడి ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో వచ్చే ఆదాయం తగ్గే అవకాశంపై కూడా ఉపసంఘం చర్చించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి హెచ్‌ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువ కన్నా అధిక ధరతోనే హెచ్‌ఎండీఏ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న అంశాన్ని అధికారులు ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు. బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలు అడ్డంకిగా మారినట్టుగా వ్యాపార, వాణిజ్యవర్గాల్లో అభిప్రాయం ఉందని కూడా వివరించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని నివేదించారు.
వాస్తవానికి హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ పరిధిలోని భూముల విక్రయాలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. నగరం చుట్టుపక్కల ఉన్న 64 ఎకరాల భూములను విక్రయించేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌కు వచ్చే స్పందన ఆధారంగా తదుపరి భూముల అమ్మకాలకు సంబంధంచిన ధరల పెంపుపై ఒక నిర్ణయానికి రావాలని, ఆ తరువాత ముఖ్యమంత్రికి దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల పెంపుతో ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అవకాశాన్ని కూడా ఉపసంఘం పరిశీలించింది. అయితే ఈ మధ్యకాలంలోనే రెండుసార్లు మద్యం ధరలు పెంచినందున ఇప్పుడే మళ్లీ పెంచడం సరికాదని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థిక, పురపాలక, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ వి.శేషాద్రి కూడా పాల్గొన్నారు.
భారం పెరిగింది.. రెవెన్యూ పెరగాలి
రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యకమాలు అమలు చేస్తున్నందున వీటి కొనసాగింపు కోసం నిధుల సమీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందని ఉపసంఘం అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలకు నిధులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయని, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపే పరిస్థితి లేనందున ఆర్థిక వనరుల సమీకరణకు కొత్త మార్గాల అన్వేషణ ఒక్కటే మార్గమని భావించింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.11 వేల కోట్ల అదనపు భారం పడటం, కొత్తగా 50 వేల ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ఉపసంఘం చర్చించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment