ministers sub committee
-
సర్కారీ స్కూళ్లు.. సరికొత్తగా!
మంత్రివర్గ ఉప సంఘం సూచనలివీ.. స్కూళ్లకు పక్కా భవనాలు, అవసరమైన చోట అదనపు తరగతి గదులను నిర్మించాలి. వివిధ పద్ధతుల ద్వారా నిధులను సమీకరించాలి. సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద కేంద్రం నుంచి కొంత మేరకు నిధులు వస్తాయి. సర్కారీ స్కూళ్లను అభివృద్ధి చేస్తే ప్రైవేటు పాఠశాలలకు కొంతైనా పోటీ ఇవ్వొచ్చు. రానున్న రోజుల్లో అదనంగా 10 లక్షల మంది విద్యార్థులు చేరొచ్చని అంచనా. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను విడతల వారీగా అభివృద్ధి చేయాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సు చేసింది. మూడేళ్లలో అన్ని స్కూళ్లను అభివృద్ధి చేయాలని పేర్కొంది. మొత్తం 27 వేల స్కూళ్లలో, తొలుత ఈ ఏడాది 9 వేల స్కూళ్లను అభివృద్ధి చేయాలని, అందులో కొన్నింటికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించింది. అందుకోసం ఈ ఏడాది రూ.2వేల కోట్ల మేరకు ఖర్చు చేయా లని సిఫార్సు చేసింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సర్కారుకు నివేదిక సమర్పించింది. మొత్తం అన్ని స్కూళ్ల అభివృ ద్ధికి రూ.6 వేల నుంచి రూ.7 వేల కోట్లు అవస రమవుతాయని అంచనా వేసింది. మూడేళ్లలో ఈ నిధులు ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. నిపుణులు, విద్యాశాఖ అధికారులతో పలుమార్లు చర్చించిన అనంతరం ఈ నివేదికను తయారు చేసింది. అలాగే అధికారుల బృందం ఏపీలోని నాడు నేడు పథకం స్కూళ్లతో పాటు ఢిల్లీలోని స్కూళ్లనూ పరిశీలించింది. రాష్ట్రంలో అనేక స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేవని మంత్రివర్గ ఉపసంఘం నిర్ధారణకు వచ్చింది. గదులు లేకపోవడం, పాత భవనాలు కావడంతో పెచ్చులూడి పోవడం, ప్రహారీ గోడలు లేకపోవ డంతో పశువులు, ఇతర జంతువులు సంచరించడం, విద్యుత్ కనెక్షన్లు లేకపోవడం, కొన్నిచోట్ల ఫ్యాన్లు లేక విద్యార్థులు యాతనలు పడుతున్నారు. గోడలకు పెయింటింగ్ వేయకపోవడంతో అనేక స్కూళ్లు బూజు పట్టి దర్శనమిస్తున్నాయి. బల్లలు, కుర్చీలు లేక విద్యా ర్థులు, టీచర్లు కూర్చోవడానికి వీలు లేకుండా పోతుంది. మరుగుదొడ్లు, తాగునీటి కనెక్షన్లు లేక పోవడాన్ని కూడా మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పాఠశాలల అభివృద్ధికి మంత్రివర్గ ఉప సంఘం పలు సూచనలు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు నిధులు సమకూర్చి ఈ ఏడాది నుంచే పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. నివేదిక అనంతరం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యాశాఖ వర్గాలు వేచి చూస్తున్నాయి. తొలి ఏడాది అత్యధిక విద్యార్థు లున్న స్కూళ్లను ఎంపికచేస్తారని, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటామని ఒక ఉన్నతాధి కారి తెలిపారు. రెండో ఏడాది కూడా ఇదే పద్ధతి ప్రకారం ఎంపిక చేస్తారన్నారు. -
భారీగా నిధులు: ప్రజావైద్యానికి తెలంగాణ పెద్దపీట
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2,500 మంది స్పెషలిస్టు వైద్యులు ఉన్నా ప్రజలకు వైద్య సేవలు అందకపోవడానికి గల కారణం ఏమిటి? కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉచితంగా వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులను కాదని రూ. లక్షల్లో అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆసుపత్రులవైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు? లోపం ఎక్కడుంది? ఈ సమస్య మూలాలను కనుగొని తగిన ‘మందు’ వేసేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, మానవవనరులను సమకూర్చి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు వచ్చే రెండేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమయ్యే నిధులను సాధారణ బడ్జెట్‌తో సంబంధం లేకుండా అదనంగా కేటాయించనుంది. ‘రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి రాకూడదు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే రూ.10 వేల కోట్లు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది’ అని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నిధులను ఎక్కడెక్కడ ఖర్చు చేయాలన్న దానిపై ప్రాధాన్యాలను గుర్తించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో వైద్య, ఆరోగ్యశాఖకు రూ.6,295 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌ను సాధారణ అవసరాలకు, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. వైద్య, ఆరోగ్యశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై మేధోమథనం ప్రారంభించింది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాల మేరకు అధికారులు ఇందుకు సంబంధించి కసరత్తు ప్రారంభించారు. ప్రైవేటు ప్రాక్టీసు వీడితేనే... ప్రభుత్వ డాకర్లు ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల రోగులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందడం లేదని కొందరు వైద్యాధికారులు చెబుతున్నారు. తమిళనాడు తరహా ప్రభుత్వ వైద్య విధానాన్ని తీసుకురావడమే ఇందుకు పరిష్కారమని సూచిస్తున్నారు. తమిళనాడులో ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్ చేసేందుకు అనుమతి లేదు. ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందే. అర్హతలేని ప్రాక్టీషనర్లు లేకపోవడంతో ప్రాథమిక వైద్యాన్ని అక్కడ బలోపేతం చేశారు. ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా నిర్ణీత వేళల్లో విధులు నిర్వహించాల్సిందే. ప్రజారోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో కరోనా తగ్గుముఖం పట్టాక రాష్ట్ర అధికారులు తమిళనాడు, కేరళలలో పర్యటించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిమ్స్ తరహా విధానం మేలు.. నిమ్స్‌లో పనిచేసే డాక్టర్లు బయట ప్రైవేటు ప్రాక్టీస్ చేయడానికి వీలులేదు. అయితే సాయంత్రం వేళల్లో ఆసుపత్రిలోనే ప్రాక్టీస్ చేస్తే కొద్ది మొత్తంలో రోగుల నుంచి కన్సల్టేషన్ ఫీజు తీసుకోవచ్చు. రెండు దశాబ్దాల క్రితం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఇటువంటి పద్ధతి ఉండేదని ఒక సీనియర్ వైద్యాధికారి వెల్లడించారు. ఇటువంటి పద్ధతిని ప్రవేశపెట్టడం ద్వారా డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా చేయడానికి వీలు కలుగుతుందని అంటున్నారు. -
భూముల మార్కెట్ ధరలు పెంచుదాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని, తొలుత హెచ్ఎండీఏ పరిధిలో పెంపును వర్తింపజేయాలని, ఆర్థిక వన రుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసం ఘం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ప్రస్తు తం అమల్లో ఉన్న మార్కెట్ ధరలను ఉమ్మడి రాష్ట్ర పాలనలో చాలా కాలం కిందట ఖరారు చేశారని, ప్రస్తుత వాస్తవ మార్కెట్ ధరలు ఎన్నో రెట్లు అధికంగా ఉన్నాయని అభిప్రాయపడుతోంది. కరోనా నియంత్రణకు లాక్డౌన్ విధించడం తో రాష్ట్ర ఆదాయానికి భారీ గండి పడిన నేపథ్యంలో.. ఈ ఏడాది భూముల అమ్మకాల ద్వారా అదనంగా రూ.15 వేల కోట్లను సమీకరించాలనే నిర్ణయానికి ఉప సంఘం వచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే భూముల ధరలు పెంచాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం.. గురువారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై ఈ అంశంపై విస్తృతంగా చర్చించింది. మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుతం అధిక ధరలకే రిజిస్ట్రేషన్లు కరోనా సమయంలో భూముల మార్కెట్ ధరలను పెంచితే.. భూకొనుగోళ్లపై ప్రభావం పడి ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో వచ్చే ఆదాయం తగ్గే అవకాశంపై కూడా ఉపసంఘం చర్చించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి హెచ్ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ ధరలు పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న మార్కెట్ విలువ కన్నా అధిక ధరతోనే హెచ్ఎండీఏ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న అంశాన్ని అధికారులు ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు. బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలు అడ్డంకిగా మారినట్టుగా వ్యాపార, వాణిజ్యవర్గాల్లో అభిప్రాయం ఉందని కూడా వివరించారు. హెచ్ఎండీఏ పరిధిలో భూముల మార్కెట్ విలువలు పెంచితే రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని నివేదించారు. వాస్తవానికి హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూములు, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ పరిధిలోని భూముల విక్రయాలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. నగరం చుట్టుపక్కల ఉన్న 64 ఎకరాల భూములను విక్రయించేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్‌కు వచ్చే స్పందన ఆధారంగా తదుపరి భూముల అమ్మకాలకు సంబంధంచిన ధరల పెంపుపై ఒక నిర్ణయానికి రావాలని, ఆ తరువాత ముఖ్యమంత్రికి దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. మద్యం ధరల పెంపుతో ఎక్సైజ్ ఆదాయం పెంచుకునేందుకు ఉన్న అవకాశాన్ని కూడా ఉపసంఘం పరిశీలించింది. అయితే ఈ మధ్యకాలంలోనే రెండుసార్లు మద్యం ధరలు పెంచినందున ఇప్పుడే మళ్లీ పెంచడం సరికాదని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్థిక, పురపాలక, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ కమిషనర్ వి.శేషాద్రి కూడా పాల్గొన్నారు. భారం పెరిగింది.. రెవెన్యూ పెరగాలి రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి కార్యకమాలు అమలు చేస్తున్నందున వీటి కొనసాగింపు కోసం నిధుల సమీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందని ఉపసంఘం అభిప్రాయపడింది. సంక్షేమ పథకాలకు నిధులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయని, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపే పరిస్థితి లేనందున ఆర్థిక వనరుల సమీకరణకు కొత్త మార్గాల అన్వేషణ ఒక్కటే మార్గమని భావించింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.11 వేల కోట్ల అదనపు భారం పడటం, కొత్తగా 50 వేల ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై ఉపసంఘం చర్చించినట్లు సమాచారం. -
కరోనా: హైపవర్ కమిటీ,మంత్రివర్గ ఉపసంఘం భేటీ
-
'ఆర్టీసీ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నాం'
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నామని కార్మిక సంఘం నేత పద్మాకర్ స్పష్టం చేశారు. ఆదివారం ఏపీ మంత్రివర్గం ఉపసంఘం కార్మిక సంఘాల నేతలతో సమావేశమైనా.. అవి సఫలం కాలేదు. కాగా, కార్మికుల డిమాండ్లపై మంత్రివర్గ ఉప సంఘానికి నివేదిక ఇచ్చినట్లు పద్మాకర్ తెలిపారు.ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినా భారం పడదని.. తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ డిమాండ్ల పరిశీలనకు మూడు వారాల గడువు కోరారని.. అయితే దానిపై ఏపీలోని అన్ని ఇతర సంఘ నేతలు, జిల్లా సమాఖ్యలతో మాట్లాడి నిర్ణయం చెబుతామని పద్మాకర్ తెలిపారు. ఈనెల 12న హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ప్రస్తుతం 60 శాతం బస్సులు తిప్పుతున్నామన్న యాజమాన్యం లెక్కలు అవాస్తవమని.. అది నిజమైతే ఆర్టీసీ ఖాతాలో రూ.9కోట్లు జమ కావాలని.. రూ.10 లక్షల కూడా జమ కాలేదని పద్మాకర్ ఎద్దేవా చేశారు. -
'కార్మికులు సమ్మెకు వెళ్లడం నాకు బాధనిపిస్తోంది'
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సబ్ కమిటీ వేశాక కూడా కార్మికులు సమ్మెకు వెళ్లడం బాధనిపిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలు, యాజమాన్య పరిస్థితిపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటికీ మూడు వారాల గడువు కోరామన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మాత్రం ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వలేమని అచ్చెన్నాయుడు తెలిపారు. తక్షణమే సమ్మె విరమించి మూడు వారాల పాటు సమయం ఇవ్వలని కోరామని.. కార్మిక సంఘాలు రేపు మాట్లాడుకుని సమాధానం చెప్తామన్నాయన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినట్లు తెలిపారు. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఆర్టీసీ సమ్మెపై చర్చలు విఫలం: సమ్మె కొనసాగింపు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రివర్గం ఉపసంఘం చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రివర్గం ఉపసంఘం ఎటువంటి ముందడుగు వేయకపోవడంతో చర్చలు సఫలం కాలేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై మరో మూడు వారాల గడువు ఇవ్వాలని ఉపసంఘం కోరడంతో అందుకు కార్మిక సంఘాలు ఒప్పుకోలేదు. ఎట్టిపరిస్థితిల్లోనూ తాము సమయం ఇవ్వలేమని కార్మిక సంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో యనుమల రామకృష్ణుడు, శిద్ధా రాఘవరావు, అచ్చెన్నాయుడు, ఎండీ సాంబశివరావులు పాల్గొన్నారు. ఆర్టీసీ పరిస్థితిని అర్థం చేసుకోవాలని.. 43 శాతం ఫిట్ మెంట్ తో సంస్థపై అదనపు భారం పడుతుందని పాత పంథానే కొనసాగించడం కాస్తా చర్చలు విఫలం కావడానికి దారి తీసింది. దీంతో కార్మిక సంఘాలు తమ సమ్మెను యథావిధిగా కొనసాగించడానికి సన్నద్ధమైయ్యాయి. గత ఐదు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా.. అవి ఫలించని సంగతి తెలిసిందే. మరోపక్క తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు భీష్మించుకున్నాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడమే కాకుండా.. అటు విద్యార్థులకు ఎంట్రెన్స్ టెస్ట్ లు ఉండటం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. -
రోడ్లపై ఉమ్మి వేస్తారేమో...జాగ్రత్త!
- సర్కారుకు సిఫార్సు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల పరిధిలో రోడ్లపై ఉమ్మి వేసే వారిపై జరిమానా విధించాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. పురపాలికల్లో పారిశుద్ధ్య పరిస్థితులు దుర్భరంగా మారడంతో అవి చెత్తకు కేంద్రాలుగా మారిపోయాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తమకు మెజిస్టీరియల్ అధికారాలు కల్పించాలని మునిసిపల్ కమిషనర్లు ఇటీవల జరిగిన మేయర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో పరిశీలనకు వచ్చిన అంశాలపై అధ్యయనం కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మంగళవారమిక్కడ సమావేశమై.. వచ్చే మూడు నెలల్లో చేపట్టాల్సిన స్వల్పకాలిక ప్రణాళికలు, ప్రభుత్వానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించింది. పారిశుద్ధ్య నిర్వహణపై సమాలోచనలు జరిపింది. సింగపూర్ స్ఫూర్తిగా మునిసిపల్ కమిషనర్లకు మెజిస్టీరియల్ అధికారాలు కల్పించాలని, కాలుష్య కారకులకు జరిమానాలు విధించాలని నిర్ణయించింది. అయితే పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించిన తర్వాతే ఈ చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పట్నం మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.